
మెట్టినిల్లు మెచ్చిన కోడలు ఆమె! మెట్టెల సవ్వడి కాదు ఆ ఇంట్లో వినపడింది... మెడల్స్ హోరు!! మొట్టికాయలు వేసే అత్తగారు కాదు... వీపు తట్టిన తల్లి ఆవిడ! కోడలు గొప్పది! ఆమె దీక్ష అనంతమైంది!! ఇంట గెలిచింది అత్తగారు... రచ్చ గెలిచింది కోడలు!!
‘‘అంట్లు తోమే చేతులు కావు... మెడల్స్ మోసే చేతులు ఇవి. పెళ్లయిందని నీ లక్ష్యాన్ని మార్చుకోనక్కర్లేదు అనేది నా అభిప్రాయం.. తర్వాత నీ ఇష్టం’’ అంటూ వంటింట్లో గిన్నెలు కడుగుతున్న కొత్త కోడలికి చెప్పారు అత్తగారు. ఆలోచనలో పడింది కోడలు. ఏవో భయాలు, ఇంకేవో బెదురు ఊహలతో ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ఆమెకి ఆ ఇంటి వాతావరణం, అత్తగారి స్పందన చాలా చిత్రంగా అనిపించాయి. నిజం చెప్పాలంటే తెలియని భరోసా కలిగించింది. చాలా రోజులుగా అలాంటి ఆసరా కోసం చూస్తోంది.
ఇల్లు ఊడ్వడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, వంట చేయడం... కోడలు పని కాదు అని అర్థం చేసుకుంది అత్తగారు! అవును... తన అత్తగారు సాక్షాత్తు అత్త రూపంలో ఉన్న అమ్మే! ఇన్నాళ్లూ నిస్సత్తువగా ఉన్న తన కాళ్లకు శక్తినిచ్చాయి ఆవిడ మాటలు. ఆవిడ ఆదరణ తన ఆశయాలకు జీవం పోసింది. ఆ ఆదరణతో! ఎస్.. తను పరుగెడుతుంది. ట్రాక్ తన ప్రపంచం! అది చుట్టేస్తుంది! నిర్ణయం తీసుకుంది. నిశ్చయమైపోయింది! ఇది స్నేహా జైన్ కథ. కోడలి సామర్థ్యాన్ని తెలుసుకుని, ఆమెను వంటింటికి పరిమితం చేయకుండా, ప్రపంచానికి పరిచయం చేసిన ఓ అత్తగారి కథ! స్నేహా జైన్ రాజస్థాన్ అథ్లెట్. వంద మీటర్ల స్ప్రింట్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ పోటీల్లో జాతీయ, ఆసియా ట్రాక్, ఫీల్డ్ రికార్డుల సృష్టికర్త. మాస్టర్స్ టోర్నమెంట్లలో 149 బంగారు పతకాలు సాధించిన బంగారు లేడి. 40 ఏళ్ల స్నేహా పరుగుల కెరీర్ పెళ్లి తర్వాతే వేగం పుంజుకుంది.
అయిదేళ్ల వయసులో...
స్నేహ ఐదో ఏట నుంచి పరుగే ఆమె వాహనం. వీధి చివర ఉన్న కిరాణా కొట్టుకు వెళ్లాలన్నా, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి వెళ్లాలన్నా ఉరకడమే! నడక అనే మాటే లేదు. మధ్యలో వచ్చే చిన్న చిన్న దిబ్బలు, పిల్ల కాల్వల మీదుగా తేలికగా జంప్ చేయడమే.. జాగ్రత్తగా దాటడమనే ఊసే లేదు. ఆమెలోని ఈ ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు, బడిలో టీచర్స్... స్నేహను ప్రోత్సహించడం ప్రారంభించారు. అలా ఆమె రన్నింగ్ ట్రాక్ 1989లో రాజస్థాన్ పక్షాన నేషనల్స్‌లో పరుగులు తీసేవరకు వెళ్లింది... 1996 వరకు సాగింది.
షాక్ అండ్ బ్రేక్
ఆ ఏడు (1996) బెంగళూరులో జరుగుతున్న నేషనల్ అథ్లెటిక్స్ స్క్వాడ్‌లో భాగమయ్యే భాగ్యం దొరికింది స్నేహకు. ఎంతో ఉత్సాహం గా ఉంది. అంతలోకే స్నేహ తల్లి మరణించిందనే విషాద వార్త స్నేహను హతాశురాలిని చేసింది. ఉన్నపళంగా నేషనల్ స్పోర్ట్స్ క్యాంప్ నుంచి బయలుదేరింది. అక్కడితో ఆమె పరుగు ఆగిపోయింది. అప్పటికే క్యాన్సర్ పేషెంట్ అయిన తల్లిని చూసుకోవడం కోసం ఇంటర్ మొదటి సంవత్సరంతోనే చదువు ఆపేసింది స్నేహ.
అమ్మను ముంబైకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించడం మొదలుపెట్టింది. ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడమే కాకుండా, తన కంటె చిన్నవారైన తమ్ముళ్ల ఆలనాపాలనా కూడా స్నేహ మీదే పడింది. ఈ బాధ్యతలు చదువు మీదే కాకుండా ఆట తీరు పైనా ప్రభావం చూపాయి. అయినా సమయం చిక్కినప్పుడల్లా ప్రాక్టీస్ చేసేది. తల్లిని చూసుకోవడానికి అక్క వచ్చినప్పుడల్లా పోటీలకు వెళ్లేది. అలాగే బెంగళూరు వెళ్లింది. తల్లి మరణంతో షాకై ఇల్లు చేరింది. అప్పటి నుంచి కోలుకోలేదు. ట్రాక్ ఎక్కలేదు.
పెళ్లి...
దిగులుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా చెల్లెలు రోజులు వెళ్లదీస్తుంటే చూసి చలించిపోయింది స్నేహ అక్క. పెళ్లి చేస్తే కొత్త జీవితంలోకి అడుగు పెడుతుందని చెల్లికి పెళ్లి సంబంధం కుదిర్చింది. చెల్లెలి గురించి ఆ ఇంటి వాళ్లకు అంతా చెప్పింది. ఆమె పరుగుల రాణి అని, ఎక్కుపెట్టిన బాణంలా రివ్వున దూసుకెళ్తుందని, చెల్లి అందుకున్న పతకాలను చూపించింది. అవన్నీ స్నేహ అత్తగారి మెదడులో చెరగని ముద్ర వేశాయి. అలా 2000లో మూడు ముళ్లతో స్నేహ అత్తింటికి వచ్చింది. పెళ్లయిన తెల్లవారే కోడలిగా ఆ ఇంటి పనులు పంచుకోవడానికి వంటింట్లోకి వెళ్లింది. అప్పుడే అత్తగారు ఆ సలహా ఇచ్చింది.
పరుగుల ట్రాక్ పైకి మళ్లీ...
నాలుగేళ్లుగా పరుగు మరిచిపోయిన కాళ్లను సమాయత్తం చేయడం కష్టమని ప్రాక్టీస్‌లో తేలింది స్నేహకు. అయినా వెనకడుగు వేయలేదు. కాని పూర్వపు ఫామ్ రాలేకపోయింది. పోటీల్లో పతకాలు సాధించలేకపోయింది. అత్తగారు అంత ఎంకరేజ్ చేస్తున్నా తాను ఖాళీ చేతులతో ఇంటికి వస్తుంటే ఆమె ఏమనుకుంటుందోనని చాలా ఒత్తిడికి లోనైంది స్నేహ. ఇక్కడా ఆ అత్త అమ్మ మనసుతో ఆలోచించింది. ‘‘పతకాలు సాధించడం అనుకున్నంత తేలిక కాదని నాకు తెలుసు. శక్తి వంచన లేకుండా ప్రయత్నించడం మన ధర్మం. ఫలితం ఆ భగవంతుడి ఇష్టం. అధైర్యపడకు. నమ్మకం కోల్పోకు’’ అని కోడలి భుజం తట్టింది.
అప్పటిదాకా భరించిన ఒత్తిడి మాయమైపోయింది స్నేహలో. ఈలోపే ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి కావడంతో మళ్లీ బ్రేక్. మళ్లీ ప్రాక్టీస్. మళ్లీ పోటీలు వచ్చేసరికి స్నేహకు 35 ఏళ్లు వచ్చేశాయి. నేషనల్ అథ్లెటిక్ కాంపిటీషన్‌కు ఆ వయసు వాళ్లకు అనుమతి లేదని తేల్చేశారు. నిరాశ పడుతుండగా, అత్తగారి చిరునవ్వు స్నేహలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అప్పుడే... అంటే 2007లో మాస్టర్స్ కాంపిటీషన్స్ ఉంటాయని, ఆ వయసు వాళ్లూ అందులో పాల్గొనొచ్చని స్నేహకు తెలిసింది. ఫస్ట్ మాస్టర్స్ టోర్నమెంట్‌లోనే లాంగ్‌జంప్ నేషనల్ రికార్డ్ సాధించింది. ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. పతకాల వేట ప్రారంభమైంది. పెళ్లి తర్వాత పాల్గొన్న ఈవెంట్స్‌లో 149 గోల్డ్ మెడల్స్ సాధించింది.
అత్తగారి ఆశీర్వాదం ఫలించింది. 37వ మాస్టర్స్ నేషనల్ గేమ్స్‌లో 100 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, నాలుగు వందల మీటర్ల, పదహారు వందల మీటర్ల రిలే పోటీల్లో అయిదు బంగారు పతకాలు సొంతం చేసుకుంది. తన కూతురు ఆర్చి, కొడుకు వంశ్‌లకు రోల్‌మోడల్‌గా నిలిచింది. ‘‘పిల్లలకే కాదు ఈ దేశానికే రోల్ మోడల్ నా కోడలు’’అంటారు స్నేహ అత్తగారు. ‘‘కితాబు నాకివ్వడం ఆమె గొప్పతనం. ఆమె లేనిదే నేను లేను. అమ్మపోయిన దుఃఖంలో నా క్రీడలను పూర్తిగా మర్చిపోయాను. అలాంటి నన్ను మళ్లీ క్రీడాకారిణిగా నిలబెట్టారు అత్తమ్మ. ఆమెతో పాటు నా భర్త, మామగారు అందరూ నాకు అండగా నిలిచారు. నా సామర్థ్యాన్ని నిరూపించుకుని మంచి క్రీడాకారిణిగా నిలబడటానికి చేయూతనిచ్చారు.
మన దేశంలో ఇలాంటి మెట్టినిల్లు దొరకడం నా అదృష్టం’’ అంటారు స్నేహా జైన్ చెమ్మగిల్లిన కళ్లతో. అయితే 2016లో మాస్టర్స్ టోర్నమెంట్‌లో 150వ మెడల్ కోసం శ్రీలంక వెళ్లినప్పుడు 1996లో సంఘటన స్నేహకు పునరావృతం అయింది. కార్డియాక్ అరెస్ట్‌తో మామగారు చనిపోయారని సమాచారం అందింది. హుటాహుటిని తిరుగుప్రయాణమైంది స్నేహ. అలా ఆమె కెరీర్‌లో 150 గోల్డ్‌మెడల్ మైలురాయిని దాటలేకపోయింది. కాని ఆమె వెనక అత్తగారున్నారు. ఆ విశ్వాసంతోనే స్నేహా జైన్ కసరత్తు మొదలుపెట్టింది. ఆల్ ద బెస్ట్ టు స్నేహ.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment