
సిసలైన ‘చెత్త’శుద్ధి...
సమ్‌థింగ్ స్పెషల్
మన పాలకులు తమ ‘చెత్త’శుద్ధిని చాటుకోవడానికి ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. దీనికోసం పౌరులు పొందే అన్ని సేవలపైనా అదనంగా 0.5 శాతం సుంకం కూడా ఎడాపెడా వసూలు చేస్తున్నారు. సుంకం వసూలు చేయడానికి ఇదొక నెపమే గానీ, పాలకులకు చిత్తశుద్ధి ఎక్కడుందీ? మహా నగరాల నుంచి మారుమూల పల్లెల వరకు ఎక్కడ చూసినా మనకు అడుగడుగునా తారసపడేవి మేరు మంధర పర్వతాలను తలపించే చెత్తకుప్పలే! పాలకుల సంగతి సరే... మన పౌరులేం తక్కువ తిన్నారు గనుక? వాడి పారేసే సంస్కృతిని నరనరానా జీర్ణించుకున్న పౌరులు యథాశక్తి ఇంటా బయట చెత్తను పోగుపెడుతూనే ఉన్నారు. పౌరులు పోగుపెట్టే చెత్తకు సంబంధించి మన దేశంలో ఎలాంటి గణాంకాలు లేవు గానీ, అగ్రరాజ్యమైన అమెరికాలోనైతే అప్ టు డేట్ గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. సగటు అమెరికన్ పౌరుడు ఏటా 1500 పౌండ్ల (680.3 కిలోలు) చెత్తను పోగు చేస్తున్నట్లు అక్కడి అధికారిక అంచనా. ఇక్కడి ఫొటోలో కనిపిస్తున్న గడ్డాల కుర్రాడి పేరు దర్శన్ కార్వత్.
ఉన్నత చదువు కోసం మన దేశం నుంచి కొన్నేళ్ల కిందట అమెరికా వెళ్లాడు. మిషిగాన్ వర్సిటీలో పోస్ట్ డాక్టరేట్‌లో చేరాడు. చెత్తను పోగుచేయడంపై విసిగి వేసారిన ఇతగాడు, ఎలాగైనా అతి తక్కువ చెత్తతో బతకాలని డిసైడయ్యాడు. తిరుగులేని ‘చెత్త’శుద్ధితో... సారీ... చిత్తశుద్ధితో ప్రయత్నం ప్రారంభించాడు. మొదటి ఏడాది ఇతగాడు పోగుపెట్టిన చెత్త కేవలం 7.5 పౌండ్లు (3.4 కిలోలు) మాత్రమే. రెండో ఏడాది మరింత గట్టి ప్రయత్నమే చేశాడు. ఈసారి ఏడాది వ్యవధిలో ఇతగాడు పోగుపెట్టిన చెత్త 6 పౌండ్లు (2.7 కిలోలు) మాత్రమే. అతి తక్కువ చెత్తను మాత్రమే పోగుపెట్టేలా బతకడానికి దర్శన్ తన జీవనశైలినే పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇందుకు అతడు కఠిన ప్రయత్నమే చేశాడు. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల కొనుగోలును పూర్తిగా మానేశాడు. టాయిలెట్ పేపర్ వాడకాన్నీ మానేశాడు. బయట రెస్టారెంట్లలో తినేటప్పుడు కూడా పదార్థాలకు చుట్టిన టిష్యూపేపర్, బర్గర్లకు గుచ్చే పుల్లలు లేకుండానే తనకు సర్వ్ చేయమని చెప్పేవాడు. ఏవైనా పార్టీలకు వెళ్లినా, అక్కడ పేపర్ కప్పులు వాడకుండా ఉండేందుకు తన గ్లాసును తానే తీసుకువెళ్లేవాడు. ఇతగాడి గురించి‘వాషింగ్టన్‌పోస్ట్’ సహా పలు పత్రికలు ఘనంగా కథనాలు రాశాయంటే, ఇతగాడి ‘చెత్త’ శుద్ధి ఎంత ఘనమైనదో అర్థం చేసుకోవాల్సిందే!