కుటుంబానికో సమాధి! | Kutumbaniko grave! | Sakshi
Sakshi News home page

కుటుంబానికో సమాధి!

Published Sun, Nov 2 2014 6:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

Kutumbaniko grave!

గీసుకొండ : మరియపురం.. గీసుకొండ మండలంలోని ఈ గ్రామానికో ప్రత్యేకత ఉంది. వంద కుటుంబాలు జీవిస్తున్న ఈ ఊరిలో కుటుంబానికో సమాధి ఉంటుంది. ఆయా కుటుంబాల్లో ఎవరు ఎప్పుడు చనిపోయినా సమాధి రెడీగా ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. గ్రామంలో నివసిస్తున్న క్రైస్తవ కుటుంబాలు వందేళ్లుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నాయి. తమవారెవరైనా చనిపోతే హృదయవనం పేరుతో ఏర్పాటు చేసుకున్న ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించుకున్న సమాధిలో ఖననం చేస్తారు.  ఒకే సమాధిలో పదిమందిని ఖననం చేసేలా అంతస్తుల మాదిరిగా సమాధులను నిర్మిచడం విశేషం.
 
అవసరానికి తెరిచేలా..

పది అడుగుల లోతులో దీర్ఘచతురస్రాకారంగా సమాధిని నిర్మిస్తారు. కిందభాగంలో గచ్చుచేసి భూమి ఉపరితలంపైన రెండుమూడు అడుగుల ఎత్తువరకు గోడ కడతారు. సమాధిపైన సిమెంట్, ఇనుప రేకులతో తయారుచేసిన బరువైన మూతలాంటిది ఏర్పాటు చేస్తారు. ఇది తలుపులా ఉండి అవసరమైనప్పుడు తెరిచే ఏర్పాటు ఉంటుంది. కుటుంబంలో మొదట చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కింది భాగంలో ఖననం చేసి ఉప్పు, సుగంధ ద్రవ్యాలను వేస్తారు.

పైన నాలుగు షాబాద్ బండలు అమర్చి మూసివేస్తారు. తర్వాత పైన మూత బిగిస్తారు. కుటుంబంలో మళ్లీ మరోవ్యక్తి చనిపోయినప్పుడు సమాధి మూతను తొలగించి ఇదే పద్ధతిలో ఖననం చేస్తారు. ఒకవేళ కుటుంబంలో ఎక్కువమంది చనిపోతే సమాధిలో ఖాళీ లేనప్పుడు అంతకుముందు సమాధి చేసిన వారి కపాలం, ఎముకలను అందులో నుంచి తీసేసి లోపలి గోడల పక్కన ఉన్న స్థలంలో వాటిని భద్రపరుస్తారు. తర్వాత అప్పుడే చనిపోయిన వారి మృతదే హాన్ని అందులో ఖననం చేస్తారు.
 
ప్రముఖుల ఊరు..

గ్రామంలో నివసించే వారిలో నిర్మల బైండింగ్ సంస్థ యజమాని అల్లం బాలిరెడ్డి, సెయింట్ పీటర్స్ విద్యా సంస్థల భాగస్వాములు గోపు జోజిరెడ్డి, తుమ్మ బాలిరెడ్డి,  వికాస్ స్కూల్స్ నిర్వాహకులు శింగారెడ్డి మర్రెడ్డి, వ్యాపారవేత్త అల్లం చిన్నపరెడ్డి తదితర విద్యా, వ్యాపార, వ్యవసాయ రంగాల్లోని ప్రముఖులు ఉన్నారు. ఈ గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన వారూ ఉన్నారు.
 
ఆత్మల పండుగ నేడు

ప్రతి ఏడాది నవంబర్ 2వ తేదీన  రోమన్ క్యాథలిక్ క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఆత్మల పండుగ జరుపుకుంటా రు. ఈ సందర్భంగా పూర్వీకుల సమాధులను శుభ్రం చేయడం, వాటికి రంగు లు వేయడంతో పాటు పూలతో అలంకరిస్తారు. సమాధుల వద్దకు వెళ్లి తమ వారి ఆత్మలకు శాంతి కలగాలని కొవ్వొత్తులను వెలిగించి  ప్రార్థిస్తారు.

చిన్నచిన్న తప్పులు చేసిన వారు అటు స్వర్గానికి, ఇటు నరకానికి వెళ్లకుండా మధ్యలో ఉండిపోతారని, అటువంటి వారి ఆత్మలు ప్రభువు సన్నిధికి చేరడానికి మృతుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడమే ఆత్మల(సమాధుల) పండుగని గ్రామస్తులు చెబుతారు. ఈ సందర్భంగా సమాధుల వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, దానధర్మాలు చేస్తారని మరియపురం చర్చి ఫాదర్ గంగారపు నవీన్ తెలిపారు. ఆదివారం గ్రామంలో జరిగే ఈ ప్రార్థనలకు బిషప్ ఉడుముల బాల వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement