మగాడికోసం కొన్ని ఆప్స్..!
మగాడిగా బతకడం ఒక ఆర్ట్... ఈ మాట పురుషాహంకారం కాదు. బాధ్యతలు నెరవేరుస్తూ, బంధాలను బ్యాలెన్స్ చేస్తూ, బ్యాలెన్స్ షీట్ సరిచూసుకొంటూ, సరదాలకు లోటు రాకుండా చూసుకొంటూ అనుకోకుండా ఎదురయ్యే స్పీడ్ బ్రేకర్లను దాటుకొంటూ.... షికారు చేయడమే ఆ ఆర్ట్. మరి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు సాయంగా వచ్చే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌లు కొన్ని ఉన్నాయి. వర్తమానంతో కనెక్ట్ అవుతూ జీవితాన్ని సాఫీగా గడపడానికి సాయంగా వస్తామంటున్నాయివి. స్మార్ట్‌ఫోన్ ఇన్‌స్టాల్ చేసుకొంటే వీటితో సరదా తెలుస్తుంది!
టై ఏ టైమ్ డీలక్స్...
చిన్నప్పుడయితే అమ్మ దగ్గరుండి స్కూల్‌కు రెడీ చేసి పంపిస్తుంది. అలా ఆఫీస్‌కు రెడీ చేసి పంపించే వాళ్లు ఉండరు కదా. బ్యాచిలర్ అయితే దగ్గరుండి టై కట్టి పంపే వాళ్లు ఉండరు కదా... మరి టైని టై చేయడంలో కూడా ప్రావీణ్యం సంపాదించాల్సిందే. అలాంటి ప్రావీణ్యతను అలవాటు చేస్తుంది ఈ అప్లికేషన్. ఇల్లస్ట్రేటెడ్ ఇన్‌స్ట్రక్షన్స్‌తో పూర్తి వివరాలు లభ్యమవుతాయి ఈ అప్లికేషన్‌లో. స్టెప్ బై స్టెప్ పద్ధతిలో మొత్తం ఏడు రకాలుగా టై కట్టుకొనే పద్ధతులు వివరంగా ఉంటాయి.
కాక్‌టెయిల్ మేడ్ ఈజీ...
తాగడం అలవాటున్న వారి కోసమే ప్రత్యేకమైనది ఈ అప్లికేషన్. వైన్‌కీ విస్కీకి ఉన్న తేడా ఏమిటో చెప్పడం దగ్గర నుంచి దాదాపు 500 రకాల కాక్‌టెయిల్‌లను కలపడం గురించి ట్రైన్ చేస్తుంది ఈ అప్లికేషన్. కాక్‌టెయిల్‌ను కాన్ఫిడెన్స్‌తో కలిపేలా మిమ్మల్ని తీర్చిదిద్దుతామంటూ ఈ అప్లికేషన్ హామీ ఇస్తుంది. ప్రతి రెసిపీ కూడా ఇమేజ్‌గా ఆయా రంగులతో చాలా స్పష్టంగా ఉంటుంది ఇందులో. బ్రిటిష్ బార్‌టెండర్ సిమన్ డిఫోర్డ్ ఈ అప్లికేషన్‌ను రివ్యూ చేశారు.
ఎవ్రీ ట్రయల్స్...
ఇష్టమైన దారిలో ప్రయాణిస్తున్నప్పుడు, ఇష్టమైన దాన్ని అందుకోవడానికి వెళుతున్నప్పుడు లక్ష్యానికి దగ్గరవుతున్నామనే ఫీలింగ్‌కు ఎంతో ఉద్వేగానికి గురి చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి చిన్ని చిన్ని ఆనందాలను అందించే అప్లికేషన్ ఎవ్రీట్రయల్స్. జీపీఎస్ ద్వారా మనం చేరాల్సిన కేంద్రాన్ని ఎంటర్‌చేస్తే చాలు. మీ వేగానికి తగ్గట్టుగా డిజిటల్ మీటర్‌లా పనిచేస్తూ సూచికగా ఉపయోగపడుతూ ఉంటుంది.
మెన్స్ హెల్త్‌వర్కవుట్ ఆప్..
పేరులోనే మగాడి ఆరోగ్యం గురించి గైడ్ అనే విషయాన్ని చెబుతుంది ఈ అప్లికేషన్. ప్రత్యేకించి జిమ్‌లో చేసే వ్యాయమంలో ట్రైనర్‌లా ఉపయోగపడుతుంది. ఏ ఎక్సర్‌సైజ్‌ను ఎలా చేయాలి? ఎంతసేపు చేయాలి, ఎక్సర్‌సైజ్‌చేస్తున్న సమయంలో శరీరాన్ని ఎలా ఉంచాలి? అనే విషయాల గురించి సూచనలు అందిస్తుంది. మెన్స్ ెహ ల్త్ గురించి వచ్చే దాదాపు 20 మ్యాగ్జిన్‌లలోని కంటెంట్‌ను కూడా అప్‌డేట్ చేస్తుంటుంది.
మనిల్లా..
వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతూ పోతాయి. టీనేజ్‌లోనే ఎక్స్ఛేంజ్‌కు వెళ్లి టెలిఫోన్ బిల్ కట్టడంతో మొదలు.. వ్యక్తిగా కుటుంబానికి సంబంధించిన అనేక ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టాల్సి ఉంటుంది. మరి ఇలాంటి బాధ్యతలకు సంబంధించి రిమైండర్‌గా ఉపయోగపడుతూ.. కట్టాల్సిన బిల్లుల వివరాలను గుర్తు చేస్తుంది ఈ అప్లికేషన్.
- జీవన్
వంటకూ లోటు లేదు!
వంటొచ్చిన మగాడు ధైర్యంగా వంటింట్లోకి చొరబడతాడు. ఆ ధైర్యాన్ని ఇచ్చే అప్లికేషన్‌లు అనేకం అందుబాటులో ఉన్నాయి! వెజ్, నాన్‌వె జ్ లలో వేల కొద్ది క్విజిన్‌లు వండటానికి గైడ్‌లుగా ఉపయోగపడతాయవి. ఓపిక ఉన్న బ్యాచిలర్ అయినా, సరదాగా ఫ్యామిలీ మెన్ అయినా వీటితో ప్రయోగాలు చేయవచ్చు! ప్రావీణ్యతను చాటుకోవచ్చు!
ఎస్‌ఏఎస్ సర్వైవల్ గైడ్..
ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకోవడం అనేది మనిషికి ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. అయితే కొన్ని విపత్తులు ఎదురయినప్పుడు ఎలాంటి వారికైనా ఎలా స్పందించాలో అర్థం కాకపోవచ్చు. ముంచుకొచ్చే ప్రమాదాలను ఎదుర్కోవడం కష్టతరం కావొచ్చు. మరి బయటపడటానికి అవకాశం ఉండి.. మార్గం కోసం అన్వేషిస్తున్న సమయంలో ఉపయోగపడేదే ఎస్‌ఏఎస్ సర్వైవల్ గైడ్. ఫస్ట్‌ఎయిడ్ దగ్గర నుంచి వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, విపత్తులు ఎదురయినప్పుడు ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాల గురించి సచిత్ర వివరణ అందిస్తుంది ఈ అప్లికేషన్..
ఆర్ట్ ఆఫ్ మ్యాన్లీనెస్..
మగాడిగా బతికే ఆర్ట్‌ను మరింతగా అలవాటు చేసుకోవాలంటే మీ ఐఫోన్‌లోనో, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోనే ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందట. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకొంటే మగాడిలా వ్యవహరించడం 274 శాతం పెరుగుతుందని అంటున్నాయి ఈ అప్లికేషన్ గణాంకాలు. చిన్న చిన్న సాహసాలు ఎలా చేయాలి అనే విషయాల దగ్గర నుంచి ఒక మ్యాన్ డైనింగ్‌టేబుల్ దగ్గర ఎలా ప్రవర్తించాలి.. అనే విషయాల దగ్గర వరకూ అనేక వివరణలుంటాయి ఈ అప్లికేషన్‌లో.