దేవుడిచ్చిన గొప్ప బహుమతి... అపజయం
మై ఫిలాసఫీ
విజయం కంటే అపజయానికే ఎక్కువ విలువ ఇవ్వాలి. విజయం నుంచి మాత్రమే ఆత్మవిశ్వాసం పుడుతుంది అనే వాదనతో నేను ఏకీభవించను. అపజయాల నుంచి తలెత్తిన ‘కసి’ నుంచి కూడా దృఢమైన ఆత్మవిశ్వాసం పుడుతుంది.
మనం ఒక పని చేస్తున్నామంటే... యాంత్రికంగా కాకుండా ఆ పనిని లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ పని పట్ల గౌరవం ఉండాలి. మన క్రమశిక్షణ దానికి తోడు కావాలి.ఒకరి సహాయం తీసుకోవడం కంటే సొంత కాళ్ల మీద నిలబడి పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తాను. సహాయం తీసుకొని పొందిన విజయం కంటే, ఎవరి సహాయం లేకుండా చేసిన పని తాలూకు ఓటమి నేర్పిన పాఠాన్ని గొప్పగా భావిస్తాను.
ప్రతి వ్యక్తికి ఉండే గొప్ప సంపద.. వారి మెదడు.
కొన్ని సమయాలలో ప్రతిభావంతులకు తమలో ఉండే ప్రతిభ గురించి తెలియదు. తమకు తగిన పని దొరికినప్పుడు ఆ ప్రతిభ బయటపడుతుంది. రాశి కంటే వాసి ముఖ్యం అనే సూత్రాన్ని బలంగా నమ్ముతాను. ఏ పనికైనా ‘సరైన సమయం’ రావాలని నమ్ముతాను. ‘‘ఫలానా పని నువ్వు చేయగలవు’’ అని ఎవరైనా సలహా ఇస్తే ‘చేయగలను’ అనే ఆత్మవిశ్వాసంతో పాటు ‘సరైన సమయం’ కోసం నిరీక్షించగల ఓపిక కూడా ఉండాలి.
- దియా మీర్జా, నటి