మనిషి కారణజన్ముడా?
గ్రంథపు చెక్క
భౌతికవాదాన్ని నమ్మేవారికి మనిషి దైవాంశసంభూతుడు కాడని చెప్పవలసిన అవసరం లేదు. కాని మనిషికి ఉండే మెదడు ప్రత్యేకమైనది. విజ్ఞానపరంగా చెప్పాలంటే వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ మనిషి అనుభవించే కష్టసుఖాలన్నింటికీ మెదడే కారణం.
తన గురించి, పరిసరాల గురించి అవగాహన కలిగి అనుభూతి పొందగలిగే ప్రాణి మనిషి ఒక్కడే. అయినప్పటికీ విశ్వంలో బుద్ధి అనేది అంత ప్రాథమికమైనదా అనేదొక ప్రశ్న. ఊహించరానంత పెద్దదయిన ఈ విశ్వంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలను చూస్తే మనకు స్థల, కాల, పదార్థాలను గురించి తెలుస్తుంది కానీ బుద్ధి, ఆలోచనలను గురించిన ఉదాహరణలు భూమి మీద తప్ప మరెక్కడా కనబడవు.
విశ్వంలో పెద్దపెద్ద నక్షత్రాలు పేలడమూ, రేడియేషన్ ప్రసారం కావడం వగైరా సంఘటలకు ‘సాక్షులు’ ఉండవలసిన అవసరం కనపడదు. ప్రాణికి తన పరిసరాలకు అనుగుణంగా మసిలేందుకు మాత్రమే పనికి వచ్చే బుద్ధివికాసం ప్రకృతిలో ఒక నియమిత పాత్ర నిర్వహిస్తుందనుకోవడమే సబబేమో. మనిషికి మాత్రమే ఉండే మెదడుకూ, బుద్ధికీగల సంబంధాన్ని చర్చించే ముందు మనిషి అసలు ఎలా పుట్టాడో తెలుసుకోవాలి. తక్కిన ప్రాణులు ఎలాంటివైనా మనిషి నిజంగా కారణజన్ముడా? అందుకు కూడా రుజువు లేవీ కనబడవు.
- కొడవటిగంటి రోహిణీప్రసాద్ (‘జీవశాస్త్రవిజ్ఞానం- సమాజం’ నుంచి)