Specialization
-
ముళ్ళతీగకు మల్లెలు పూస్తాయా?
ఊహకు సైతం అందని ఈ విశాల విశ్వం, అందులోని అణువణువూ దేవుని ఏకత్వాన్ని, ఆయన ఘనతను, ఆయన పాలనా, పోషణా గుణాలను సూచిస్తున్నాయి. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టి్టంచినవాడు ఆ ప్రభువే కనుక అన్నిటిపై అధికారం, ఆధిపత్యం కూడా ఆయనదే. ఈ విశ్వంలోని అసంఖ్యాక సృష్టితాల్లో మానవ రాసి కూడా ఒకటి. మరే ప్రాణికీ లేనటువంటి అత్యద్భుత ప్రతిభా పాటవాలను దైవం ఒక్క మానవ రాసికే అనుగ్రహించి, తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలని నిర్దేశించాడు. నిజానికి ఈ సృషి ్టసమస్తమూ ఒక్క మానవుడి కోసమేనంటే అతిశయోక్తి కాదు. మానవ మనుగడకోసం, మానవుల ప్రయోజనం కోసం దైవం అసంఖ్యాక ఏర్పాట్లు చేశాడు. గాలిని, నీటిని, వెలుగును, వేడిని, పగటిని, రేయిని ఆయన సృష్టించాడు. మానవుల ఆయురారోగ్యాలు, సౌభాగ్య దౌర్భాగ్యాలు ఆయన అధీనంలోనే ఉన్నాయి. జీవన్మరణాలు కూడా ఆయన గుప్పెట్లోనే ఉన్నాయి. మొరలు వినేవాడు, అవసరాలు తీర్చేవాడు అన్నీ ఆయనే. అండనిచ్చేవాడు, ఆశ్రయమిచ్చేవాడూ ఆయనే. మానవులు ఈప్రపంచంలో శాంతి సంతోషాలతో జీవితం గడపడానికి, పరలోక జీవితంలో సాఫల్యం పొందడానికి కావలసిన సకల ఏర్పాట్లూచేశాడు, సాధనాలనూ సమకూర్చాడు.అయితే, దురదృష్టవశాత్తూ మానవులు సృష్టికర్తను మరిచి ఇష్టారాజ్యంగా జీవించడం వల్ల రెండు విధాలుగా నష్టపోతున్నారు. ఈ ప్రాపంచిక జీవితంలో సుఖశాంతులు లేకుండా, మానసిక ప్రశాంతత లేకుండా భారంగా జీవితం వెళ్ళదీస్తున్నారు. అన్ని జీవరాసులకన్నా శ్రేష్ఠస్థానంలో ఉండి, బుద్ధికుశలతలకు అజ్ఞానపు పరదా కప్పి హీనస్థాయికి దిగజారిపోతున్నారు. ఇంతకన్నా భయంకరమైన నష్టం మరొకటి ఉంది. అదే పరలోక వైఫల్యం. ఏదో ఒక విధంగా ఇహలోక జీవితం గట్టెక్కినా, శాశ్వతమైన పరలోక జీవితంలో చేదు అనుభవమే ఎదురు కానుంది. ఇహలోక జీవితంలో బుద్ధినుపయోగించి, మంచిమార్గంలో నడిస్తే, రేపటి పరలోక జీవితం సఫలమవుతుంది. అంతేతప్ప ముళ్ళ విత్తనాన్ని నాటి మల్లెపూలు కోస్తామంటే సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడి ఆచరణ, నడవడిని బట్టే, అక్కడ ప్రతిఫలం నిర్ణయమవుతుంది. కనుక బుధ్ధిజీవి అయిన మానవుడు దైవం తనకు ప్రసాదించిన జ్ఞానాన్ని,స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే ఇహ, పరలోకాల్లో సంపూర్ణ సాఫల్యాన్ని సొంతం చేసుకోవచ్చు. దైవం మనందరికీ సన్మార్గపథాన నడిచే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
చెట్టునెక్కలేదు... పుట్టనెక్కలేదు
గిన్నిస్ మాత్రం ఎక్కేశారు థీమ్.. త న న సహజంగా ఉన్న ప్రత్యేకతైనా, సాధించి తెచ్చుకున్న ప్రత్యేకతైనా పదిమందిలో గుర్తింపు తెస్తుంది. ఆ ప్రత్యేకత మరీ మరీ ప్రత్యేకమైనదైతే గిన్నెస్ బుక్‌లో చోటు లభిస్తుంది. ఇదిగో.. వీళ్లంతా అలా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కినవాళ్లే. వీళ్లెవరూ చెట్టును ఎక్కలేదు. గుట్టను ఎక్కలేదు. చిటారు కొమ్మన ఉన్న పిట్టనూ పట్టలేదు. పుట్టుకతో వచ్చిన బాడీతో, పెంచి పోషించుకున్న బాడీ పార్ట్స్‌తో ప్రపంచంలోనే ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలిచిపోయారు. తమ దేశాలకు గిన్నిస్ కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. గడ్డం ఉన్న అమ్మాయి బాధపడి పోకండి.. అయ్యో ఇంత అందమైన అమ్మాయికి గడ్డం, మీసం ఏంటని?! దీన్నొక రికార్డుగా మాత్రమే తీసుకుని మనసు దిటవు చేసుకోండి. ఈమె పేరు హర్నామ్ కౌర్. పంజాబీ అమ్మాయి. ఇంగ్లండ్‌లో ఉంటోంది. 24 ఏళ్ల కౌర్ 2015 సెప్టెంబర్ 7న గిన్నిస్‌లోకి క్యాట్ వాక్ చేసింది. దేవుడా? ఏమిటి నీ లీలా వినోదాలు!! పొడవైన గోళ్లు లీ రెడ్మండ్ అమెరికా యువతి. ఈమె గోళ్ల పొడవు(అన్నీ కలిపి) 28 అడుగుల 4.5 అంగుళాలు! రెండు చేతుల గోళ్లూ ఏళ్ల తరబడి పెంచేసింది! 2008 ఫిబ్రవరి 28 గిన్నిస్‌ను ఆ గోళ్లతో రక్కేసింది! 2009లో పాపం కొన్ని గోళ్లు విరిగిపోయాయట. ఆ విషయాన్ని చాలా బా«దగా చెబుతుంటుంది లీ. ఫుట్ రొటేషన్ బాడీని అలాగే ఉంచేసి పాదాలను మాత్రం వెనక్కు తిప్పేయడంలో నిష్ణాతుడు మాక్స్వెల్ డే. ఈ బ్రిటన్ బాయ్ 157 డిగ్రీల వరకు పాదాలను టర్న్ చేసేస్తాడు. 2015 సెప్టెంబర్ 24 ఇతడు గిన్నిస్ బుక్ వైపు తన పాదాలను తిప్పాడు. టాలెస్ట్ మ్యాన్ టర్కీ సుల్తాన్ ఈయన. పేరు సుల్తానే కానీ, నిజంగా సుల్తాన్ కాదు. కంట్రీ మాత్రం టర్కీనే. ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు. 2011 ఫిబ్రవరి 9న ఈయన అంత పెద్ద గిన్నిస్ బుక్ తనని తలదించి చూసేలా చేసుకున్నాడు! పొడవైన మీసాలు ఈ మీసాల రాయుడి పేరు రామ్‌సింగ్ చౌహాన్. ఈయన్ది రాజస్థాన్. 14 అడుగుల పొడవున (రెండూ కలిపి) మీసాలు పెంచి, గిన్నిస్‌లో 2010 మార్చిన 4న ఆ మీసాలను మెలేశాడు. మహాద్వారం బర్గర్‌ను తింటున్న ఈ జర్మన్ దేశస్థుడిని చూశారు కదా. ఈయన పేరు బెర్న్›్డ స్కూమిడ్. నోరు తెరిస్తే పెద్దపెద్ద కొండలే అవలీలగా లోపలికి వెళ్లిపోతాయి. ఇంతకన్నా ఎవరూ నోరు తెరవలేరని బెర్న్›్డను చూసిన గిన్నిస్ నోరు తెరిచేసింది. 8.8 సెం.మీ. నిడివిలో నోరు తెరిచి 2015 జనవరి 17న ఇతడు గిన్నిస్ బుక్‌ని మింగేశాడు. పాదాలు వెనిజులా కుర్రాడు జేసన్ రోడ్రిగ్ హెర్నాండెజ్ పాదాలివి. ఒక్కో పాదం 40 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అంటే 1 అడుగు, 3.79 అంగుళాలు. ఇంత పెద్ద పాదాలు వేసుకుని ఇతడు 2014 అక్టోబర్ 6న గిన్నిస్ బుక్ మీదకి నడిచారు. ఆఫ్రో ఆఫ్రో అంటే తీరైన తలకట్టు అని అర్థం. ఇంత భారీ తలకట్టు అమెరికాలో కానీ, ఇంకెక్కడా కానీ లేదని గిన్నిస్ అనేసింది. అలా అని టేలర్ రైట్కి సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది. టేలర్ అమెరికన్ బాయ్. 25.4 సెంటీమీటర్ల ఎత్తు, 22.9 సెం.మీ.ల వెడల్పు, 177.8 సెం.మీ. చుట్టుకొలత ఉన్న తలకట్టుతో టేలర్ 2015 జూన్ 19న గిన్నిస్ బుక్ పై తన క్రాఫు విదిల్చాడు. పళ్లు ఈయన్ని చూడండి. నోరు ఎలా తెరిచాడో! ఎందుకు తెరిచాడంటే.. తన దంత సిరిని చూపించుకోడానికి. అందరికీ 32 పళ్లు ఉంటే ఈయనకు మాత్రం 37 పళ్లు. ఆ పళ్లతో 2014 సెప్టెంబర్ 20న గట్టిగా గిన్నిస్‌ను పట్టేసుకున్నాడు. అన్నట్టు ఈయన మన ఇండియనే. పేరు విజయకుమార్. ఊరు దావణగెరె. బుల్లి కపుల్ పాలో గాబ్రియల్ డి సిల్వా బారోస్, కట్యూసియా లీ హష్నిమో భార్యాభర్తలు. తమ పేర్లంత పొడవు కూడా లేనివాళ్లు! అదే వీళ్లకు ప్లస్ అయింది. ఇద్దర్నీ కలిపినా కూడా వీళ్ల ఎత్తు 5 అడుగుల 11.4 అంగుళాలకు మించిలేదు. 2016 నవంబర్ 3న ఈ జంట గిన్నిస్ ఆశీర్వాదాలు అందుకుంది. చిన్నమ్మాయ్ నాన్న చేతుల్లో ఉన్న ఈ అమ్మాయి జ్యోతి కిసాంజీ ఆమ్గే. వయసు 23. నాన్న కిషన్. అమ్మ రంజన. వీళ్లది నాగపూర్. 2 అడుగుల మీద అరంగుళం పొడవుండే జ్యోతి అతి తక్కువ ఎత్తయిన మహిళగా 2011 డిసెంబర్ 16న గిన్నిస్ చంక ఎక్కేసింది. మీసాలు, గెడ్డాల చాంపియన్ కార్ల్ హెయింజ్ అనే ఈ జర్మనీ దేశస్థుడిని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఇక ముందు కూడా చూడబోతారు. మీసాలు, గెడ్డాల పోటీల్లో 8 సార్లు చాంపియన్‌షిప్ సాధించిన కార్ల్ 2011లో తొలిసారి తన గెడ్డం, మీసాలతో గిన్నిస్‌కు గిలిగింతలు పెట్టాడు. మగాళ్లలో ఓల్డెస్ట్ ప్రస్తుతం భూమ్మీద జీవించి ఉన్నవాళ్లలో అందరికన్నా వయసులో పెద్దవారు ఇజ్రాయెల్ క్రిస్టల్. ఈయన దేశం పేరే ఈయన ఇంటిపేరు. 2016 మార్చి 11 నాటికి ఈయన వయసు 112 సంవత్సరాల 178 రోజులు. అతి పాత వ్యక్తిగా గిన్నెస్కు కొత్త లుక్ ఇచ్చాడు. శిరోజాలు ఈ ‘జుట్టున్నమ్మ’ చైనా అమ్మాయి. పేరు జీ క్విపింగ్. జుట్టును కొలిస్తే 18 అడుగుల 5 అంగుళాల పైన పొడవుంది. 2004 మే 8న జీ క్విపింగ్ తన అందమైన శిరోజాలతో గిన్నిస్ బుక్‌ను పడేశారు. నాలుక ఇది ప్రపంచంలోనే అతి పొడవైన నాలుక. ఈ నాలుక నిక్ స్టోబెర్ల్ అనే అమెరికా కుర్రాడిది. పొడవు పది సెంటీమీటర్లు! 2012 నవంబర్ 27న ఇతడు గిన్నిస్ని తన నాలుకతో చప్పరించేశాడు. ఒళ్లంతా పచ్చబొట్లు ఈయన ఛార్ల్స్ హెల్మ్క్. అమెరికా. ఈయన ఒళ్లంతా పచ్చబొట్లే! వీలు కాని చోట తప్ప.. వీలైన చోటంతా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. బాడీలో 93.25 శాతం పచ్చబొట్లే. ఇక ఈవిడ చార్లెట్ గూటెన్‌బర్గ్. ఈమెదీ అమెరికానే. ఈవిడ ఒంటి మీద 91.5 శాతం వరకు పచ్చబొట్లు ఉన్నాయి. ఒంటి నిండా మాగ్జిమం పచ్చబొట్లు పొడిపించుకున్న సీనియర్ సిటిజన్లుగా వీళ్లు గిన్నిస్కే పచ్చబొట్టు అయ్యారు. చార్ల్స్ 2016 ఆగస్టు 2న, చార్లెట్ 2015 జూన్ 3న ఈ రికార్డు సాధించారు. ముక్కు చూడగానే పసిట్టేశారు కదా! పెద్ద ముక్కు మాస్టారు. (గెద్ద ముక్కలా వినిపిస్తోందా?). కాదు పెద్ద ముక్కే. మెహ్మెట్ ఒజ్యూరెక్ అనే ఈ టర్కీ దేశస్థుడి ముక్కు పొడవు 8.8. సెంటీమీటర్లు. 2010 మార్చి 18న ఈయన తన ముక్కుతో గిన్నిస్ బుక్‌ను పొడిచాడు. పెద్ద నోరు భీతిల్లకండి. సాగదీసినప్పుడే ఈయన గారి నోరు ఇంత పెద్దది అవుతుంది. ఎంత పెద్దది అంటే 17 సెంటీమీటర్లు. ఈయన పేరు ఫ్రాన్సిస్కో జోక్విమ్. దేశం అంగోలా. 2010 మార్చి 18 న ఇంత నోరేసుకుని గిన్నెస్ బుక్‌పై పడిపోయాడు ఫ్రాన్సిస్కో. వేళ్లు ఈ చేతికి ఐదు, ఆ చేతికి ఐదు, ఈ కాలికి ఐదు, ఆ కాలికి ఐదు.. మొత్తం మానవజాతికి 20 వేళు.్ల అయితే దేవేంద్ర సుతార్ ఒక్కడికి 28 వేళ్లు. ఈయనది గుజరాత్. 2014 నవంబర్ 11న తన ఎక్స్ట్రా వేళ్లపై గిన్నిస్ బుక్‌ని నిలబెట్టాడు. -
కుటుంబానికో సమాధి!
గీసుకొండ : మరియపురం.. గీసుకొండ మండలంలోని ఈ గ్రామానికో ప్రత్యేకత ఉంది. వంద కుటుంబాలు జీవిస్తున్న ఈ ఊరిలో కుటుంబానికో సమాధి ఉంటుంది. ఆయా కుటుంబాల్లో ఎవరు ఎప్పుడు చనిపోయినా సమాధి రెడీగా ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. గ్రామంలో నివసిస్తున్న క్రైస్తవ కుటుంబాలు వందేళ్లుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నాయి. తమవారెవరైనా చనిపోతే హృదయవనం పేరుతో ఏర్పాటు చేసుకున్న ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించుకున్న సమాధిలో ఖననం చేస్తారు. ఒకే సమాధిలో పదిమందిని ఖననం చేసేలా అంతస్తుల మాదిరిగా సమాధులను నిర్మిచడం విశేషం. అవసరానికి తెరిచేలా.. పది అడుగుల లోతులో దీర్ఘచతురస్రాకారంగా సమాధిని నిర్మిస్తారు. కిందభాగంలో గచ్చుచేసి భూమి ఉపరితలంపైన రెండుమూడు అడుగుల ఎత్తువరకు గోడ కడతారు. సమాధిపైన సిమెంట్, ఇనుప రేకులతో తయారుచేసిన బరువైన మూతలాంటిది ఏర్పాటు చేస్తారు. ఇది తలుపులా ఉండి అవసరమైనప్పుడు తెరిచే ఏర్పాటు ఉంటుంది. కుటుంబంలో మొదట చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కింది భాగంలో ఖననం చేసి ఉప్పు, సుగంధ ద్రవ్యాలను వేస్తారు. పైన నాలుగు షాబాద్ బండలు అమర్చి మూసివేస్తారు. తర్వాత పైన మూత బిగిస్తారు. కుటుంబంలో మళ్లీ మరోవ్యక్తి చనిపోయినప్పుడు సమాధి మూతను తొలగించి ఇదే పద్ధతిలో ఖననం చేస్తారు. ఒకవేళ కుటుంబంలో ఎక్కువమంది చనిపోతే సమాధిలో ఖాళీ లేనప్పుడు అంతకుముందు సమాధి చేసిన వారి కపాలం, ఎముకలను అందులో నుంచి తీసేసి లోపలి గోడల పక్కన ఉన్న స్థలంలో వాటిని భద్రపరుస్తారు. తర్వాత అప్పుడే చనిపోయిన వారి మృతదే హాన్ని అందులో ఖననం చేస్తారు. ప్రముఖుల ఊరు.. గ్రామంలో నివసించే వారిలో నిర్మల బైండింగ్ సంస్థ యజమాని అల్లం బాలిరెడ్డి, సెయింట్ పీటర్స్ విద్యా సంస్థల భాగస్వాములు గోపు జోజిరెడ్డి, తుమ్మ బాలిరెడ్డి, వికాస్ స్కూల్స్ నిర్వాహకులు శింగారెడ్డి మర్రెడ్డి, వ్యాపారవేత్త అల్లం చిన్నపరెడ్డి తదితర విద్యా, వ్యాపార, వ్యవసాయ రంగాల్లోని ప్రముఖులు ఉన్నారు. ఈ గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన వారూ ఉన్నారు. ఆత్మల పండుగ నేడు ప్రతి ఏడాది నవంబర్ 2వ తేదీన రోమన్ క్యాథలిక్ క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఆత్మల పండుగ జరుపుకుంటా రు. ఈ సందర్భంగా పూర్వీకుల సమాధులను శుభ్రం చేయడం, వాటికి రంగు లు వేయడంతో పాటు పూలతో అలంకరిస్తారు. సమాధుల వద్దకు వెళ్లి తమ వారి ఆత్మలకు శాంతి కలగాలని కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థిస్తారు. చిన్నచిన్న తప్పులు చేసిన వారు అటు స్వర్గానికి, ఇటు నరకానికి వెళ్లకుండా మధ్యలో ఉండిపోతారని, అటువంటి వారి ఆత్మలు ప్రభువు సన్నిధికి చేరడానికి మృతుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడమే ఆత్మల(సమాధుల) పండుగని గ్రామస్తులు చెబుతారు. ఈ సందర్భంగా సమాధుల వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, దానధర్మాలు చేస్తారని మరియపురం చర్చి ఫాదర్ గంగారపు నవీన్ తెలిపారు. ఆదివారం గ్రామంలో జరిగే ఈ ప్రార్థనలకు బిషప్ ఉడుముల బాల వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
వీరశైవుల భక్తికి నిదర్శనం శూలాల ఉత్సవం
రేపు మునగపాకలో సంబరం మునగపాక: ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే పేరెన్నిక గన్న మునగపాక శూలాల మహోత్సవం ఈ నెల 3న ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ బూడిద శ్రీనివాసరావు తెలిపారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజలు ఇక్కడకు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఏటా కార్తీకమాసం రెండో సోమవారం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉత్సవ ప్రత్యేకత ఇక్కడి దేవాంగుల కులానికి చెందిన వారు వ్యాపార నిమిత్తం తమిళనాడు రాష్ట్రం పళిని పట్టణాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా అక్కడ వీరశైవులు శూలాలు ధరించి డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేయడం వీరిని ఎంతగానో ఆకర్షించింది. అదేవిధంగా మునగపాకలో కూడా నిర్వహించాలనుకున్నారు. సుమారు వందేళ్ల నుంచి మునగపాకలో క్రమం తప్పకుండా శరీరం, నాలుక, బుగ్గలపై శూలాలు ధరించి నృత్యం చేస్తూ వస్తున్నారు. అప్పట్లో ఈ వేడుక ఒక వీధికి మాత్రమే పరిమితమై ఉండేది. క్రమేణా గ్రామస్తులంతా ఒకటై కులమతాలకు అతీతంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ప్రత్యేక ఆకర్షణగా శూలాల నృత్యం ఈ వేడుకల్లో శివ భక్తులు ప్రదర్శించే ఇనుప శూలాల నృత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. కార్తీక మాసం రెండో సోమవారం శూలాలు ధరించే భక్తులు ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి శరీరం, బుగ్గలు, నాలుకపై ఇనుప చువ్వలు గుచ్చుకొని చువ్వల చివరన ఉండే నూలు కండెలను వెలిగించి డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తారు. నృత్య ప్రదర్శన గ్రామంలోని అన్ని వీధులగుండా ఊరేగింపుగా వచ్చి ఉదయం 5 గంటలకు ఆలయానికి తిరిగి చేరుకుంటుంది. ఈ నృత్యాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి ఉంటారు. ఆకర్షణీయంగా రెండతస్తుల గుమ్మటం ఈ ఉత్సవానికి మరో ఆకర్షణగా రెండతస్తుల గుమ్మటం నిలుస్తుంది. ఏటా ఉత్సవానికి నెలరోజుల ముందు నుంచి గుమ్మటం తయారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రంగురంగుల నూలుదారాలతో సుమారు 15 అడుగుల ఎత్తులో ఈ గుమ్మటాన్ని తయారు చేస్తారు. గుమ్మటంలో శివుని ఫొటో ఉంచి పురవీధుల్లో భక్తుల దర్శనార్ధం ఊరేగింపు నిర్వహిస్తారు. గుమ్మటం కింద భాగాన్ని నుదిటితో భక్తులు హత్తుకుంటారు. దీనివల్ల కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. గ్రామంలోని అన్ని వీధులను కలుపుకొని భారీ విద్యుత్ అలంకరణలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సందర్శనార్థం సోమవారం తెల్లవారు నుండి ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవంలో భాగంగా గ్రామంలోని అన్ని ప్రధాన కూడళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, నేలవేషాలు ఏర్పాటు చేస్తున్నారు. చిడతలు, కోలాటాలు, భజనలు, కొయ్య డ్యాన్స్‌లు, తప్పిటగుళ్ల వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మునగపాక ఎస్ఐ జి. రవికుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.