దైవమూ కణమూ మనమూ క్షేమమే! | According to manamu kanamu safe! | Sakshi
Sakshi News home page

దైవమూ కణమూ మనమూ క్షేమమే!

Published Wed, Sep 10 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

దైవమూ కణమూ మనమూ క్షేమమే!

దైవమూ కణమూ మనమూ క్షేమమే!

 ‘ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్’... ఇంగ్లీషులో ఓ నానుడి!
 తెలుగులోనైతే... ‘వివరంలోనే ‘విషయం’ అనుకోవచ్చు.
 ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ‘దైవ’కణంపై చేసిన వ్యాఖ్యలు ఈ మాటల్నే గుర్తు చేస్తున్నాయి.
 వివరాలు తెలుసుకునే ముందు... ఒక్కటైతే స్పష్టం...
 దైవమూ... కణమూ... మనమూ అంతా క్షేమమే!

 
దైవకణం జోలికెళితే విశ్వం మొత్తం నాశనమైపోతుందన్నది స్టీఫెన్ హాకింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్య. శాస్త్రవేత్తగా ఆయన పేరు ప్రఖ్యాతులకు తిరుగులేదు. కాబట్టి చాలామంది ఈ మాటల్ని నమ్మే ఉంటారు. ఇంకేముంది.. ఈ ప్రపంచం నాశనమైపోతోందట... ఉన్నన్నాళ్లూ హ్యాపీగా బతికేద్దాం అని.. మరోటనే జల్సా రాయళ్లకూ కొదవ లేకపోవచ్చు. అయితే... ఇదంతా వాస్తవమేనా? దైవకణం... శాస్త్రపరిభాషలో హిగ్స్ బోసాన్ నిజంగానే విశ్వాన్ని లయం చేసేయగలదా? అదెప్పుడు జరుగుతుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు మన మెదళ్లను తొలుస్తూంటాయి. వీటన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం...!
 
హాకింగ్ వ్యాఖ్యల్లో నిజానిజాలేమిటో తెలుసుకునే ముందు ఈ హిగ్స్ బోసాన్ కణం ఏమిటో దాని ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కంటికి కనిపించని అతిసూక్ష్మమైన కణాల తాలూకూ లక్షణాలు, ధర్మాలను వివరించేందుకు భౌతిక శాస్త్రంలో స్టాండర్డ్ మోడల్ అని ఒక సిద్ధాంతం ఉంది. దీని ప్రకారం ఈ విశ్వం మొత్తం ఫెర్మియాన్లు, బోసాన్లు అనే రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంది. ఎలక్ట్రాన్లతోపాటు డౌన్‌క్వార్క్ వంటివాటితో మనకు కనిపించే వస్తువులు, పదార్థాలు తయారవుతాయి. బోసాన్లు... ఫెర్మియాన్లను ప్రభావితం చేయగల శక్తి కణాలు! వీటిల్లో చాలా రకాలున్నాయి. ఫోటాన్లు విద్యుదయస్కాంత శక్తికి హేతువు.. కాంతిని ప్రసారం చేస్తాయి. డబ్యూ, జెడ్ బోసాన్లు పదార్థ క్షయానికి, మార్పులకూ కారణమైన బలహీన శక్తి. గ్లుయాన్ బోసాన్ కణ కేంద్రకంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్లు చెల్లాచెదురు కాకుండా బంధించి ఉంచే బలమైన శక్తి. ఈ బోసాన్లే కాకుండా గురుత్వాకర్షణ శక్తికీ గ్రావిటాన్ బోసాన్ అనేది కారణమని అంటారు. దీన్ని ఇప్పటివరకూ గుర్తించలేదు.
 
బరువుల్లో భారీ తేడాలు!

బోసాన్లు దాదాపుగా ఒకేరకమైన కణాలైనప్పటికీ వీటి బరువుల్లో మాత్రం చాలా తేడాలుంటాయి. ఉదాహరణకు ప్రోటాన్‌కు అసలు బరువనేదే ఉండదు. కానీ ఎలక్ట్రాన్‌కు 0.0005 జీఈవీ (గిగా ఎలక్ట్రాన్ వోల్టులు, శక్తి, బరువులకు ప్రమాణం) బరువు ఉంటే.. డౌన్‌క్వార్క్ 0.01 జీఈవీ బరువు ఉంటుంది. అదే సమయంలో జెడ్ బోసాన్ బరువు ఏకంగా 91 జీఈవీలు ఉంటుంది. ఎందుకీ తేడా అన్న ప్రశ్న వచ్చినప్పుడు హిగ్స్ బోసాన్ ప్రస్తావన వస్తుంది. విశ్వం మొత్తమ్మీద ఓ అదృశ్య క్షేత్రం ఆవరించి ఉంటుందని... కణాలు ఈ క్షేత్రంలో ఉండే బోసాన్లతో ఢీకొన్నప్పుడు వాటికి బరువు అబ్బుతుందని సిద్ధాంతకర్తలు అంచనాలు కట్టారు. దీని బరువు దాదాపు 126 జీఈవీలు ఉన్నప్పటికీ ఢీకొన్న కణాన్ని బట్టి బరువులో తేడా వచ్చేస్తుంది కాబట్టే ఎలక్ట్రాన్, డౌన్‌క్వార్క్‌ల బరువులు తక్కువగా జెడ్‌బోసాన్ బరు చాలా రెట్లు ఎక్కువగా ఉందని అంచనా.
 
2012లో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్ సమీపంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన భారీ ప్రయోగశాలలో జరిపిన ప్రయోగాల ద్వారా ఈ హిగ్స్‌బోసాన్ అనేది ఒకటి ఉందని తొలిసారి స్పష్టమైంది. ఫొటాన్లను దాదాపు 3.5 టెరా ఎలక్ట్రాన్ వోల్టుల (టెరా = ఒకటిపక్కన 12 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య) వేగంతో ఢీకొట్టించి.. ఆ క్రమంలో చెల్లాచెదురైన అతిసూక్ష్మ కణాలను గుర్తించడం ద్వారా హిగ్స్‌బోసన్ అత్యంత స్వల్ప సమయం పాటు ఉనికిలో ఉండిందని ఈ ప్రయోగాల ద్వారా నిర్ధారించారు. విశ్వంలో హిగ్స్ బోసాన్ వంటి కణం లేకపోయి ఉంటే...  ఈ చెట్టూపుట్టా... పురుగుపుట్రా ఇప్పుడున్నట్లుగా ఉండేవి కాదేమో! అందుకే ఈ కణానికి ఇంత ప్రత్యేకత.
 
చివరికి నాశనమేనా?

మొదట్లో చెప్పినట్టుగా స్టీఫెన్ హాకింగ్ చేసిన వ్యాఖ్యలను వివరంగా చూస్తే విషయం ఇట్టే అర్థమైపోతుంది. హిగ్స్ బోసాన్ కణం వంద బిలియన్ అంటే... 10000 కోట్ల గిగా ఎలక్ట్రాన్ వోల్టుల స్థాయుల్లో అస్థిరంగా మారుతుందని హాకింగ్ అంచనా కట్టారు. ఎప్పుడన్నదీ స్పష్టం చేయలేదు. కొంతమంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఇది రానున్న కోటానుకోట్ల ఏళ్ల వరకూ సాధ్యమయ్యే విషయం కాదు. అలాగే భూమ్మీద అత్యంత శక్తిమంతమైన పార్టికల్ ఆక్సిలరేటర్ పూర్తిస్థాయి సామర్థ్యం వెయ్యి జీఈవీలకు మించదు. అటువంటప్పుడు హాకింగ్ ప్రతిపాదన నిజం కావాలంటే ఈ శక్తి మరో పదిరెట్లు ఎక్కువ కావాలి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ, పదార్థాలను చూస్తే... ఇది కూడా దాదాపు అసాధ్యమైన విషయమే!
 
- గిళియార్ గోపాలకష్ణ మయ్యా!
 
2000 వరకూ స్టీఫెన్ హాకింగ్ హిగ్స్ బోసాన్ కణం అసలు లేదని వాదించారు. ఈ కణాన్ని ఎప్పటికీ గుర్తించలేమని మిషిగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త గార్డన కీనేతో వంద డాలర్ల పందెం కాశాడు. 2012లో ఈ పందెం ఓడిపోయారు కూడా.
     
అంతకుమునుపు కూడా కష్ణబిలాల విషయంలోనూ ఇద్దరు శాస్త్రవేత్తలతో పందెం కాసి ఓడిపోయారు హాకింగ్.
     
విశ్వ విస్తరణకు సంబంధించిన ఒకే ఒక్క పందెంలో హాకింగ్ ఇప్పటివరకూ గెలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement