గిన్నిస్ మాత్రం ఎక్కేశారు
థీమ్.. త న న
సహజంగా ఉన్న ప్రత్యేకతైనా, సాధించి తెచ్చుకున్న ప్రత్యేకతైనా పదిమందిలో గుర్తింపు తెస్తుంది. ఆ ప్రత్యేకత మరీ మరీ ప్రత్యేకమైనదైతే గిన్నెస్ బుక్‌లో చోటు లభిస్తుంది. ఇదిగో.. వీళ్లంతా అలా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కినవాళ్లే. వీళ్లెవరూ చెట్టును ఎక్కలేదు. గుట్టను ఎక్కలేదు. చిటారు కొమ్మన ఉన్న పిట్టనూ పట్టలేదు. పుట్టుకతో వచ్చిన బాడీతో, పెంచి పోషించుకున్న బాడీ పార్ట్స్‌తో ప్రపంచంలోనే ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలిచిపోయారు. తమ దేశాలకు గిన్నిస్ కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు.
గడ్డం ఉన్న అమ్మాయి
బాధపడి పోకండి.. అయ్యో ఇంత అందమైన అమ్మాయికి గడ్డం, మీసం ఏంటని?! దీన్నొక రికార్డుగా మాత్రమే తీసుకుని మనసు దిటవు చేసుకోండి. ఈమె పేరు హర్నామ్ కౌర్. పంజాబీ అమ్మాయి. ఇంగ్లండ్‌లో ఉంటోంది. 24 ఏళ్ల కౌర్ 2015 సెప్టెంబర్ 7న గిన్నిస్‌లోకి క్యాట్ వాక్ చేసింది. దేవుడా? ఏమిటి నీ లీలా వినోదాలు!!
పొడవైన గోళ్లు
లీ రెడ్‌మండ్ అమెరికా యువతి. ఈమె గోళ్ల పొడవు(అన్నీ కలిపి) 28 అడుగుల 4.5 అంగుళాలు! రెండు చేతుల గోళ్లూ ఏళ్ల తరబడి పెంచేసింది! 2008 ఫిబ్రవరి 28 గిన్నిస్‌ను ఆ గోళ్లతో రక్కేసింది! 2009లో పాపం కొన్ని గోళ్లు విరిగిపోయాయట. ఆ విషయాన్ని చాలా బా«దగా చెబుతుంటుంది లీ.
ఫుట్ రొటేషన్
బాడీని అలాగే ఉంచేసి పాదాలను మాత్రం వెనక్కు తిప్పేయడంలో నిష్ణాతుడు మాక్స్‌వెల్ డే. ఈ బ్రిటన్ బాయ్ 157 డిగ్రీల వరకు పాదాలను టర్న్ చేసేస్తాడు. 2015 సెప్టెంబర్ 24 ఇతడు గిన్నిస్ బుక్ వైపు తన పాదాలను తిప్పాడు.
టాలెస్ట్ మ్యాన్
టర్కీ సుల్తాన్ ఈయన. పేరు సుల్తానే కానీ, నిజంగా సుల్తాన్ కాదు. కంట్రీ మాత్రం టర్కీనే. ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు. 2011 ఫిబ్రవరి 9న ఈయన అంత పెద్ద గిన్నిస్ బుక్ తనని తలదించి చూసేలా చేసుకున్నాడు!
పొడవైన మీసాలు
ఈ మీసాల రాయుడి పేరు రామ్‌సింగ్ చౌహాన్. ఈయన్ది రాజస్థాన్. 14 అడుగుల పొడవున (రెండూ కలిపి) మీసాలు పెంచి, గిన్నిస్‌లో 2010 మార్చిన 4న ఆ మీసాలను మెలేశాడు.
మహాద్వారం
బర్గర్‌ను తింటున్న ఈ జర్మన్ దేశస్థుడిని చూశారు కదా. ఈయన పేరు బెర్న్›్డ స్కూమిడ్. నోరు తెరిస్తే పెద్దపెద్ద కొండలే అవలీలగా లోపలికి వెళ్లిపోతాయి. ఇంతకన్నా ఎవరూ నోరు తెరవలేరని బెర్న్›్డను చూసిన గిన్నిస్ నోరు తెరిచేసింది. 8.8 సెం.మీ. నిడివిలో నోరు తెరిచి 2015 జనవరి 17న ఇతడు గిన్నిస్ బుక్‌ని మింగేశాడు.
పాదాలు
వెనిజులా కుర్రాడు జేసన్ రోడ్రిగ్ హెర్నాండెజ్ పాదాలివి. ఒక్కో పాదం 40 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అంటే 1 అడుగు, 3.79 అంగుళాలు. ఇంత పెద్ద పాదాలు వేసుకుని ఇతడు 2014 అక్టోబర్ 6న గిన్నిస్ బుక్ మీదకి నడిచారు.
ఆఫ్రో
ఆఫ్రో అంటే తీరైన తలకట్టు అని అర్థం. ఇంత భారీ తలకట్టు అమెరికాలో కానీ, ఇంకెక్కడా కానీ లేదని గిన్నిస్ అనేసింది. అలా అని టేలర్ రైట్‌కి సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది. టేలర్ అమెరికన్ బాయ్. 25.4 సెంటీమీటర్ల ఎత్తు, 22.9 సెం.మీ.ల వెడల్పు, 177.8 సెం.మీ. చుట్టుకొలత ఉన్న తలకట్టుతో టేలర్ 2015 జూన్ 19న గిన్నిస్ బుక్ పై తన క్రాఫు విదిల్చాడు.
పళ్లు
ఈయన్ని చూడండి. నోరు ఎలా తెరిచాడో! ఎందుకు తెరిచాడంటే.. తన దంత సిరిని చూపించుకోడానికి. అందరికీ 32 పళ్లు ఉంటే ఈయనకు మాత్రం 37 పళ్లు. ఆ పళ్లతో 2014 సెప్టెంబర్ 20న గట్టిగా గిన్నిస్‌ను పట్టేసుకున్నాడు. అన్నట్టు ఈయన మన ఇండియనే. పేరు విజయకుమార్. ఊరు దావణగెరె.
బుల్లి కపుల్
పాలో గాబ్రియల్ డి సిల్వా బారోస్, కట్యూసియా లీ హష్నిమో భార్యాభర్తలు. తమ పేర్లంత పొడవు కూడా లేనివాళ్లు! అదే వీళ్లకు ప్లస్ అయింది. ఇద్దర్నీ కలిపినా కూడా వీళ్ల ఎత్తు 5 అడుగుల 11.4 అంగుళాలకు మించిలేదు. 2016 నవంబర్ 3న ఈ జంట గిన్నిస్ ఆశీర్వాదాలు అందుకుంది.
చిన్నమ్మాయ్
నాన్న చేతుల్లో ఉన్న ఈ అమ్మాయి జ్యోతి కిసాంజీ ఆమ్‌గే. వయసు 23. నాన్న కిషన్. అమ్మ రంజన. వీళ్లది నాగపూర్. 2 అడుగుల మీద అరంగుళం పొడవుండే జ్యోతి అతి తక్కువ ఎత్తయిన మహిళగా 2011 డిసెంబర్ 16న గిన్నిస్ చంక ఎక్కేసింది.
మీసాలు, గెడ్డాల చాంపియన్
కార్ల్ హెయింజ్ అనే ఈ జర్మనీ దేశస్థుడిని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఇక ముందు కూడా చూడబోతారు. మీసాలు, గెడ్డాల పోటీల్లో 8 సార్లు చాంపియన్‌షిప్ సాధించిన కార్ల్ 2011లో తొలిసారి తన గెడ్డం, మీసాలతో గిన్నిస్‌కు గిలిగింతలు పెట్టాడు.
మగాళ్లలో ఓల్డెస్ట్
ప్రస్తుతం భూమ్మీద జీవించి ఉన్నవాళ్లలో అందరికన్నా వయసులో పెద్దవారు ఇజ్రాయెల్ క్రిస్టల్. ఈయన దేశం పేరే ఈయన ఇంటిపేరు. 2016 మార్చి 11 నాటికి ఈయన వయసు 112 సంవత్సరాల 178 రోజులు. అతి పాత వ్యక్తిగా గిన్నెస్‌కు కొత్త లుక్ ఇచ్చాడు.
శిరోజాలు
ఈ ‘జుట్టున్నమ్మ’ చైనా అమ్మాయి. పేరు జీ క్విపింగ్. జుట్టును కొలిస్తే 18 అడుగుల 5 అంగుళాల పైన పొడవుంది. 2004 మే 8న జీ క్విపింగ్ తన అందమైన శిరోజాలతో గిన్నిస్ బుక్‌ను పడేశారు.
నాలుక
ఇది ప్రపంచంలోనే అతి పొడవైన నాలుక. ఈ నాలుక నిక్ స్టోబెర్ల్ అనే అమెరికా కుర్రాడిది. పొడవు పది సెంటీమీటర్లు! 2012 నవంబర్ 27న ఇతడు గిన్నిస్‌ని తన నాలుకతో చప్పరించేశాడు.
ఒళ్లంతా పచ్చబొట్లు
ఈయన ఛార్ల్స్ హెల్మ్‌క్. అమెరికా. ఈయన ఒళ్లంతా పచ్చబొట్లే! వీలు కాని చోట తప్ప.. వీలైన చోటంతా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. బాడీలో 93.25 శాతం పచ్చబొట్లే. ఇక ఈవిడ చార్లెట్ గూటెన్‌బర్గ్. ఈమెదీ అమెరికానే. ఈవిడ ఒంటి మీద 91.5 శాతం వరకు పచ్చబొట్లు ఉన్నాయి. ఒంటి నిండా మాగ్జిమం పచ్చబొట్లు పొడిపించుకున్న సీనియర్ సిటిజన్‌లుగా వీళ్లు గిన్నిస్‌కే పచ్చబొట్టు అయ్యారు. చార్ల్స్ 2016 ఆగస్టు 2న, చార్లెట్ 2015 జూన్ 3న ఈ రికార్డు సాధించారు.
ముక్కు
చూడగానే పసిట్టేశారు కదా! పెద్ద ముక్కు మాస్టారు. (గెద్ద ముక్కలా వినిపిస్తోందా?). కాదు పెద్ద ముక్కే. మెహ్‌మెట్ ఒజ్యూరెక్ అనే ఈ టర్కీ దేశస్థుడి ముక్కు పొడవు 8.8. సెంటీమీటర్లు. 2010 మార్చి 18న ఈయన తన ముక్కుతో గిన్నిస్ బుక్‌ను
పొడిచాడు.
పెద్ద నోరు
భీతిల్లకండి. సాగదీసినప్పుడే ఈయన గారి నోరు ఇంత పెద్దది అవుతుంది. ఎంత పెద్దది అంటే 17 సెంటీమీటర్లు. ఈయన పేరు ఫ్రాన్సిస్కో జోక్విమ్. దేశం అంగోలా. 2010 మార్చి 18 న ఇంత నోరేసుకుని గిన్నెస్ బుక్‌పై పడిపోయాడు ఫ్రాన్సిస్కో.
వేళ్లు
ఈ చేతికి ఐదు, ఆ చేతికి ఐదు, ఈ కాలికి ఐదు, ఆ కాలికి ఐదు.. మొత్తం మానవజాతికి 20 వేళు.్ల అయితే దేవేంద్ర సుతార్ ఒక్కడికి 28 వేళ్లు. ఈయనది గుజరాత్. 2014 నవంబర్ 11న తన ఎక్స్‌ట్రా వేళ్లపై గిన్నిస్ బుక్‌ని
నిలబెట్టాడు.
చెట్టునెక్కలేదు... పుట్టనెక్కలేదు
Published Mon, Feb 20 2017 12:14 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM
Advertisement