ఏచూరి s/o కల్పకం | Sitaram Yechury s/o Kalpakam | Sakshi
Sakshi News home page

ఏచూరి s/o కల్పకం

Published Tue, Apr 21 2015 10:25 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

ఏచూరి s/o కల్పకం - Sakshi

ఏచూరి s/o కల్పకం

మీ అబ్బాయి గురించి మూడు మాటల్లో చెప్పండి అంటే... ‘సింప్లిసిటీ.. కమిట్‌మెంట్.. అండ్ డెడికేషన్’ అని టక్కున చెప్పేస్తుంది ఆ అమ్మ. ఆ అమ్మ ఎవరో, ఆమె కొడుకెవరో ఇప్పటికే పోల్చుకుని ఉంటారు! కొడుకు... సీపీఎం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి వార్తల్లో నిలిచిన సీతారాం ఏచూరి. ఆ పుత్రోత్సాహంలో ఉన్న తల్లి...  కల్పకం ఏచూరి! అయితే సీతారాం ఏచూరి తల్లిగానే కాదు... కల్పకం ఏచూరి కొడుకు అని చెప్పేంత గుర్తింపు ఉంది ఆమెకు!
- సరస్వతి రమ
 
కల్పకం చిన్నప్పుడే దుర్గాబాయి దేశ్‌ముఖ్ భావాలతో ప్రభావితమయ్యారు. ఇప్పటికీ ఆ బాటలోనే నడుస్తున్నారు.ఆలిండియా విమెన్ కాంగ్రెస్ అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యురాలు. ఆ సంస్థ తరపున ఎన్నో సేవల్లో భాగస్వామిగా ఉన్నారు. అందులో భాగంగానే తమ సొంత ఊరైన కాకినాడ దగ్గర్లోని ‘కొమరగిరి’ని దత్తత తీసుకొని అక్కడి చేనేత కార్మికులకు పునర్జన్మనిచ్చారు. కల్పకం పొలిటికల్ సైన్స్‌లో ఎమ్మే ఎంఫిల్ పట్టభద్రురాలు! ఈ 82 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుగ్గా ఉంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా తన కారును తనే డ్రైవ్ చేసుకుంటారు. ఈమెయిల్ నుంచి వాట్సప్, ట్విట్టర్, స్కైప్‌లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సిస్టమ్స్‌ను సొంతంగా ఆపరేట్ చేసుకుంటారు! అంతటి క్రియాశీలురాలు, సేవాతత్పరురాలు అయిన ఈ అమ్మ తన కొడుకు గురించి చెప్పిన విషయాలు, విశేషాలివి.

నా ఇద్దరు పిల్లల్లో సీతారాం పెద్దవాడు. చిన్నవాడు భీమశంకర్ (మా నాన్నగారి పేరు). సీతారాం పాలిటిక్స్.. అదీ లెఫ్ట్ పాలిటిక్స్‌లోకి రావడం... ఆశ్చర్యమే. ఎందుకంటే రాజకీయాలకు తగిన మనస్తత్వం కాదు వాడిది. సున్నిత మనస్కుడు. నేను కాస్త గట్టిగా అరిచినా.. ‘అంత గట్టిగా ఎందుకు మాట్లాడ్తావమ్మా’ అంటూ నెమ్మదిగా విసుక్కునే వాడు. అంత మృదు స్వభావి. చిన్నప్పుడు స్కూల్లో వాడిని ఎవరైనా కొట్టినా, బెంచి మీద నుంచి తోసేసినా ఏమీ అనేవాడు కాదు. పెద్దాడిని కొట్టిన వాళ్లతో చిన్నాడు గొడవపడేవాడు కానీ పెద్దాడు మాత్రం నోరుమెదిపేవాడు కాదు. ఇప్పటికీ ఎవరి మనసూ నొప్పించడు. గట్టిగా మాట్లాడడు. నేటికీ ఇటు ఫ్యామిలీలో, అటు బయట.. ఎవరితోనూ ఎలాంటి వివాదాలూ లేవు.  అందరికీ కావాల్సినవాడే!
 
బాల్యం హైదరాబాద్‌లోనే...

మావారు (సర్వేశ్వర సోమయాజులు) ఆటోమొబైల్ ఇంజనీర్. మైసూర్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఉద్యోగం. మొదట బాంబే,  బెంగళూరు తర్వాత ఆంధ్రప్రదేశ్.. ఇలా మూడు రాష్ట్రాలు తిరుగుతూ హైదరాబాద్ వచ్చాం. అప్పటికే అమ్మావాళ్లు హైదరాబాద్‌లో ఉన్నారు. నాన్న హైకోర్టు జడ్జిగా పనిచేసేవారు. పిల్లలిద్దరూ హైదరాబాద్‌లోనే పుట్టారు. తమ్ముడు మోహన్ (రిటైర్ట్ ఐఏఎస్ మోహన్‌కందా) తోపాటే కలిసి పెరిగారు అమ్మ దగ్గర.

ఇప్పటికీ రికార్డే...

సీతారాం చాలా తెలివైన విద్యార్థి. అన్నీ క్లాస్ ఫస్ట్‌లే. ఆల్ సెయింట్స్‌లో చదివాడు. టెన్త్‌లో ఉన్నప్పుడు యునెస్కోవాళ్లు పెట్టిన వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. ఆ సందర్భంగా అమెరికా వెళ్లొచ్చాడు. ఆటల్లోనూ ముందే. టెన్నిస్ బాగా ఆడేవాడు. చిన్నప్పుడు వాడి హాబీ స్టాంప్ కలెక్షన్. పుస్తకాలు బాగా చదివేవాడు. అందుకోసం హైదరాబాద్‌లోని బ్రిటిష్ కౌన్సిల్‌కి వెళ్లేవాడు. నాన్న మా తమ్ముడితో పాటు వీడినీ కూర్చోబెట్టుకొని షేక్స్‌పియర్ నాటకాలను చదివి వినిపించేవాడు. దాంతో ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఆసక్తి చూపించేవాడు. సీతారాం పీయూసీలో ఉన్నప్పుడే  మావారు యూపీఎస్‌సీలో సెలక్ట్ అయ్యారు. మకాం ఢిల్లీకి మార్చాల్సి వచ్చింది. అందుకే సీతారాంని ఇక్కడే ఉంచేసి చిన్నవాడిని తీసుకొని ఢిల్లీ వెళ్లిపోయాం. పీయూసీ పూర్తిచేసి సీతారాం ఢిల్లీ వచ్చాడు. అయితే డిగ్రీలో చేరడానికి హైదరాబాద్ పీయూసీతో కుదరదన్నారు. సీబీఎస్‌లో మళ్లీ ఒక సంవత్సరం చదివాడు. స్టేట్ ఫస్ట్ వచ్చాడు. అప్పుడే వాడిని మెడిసిన్‌లో జాయిన్ చేయించాలని నాకు ఉండింది. డాక్టర్ అయితే బాగుండు అనుకున్నా. అలా అయితే సీతారాం ఎందుకు అవుతాడు? అందుకే సెయింట్ స్టీఫెన్స్‌లో బీఏ ఎకనామిక్స్‌లో చేరాడు. అదీ ఫస్టే. పీజీ కోసం ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జాయిన్ అయ్యాడు. అదే యేడు ఎకనామిక్స్‌కి సంబంధించి జేఎన్‌యూలో కొత్త కోర్సులు పెట్టడంతో వద్దన్నా వినకుండా జేఎన్‌యూలోకొచ్చాడు. అక్కడా సీతారాం ఫస్టే. వాడు సాధించిన అ++ ఇప్పటికీ రికార్డే . అక్కడే సీతారాంకు మార్క్సిజం పరిచయం అయింది.  
 
ఎవరు ఎవర్ని మారుస్తారని...


ఎస్‌ఎఫ్‌ఐలో చేరి లెఫ్ట్ రాజకీయాల్లో చరుగ్గా ఉన్నాడు. యూనివర్శిటీ ఎన్నికల్లో వాళ్ల యూనియన్‌కి ప్రెసిడెంట్  అయ్యాడు. ఎక్కడ ఏది టాప్ అయితే అక్కడ దాన్ని అధిరోహించాడన్నమాట. వాడు యూనివర్శిటీలో ఉన్నప్పుడే ఎమర్జెన్సీ విధించారు. ఆ సమయంలో వీళ్ల కార్యకలాపాల మూలంగా వీడూ జైల్లో ఉన్నాడు. మా ఇంటిముందున్న పోలీస్‌స్టేషన్ లాకప్‌లోనే రెండు రోజులుంచారు. ఎలా ఉన్నాడో చూద్దామని వెళితే .. బల్ల మీద వీడు కూర్చొని స్పీచ్ ఇస్తుంటే కానిస్టేబుల్స్ అంతా కింద కూర్చొని వాడు చెప్పేది బుద్ధిగా వింటున్నారు. అదన్నమాట వాడు. ఎమర్జెన్సీ అయ్యాక.. వీడిని అప్పటికే ఐఏఎస్‌గా ఉన్న మా తమ్ముడి దగ్గరకు పంపా. ఏమన్నా మారతాడని. వీడిని మోహన్ దగ్గరికి పంపేటప్పుడు ఢిల్లీలో ఆంధ్రా కేడర్‌లో ఉన్న తెలిసిన ఐపీఎస్ ఒకతను అన్నాడు.. ‘హూ విల్ ఛేంజ్ హూమ్’ అని. అన్నట్టుగానే వీడు వెళ్లిన రెండురోజులకే మా తమ్ముడి దగ్గర్నుంచి కబురు.. ‘అక్కా.. వీడిని నువ్వు వెంటనే తీసుకెళ్లకపోతే నేను నా జాబ్‌కి రిజైన్ చేసేటట్టు ఉన్నా’నంటూ! ఎవరినైనా కన్విన్స్ చేస్తాడు. దేన్నయినా సాధిస్తాడు. చివరకు మా నాన్నగారి చేత కూడా ‘వాడు చెప్పింది కరెక్టేనేమో’ అనిపించేలా చేశాడు. మా అమ్మావాళ్ల వైపు అందరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారే, అటు మా అత్తింటివైపూ అందరివీ మంచి ఉద్యోగాలే. స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్‌ను అభిమానించారే తప్ప ఏనాడు ఎవరూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. వీడొక్కడే. వీడూ ఏ డాక్టరో, ఐఏఎస్సో, అకడమీషియనో అవుతాడని అనుకున్నాం. కానీ నేతగా ఎదిగాడు. ఎంత కష్టమొచ్చినా తాను నమ్ముకున్న సిద్ధాంతాన్నే ఆచరించాడు కానీ ఎప్పుడూ పశ్చాత్తాపం ఫీలవలేదు. మమ్మల్నీ ఫీలవనీయలేదు. తాను ఎంచుకున్న దారి సరైనదేనని నిరూపించాడు. చేస్తున్న పని పట్ల నిబద్ధత, అంకిత భావమే తప్ప ప్రతిఫలం మీద ఆశలేదు వాడికి. ఆ నిజాయితే ఈరోజు వాడిని ఈ శిఖరాన నిలబెట్టింది. పుచ్చలపల్లి సుందరయ్య.. ‘నీ కొడుకుని నాకోసమే కన్నావేమోనమ్మా’ అన్నారు అన్నారొకసారి.

మాది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. అయినా మా పిల్లల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోలేదు. వాళ్లకు నచ్చినట్లే ఉండనిచ్చాం. పెద్దాడు రాజకీయాలకు అంకితమైతే, చిన్నాడు ఆటోమొబైల్ ఇంజనీర్. మారుతీ కంపెనీకి అంకితమయ్యాడు. సీతారాంకు ముగ్గురు పిల్లలు. అమ్మాయి హిస్టరీ ఆనర్స్ గోల్డ్‌మెడలిస్ట్. ఎడిన్‌బరోలో ప్రొఫెసర్. కొడుకు.. జర్నలిస్ట్. చిన్న కొడుకు ఇంకా చదువుతున్నాడు. మా అమ్మగారితోపాటు, నా గురువు దుర్గాబాయి దేశ్‌ముఖ్ చేతనైనంతలో తోటివారికి సహాయం చేయమనే సత్యాన్ని బోధించారు. దాన్నే నా పిల్లలకూ నేర్పాను. వాళ్లు పాటిస్తున్నారు. ఇంతకన్నా పుత్రోత్సాహం ఏముంటుంది?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement