న్యూరాలజీ కౌన్సెలింగ్
కీ హోల్ సర్జరీ మెదడుకూ చేయచ్చా?
డాక్టర్‌గారూ, నాదొక సందేహం. ఇప్పుడు పొత్తికడుపుకి కీ హోల్ సర్జరీ అని చేస్తున్నారు కదా, అది మెదడుకు కూడా చేయవచ్చా?
- రమణ, విశాఖపట్టణం
నేటి రోజుల్లో మెడికల్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అంతకంతకూ పెరిగిపోతోంది కాబట్టి దేనినీ అసాధ్యమని చెప్పడానికి వీలు లేదు. కీ హోల్ సర్జరీ ద్వారా అతి తక్కువ కోతతో ఆపరేషన్ చేయవచ్చు. దీనినే న్యూరో ఎండోస్కోపీ అంటారు. ఈ విధానంలో మెదడులోకి లేదా వెన్నెముకలోకి చిన్న టెలిస్కోప్‌ను పంపించి, అత్యధిక రెజల్యూషన్ గల వీడియో కెమెరాల ద్వారా ఆపరేషన్ చేయవలసిన భాగాన్ని చూస్తూ, వెంట్రుకవాసి పరిమాణంలో ఉండే పరికరాల ద్వారా ఆపరేషన్ చేస్తారు. దీని ద్వారా రోగికి అతి తక్కువ కోతగాయం మాత్రమే అవుతుంది. రోగి చాలా తక్కువ వ్యవధిలోనే కోలుకోగలుగుతాడు.
మెదడులోకి నీరు చేరి, తల అసాధారణమైన పరిమాణానికి పెరిగిపోయే హైడ్రోసెఫలస్ అనే వ్యాధికి కీ హోల్ సర్జరీ చేయడం ద్వారా త్వరగా నయం చేయవచ్చు. సంప్రదాయ శస్త్రచికిత్సా విధానంలో పుర్రెకు చాలా పెద్ద రంద్రం చేయాలి. అది నయం కావడానికి, రోగి కోలుకోవడానికీ చాలా కాలం పట్టవచ్చు. అయితే ఈ పద్ధతిలో పుర్రెకు చాలా సూక్ష్మమైన రంధ్రం మాత్రమే చేస్తారు. రోగి త్వరగా కోలుకుంటాడు. దీని ద్వారా సంప్రదాయ శస్త్రచికిత్సాపద్ధతిలో ఎదురయే సాధారణ దుష్పలితాలను (సైడ్ ఎఫెక్ట్స్) నివారింవచ్చు. రోగికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది.
అదేవిధంగా బ్రెయిన్ ట్యూమర్ వంటి వాటికి కూడా ఈ ప్రక్రియలో చాలా సులువుగా శస్త్రచికిత్స చేయవచ్చు. శరీరంలోని అతి ప్రధానమైనదిగా పేర్కొనే పిట్యూటరీ గ్రంథిని వాపును కూడా కీ హోల్ సర్జరీ ద్వారా అసలు కత్తితో ఎటువంటి గాయమూ, కోతా లేకుండా చాలా సులువుగా చికిత్స చేయవచ్చు. మెదడులోపలి పొరల్లో వచ్చే అతి సంక్లిష్టమైన కణుతులకు కూడా రేడియో లేదా కీ హోల్ సర్జరీ చాలా మంచి చికిత్సా పద్ధతి అనే చెప్పాలి. అయితే పిల్లల్లో లేదా పెద్దలలో కూడా వారి శరీర నిర్మాణాన్ని, తత్వాన్ని బట్టి ఎటువంటి చికిత్స చేయాల్సి ఉంటుందనేది వైద్యులు నిర్ధారించి, దానికి తగ్గట్టు చికిత్స పద్ధతిని నిర్ధారిస్తారు. రెండిటిలోనూ మంచి చెడ్డలు చెబుతారు. రోగులు వారికి అనువైన పద్ధతిని ఎంచుకోవచ్చు.