స్కేటింగ్ స్టార్
టాలెంట్
స్కేటింగ్‌లో ఎన్నో బంగారు పతకాలు సాధించి విదేశాల్లో భారత దేశ పతాకాన్ని ఎగురవేశాడు 30ఏళ్ల అనూప్ కుమార్ యామా. రోలర్ స్కేటింగ్‌లో ఇండియా నెం.1, ఆసియా నెం.1, వరల్డ్ నెం.1గా నిలిచి తన సత్తా చాటాడు అనూప్...
అనూప్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాలుగేళ్ల వయసు నుంచే స్కేటింగ్ చేయడం ప్రారంభించాడు. స్కేటింగ్‌లో రెండు రకాలైన రోలర్, ఐస్ స్కేటింగ్‌లోనూ అనూప్‌కు ప్రావీణ్యం ఉంది. రోలర్‌లో భాగమైన ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో దిట్టైన అనూప్ తన ఆటలో భారత దేశ సంస్కృతి ఉట్టిపడేలా ప్రతిభ కనబరుస్తున్నాడు. ‘‘రోలర్ స్కేటింగ్‌లో ఎన్ని విజయాలు సాధించినా నాకు మంచు మీద చేసే ఐస్ స్కేటింగ్ అంటే బాగా ఇష్టం’’ అంటున్నాడు ఈ తెలుగు తేజం.
అనూప్ నాన్న వీరేశ్ కూడా స్కేటింగ్‌లో దిట్టే. ప్రస్తుతం ఆయన స్కేటింగ్ నేషనల్ కోచ్‌గా, ఆ క్రీడాపోటీల్లో జడ్జిగా వ్యవహరిస్తుంటారు. వాళ్లింట్లో మరో స్కేటింగ్ స్టార్ ఉన్నాడు. అతనే అనూప్ అన్నయ్య అమర్‌నాగ్ యామా. మనదేశం నుంచి ఇంకెంతో మంది తనలా స్కేటింగ్‌లో వరల్డ్ ఛాంపియన్లు కావాలనే ఉద్దేశంతో సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన ఇంట్లోనే ‘యామా స్కేటింగ్ అకాడమీ’ని స్థాపించాడు. ఈ ఆటపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నో సెమినార్లూ ఇచ్చాడు.
60 దేశాలు పాల్గొన్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో వరల్డ్ నెం.1 స్థానాన్ని చేజిక్కించుకుని విదేశాల్లో భారతదేశ సత్తా చాటిన అనూప్ ప్రస్తుతం కొలంబియా(దక్షిణాఫ్రికా)లో జరిగే వరల్డ్ ఛాంపియన్‌షిప్-2015లో విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అలాగే ఈ నెల ముంబైలో జరిగే జాతీయ స్కేటింగ్ పోటీలకు తన అకాడమీ నుంచి 16మందిని సిద్ధం చేస్తున్నాడు.
2018లో జరిగే శీతాకాల క్రీడల ఒలంపిక్స్‌లో పాల్గొని వరల్డ్ నెం.1 అయ్యేందుకు విదేశాల్లో శిక్షణకు వెళుతున్నట్లు అనూప్ తెలిపాడు. అనూప్ 2010లో విడుదలైన ‘లఫంగే పరిందే’ చిత్రంలో హీరో నీల్‌నితీశ్ దేశ్‌ముఖ్, హీరోయిన్ దీపికా పదుకొనెకు రెండు నెలలు స్కేటింగ్‌లో శిక్షణ కూడా ఇచ్చాడు.
ఫొటో: ఎన్.రాజేశ్‌రెడ్డి
తైవాన్(చైనా)లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్- 2013లో బంగారు పతకం న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్- 2012లో కాంస్య పతకం స్పెయిన్‌లోని 2014 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం జాతీయ స్థాయిలో, ఆసియా ఛాంపియన్ షిప్‌లో ఎన్నో బంగారు పతకాలు గెలుచుకున్నాడు.