‘విశ్వ’ విజేత | Scientist Stephen Hawking great life story | Sakshi
Sakshi News home page

‘విశ్వ’ విజేత

Published Thu, Mar 15 2018 2:44 AM | Last Updated on Thu, Mar 15 2018 10:42 AM

Scientist Stephen Hawking great life story - Sakshi

కాలేజీ రోజుల్లో స్టీఫెన్‌ హాకింగ్‌

కాలేజీ రోజుల్లో అతడూ అందరిలాంటి కుర్రాడే... రోజంతా... స్నేహితులతో షికార్లు.. పార్టీలతో సరదాగా గడిపిన వాడే! తెలివైన వాడనే ఒకే ఒక్క కారణం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేసే అవకాశమిచ్చింది. అయితేనేం.. ఒకసారి గురి కుదిరిన తరువాత మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు.. మనకు కనిపించని విశాల విశ్వం అంచులని తాకింది ఆయన దృష్టి.. విశ్వం ఆవిర్భావం మొదలుకొని... అన్నింటినీ తనలో కలుపుకోగల కృష్ణబిలాల వరకూ.. భౌతికశాస్త్రాన్ని ఔపోసన పట్టేశాడు. సిద్ధాంతాల చట్రంలోకి తెచ్చేశాడు. ఒళ్లు చచ్చుబడిపోయినా.. ఒకదశలో కళ్లు మినహా మరే ఇతర అవయవం పనిచేయకపోయినా... తన మేధోశక్తితో విశ్వం ఆనుపానులను సామాన్యుడి దరికి చేర్చాడు.  ఈ తరం ఐన్‌స్టీన్‌గా మిగిలిపోయాడు. ‘స్టీఫెన్‌ హాకింగ్‌’పేరుతో కాలంలోకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.. 

సాక్షి, హైదరాబాద్‌: మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడేది భౌతిక శాస్త్రం. నాలుగు వందల ఏళ్ల క్రితం సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ గురుత్వ ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం భౌతికశాస్త్ర పురోభివృద్ధికి తొలి మేలిమలుపు అయితే.. 20వ శతాబ్దం తొలినాళ్లలో ఐన్‌స్టీన్‌ సామాన్య సాపేక్ష సిద్ధాంతం రెండవదన్నది అందరూ అంగీకరించే విషయం. సామాన్య సాపేక్ష సిద్ధాంతం విశాల విశ్వం పనితీరుపై ఒక అవగాహన కల్పిస్తుంది. అణుస్థాయిలో భౌతిక ప్రపంచం తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు పనికొచ్చే క్వాంటమ్‌ మెకానిక్స్‌పై కూడా ఐన్‌స్టీన్‌ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే.. అటు విశాల విశ్వాన్ని విడమరచి చెప్పే సాపేక్ష సిద్ధాంతాన్ని.. ఇటు సూక్ష్మ ప్రపంచం ధర్మాలను వివరించే క్వాంటమ్‌ మెకానిక్స్‌ను కలిపింది స్టీఫెన్‌ హాకింగ్‌ కాబట్టి! భౌతిక శాస్త్రంలో ఇది మూడో మేలి మలుపని ప్రపంచం ఇప్పటికే గుర్తించడం హాకింగ్‌ గొప్పదనానికి నిదర్శనం.  

ఐన్‌స్టీన్, హాకింగ్‌.. వీరిద్దరిలో ఎవరు గొప్ప అన్న వాదన చాలాకాలంగా జరుగుతోంది. శాస్త్రవేత్తల కమ్యూనిటీ ఈ విషయంలో రెండుగా విడిపోయి ఉండవచ్చు కూడా. ఇద్దరినీ పోల్చి చూడటం సరికాదన్న అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. అయితే కొన్ని విషయాల్లో ఐన్‌స్టీన్‌ కంటే హాకింగ్‌ గొప్పవాడు అనక తప్పదు. అందుకు కారణాలు ఏమిటంటే.. పట్టుమని 21 ఏళ్లు కూడా నిండకుండానే.. ‘ఇంకొన్నేళ్లలో నీకు మరణం తప్పదు’ అని ఎవరైనా అంటే.. కుప్పకూలిపోతారు.. నిరాశ నిస్పృహలతో జీవితాన్ని కొనసాగిస్తారు. స్టీఫెన్‌ హాకింగ్‌ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వైకల్యం ముంచుకొస్తున్న తరుణంలోనే తన మేధకు మరింత పదును పెట్టి ఖగోళశాస్త్రంలో తనదైన ముద్ర వేశాడు. అందుకే ఆయన ఒకచోట ‘‘21 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి జీవితంపై నా అంచనాలన్నీ సున్నా అయిపోయాయి. ఆ తరువాత నాకు దక్కిందంతా బోనస్‌’’అని అంటాడు. 

గొంతుకనిచ్చిన టెక్నాలజీ 
1985.. హాకింగ్‌ జెనీవాలో పర్యటిస్తున్నారు. న్యుమోనియా బారిన పడటంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పటికే అమియోమోట్రోపిక్‌ లాటరల్‌ స్లె్కరోసిస్‌ (ఏఎల్‌ఎస్‌) వ్యాధితో బాధపడుతున్న హాకింగ్‌ శరీరం ఈ కొత్త దాడికి తట్టుకోలేకపోయింది. పరిస్థితి విషమించిన దశలో ఆయన ఊపిరి పీల్చుకునేందుకు గాను గొంతుకు రంధ్రం చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన మాట్లాడే అవకాశాన్నీ కోల్పోయారు. కొంతకాలంపాటు కనుబొమల కదలికలతో, స్పెల్లింగ్‌ కార్డుల సాయంతో అక్షరాలను సూచిస్తూ పదాలను నిర్మించి తన భావాలను వెల్లడించే వారు. ఈ పరిస్థితుల్లో హాకింగ్‌తో పనిచేస్తున్న మార్టిన్‌ కింగ్‌ అనే శాస్త్రవేత్త కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న వర్డ్స్‌ ప్లస్‌ అనే సంస్థను సంప్రదించారు. ఈ సంస్థ అధిపతి వూల్టోజ్‌ అత్తగారూ ఏఎల్‌ఎస్‌తో బాధపడుతుండేవారు. ఆమె మాట్లాడేందుకు, రాసేందుకు వీలుగా వూల్టోజ్‌ ఈక్వలైజర్‌ పేరుతో ఒక కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. హాకింగ్‌కు ఇదేమైనా ఉపయోగపడుతుందేమో అని మార్టిన్‌ కింగ్‌ వూల్టోజ్‌ను విచారించారు. వూల్టోజ్‌ ఆ ఈక్వలైజర్‌ను హాకింగ్‌కు ఉచితంగా ఇచ్చేశారు. 

ఆపిల్‌ –2 కంప్యూటర్‌పై ఈక్వలైజర్‌ సాఫ్ట్‌వేర్‌కు స్పీచ్‌ సింథసైజర్‌ అనే పరికరం తోడైంది. హాకింగ్‌కు సపర్యలు చేసిన ఒక నర్సు భర్త డేవిడ్‌ మేసన్‌ దీన్ని తయారు చేశాడు. చిన్నసైజులో ఉండే ఈ స్పీచ్‌ సింథసైజర్‌ హాకింగ్‌ చక్రాల కుర్చీ చేతిమీద అమరిపోయింది. వీటి సాయంతో హాకింగ్‌ నిమిషానికి 15 పదాల చొప్పున మాట్లాడటం ప్రారంభించారు. అయితే, తన బొటనవేలిని మాత్రం కదిలించేందుకు ఉపయోగపడ్డ ఒక నాడి క్రమేపీ దెబ్బతినడంతో 2008 నాటికి ఆయన మౌస్‌ను క్లిక్‌ చేసే సామర్థ్యాన్ని కూడా కోల్పోయారు. ఈ దశలో హాకింగ్‌ విద్యార్థి ఒకరు చీక్‌ స్విచ్‌ పేరుతో ఇంకో చిన్న పరికరాన్ని అభివృద్ధి చేశారు. హాకింగ్‌ కళ్లజోడుకు అతుక్కునేలా రూపొందించిన ఈ పరికరం పరారుణ కాంతితో పనిచేసేది. దవడ కండరాలను బిగించడం ద్వారా ఇది మౌస్‌ మాదిరిగా పనిచేసేది. ఈ పరికరం సాయంతో హాకింగ్‌ ఈ మెయిళ్లు రాయడం మొదలుకొని ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేయడం, పుస్తకాలు రాయడం, స్పీచ్‌ సింథసైజర్‌ సాయంతో మాట్లాడగలగడం వంటి అనేక పనులు చేయగలిగారు. 2011 నాటికి పరిస్థితి మరింత క్షీణించింది. నిమిషానికి ఒకట్రెండు మాటలు మాత్రమే మాట్లాడగలిగిన స్థితికి చేరుకున్నారు. ఈ దశలో ఇంటెల్‌ వ్యవస్థాపకుడు గార్డన్‌ మూర్‌ సాయం అందించేందుకు ముందుకొచ్చారు. కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జస్టిన్‌ రాట్నర్‌ కొంతమంది నిపుణుల సాయంతో హాకింగ్‌ ఆలోచనలనే మాటల రూపంలోకి మార్చగలిగారు.  

భూమిపై...  
‘మనం భూమిని ఖాళీ చేయాల్సిన సమయం ఎంతో దూరంలో లేదు. మరో వందేళ్లలోనే మనం నివాసయోగ్యంగా ఉండే మరో గ్రహాన్ని వెతుక్కోవాలి. మితిమీరిన జనాభా, వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు, భూమికి అత్యంత సమీపంగా వస్తున్న గ్రహశకలాలతో ఇక భూమిపై జీవించడం దుర్లభంగా మారుతుంది’ 
    –మరో భూమి అన్వేషణ కోసం బీబీసీ డాక్యుమెంటరీపై..

మరణంపై... 
మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం, నరకం అన్నవి అసలే లేవు. చావు అంటే భయం ఉన్నవారి కోసం అలాంటి కట్టు కథలు అల్లారు. మన మెదడు ఒక కంప్యూటర్‌ లాంటిది. కంప్యూటర్‌లో విడిభాగాలు పాడైతే అదెలా పనిచేయదో మెదడు కూడా అంతే.. పనిచేయడం ఆగిపోతుంది. నాకు చావంటే భయం లేదు. అలాగని వెంటనే మరణించాలని లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సింది చాలా ఉంది. జీవించి ఉన్న సమయంలోనే మనలోని శక్తి సామర్థ్యాల్ని సమర్థంగా వినియోగించుకోవాలి.    
–2011లో గార్డియన్‌ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 

హాకింగ్‌ 5 అద్భుత రచనలు 
మై బ్రీఫ్‌ హిస్టరీ 
ఇది హాకింగ్‌ ఆత్మకథ లాంటిది. లండన్‌లో హాయిగా సాగిన తన బాల్యం.. బెట్స్‌ కడుతూ తన మిత్రులతో సరదాగా గడిచిన యవ్వనం.. మేధావిగా, ప్రఖ్యాత సైద్ధాంతిక శాస్త్రవేత్తగా తన పరిణామం.. ఈ వివరాలన్నింటినీ ‘మై బ్రీఫ్‌ హిస్టరీ’లో ఆసక్తికరంగా హాకింగ్‌ వివరిస్తారు. పాఠకులకు తెలియని ఒక కొత్త హాకింగ్‌ను, సరదాపరుడు, చతురుడైన హాకింగ్‌ను ఈ పుస్తకంలో ఆయన పరిచయం చేస్తారు. ఇందులోని అరుదైన ఫొటోగ్రాఫ్‌లు పాఠకులకు అదనపు ఆసక్తిని కలిగిస్తాయి. 

ఏ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌ 
భౌతిక, ఖగోళ సిద్ధాంతాలు సామాన్యులకు అర్థమయ్యే లా హాకింగ్‌ ఈ పుస్తకాన్ని 1988లో రాశారు. ఇందులో విశ్వం ఆవిర్భావం, విస్తరణ, అంతరిక్షం, కాలంతో పాటు గురుత్వాకర్షణ, కృష్ణబిలాలను సరళమైన రీతిలో హాకింగ్‌ వివరించారు. 2001 నాటికి 35 భాషల్లో తర్జుమా అయింది. 

ది గ్రాండ్‌ డిజైన్‌ 
ఈ పుస్తకాన్ని లియోనార్డ్‌ మ్లోడినౌ అనే మరో భౌతికశాస్త్రవేత్తతో కలసి హాకింగ్‌ 2010లో రచించారు. బిగ్‌బ్యాంగ్‌(విశ్వ ఆవిర్భావం) భౌతికశాస్త్ర నియమాల ఆధారంగానే జరిగిందనీ, ఇందులో దేవుడి పాత్రేమీ లేదని ఈ పుస్తకంలో హాకింగ్‌ స్పష్టం చేశారు. విశ్వం పుట్టుకను తెలుసుకునేందుకు దేవుడ్ని అన్వేషించాల్సిన అవసరం లేదన్నారు. ‘దేవుడు లేడని ఎవ్వరూ నిరూపించలేరు. కానీ సైన్స్‌ దేవుడి అవసరం లేకుండా చేస్తుంది’ అని అన్నారు. 

యూనివర్స్‌ ఇన్‌ ఏ నట్‌షెల్‌ 
ఏ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌ పుస్తకానికి సీక్వెల్‌గా హాకింగ్‌ దీన్ని 2001లో రాశారు. ఇందులో తన పరిశోధనలతో పాటు క్వాంటమ్‌ మెకానిక్స్, ఆధునిక భౌతికశాస్త్ర సిద్ధాంతాలు, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలైన ఐన్‌స్టీన్, రిచర్డ్‌ ఫైన్‌మెన్‌ల సిద్ధాంతాలను ఇందులో హాకింగ్‌ వివరించారు. ఈ పుస్తకం 2002లో అవెన్టిస్‌ ప్రైజ్‌కు ఎంపికైంది.

జార్జ్‌స్‌ సీక్రెట్‌ కీ టు యూనివర్స్‌ 
కుమార్తె లూసీతో కలసి హాకింగ్‌ 2007లో చిన్నారుల కోసం రాసిన పుస్తకమిది. ఇందులో కాస్మోస్‌ అనే శక్తిమంతమైన కంప్యూటర్‌ సాయంతో చిన్నారులు సుసన్, రింగో, ఎరిక్, జార్జ్‌లతో పాటు డా.రీపర్‌ సాహసాలు చేస్తారు. కథల రూపంలో విశ్వంలోని సంక్లిష్ట అంశాలను సులభంగా అర్థమయ్యేలా హాకింగ్‌ ఇందులో వివరించారు. 

భారత్‌తో అనుబంధం
తొలిసారి 2001లో భారత్‌కు వచ్చిన హాకింగ్‌ 16 రోజులపాటు దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో జరిగిన ఓ సెమినార్‌లో ప్రసంగించారు. అలాగే ‘స్ట్రింగ్స్‌ 2001’పేరుతో జరిగిన మరో కార్యక్రమంలో నిర్వాహకులు హాకింగ్‌ను ‘సరోజిని దామోదర్‌ ఫెలోషిప్‌’తో సత్కరించారు. హాకింగ్‌ చక్రాల కుర్చీని అమర్చేలా మహీంద్రా అండ్‌ మహీంద్రా రూపొందించిన ప్రత్యేకమైన కారులో ఆయన ముంబైలో విహరించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్, కుతుబ్‌మీనార్‌లను సందర్శించిన హాకింగ్‌ ఈ పర్యటనలో భాగంగా అప్పటి రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ను కలుసుకుని దాదాపు 45 నిమిషాల సేపు ముచ్చటించారు.

హాకింగ్‌ను కబళించిన వ్యాధి 
స్టీఫెన్‌ హాకింగ్‌కు 21 ఏళ్ల వయసులోనే అమియోట్రోపిక్‌ లాటరల్‌ స్లె్కరోసిస్‌ (ఏఎల్‌ఎస్‌) అనే ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు బయటపడింది. హాకింగ్‌ మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం బతకరని అప్పట్లో వైద్యులు చెప్పినా ఆయన మరో 50 ఏళ్లపైనే జీవించడం విశేషం. అసలు ఇంతకీ ఏంటీ ఏఎల్‌ఎస్‌ వ్యాధి.. దీనినే లౌ గెహ్రిగ్స్‌ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపే అరుదైన రోగం. భారత్‌లో ఏడాదికి దాదాపు లక్ష మంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు అంచనా. ఇది కండరాలను బలహీనపరిచి ఏ చిన్న పని కూడా చేయనీదు. చికిత్సతో స్వల్ప ప్రయోజనం ఉండొచ్చు కానీ పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. రోజులు గడిచేకొద్దీ వ్యాధి మరింత ముదురుతుంది. క్రమక్రమంగా కండరాలు సత్తువ కోల్పోయి నిలబడటం, మాట్లాడటం, తినడం, కదలడం చేయలేరు. కనీసం సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేరు. నరాల నుంచి మెదడుకు సంకేతాలు చేరవు. కండరాలు చచ్చుబడిపోతాయి. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన మూడు నుంచి ఐదేళ్లలోపు శ్వాసకోశ సంబంధ సమస్యలతో రోగులు చనిపోతారు.  

ఆస్తులు 129.75 కోట్లు 
- చనిపోయేనాటికి స్టీఫెన్‌ హాకింగ్‌ సంపద రూ.129.75 కోట్లు(2 కోట్ల డాలర్లు)గా ఉంది. 
సిమ్సన్స్, ఫ్యుచరమా, స్టార్‌ట్రెక్‌: నెక్సట్‌ జనరేషన్, ద బిగ్‌బ్యాంగ్‌ థియరీ వంటి టెలివిజన్‌ సీరియళ్లలో హాకింగ్‌ పేరుతో పాత్రలను రూపొందించారు. 

అడుగడుగునా పోరాటమే 
వీల్‌ చైర్‌ నుంచే విశ్వ రహస్యాలను శోధించి... ఆత్మస్థైర్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ జీవితమే ఒక పోరాటం. అరుదైన వ్యాధితో పోరాడటమే కాదు, కుటుంబ జీవితంలోనూ ఆయన ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. గొప్ప శాస్త్రవేత్తగా ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హాకింగ్‌ విద్యార్థి జీవితం సాదాసీదాగా గడిచిపోయింది. చదువులో పెద్దగా ప్రతిభ కనబర్చకపోయినప్పటీకీ.. చిన్నారి హాకింగ్‌ తెలివితేటల్ని చూసి టీచర్లు మంత్రముగ్ధులయ్యేవారు. తొమ్మిదేళ్ల వయసులోనే హాకింగ్‌కు ఐన్‌స్టీన్‌ అనే నిక్‌నేమ్‌ కూడా ఉండేది. తొలుత హాకింగ్‌ను డాక్టర్‌ చేయాలని ఆయన తండ్రి ఆశపడ్డారు. ఇందుకోసం బయాలజీ తీసుకోవాలని ఒత్తిడి కూడా చేశారు. అయితే హాకింగ్‌కు గణితంపై అమితమైన ఆసక్తి ఉండటంతో అందులోనే డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో గణితంలో డిగ్రీకి ప్రథమ ప్రాధాన్యం లేకపోవడంతో ఆయన భౌతికశాస్త్రాన్ని ఎంచుకున్నారు. అప్పటి నుంచి భౌతిక, ఖగోళ శాస్త్రాల లోతుపాతుల్ని తెలుసుకోవడం మొదలుపెట్టారు. 

ప్రేమ.. పెళ్లి 
1963లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హాకింగ్‌కు జేన్‌ విల్డే అనే అమ్మాయితో తొలిసారి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇంతలోనే తనను అరుదైన వ్యాధి కబళిస్తోందన్న విషయం హాకింగ్‌కు తెలిసింది. ఈ విషయాన్ని విల్డేకు ఆయన తెలిపారు. ఆమె అంగీకరించడంతో వీరిద్దరూ 1965లో వివాహం చేసుకున్నారు. హాకింగ్‌ దంపతులకు రాబర్ట్, తిమోతి అనే ఇద్దరు కుమారులు, లూసీ అనే కుమార్తె ఉన్నారు. వివాహం అనంతరం సపర్యలు చేయడానికి వచ్చిన నర్సు ఎలైన్‌ మాసన్‌తో హాకింగ్‌ సన్నిహితంగా ఉండటంతో వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఆయనకు దూరమయ్యారు. హాకింగ్‌ తమకు దూరమవ్వడానికి ఎలైనే కారణమని అప్పట్లో ఆయన పిల్లలు ఆరోపించారు. అయితే వీటన్నింటిని పట్టించుకోని హాకింగ్‌ 1995లో ఎలైన్‌ను వివాహమాడారు. రెండో భార్య ఎలైన్‌తో.. పెళ్లి తర్వాత ఎలైన్‌ హాకింగ్‌ను హింసిస్తోందనీ.. చెయ్యి చేసుకుంటోందని తోటి నర్సులు పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనమైంది. తొలుత ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హాకింగ్‌ ఆ ఆరోపణల్ని ఖండించడంతో కేసును క్లోజ్‌ చేశారు. ఎలైన్‌తో హాకింగ్‌ వివాహబంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. 2006లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత హాకింగ్‌ తన పిల్లలకు దగ్గరయ్యారు. కుమార్తె లూసీతో కలసి సైన్స్‌కు సంబంధించి ఐదు పుస్తకాలు రాశారు.  

హాకింగ్‌ పరిశోధనలు క్లుప్తంగా.
1970 ఈ విశ్వం మొత్తం సింగుల్యారిటీ ద్వారా ఏర్పడింది. మనకు కనిపిస్తున్న గ్రహాలు, నక్షత్రాలు అన్నిరకాల ఇతర పదార్థాలు కంటికి కనిపించనంత చిన్న గుళిక స్థాయికి కుంచించుకుపోయాయనుకోండి.. అప్పుడు విశ్వం సాంద్రత, బరువు అనంతమవుతాయి. అంతరిక్షం, కాలం అన్నీ అందులోనే ఇమిడిఉంటాయి. ఈ భావనను సింగ్యులారిటీ అంటారు 
1972-74 కృష్ణబిలాల యంత్రాంగం: విశ్వంలో అక్కడక్కడా అదృశ్యంగా ఉండే కృష్ణబిలాల నుంచి కూడా రేడియోధార్మికత వెలువడుతూ ఉంటుందని ప్రతిపాదన. 
1981 ఇన్ఫర్మేషన్‌ పారడాక్స్‌: కృష్ణబిలంలోకి వెళ్లే పదార్థం, సమాచారం ఏదైనా సరే.. అది ఆవిరి అవడంతో ఎవరికీ అందకుండా పోతుంది. 
1983 అనంత విశ్వం: అంతరిక్షం–కాలాలకు సంబంధించి ఈ విశ్వానికి సరిహద్దులు లేవు 
1988 కాలం: కాలమనేది దూసుకుపోతున్న మూడు బాణాల వంటిదని హాకింగ్‌ అంచనా వేశారు. థెర్మోడైనమిక్స్‌ ఒక బాణమైతే... ఖగోళ, మానసిక సంబంధమైనవి మిగిలిన రెండు.  
2006 ఈ విశ్వం వేర్వేరు స్థితుల నుంచి ఉనికిలోకి వచ్చింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement