ఊహకు సైతం అందని ఈ విశాల విశ్వం, అందులోని అణువణువూ దేవుని ఏకత్వాన్ని, ఆయన ఘనతను, ఆయన పాలనా, పోషణా గుణాలను సూచిస్తున్నాయి. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టి్టంచినవాడు ఆ ప్రభువే కనుక అన్నిటిపై అధికారం, ఆధిపత్యం కూడా ఆయనదే. ఈ విశ్వంలోని అసంఖ్యాక సృష్టితాల్లో మానవ రాసి కూడా ఒకటి. మరే ప్రాణికీ లేనటువంటి అత్యద్భుత ప్రతిభా పాటవాలను దైవం ఒక్క మానవ రాసికే అనుగ్రహించి, తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలని నిర్దేశించాడు. నిజానికి ఈ సృషి ్టసమస్తమూ ఒక్క మానవుడి కోసమేనంటే అతిశయోక్తి కాదు. మానవ మనుగడకోసం, మానవుల ప్రయోజనం కోసం దైవం అసంఖ్యాక ఏర్పాట్లు చేశాడు.
గాలిని, నీటిని, వెలుగును, వేడిని, పగటిని, రేయిని ఆయన సృష్టించాడు. మానవుల ఆయురారోగ్యాలు, సౌభాగ్య దౌర్భాగ్యాలు ఆయన అధీనంలోనే ఉన్నాయి. జీవన్మరణాలు కూడా ఆయన గుప్పెట్లోనే ఉన్నాయి. మొరలు వినేవాడు, అవసరాలు తీర్చేవాడు అన్నీ ఆయనే. అండనిచ్చేవాడు, ఆశ్రయమిచ్చేవాడూ ఆయనే. మానవులు ఈప్రపంచంలో శాంతి సంతోషాలతో జీవితం గడపడానికి, పరలోక జీవితంలో సాఫల్యం పొందడానికి కావలసిన సకల ఏర్పాట్లూచేశాడు, సాధనాలనూ సమకూర్చాడు.అయితే, దురదృష్టవశాత్తూ మానవులు సృష్టికర్తను మరిచి ఇష్టారాజ్యంగా జీవించడం వల్ల రెండు విధాలుగా నష్టపోతున్నారు. ఈ ప్రాపంచిక జీవితంలో సుఖశాంతులు లేకుండా, మానసిక ప్రశాంతత లేకుండా భారంగా జీవితం వెళ్ళదీస్తున్నారు.
అన్ని జీవరాసులకన్నా శ్రేష్ఠస్థానంలో ఉండి, బుద్ధికుశలతలకు అజ్ఞానపు పరదా కప్పి హీనస్థాయికి దిగజారిపోతున్నారు. ఇంతకన్నా భయంకరమైన నష్టం మరొకటి ఉంది. అదే పరలోక వైఫల్యం. ఏదో ఒక విధంగా ఇహలోక జీవితం గట్టెక్కినా, శాశ్వతమైన పరలోక జీవితంలో చేదు అనుభవమే ఎదురు కానుంది. ఇహలోక జీవితంలో బుద్ధినుపయోగించి, మంచిమార్గంలో నడిస్తే, రేపటి పరలోక జీవితం సఫలమవుతుంది. అంతేతప్ప ముళ్ళ విత్తనాన్ని నాటి మల్లెపూలు కోస్తామంటే సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడి ఆచరణ, నడవడిని బట్టే, అక్కడ ప్రతిఫలం నిర్ణయమవుతుంది. కనుక బుధ్ధిజీవి అయిన మానవుడు దైవం తనకు ప్రసాదించిన జ్ఞానాన్ని,స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే ఇహ, పరలోకాల్లో సంపూర్ణ సాఫల్యాన్ని సొంతం చేసుకోవచ్చు. దైవం మనందరికీ సన్మార్గపథాన నడిచే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment