
పాదాల పగుళ్లు ఉంటే...
స్కిన్‌కేర్
ఇది చలికాలం. ఈ సీజన్‌లో చాలామంది కాళ్ల (మడమల) మీద పగుళ్లు కనిపించడం చాలా సాధారణం. ఇది చాలామందిలో తీవ్రంగా ఉంటుంది. చాలా బాధ కలిగిస్తుంటుంది. కొంతమందిలో రక్తస్రావమూ అవుతుంది. ఇది కొంతమందిలో మామూలుగా అన్ని సీజన్‌లలో కనిపించినా... ఈ కాలంలో మరీ ఎక్కువ. పొడి చర్మం ఉండేవారిలో ఇది చాలా తరచూ కనిపించే సమస్య.
ఉపశమనం... చికిత్స...
పొడిగానూ, పగుళ్లుబారినట్లుగా ఉన్న ఆ ప్రాంతంలో ప్యూమిక్ స్టోన్‌తో రుద్దాలి. అంటే... స్క్రబింగ్ చేయాలి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో వైట్ సాఫ్ట్ పారఫీన్, షియా బటర్ ఉన్న ఉన్న మాయిశ్చరైజింగ్ క్రీము రాయాలి ఇలా రోజూ ఉదయం, రాత్రి రాస్తూ ఉండాలి అప్పటికీ తగ్గకుండా ఉంటే కార్టికో స్టెరాయిడ్స్, శాల్సిలిక్ యాసిడ్ కాంబినేషన్‌తో ఉండే క్రీము, మాయిశ్చరైజర్లు ఆ ప్రాంతంలో కొద్దిరోజులు రాయాలి.
సొరియాసిస్ వల్ల జరిగితే...
సొరియాసిస్ కారణంగా చర్మం పగుళ్లు బారి, పొలుసులుగా రాలుతున్నవారిలోనూ ఇదే లక్షణం కనిపిస్తుంటుంది. ఆ కారణంగా చర్మం పొలుసులుగా రాలుతుంటే మాత్రం లిక్విడ్ పారఫీన్ ఆయిల్‌లో పాదాల వరకు మునిగేలా 10 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత పాదాలపై పగుళ్లు ఉన్న చోట కార్టికో స్టెరాయిడ్, కోల్ తార్ కాంబినేషన్‌తో ఉండే క్రీమును ప్రతిరోజూ ఉదయం, రాత్రివేళ రెండు వారాల పాటు రాయాలి. అయితే చలికాలం పొడవునా వైట్ సాఫ్ట్ పారఫీన్, షియాబటర్ ఉన్న మాయిశ్చరైజర్ రాస్తూనే ఉండాలి రాత్రివేళల్లో సాక్స్ ధరించడం అన్నది రెండు రకాలైన పాదాల పగుళ్లను తగ్గించడానికీ బాగా పనిచేస్తుంది.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్
గచ్చిబౌలి, హైదరాబాద్