
లండన్ : రోజుకు ఆరు కప్పుల కాఫీతో అకాల మరణం ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజుకు ఆరు నుంచి ఏడు సార్లు కాఫీ తాగే వారు ఎలాంటి వ్యాధితోనైనా మరణించే ముప్పు 16 శాతం తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, కుంగుబాటు, డిమెన్షియాలను కాఫీ నిరోధిస్తుందని చాలా కాలంగా పలు నివేదికలు వెల్లడించాయి.
ఆరోగ్యకర ఆహారంలో కాఫీ ఒకటని తాము చేపట్టిన తాజా అథ్యయనంలో మరోసారి నిరూపితమైందని నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు పేర్కొన్నారు. 2006 నుంచి 2016 వరకూ 5 లక్షల మందిపై ఈ అథ్యయనం నిర్వహించారు.
ఇక రోజుకు ఐదు కప్పులు, ఒక కప్పు కాఫీ తీసుకునే వారికి అకాల మరణం ముప్పు వరుసగా 12, 8 శాతం మేరకు తక్కువగా ఉందని అథ్యయనంలో వెల్లడైందని రచయిత డాక్టర్ ఎరికా లోఫ్ట్‌ఫీల్డ్ చెప్పారు. శరీరంలో వాపులను తగ్గించి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో కాఫీలో ఉండే కెఫిన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment