ఒక్కొక్కరికీ నాలుగు కళ్లు...
మన వీణావాణీల్లాగానే వీరు కూడా తల భాగంలో అతుక్కుని పుట్టిన అవిభక్త కవలలు. పేర్లు తాతియానా, క్రిస్టా. వయసు ఏడేళ్లు.. ఉండేది కెనడాలో.. వీరిద్దరికీ అన్ని అవయవాలూ విడివిడిగానే ఉన్నాయి. మెదడు కూడా ఎవరిది వారిదే. కానీ రెండు అతుక్కుని ఉండటంతో భావోద్వేగాలను ఇద్దరూ అనుభూతి చెందుతారు. అంటే.. ఒకరికి చక్కిలిగింత పెడితే రెండో అమ్మాయికీ నవ్వొస్తుంది. ఒకరికి బాధ కలిగితే అది ఇద్దరికీ తెలుస్తుంది. అన్నింటికంటే ప్రత్యేకత ఏమిటంటే.. వీరిద్దరూ ఒకరి కళ్లలో నుంచి మరొకరు చూడగలుగుతారు!!
ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు, వేర్వేరు ఆలోచనలు ఉన్నాయి. తమ అవయవాలను తామే నియంత్రించుకుంటారు. కానీ కాళ్లు, చేతులను మాత్రం ఇద్దరూ నియంత్రించగలుగుతారు. అంటే.. తాతియానా చేతిని గాల్లోకి లేపాలంటే అది క్రిస్టా కూడా చేయగలుగుతుందన్న మాట. వీరు పుట్టిన తర్వాత ఒక రోజు కంటే ఎక్కువ బతకరని వైద్యులు పెదవి విరిచారట. కానీ ఇప్పుడు వీరు చాలా ఆనందంగా ఎలాంటి సమస్యా లేకుండా ఉండటం తమకు ఎంతో సంతోషంగా ఉందని తల్లి హోగన్ చెబుతోంది.