The brain
-
సిటీ బ్రెయిన్‌కు స్ట్రోక్ ముప్పు..!
నగరంలో పెరుగుతున్న కేసులు మద్యం, ధూూమపానం వల్లే ఎక్కువ వైద్యుల పరిశీలనలో వెల్లడి పనిలో అధిక ఒత్తిడి.. రిలాక్స్ కోసం మద్యం.. ధూమపానం.. వెరసి నగర యువత మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీరిలో కొంత మంది కాళ్లు, చేతులు పడిపోయి (ఇస్కామిక్ స్ట్రోక్) నిర్జీవంగా మారుతుండగా, మరికొంత మంది మెదడులో రక్తనాళాలు చిట్లి (హ్యమరేజ్ స్ట్రోక్) తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలోనూ ఇలాంటి కేసులు పెరగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - సాక్షి, సిటీబ్యూరో నగర జీవనం చాలా మార్పులకు లోనవుతోంది. ఉరుకుల పరుగుల జీవితం.. కంప్యూటర్లతో కుస్తీలు.. మార్కెటింగ్ టార్గెట్లు.. ఫలితంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం.. వెరసి నగరవాసుల మెదళ్లను చిదిమేస్తున్నాయి. మెదడులో రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల కాళ్లు చేతులు, మాట, చూపు, పడిపోయి నిర్జీవంగా మారుతున్నారు. సహజంగా 60 ఏళ్లు దాటిన వారిలో కన్పించే వ్యాధి.. సిటీలో నాలుగు పదుల వయసులోపే అనేక మంది బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) బారిన పడుతున్నారు. ఇటీవల నగరంలో ఇలాంటి కేసులు ఎక్కుగా నమోదు అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదీ నిపుణుల లెక్క.. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 150- 285 మంది పక్షవాతం బారిన పడుతున్నారు. ప్రతి 45 నిమిషాలకు ఒక పక్షవాతం కేసు నమోదవుతుండ గా, ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరు మృతి చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పక్షవాతంతో మరణిస్తున్న దేశాల జాబితాలో మనది రెండో స్థానం. ఈ వ్యాధి 35 శాతం మందిలో ధూమపానం వల్ల, 26 శాతం మంది మద్యం, 26 శాతం మంది హైపర్ టెన్షన్, 16 శాతం మంది మధుమేహం, 16 శాతం మంది ఊబకాయం వల్ల పక్షవాతానికి గురవుతున్నట్టు యశోద ఆస్పత్రి వైద్యుల పరిశోధనలో తేలింది. తొలిసారి స్ట్రోక్‌కు గురైనవారిలో 98 శాతం మంది సకాలంలో ఆస్పత్రిలో చేరి రికవరీ అవుతున్నప్పటికీ.. రెండు శాతం మంది మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. బాధితుల్లో 65 శాతం పురుషులు కాగా, 35 శాతం మహిళలు ఉన్నారు. పక్షవాతం వచ్చిన వారిలో ఒక కాలు, చేయి బలహీనంగా మారుతుంది. తూలుతూ నడవడం, మతిమరుపు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఇవి 24 గంటల్లోనే తగ్గిపోతే ‘ట్రాన్సియెంట్ ఇస్కామిక్ ఎటాక్’ అంటారు. చాలా మందిలో గంట వ్యవధిలోనే తగ్గిపోతుంది. కానీ ఈ లక్షణాలు భవిష్యత్తులో ప్రమాదానికి సంకేతంగా భావించి జాగ్రత్త తీసుకుంటే మంచిది. -
నైట్‌డ్యూటీలు చేస్తే డయాబెటిస్ వస్తుందా?
హోమియో కౌన్సెలింగ్ నాకు వెన్ను నొప్పి ఎక్కువగా వస్తుంది. హోమియోలో పరిష్కారం చెప్పండి. - సుందర్, హైదరాబాద్ మన వెన్నెముకలో 33 ఎముకలు ఉంటాయి. అందులో 7 మెడ భాగంలో, 12 వీపు భాగంలో, ఐదు కింది వీపు భాగంలో, మిగిలిన తొమ్మిది కింది నడుము భాగంలో ఉంటాయి. ప్రతి రెండు ఎముకల మధ్య డిస్క్ అనే మెత్తటి పదార్థం ఉంటుంది. మనం కదిలేటప్పుడు, ఏదైనా పనిచేసేటప్పుడు రెండు ఎముకల మధ్య రాపిడిని ఈ డిస్క్ తగ్గిస్తుంది. ఈ డిస్క్ మధ్య భాగం లోంచి మెదడు నుంచి మచ్చే నాడులు ఉంటాయి. మెడ భాగంలోని వెన్నుపూసల మధ్య నరాలు ఒత్తిడికి గురి కావడం వల్ల వచ్చే మెడనొప్పిని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. మెడకు తీవ్రగాయం కావడం వయసు పెరిగేకొద్దీ డిస్క్ అరగడం గంటల తరబడి కూర్చొని పనిచేయడం తీవ్రమైన మానసిక ఒత్తిడి పడటం వంటి కారణాలతో ఇది వస్తుంది. మెడ భాగంలో తీవ్రమైన నొప్పి ఉండి, అది భుజాలు, చేతి వరకు పాకుతుంటుంది. చేతి వేళ్ల తిమ్మిర్లు, మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లంబార్ స్పాండిలైటిస్: కింద నడుము భాగంలో ఐదు ఎముకలు ఉంటాయి. ఎల్4 - ఎల్ 5 మధ్య సయాటిక్ నరం ఆరంభమవుతుంది. ఈ ఎముకల డిస్క్ అరగడం లేదా పక్కకు జరగడం వల్ల సయాటిక్ నరం మీద ఒత్తిడి పడుతుంది. ఈ తరహా నొప్పి నడుం వద్ద ప్రారంభమై కాలు మొత్తానికి పాకుతుంది. కాలు తిమ్మిర్లు పట్టడం కూడా జరగవచ్చు. కారణాలు: నడుముకు బలమైన గాయం కావడం, వయసు పెరిగేకొద్దీ వచ్చే అరుగుదల సమస్య తదేకంగా ఎలాంటి కదలికలు లేకుండా కూర్చొని పనిచేయడం గర్భిణులు. సయాటికా: సయాటిక్ నరం మన శరీరంలోని అతి పెద్ద నరం. ఇది నడుము దగ్గర ప్రారంభమై, తొడలు, పిక్కల నుంచి వెళ్తూ అరికాలి వరకూ ఉంటుంది. ఈ నరంపై ఒత్తిడి పడటం వల్ల కలిగే నొప్పిని సయాటికా అంటారు. ఇప్పుడు వెన్నుపూసల నొప్పికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, కామొమిల్లా, మాగ్‌ఫాస్ లాంటి మందులను రోగి తత్వాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా అనుభవజ్ఞులైన వైద్యులు తగిన మందును నిర్ణయిస్తారు. దీన్ని వారు సూచించిన మోతాదులో, నిర్ణీత కాలపరిమితి మేర వాడటం వల్ల వెన్నుకు సంబంధించిన సమస్యల నుంచి ఎలాంటి సర్జరీ లేకుండా శాశ్వతమైన ఫలితం లభిస్తుంది. హోమియో మందులతో పాటు మంచి పౌష్టికాహారం, ఫిజియోథెరపీ వల్ల వెన్ను సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. డయాబెటిక్ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గత నాలుగేళ్లుగా కాల్సెంటర్లో పనిచేస్తున్నాను. ఎక్కువగా నైట్‌డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. నేను ఇటీవల పరీక్షలు చేయించుకుంటే డయాబెటిస్ బార్డర్‌లైన్‌లో ఉందని తేలింది. రక్తపరీక్షలు చేయించినప్పటి నుంచి నాకు డయాబెటిస్ చాలా త్వరగా వచ్చేస్తుందేమోనని ఆందోళన కలుగుతోంది. నేను డయాబెటిస్ బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - సోమసుందర్, హైదరాబాద్ వృత్తిపరంగా కంటినిండా నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల నిద్రపట్టకపోవడం డయాబెటిస్ రావడాన్ని వేగవంతం చేస్తే చేయవచ్చు. గానీ కేవలం నైట్ డ్యూటీస్ వల్లనే డయాబెటిస్ రాదు. ఇది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లోగానీ, మీ వంశంలో ఎవరికైనా డయాబెటిస్ ఉందా అన్న అంశాన్ని మీరు తెలపలేదు. జన్యుపరంగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువగా నైట్‌డ్యూటీలు చేస్తానని తెలిపారు. అయితే మీరు పగలు పడుకోవడం, రాత్రిళ్లు మేల్కొంటూ ఉండటం వల్ల కొన్ని రకాల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక డయాబెటిస్ కోసం మీరు మీ రక్తపరీక్షలను పరగడపున చేయించుకున్నారా లేక భోజనం చేసిన తర్వాత చేయించుకున్నారా అన్న విషయాలు తెలపలేదు. రక్తపరీక్షలో బార్డర్‌లైన్ డయాబెటిస్ అని వచ్చింది కాబట్టి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఆరోగ్యకరమైన మీ జీవనశైలి మార్పులతో మీరు మీ డయాబెటిస్ వచ్చే అవకాశాలను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇందుకోసం మీరు రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు వంటి అధిక క్యాలరీలు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ప్రతి కొద్దిగంటల తర్వాత కొద్ది మోతాదులో ఆహారం ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పీచు ఎక్కువగా ఉండే ముడిబియ్యం, కాయధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. నైట్‌డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో కాఫీలు, టీలు తాగవద్దు. కచ్చితంగా భోజనం వేళకు భోజనం చేయడం, కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు భోజనం చేయడం వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోండి. మీ బరువును అదుపులో పెట్టుకోండి. ఇలాంటి జీవనశైలి మార్పులు చేసుకుంటే డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఎక్కువగా నివారించవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 58. షుగర్‌వల్ల రెండు కిడ్నీలూ పనిచేయడం లేదు. డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలో చలి, వణుకు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి? - రవికుమార్, హైదరాబాద్ ఇప్పుడు వాడుతున్న క్యాథెటర్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. మొదట ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి తగ్గడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్మ్ క్యాథ్ ద్వారా డయాలసిస్ చేయించుకోవడం మంచిది. ఇలా ఫిస్టులా సమస్య ఉన్నప్పుడు హోమ్ డయాలసిస్ (కంటిన్యువస్ ఆంబుల్యేటరీ పెరిటోనియల్ డయాలసిస్-సీఏపీడీ) చేయించుకోవడం మేలు. సీఏపీడీ వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇంట్లోనే ఉండి, ఈ డయాలసిస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వృత్తినిర్వహణకూ ఇలాంటి ఇబ్బందీ ఉండదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. హోమ్ డయాలసిస్‌కు అయ్యే ఖర్చు హాస్పిటల్స్ డయాలసిస్ కంటే తక్కువ. నా వయసు 36. కిడ్నీ సైజు తగ్గిందని తేలింది. సీకేడీ స్టేజ్ 5 అని డాక్టర్ చెప్పారు. కిడ్నీ మార్పిడి చేయించుకోవాలి అని సలహా ఇచ్చారు. అది కాకుండా ఇంకేదైనా అవకాశం ఉందా? - మహబూబ్‌బాషా, గుంటూరు కిడ్నీ మార్పిడి చేయడం మీకు మంచి చికిత్స. మీకు మీ అన్నదమ్ములు గానీ, అక్కచెల్లెళ్లుగానీ లేదా మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు కిడ్నీ ఇవ్వవచ్చు. కిడ్నీ ఇచ్చే వారికి అన్ని పరీక్షలూ చేసి, ఇలా చేయడం వల్ల వారికి ఎలాంటి సమస్యా రాదనీ, ఒక్క కిడ్నీతోనే వారు సాధారణంగా జీవిస్తారని తేలిన తర్వాతనే దాతను నిర్ధారణ చేస్తారు. దాత ఎంత ఎక్కువ దగ్గరి సంబంధీకుడైతే.. ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత రోగి శరీరంలో కిడ్నీ అంతగా ఇమిడిపోవడానికీ, ఎక్కువ కాలం పనిచేయడానికీ అవకాశం ఉంటుంది. కిడ్నీ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంట్) తర్వాత కూడా మీరు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. అయితే కిడ్నీ ఇచ్చే దాత లేనివారు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, ఎవరైనా బ్రెయిన్‌డెడ్ దాతల నుంచి కిడ్నీ లభించేవరకూ వేచిచూడాలి. -
ఒక్కొక్కరికీ నాలుగు కళ్లు...
మన వీణావాణీల్లాగానే వీరు కూడా తల భాగంలో అతుక్కుని పుట్టిన అవిభక్త కవలలు. పేర్లు తాతియానా, క్రిస్టా. వయసు ఏడేళ్లు.. ఉండేది కెనడాలో.. వీరిద్దరికీ అన్ని అవయవాలూ విడివిడిగానే ఉన్నాయి. మెదడు కూడా ఎవరిది వారిదే. కానీ రెండు అతుక్కుని ఉండటంతో భావోద్వేగాలను ఇద్దరూ అనుభూతి చెందుతారు. అంటే.. ఒకరికి చక్కిలిగింత పెడితే రెండో అమ్మాయికీ నవ్వొస్తుంది. ఒకరికి బాధ కలిగితే అది ఇద్దరికీ తెలుస్తుంది. అన్నింటికంటే ప్రత్యేకత ఏమిటంటే.. వీరిద్దరూ ఒకరి కళ్లలో నుంచి మరొకరు చూడగలుగుతారు!! ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు, వేర్వేరు ఆలోచనలు ఉన్నాయి. తమ అవయవాలను తామే నియంత్రించుకుంటారు. కానీ కాళ్లు, చేతులను మాత్రం ఇద్దరూ నియంత్రించగలుగుతారు. అంటే.. తాతియానా చేతిని గాల్లోకి లేపాలంటే అది క్రిస్టా కూడా చేయగలుగుతుందన్న మాట. వీరు పుట్టిన తర్వాత ఒక రోజు కంటే ఎక్కువ బతకరని వైద్యులు పెదవి విరిచారట. కానీ ఇప్పుడు వీరు చాలా ఆనందంగా ఎలాంటి సమస్యా లేకుండా ఉండటం తమకు ఎంతో సంతోషంగా ఉందని తల్లి హోగన్ చెబుతోంది. -
న్యూరాలజీ కౌన్సెలింగ్
కీ హోల్ సర్జరీ మెదడుకూ చేయచ్చా? డాక్టర్‌గారూ, నాదొక సందేహం. ఇప్పుడు పొత్తికడుపుకి కీ హోల్ సర్జరీ అని చేస్తున్నారు కదా, అది మెదడుకు కూడా చేయవచ్చా? - రమణ, విశాఖపట్టణం నేటి రోజుల్లో మెడికల్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అంతకంతకూ పెరిగిపోతోంది కాబట్టి దేనినీ అసాధ్యమని చెప్పడానికి వీలు లేదు. కీ హోల్ సర్జరీ ద్వారా అతి తక్కువ కోతతో ఆపరేషన్ చేయవచ్చు. దీనినే న్యూరో ఎండోస్కోపీ అంటారు. ఈ విధానంలో మెదడులోకి లేదా వెన్నెముకలోకి చిన్న టెలిస్కోప్‌ను పంపించి, అత్యధిక రెజల్యూషన్ గల వీడియో కెమెరాల ద్వారా ఆపరేషన్ చేయవలసిన భాగాన్ని చూస్తూ, వెంట్రుకవాసి పరిమాణంలో ఉండే పరికరాల ద్వారా ఆపరేషన్ చేస్తారు. దీని ద్వారా రోగికి అతి తక్కువ కోతగాయం మాత్రమే అవుతుంది. రోగి చాలా తక్కువ వ్యవధిలోనే కోలుకోగలుగుతాడు. మెదడులోకి నీరు చేరి, తల అసాధారణమైన పరిమాణానికి పెరిగిపోయే హైడ్రోసెఫలస్ అనే వ్యాధికి కీ హోల్ సర్జరీ చేయడం ద్వారా త్వరగా నయం చేయవచ్చు. సంప్రదాయ శస్త్రచికిత్సా విధానంలో పుర్రెకు చాలా పెద్ద రంద్రం చేయాలి. అది నయం కావడానికి, రోగి కోలుకోవడానికీ చాలా కాలం పట్టవచ్చు. అయితే ఈ పద్ధతిలో పుర్రెకు చాలా సూక్ష్మమైన రంధ్రం మాత్రమే చేస్తారు. రోగి త్వరగా కోలుకుంటాడు. దీని ద్వారా సంప్రదాయ శస్త్రచికిత్సాపద్ధతిలో ఎదురయే సాధారణ దుష్పలితాలను (సైడ్ ఎఫెక్ట్స్) నివారింవచ్చు. రోగికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా బ్రెయిన్ ట్యూమర్ వంటి వాటికి కూడా ఈ ప్రక్రియలో చాలా సులువుగా శస్త్రచికిత్స చేయవచ్చు. శరీరంలోని అతి ప్రధానమైనదిగా పేర్కొనే పిట్యూటరీ గ్రంథిని వాపును కూడా కీ హోల్ సర్జరీ ద్వారా అసలు కత్తితో ఎటువంటి గాయమూ, కోతా లేకుండా చాలా సులువుగా చికిత్స చేయవచ్చు. మెదడులోపలి పొరల్లో వచ్చే అతి సంక్లిష్టమైన కణుతులకు కూడా రేడియో లేదా కీ హోల్ సర్జరీ చాలా మంచి చికిత్సా పద్ధతి అనే చెప్పాలి. అయితే పిల్లల్లో లేదా పెద్దలలో కూడా వారి శరీర నిర్మాణాన్ని, తత్వాన్ని బట్టి ఎటువంటి చికిత్స చేయాల్సి ఉంటుందనేది వైద్యులు నిర్ధారించి, దానికి తగ్గట్టు చికిత్స పద్ధతిని నిర్ధారిస్తారు. రెండిటిలోనూ మంచి చెడ్డలు చెబుతారు. రోగులు వారికి అనువైన పద్ధతిని ఎంచుకోవచ్చు. -
కార్బోరన్
జీవితాన్ని పరుగులు తీయించే కార్బోహైడ్రేట్స్ జీవితం పరుగెత్తాలంటే శక్తి కావాలి. రోజంతా ఇంటిపని చేయాలంటే శక్తి కావాలి. ఆఫీస్‌లో దౌడు తీయాలంటే శక్తి కావాలి. పరుగులు తీసే పిల్లల కోసం... పరుగెత్తుతున్న ఆశల కోసం... అంతెందుకు... పరుగెడుతున్న బస్సు పట్టుకోవడం కోసం... శక్తి కావాలి. జీవితాన్ని పరుగులు తీయించే శక్తి కావాలి. ఆ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్ మంచిదా? కాదా..? మనిషి చక్కగా పనిచేయడానికి కావాల్సిన మూడు సూక్ష్మపోషకాల్లో కార్బోహైడ్రేట్స్ ఒకటి. (మిగిలిన రెండు.. ప్రొటీన్స్, ఫ్యాట్స్). ఒక వాహనం నడవడానికి పెట్రోల్ ఎంత అవసరమో మన శరీరం అనే బండి నడవడానికీ కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థాలు)అనే ఇంధనం అంతే అవసరం. మనం తీసుకున్న ఆహారాన్ని మన నోరు, కడుపు, పేగుల్లోని ఎంజైమ్‌లు చక్కెర్లుగా మారుస్తాయి. తర్వాత ఇవి గ్లూకోజ్‌గా మారుతాయి. రక్తప్రసారం ద్వారా ఇది మన శరీరానికి కావల్సిన శక్తినిస్తుంది. శ్వాస తీసుకోవడం దగ్గర్నుంచి మనం చేసే శారీరక వ్యాయామాల వరకు ఏ పని చేయాలన్నా గ్లూకోజ్ అనే శక్తి కావాల్సిందే. ఈ గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ వల్ల రావాల్సిందే. శరీరానికి కావల్సిన ఎనర్జీ కాక, మెదడు కావాల్సిన శక్తిని అందించే పనీ ఇదే చేస్తుంది. మెదడు సక్రమంగా తన విధులు నిర్వర్తించాలంటే రక్తంలో తగు మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఉండాల్సిందే. కావల్సినన్ని కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే వీక్ అవుతారు. నీరసంగా ఉంటుంది. డ్రౌజీగా అనిపిస్తుంది. తలనొప్పి వస్తుంది, మలబద్దకంతో బాధపడ్తారు (ఫైబర్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే). డయేరియా బారిన పడ్తారు. అంతేకాదు చిన్న చిన్న పనులూ కష్టంగా తోస్తాయి. ఏకాగ్రత నిలవదు. పిండి పదార్థాలే కదా అని కొట్టిపారేసి శరీరానికి అందివ్వకపోతే పిండిలా మారిపోతామన్నమాట. కార్బోహైడ్రేట్స్... రకాలు షుగర్, స్టార్చ్, ఫైబర్.. అనే మూడు రకాల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. నిత్యం మన ఆహారంలో ఈ మూడు రాకాలూ ఉండాల్సిందే. మోతాదు మించకుండా వీటిని ఆరగించాల్సిందే! షుగర్‌ను సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు. స్టార్చ్, ఫైబర్‌ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌గా పిలుస్తారు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ షుగర్స్ లేదా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఒకటి, రెండు చక్కెర పరమాణువులను మాత్రమే కలిగి ఉంటాయి. కాబట్టి సింపుల్ కార్బోహైడ్రేట్స్ నోరు, కడుపు, పేగుల్లోని ఎంజైముల ద్వారా వెంటనే జీర్ణమై గ్లూకోజ్‌గా మారుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. దీనివల్ల తక్షణ శక్తి తప్ప ఇంకెలాంటి పోషకాలూ శరీరానికి అందవు. దాంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక బరువుకూ కారణమవుతాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్‌కి ఉదాహరణ..పాలిష్డ్ ధాన్యాలు, పంచదార, పాలు, బ్రెడ్, కుకీస్, కేక్ వంటివి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్.. స్టార్చ్, ఫైబర్ (పీచు పదార్థం) అనే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎన్నో చక్కెర పరమాణువుల సమ్మిళితం. కాబట్టి వెంటనే జీర్ణం కావు. నెమ్మదిగా జీర్ణమవుతాయి. అందుకని ఇవి గ్లూకోజ్‌లా మారడానికీ టైమ్ పడుతుంది. దీంతో రక్తంలో చక్కెర వేగంగా కాక నెమ్మదిగా ఓ క్రమపద్ధతిలో విడుదల అవుతుంది. చక్కెర నెమ్మదిగా విడుదలవడమే ఆరోగ్యానికి మేలు. అంతేకాదు స్లో డెజైషనే దీర్ఘకాల శక్తినిస్తుంది. ఆకలిని ఆలస్యం చేస్తూ బరువునూ కంట్రోల్లో ఉంచుతుంది. తద్వారా చెడు కొలెస్ట్రాల్‌కి చెక్ పడుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లోని స్టార్చీ ఫుడ్‌కి ఉదాహరణ.. బఠాణీలు, బీన్స్, మొక్కజొన్నలు, పాస్తా, బియ్యం, బంగాళదుంపలు, ఇంకా ఇతర ధాన్యాలు. ఇవి మనిషికి కావల్సిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌ను అందిస్తాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌లో ఫైబర్ ఫుడ్‌కి ఉదాహరణ.. పొట్టు ధాన్యాలు (బ్రౌన్ రైస్, హోల్ వీట్గ్రైన్స్ వంటివేవైనా), ఆకు కూరలు, ఆకుపచ్చని కూరగాయలు, బ్రకోలి(కాలిఫ్లవర్ లాంటిదే గ్రీన్‌కలర్‌లో ఉంటుంది), కాలిఫ్లవర్, టమాటాలు, ఉల్లి,వెల్లుల్లి, మిరియాలు, మామిడి, కివి, దానిమ్మ వంటి ముదురు రంగులో ఉన్న పళ్లు. ఈ ఫైబర్ ఫుడ్ మలబద్దకాన్ని నివారిస్తుంది. కొలొన్, కడుపు, పేగులకు వచ్చే కాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది. అదే సమయంలో కార్డియోవ్యాస్క్యులర్ జబ్బులనూ దూరంగా ఉంచుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్స్ ...ఈ మూడు సూక్ష్మ పోషకాలు అని చెప్పుకున్నాం కదా. ఈ మూడూ తగు పాళ్లలో ఉంటేనే ఆరోగ్యం. ఏ రెండు ఎక్కువై ఒకటి తక్కువైనా కష్టమే. ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే క్యాన్సర్, ఒబేసిటీకి దారితీస్తాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ సాయం లేనిదే ప్రొటీన్స్ రక్తంలో ప్రయాణం చేయలేవు. అంతేకాదు ఒంట్లో తగినన్ని కార్బోహైడ్రేట్స్ లేనప్పుడు శరీరం తనకు కావల్సిన శక్తిని ప్రొటీన్స్ నుంచే తీసుకుంటుంది. పొట్టు ధాన్యాలన్నీ కేవలం ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్‌నే కాదు, పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌నీ కలిగి ఉంటాయి. పచ్చని కూరగాయలు, పళ్లు వీటికి చక్కటి ఉదాహరణ. ఎవరికి ఎంత మోతాదులో కార్బోహైడ్రేట్స్.. సాధారణంగా ఏ కార్బోహైడ్రేట్స్ అయినా గ్రాముకి నాలుగు కేలరీల శక్తినిస్తాయి. పోషకవిలువలున్న ఆహార పదార్థాల నుంచి కార్బోహైడ్రేట్స్‌ని తీసుకుంటే మరీ మంచిది. శక్తితో పాటు ఆరోగ్యమూ చేకూరుతుంది. ఎవరు ఎంతెంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అనేది వాళ్ల వాళ్ల వయసు, ఎత్తు దానికి తగ్గ బరువు (వెయిట్ మానేజ్మెంట్), శారీరక శ్రమను బట్టి ఉంటుంది. డేంజరస్ లో కార్బోహైడ్రేట్స్ డైట్ చాలా డేంజరస్ డైట్. శరీరానికి కార్బోహైడ్రేట్స్ అందకపోతే శరీరంలో తగు మోతాదులో కొవ్వు తయారవదు. ఇది కెటోసిస్కి దారితీస్తుంది. కెటోసిస్ అధిక మోతాదులో యూరిక్‌యాసిడ్, హైపర్యురిసేమియాను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి, ఇతర కిడ్నీ వ్యాధులు, గౌట్, రక్తపోటు, గుండె జబ్బులు, కొలొన్ క్యాన్సర్ వంటి ప్రమాదాలనూ తెచ్చి పెడుతుంది. ఎక్కువైతే.. గ్లూకోజ్‌గా మారిన కార్బోహైడ్రేట్స్.. శరీరానికి కావల్సిన శక్తినిచ్చి మిగిలినది గ్లైకోజెన్‌గా లివర్, కండరాల్లో నిల్వ ఉంటుంది. ఇంకా మిగిలినది కొవ్వుగా మారి అడిపోజ్ టిష్యూగానిల్వవుతుంది. అన్రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఇవి చాలా మంచివి. ఎందుకంటే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. ఇవి కూరగాయలు, పళ్లు మొదలైన వాటిల్లో ఉంటాయి. ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్‌ను నివారిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుండె, ఎముకలను పటిష్టపరుస్తాయి. పిల్లలు: పిల్లల శక్తికి ప్రధాన కారకాలు కార్బోహైడ్రేట్సే. అందుకే పిల్లలకు ప్రతి రోజూ రకరకాల కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం ఇవ్వాలి. ఏదైనా ఆనారోగ్య సమస్య ఉండి డాక్టర్ సూచిస్తే తప్ప పిల్లలకు తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం ఇవ్వకూడదు. రెండేళ్ల పైబడ్డ పిల్లలందరికీ ప్రతి రోజు కనీసం 130 గ్రాముల కార్బోహైడ్రేట్స్నివ్వాలి. అయితే ఇదీ పిల్లలు ఎన్ని కేలరీలు తీసుకుంటున్నారన్నదానిబట్టే ఉంటుంది. ఉదాహరణకు రెండేళ్ల పిల్లాడు 12 వందల కేలరీలు తీసుకుంటుంటే ఆ పిల్లాడికి 135 నుంచి 195 గ్రాములు కార్బోహైడ్రేట్స్ అవసరమవుతాయి. ఆరేళ్ల పాప... 16 వందల కేలరీలు తీసుకుంటుంటే గనక ప్రతి రోజు ఆ అమ్మాయికి 180 నుంచి 260 గ్రాముల కార్బోహైడ్రేట్స్ కావాలి. స్త్రీలు వయసు తీసుకోవాల్సిన కార్బోహైడ్రేట్స్ 20 పైబడ్డవాళ్లు 45 నుంచి 65 గ్రాములు టీనేజర్స్ 225 నుంచి 325 గ్రాములు (ఇందులో 25 గ్రా. ఫైబర్ కచ్చితంగా ఉండాలి) పురుషులు 20 పైబడ్డవాళ్లు 180 నుంచి 270 గ్రాములు టీనేజర్స్ 225 నుంచి 325 గ్రాములు (ఇందులో 38 గ్రా. ఫైబర్ కచ్చితంగా ఉండాలి. -
నిద్రతో మెదడు చురుకు
హెల్దీ స్లీప్‌తో హెల్దీ బ్రెయిన్ కొందరు కేవలం నాలుగు గంటల నిద్ర సరిపోతుందని చెబుతుంటారు. ఎక్కువగా నిద్రపోవడం బద్దకస్తుల లక్షణమంటూ పేర్కొంటుంటారు. కానీ కనీసం ఏడు గంటల సంతృప్తికరమైన నిద్ర అవసరం అంటున్నారు సింగపూర్‌లోని డ్యూక్-ఎన్‌యూఎస్ గ్రాడ్యుయేట్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు. వీరు ఎంపిక చేసిన దాదాపు 120 మందిపై అనేక న్యూరోసైకలాజికల్ పరీక్షలు నిర్వహించారు. ఎమ్మారై బ్రెయిన్ స్కాన్లు తీశారు. రెండేళ్ల పాటు నిర్వహించిన పరీక్షల్లో నిద్రపోయే సమయాన్నీ, నిద్ర నాణ్యతను పరీక్షించాక... సంతృప్తికరమైన నిద్రపోయేవారిలో వయసు పైబడుతున్న కొద్దీ మెదడు శక్తి క్షీణించే రేటు గణనీయంగా తగ్గిపోతుందని తెలిపారు. దాంతో వారి మెదడు యవ్వనంలో ఉన్నప్పటిలాగే ఉంటుందని తేల్చారు. ఒకవేళ తగినంత నిద్రలేకపోతే వయసు పైబడకముందే మెదడుకు వృద్ధాప్యం వస్తుందని హెచ్చరించారు. ఈ పరిశోధన ఫలితాలు ‘స్లీప్’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమ య్యాయి. -
దేవుడిచ్చిన గొప్ప బహుమతి... అపజయం
మై ఫిలాసఫీ విజయం కంటే అపజయానికే ఎక్కువ విలువ ఇవ్వాలి. విజయం నుంచి మాత్రమే ఆత్మవిశ్వాసం పుడుతుంది అనే వాదనతో నేను ఏకీభవించను. అపజయాల నుంచి తలెత్తిన ‘కసి’ నుంచి కూడా దృఢమైన ఆత్మవిశ్వాసం పుడుతుంది. మనం ఒక పని చేస్తున్నామంటే... యాంత్రికంగా కాకుండా ఆ పనిని లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ పని పట్ల గౌరవం ఉండాలి. మన క్రమశిక్షణ దానికి తోడు కావాలి.ఒకరి సహాయం తీసుకోవడం కంటే సొంత కాళ్ల మీద నిలబడి పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తాను. సహాయం తీసుకొని పొందిన విజయం కంటే, ఎవరి సహాయం లేకుండా చేసిన పని తాలూకు ఓటమి నేర్పిన పాఠాన్ని గొప్పగా భావిస్తాను. ప్రతి వ్యక్తికి ఉండే గొప్ప సంపద.. వారి మెదడు. కొన్ని సమయాలలో ప్రతిభావంతులకు తమలో ఉండే ప్రతిభ గురించి తెలియదు. తమకు తగిన పని దొరికినప్పుడు ఆ ప్రతిభ బయటపడుతుంది. రాశి కంటే వాసి ముఖ్యం అనే సూత్రాన్ని బలంగా నమ్ముతాను. ఏ పనికైనా ‘సరైన సమయం’ రావాలని నమ్ముతాను. ‘‘ఫలానా పని నువ్వు చేయగలవు’’ అని ఎవరైనా సలహా ఇస్తే ‘చేయగలను’ అనే ఆత్మవిశ్వాసంతో పాటు ‘సరైన సమయం’ కోసం నిరీక్షించగల ఓపిక కూడా ఉండాలి. - దియా మీర్జా, నటి -
మనిషి కారణజన్ముడా?
గ్రంథపు చెక్క భౌతికవాదాన్ని నమ్మేవారికి మనిషి దైవాంశసంభూతుడు కాడని చెప్పవలసిన అవసరం లేదు. కాని మనిషికి ఉండే మెదడు ప్రత్యేకమైనది. విజ్ఞానపరంగా చెప్పాలంటే వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ మనిషి అనుభవించే కష్టసుఖాలన్నింటికీ మెదడే కారణం. తన గురించి, పరిసరాల గురించి అవగాహన కలిగి అనుభూతి పొందగలిగే ప్రాణి మనిషి ఒక్కడే. అయినప్పటికీ విశ్వంలో బుద్ధి అనేది అంత ప్రాథమికమైనదా అనేదొక ప్రశ్న. ఊహించరానంత పెద్దదయిన ఈ విశ్వంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలను చూస్తే మనకు స్థల, కాల, పదార్థాలను గురించి తెలుస్తుంది కానీ బుద్ధి, ఆలోచనలను గురించిన ఉదాహరణలు భూమి మీద తప్ప మరెక్కడా కనబడవు. విశ్వంలో పెద్దపెద్ద నక్షత్రాలు పేలడమూ, రేడియేషన్ ప్రసారం కావడం వగైరా సంఘటలకు ‘సాక్షులు’ ఉండవలసిన అవసరం కనపడదు. ప్రాణికి తన పరిసరాలకు అనుగుణంగా మసిలేందుకు మాత్రమే పనికి వచ్చే బుద్ధివికాసం ప్రకృతిలో ఒక నియమిత పాత్ర నిర్వహిస్తుందనుకోవడమే సబబేమో. మనిషికి మాత్రమే ఉండే మెదడుకూ, బుద్ధికీగల సంబంధాన్ని చర్చించే ముందు మనిషి అసలు ఎలా పుట్టాడో తెలుసుకోవాలి. తక్కిన ప్రాణులు ఎలాంటివైనా మనిషి నిజంగా కారణజన్ముడా? అందుకు కూడా రుజువు లేవీ కనబడవు. - కొడవటిగంటి రోహిణీప్రసాద్ (‘జీవశాస్త్రవిజ్ఞానం- సమాజం’ నుంచి)