The universe
-
ముళ్ళతీగకు మల్లెలు పూస్తాయా?
ఊహకు సైతం అందని ఈ విశాల విశ్వం, అందులోని అణువణువూ దేవుని ఏకత్వాన్ని, ఆయన ఘనతను, ఆయన పాలనా, పోషణా గుణాలను సూచిస్తున్నాయి. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టి్టంచినవాడు ఆ ప్రభువే కనుక అన్నిటిపై అధికారం, ఆధిపత్యం కూడా ఆయనదే. ఈ విశ్వంలోని అసంఖ్యాక సృష్టితాల్లో మానవ రాసి కూడా ఒకటి. మరే ప్రాణికీ లేనటువంటి అత్యద్భుత ప్రతిభా పాటవాలను దైవం ఒక్క మానవ రాసికే అనుగ్రహించి, తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలని నిర్దేశించాడు. నిజానికి ఈ సృషి ్టసమస్తమూ ఒక్క మానవుడి కోసమేనంటే అతిశయోక్తి కాదు. మానవ మనుగడకోసం, మానవుల ప్రయోజనం కోసం దైవం అసంఖ్యాక ఏర్పాట్లు చేశాడు. గాలిని, నీటిని, వెలుగును, వేడిని, పగటిని, రేయిని ఆయన సృష్టించాడు. మానవుల ఆయురారోగ్యాలు, సౌభాగ్య దౌర్భాగ్యాలు ఆయన అధీనంలోనే ఉన్నాయి. జీవన్మరణాలు కూడా ఆయన గుప్పెట్లోనే ఉన్నాయి. మొరలు వినేవాడు, అవసరాలు తీర్చేవాడు అన్నీ ఆయనే. అండనిచ్చేవాడు, ఆశ్రయమిచ్చేవాడూ ఆయనే. మానవులు ఈప్రపంచంలో శాంతి సంతోషాలతో జీవితం గడపడానికి, పరలోక జీవితంలో సాఫల్యం పొందడానికి కావలసిన సకల ఏర్పాట్లూచేశాడు, సాధనాలనూ సమకూర్చాడు.అయితే, దురదృష్టవశాత్తూ మానవులు సృష్టికర్తను మరిచి ఇష్టారాజ్యంగా జీవించడం వల్ల రెండు విధాలుగా నష్టపోతున్నారు. ఈ ప్రాపంచిక జీవితంలో సుఖశాంతులు లేకుండా, మానసిక ప్రశాంతత లేకుండా భారంగా జీవితం వెళ్ళదీస్తున్నారు. అన్ని జీవరాసులకన్నా శ్రేష్ఠస్థానంలో ఉండి, బుద్ధికుశలతలకు అజ్ఞానపు పరదా కప్పి హీనస్థాయికి దిగజారిపోతున్నారు. ఇంతకన్నా భయంకరమైన నష్టం మరొకటి ఉంది. అదే పరలోక వైఫల్యం. ఏదో ఒక విధంగా ఇహలోక జీవితం గట్టెక్కినా, శాశ్వతమైన పరలోక జీవితంలో చేదు అనుభవమే ఎదురు కానుంది. ఇహలోక జీవితంలో బుద్ధినుపయోగించి, మంచిమార్గంలో నడిస్తే, రేపటి పరలోక జీవితం సఫలమవుతుంది. అంతేతప్ప ముళ్ళ విత్తనాన్ని నాటి మల్లెపూలు కోస్తామంటే సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడి ఆచరణ, నడవడిని బట్టే, అక్కడ ప్రతిఫలం నిర్ణయమవుతుంది. కనుక బుధ్ధిజీవి అయిన మానవుడు దైవం తనకు ప్రసాదించిన జ్ఞానాన్ని,స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే ఇహ, పరలోకాల్లో సంపూర్ణ సాఫల్యాన్ని సొంతం చేసుకోవచ్చు. దైవం మనందరికీ సన్మార్గపథాన నడిచే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
దైవమూ కణమూ మనమూ క్షేమమే!
‘ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్’... ఇంగ్లీషులో ఓ నానుడి! తెలుగులోనైతే... ‘వివరంలోనే ‘విషయం’ అనుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ‘దైవ’కణంపై చేసిన వ్యాఖ్యలు ఈ మాటల్నే గుర్తు చేస్తున్నాయి. వివరాలు తెలుసుకునే ముందు... ఒక్కటైతే స్పష్టం... దైవమూ... కణమూ... మనమూ అంతా క్షేమమే! దైవకణం జోలికెళితే విశ్వం మొత్తం నాశనమైపోతుందన్నది స్టీఫెన్ హాకింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్య. శాస్త్రవేత్తగా ఆయన పేరు ప్రఖ్యాతులకు తిరుగులేదు. కాబట్టి చాలామంది ఈ మాటల్ని నమ్మే ఉంటారు. ఇంకేముంది.. ఈ ప్రపంచం నాశనమైపోతోందట... ఉన్నన్నాళ్లూ హ్యాపీగా బతికేద్దాం అని.. మరోటనే జల్సా రాయళ్లకూ కొదవ లేకపోవచ్చు. అయితే... ఇదంతా వాస్తవమేనా? దైవకణం... శాస్త్రపరిభాషలో హిగ్స్ బోసాన్ నిజంగానే విశ్వాన్ని లయం చేసేయగలదా? అదెప్పుడు జరుగుతుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు మన మెదళ్లను తొలుస్తూంటాయి. వీటన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం...! హాకింగ్ వ్యాఖ్యల్లో నిజానిజాలేమిటో తెలుసుకునే ముందు ఈ హిగ్స్ బోసాన్ కణం ఏమిటో దాని ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కంటికి కనిపించని అతిసూక్ష్మమైన కణాల తాలూకూ లక్షణాలు, ధర్మాలను వివరించేందుకు భౌతిక శాస్త్రంలో స్టాండర్డ్ మోడల్ అని ఒక సిద్ధాంతం ఉంది. దీని ప్రకారం ఈ విశ్వం మొత్తం ఫెర్మియాన్లు, బోసాన్లు అనే రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంది. ఎలక్ట్రాన్లతోపాటు డౌన్క్వార్క్ వంటివాటితో మనకు కనిపించే వస్తువులు, పదార్థాలు తయారవుతాయి. బోసాన్లు... ఫెర్మియాన్లను ప్రభావితం చేయగల శక్తి కణాలు! వీటిల్లో చాలా రకాలున్నాయి. ఫోటాన్లు విద్యుదయస్కాంత శక్తికి హేతువు.. కాంతిని ప్రసారం చేస్తాయి. డబ్యూ, జెడ్ బోసాన్లు పదార్థ క్షయానికి, మార్పులకూ కారణమైన బలహీన శక్తి. గ్లుయాన్ బోసాన్ కణ కేంద్రకంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్లు చెల్లాచెదురు కాకుండా బంధించి ఉంచే బలమైన శక్తి. ఈ బోసాన్లే కాకుండా గురుత్వాకర్షణ శక్తికీ గ్రావిటాన్ బోసాన్ అనేది కారణమని అంటారు. దీన్ని ఇప్పటివరకూ గుర్తించలేదు. బరువుల్లో భారీ తేడాలు! బోసాన్లు దాదాపుగా ఒకేరకమైన కణాలైనప్పటికీ వీటి బరువుల్లో మాత్రం చాలా తేడాలుంటాయి. ఉదాహరణకు ప్రోటాన్కు అసలు బరువనేదే ఉండదు. కానీ ఎలక్ట్రాన్కు 0.0005 జీఈవీ (గిగా ఎలక్ట్రాన్ వోల్టులు, శక్తి, బరువులకు ప్రమాణం) బరువు ఉంటే.. డౌన్క్వార్క్ 0.01 జీఈవీ బరువు ఉంటుంది. అదే సమయంలో జెడ్ బోసాన్ బరువు ఏకంగా 91 జీఈవీలు ఉంటుంది. ఎందుకీ తేడా అన్న ప్రశ్న వచ్చినప్పుడు హిగ్స్ బోసాన్ ప్రస్తావన వస్తుంది. విశ్వం మొత్తమ్మీద ఓ అదృశ్య క్షేత్రం ఆవరించి ఉంటుందని... కణాలు ఈ క్షేత్రంలో ఉండే బోసాన్లతో ఢీకొన్నప్పుడు వాటికి బరువు అబ్బుతుందని సిద్ధాంతకర్తలు అంచనాలు కట్టారు. దీని బరువు దాదాపు 126 జీఈవీలు ఉన్నప్పటికీ ఢీకొన్న కణాన్ని బట్టి బరువులో తేడా వచ్చేస్తుంది కాబట్టే ఎలక్ట్రాన్, డౌన్క్వార్క్ల బరువులు తక్కువగా జెడ్బోసాన్ బరు చాలా రెట్లు ఎక్కువగా ఉందని అంచనా. 2012లో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్ సమీపంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన భారీ ప్రయోగశాలలో జరిపిన ప్రయోగాల ద్వారా ఈ హిగ్స్బోసాన్ అనేది ఒకటి ఉందని తొలిసారి స్పష్టమైంది. ఫొటాన్లను దాదాపు 3.5 టెరా ఎలక్ట్రాన్ వోల్టుల (టెరా = ఒకటిపక్కన 12 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య) వేగంతో ఢీకొట్టించి.. ఆ క్రమంలో చెల్లాచెదురైన అతిసూక్ష్మ కణాలను గుర్తించడం ద్వారా హిగ్స్బోసన్ అత్యంత స్వల్ప సమయం పాటు ఉనికిలో ఉండిందని ఈ ప్రయోగాల ద్వారా నిర్ధారించారు. విశ్వంలో హిగ్స్ బోసాన్ వంటి కణం లేకపోయి ఉంటే... ఈ చెట్టూపుట్టా... పురుగుపుట్రా ఇప్పుడున్నట్లుగా ఉండేవి కాదేమో! అందుకే ఈ కణానికి ఇంత ప్రత్యేకత. చివరికి నాశనమేనా? మొదట్లో చెప్పినట్టుగా స్టీఫెన్ హాకింగ్ చేసిన వ్యాఖ్యలను వివరంగా చూస్తే విషయం ఇట్టే అర్థమైపోతుంది. హిగ్స్ బోసాన్ కణం వంద బిలియన్ అంటే... 10000 కోట్ల గిగా ఎలక్ట్రాన్ వోల్టుల స్థాయుల్లో అస్థిరంగా మారుతుందని హాకింగ్ అంచనా కట్టారు. ఎప్పుడన్నదీ స్పష్టం చేయలేదు. కొంతమంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఇది రానున్న కోటానుకోట్ల ఏళ్ల వరకూ సాధ్యమయ్యే విషయం కాదు. అలాగే భూమ్మీద అత్యంత శక్తిమంతమైన పార్టికల్ ఆక్సిలరేటర్ పూర్తిస్థాయి సామర్థ్యం వెయ్యి జీఈవీలకు మించదు. అటువంటప్పుడు హాకింగ్ ప్రతిపాదన నిజం కావాలంటే ఈ శక్తి మరో పదిరెట్లు ఎక్కువ కావాలి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ, పదార్థాలను చూస్తే... ఇది కూడా దాదాపు అసాధ్యమైన విషయమే! - గిళియార్ గోపాలకష్ణ మయ్యా! 2000 వరకూ స్టీఫెన్ హాకింగ్ హిగ్స్ బోసాన్ కణం అసలు లేదని వాదించారు. ఈ కణాన్ని ఎప్పటికీ గుర్తించలేమని మిషిగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త గార్డన కీనేతో వంద డాలర్ల పందెం కాశాడు. 2012లో ఈ పందెం ఓడిపోయారు కూడా. అంతకుమునుపు కూడా కష్ణబిలాల విషయంలోనూ ఇద్దరు శాస్త్రవేత్తలతో పందెం కాసి ఓడిపోయారు హాకింగ్. విశ్వ విస్తరణకు సంబంధించిన ఒకే ఒక్క పందెంలో హాకింగ్ ఇప్పటివరకూ గెలిచారు. -
మనిషి కారణజన్ముడా?
గ్రంథపు చెక్క భౌతికవాదాన్ని నమ్మేవారికి మనిషి దైవాంశసంభూతుడు కాడని చెప్పవలసిన అవసరం లేదు. కాని మనిషికి ఉండే మెదడు ప్రత్యేకమైనది. విజ్ఞానపరంగా చెప్పాలంటే వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ మనిషి అనుభవించే కష్టసుఖాలన్నింటికీ మెదడే కారణం. తన గురించి, పరిసరాల గురించి అవగాహన కలిగి అనుభూతి పొందగలిగే ప్రాణి మనిషి ఒక్కడే. అయినప్పటికీ విశ్వంలో బుద్ధి అనేది అంత ప్రాథమికమైనదా అనేదొక ప్రశ్న. ఊహించరానంత పెద్దదయిన ఈ విశ్వంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలను చూస్తే మనకు స్థల, కాల, పదార్థాలను గురించి తెలుస్తుంది కానీ బుద్ధి, ఆలోచనలను గురించిన ఉదాహరణలు భూమి మీద తప్ప మరెక్కడా కనబడవు. విశ్వంలో పెద్దపెద్ద నక్షత్రాలు పేలడమూ, రేడియేషన్ ప్రసారం కావడం వగైరా సంఘటలకు ‘సాక్షులు’ ఉండవలసిన అవసరం కనపడదు. ప్రాణికి తన పరిసరాలకు అనుగుణంగా మసిలేందుకు మాత్రమే పనికి వచ్చే బుద్ధివికాసం ప్రకృతిలో ఒక నియమిత పాత్ర నిర్వహిస్తుందనుకోవడమే సబబేమో. మనిషికి మాత్రమే ఉండే మెదడుకూ, బుద్ధికీగల సంబంధాన్ని చర్చించే ముందు మనిషి అసలు ఎలా పుట్టాడో తెలుసుకోవాలి. తక్కిన ప్రాణులు ఎలాంటివైనా మనిషి నిజంగా కారణజన్ముడా? అందుకు కూడా రుజువు లేవీ కనబడవు. - కొడవటిగంటి రోహిణీప్రసాద్ (‘జీవశాస్త్రవిజ్ఞానం- సమాజం’ నుంచి)