చెమట బాధిస్తోందా..?!
బ్యూటిప్స్
ఎండాకాలం చెమట అధికంగా పడుతుంది. దీని వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవాలంటే...
స్వెట్ ప్యాడ్స్
చెమట వల్ల బ్లౌజ్‌లు, డ్రెస్సుల చంకభాగాల్లో మరక ఏర్పడుతుంటుంది. దీన్ని నివారించడానికి స్వెట్ ప్యాడ్స్ సహాయపడతాయి. డ్రెస్ లోపలి భాగంలో చంక కింద రెండువైపులా ఈ ప్యాడ్స్‌ని అమర్చుకోవాలి. ఏ రోజుకారోజు వీటిని శుభ్రపరుచుకొని మళ్లీ వాడుకోవచ్చు.
డియోడరంట్
చెమట మరకను ఇది ఆపలేదు. కానీ, సాధ్యమైనంత వరకు చెమట పట్టే చోటు (చంక భాగాలను) ఎక్కువ సేపు పొడిగా ఉంచుతుంది.
టాల్కమ్ పౌడర్
చెమట ఎక్కువగా బట్టలకు అంటకుండా పౌడర్ పీల్చుకుంటుంది. అలాగే స్వేదగ్రంధులకు ఫ్యాబ్రిక్ వల్ల కలిగే ఇబ్బందిని తగ్గిస్తుంది. చంకభాగాలను శుభ్రపరుచుకొని, పొడిగా తుడిచి ఆ తర్వాతనే టాల్కమ్ పౌడర్‌ని ఉపయోగించాలి.
షేవ్
చంకభాగాల్లో ఉండే రోమాలను క్రమం తప్పకుండా తొలగించుకోవాలి. ఈ రోమాలు చెమటను ఇంకా ఉత్పత్తి చేస్తాయి. బాక్టీరియా వృద్ధి చెందుతుంది. రోమాలు, ఫ్యాబ్రిక్ మధ్య ఒత్తిడి పెరిగి ర్యాష్ ఏర్పడుతుంది. ఇందుకు షేవ్, వాక్సింగ్ పద్ధతుల ద్వారా రోమాలను తొలగించుకోవాలి.
టిష్యూ పేపర్
బయటకు వెళ్లేటప్పుడు బ్యాగ్‌లో టిష్యూ పేపర్స్‌ను తీసుకెళ్లాలి. బాత్రూమ్‌కి వెళ్లినప్పుడు చంకభాగాల్లో టిష్యూ పేపర్‌తో తడిని తుడిచేస్తే ఎక్కువ ఇబ్బంది ఉండదు.