
చిన్నప్పుడు గోరుముద్దలు పెడుతూ... అమ్మ చందమామను చూపించేది. చంద్రుడు కనపడేవాడు... అమ్మ ప్రేమ చల్లని వెన్నెలలా అనిపించేది. ఝాన్సీ తల్లి శారద... తన బిడ్డకు దైవమార్గాన్ని చూపించింది. ఈ నిరాడంబర మార్గంలో... దేవుడిని ఆర్తిగా తలుచుకుంటే చాలు కనపడతాడు... ప్రేమగా పిలిస్తే చాలు... పలుకుతాడు.
తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు ఝాన్సీ. యాంకర్‌గా మనకు సుపరిచితమే! ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఝాన్సీ ఇంటికి వెళ్లినప్పుడు ఇంటి ముందు కనిపించిన దేవతా విగ్రహాలు, వాటి అలంకరణ చూడగానే ఆహ్లాదంగా అనిపించింది. నటరాజ విగ్రహం, ఆ పక్కనే బుద్ధుడు, ఓ వైపు గణేశుని మూర్తులు.. అందంగా, పొందికగా ఉన్న ఆ అలంకరణ చూసి ఝాన్సీకి దైవభక్తి అధికమే అనుకున్నాం. ఇదే విషయాన్ని ఆమెను అడిగితే.. ఆధ్యాత్మిక కోణాన్ని ఊహించినదానికి భిన్నంగా ఆవిష్కరించారు.
దేవుడిని బాగా కొలుస్తారనుకుంటాను. దైవశక్తి మీద అంతటి నమ్మకం ఎప్పుడు ఏర్పడింది?
మనకు అర్థం కాని శక్తి ఏదో మన చుట్టూ ఉంది. ఇది నాస్తికులైనా సరే ఒప్పుకోవాల్సిందే! ఇక భక్తి అంటారా.. ఇదంతా మన పెద్దల ఆచారాల నుంచి వస్తుంది. మా అమ్మమ్మ ఉదయాన్నే సూర్యనమస్కారం చేసుకోనిదే ఏ పనీ మొదలుపెట్టేది కాదు. మా నాన్న (రాజారావు)కు సాయిబాబా అంటే అచంచలమైన విశ్వాసం. ఇక అమ్మ (శారద) ధ్యానమార్గం నాకు దైవాన్ని ఇంకా దగ్గర చేసింది. ఆమె సాయిధామం, విపాసన, ప్రజ్ఞారణ్య స్వామి.. ధ్యాన మార్గాలను అనుసరిస్తుంది. మానసిక సంస్కారానికి ఇవన్నీ ఉపయోగపడ్డాయి. వీరందరి ప్రభావం నా జీవితంపై ఉంది. ఇవే దైవానికి చేరువ చేశాయి.
మానసిక సంస్కారానికి ధ్యానం ఉపయోగపడుతుందని, దైవాన్ని పరిచయం చేసిందని అన్నారు అదెలా?
దోసకాయ పండినప్పుడు తొడిమ నుంచి ఎలా వేరయిపోతుందో అలా మనం ఉండాలని పెద్దవాళ్లు చెబుతుంటారు. అంటే, జీవితాను భవాలను గ్రహించాలి. చివరకు అంతే సులువుగా ఆ బంధాలను నుంచి దూరమవ్వాలి. అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ విధానం ధ్యానం తెలియజేస్తుంది. నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే అంతే డిటాచ్డ్‌గా ఉండటం నేర్చుకున్నాను. ఇందుకు అమ్మ ఆధ్యాత్మిక పరంగా నాకు పెద్ద గైడ్. ఏదైనా స్పిరిచ్యువల్ బుక్స్ కనిపిస్తే చాలు అమ్మ చదవకుండా వదిలిపెట్టదు. వాటిలో మంచి వాక్యాలుంటే అండర్‌లైన్ చేసి, మరీ నాకు వినిపిస్తుంది. చిన్నప్పడు కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలకూ పంపించింది. ఈ విధానం ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండేలా చేసింది. ఆ ఆనందం దైవం అని నమ్ముతాను.
డిటాచ్‌మెంట్, అటాచ్‌మెంట్ అనే భావన బలమవ్వడానికి మీ అమ్మగారి ధ్యానమార్గంతో పాటు యోగుల పరిచయాలు ఏమైనా సాయపడ్డాయా?
సత్యప్రదానంద, స్వామి ప్రజ్ఙారణ్య, యోగి తపోవన వంటి వారి ద్వారా కొంత తెలిసింది. అలాగే ఈషా మెడిటేషన్ ద్వారా కూడా ఆధ్యాత్మిక కోణంలో మార్పులు వచ్చాయి. మెహిదీపట్నం లక్ష్మీనగర్‌లో ఒక నిరాహారి యోగిని ఉంటారు. ఆమె పండు తప్ప మరే ఆహారమూ తీసుకోరు. మా పాప మూడునెలల వయసులో వారి ఆశీస్సులు ఇప్పిద్దామని వెళ్లాం. అక్కడకు వెళ్లి ఆ గదిలో కూర్చున్నాం. ఆ గదిలో పెద్ద పెద్ద గురువుల ఫొటోలు ఉన్నాయి. ఆమె ఆశీర్వచనం పూర్తయ్యాక ఆ ఫొటోల మీద నుంచి పూలు రాలి పాప మీదుగా పడ్డాయి. మేం కోరుకున్నది అమ్మ ఇప్పించిందని అర్థమయ్యింది.
ధ్యానం నిరాడంబరాన్ని పరిచయం చేసింది. ఇలాంటప్పుడు పండుగల సందడి, పూజలకు అయ్యే ఖర్చు వీటి గురించి ఏమనుకుంటారు?
పండుగలు, ఆచారాలు వేటికీ దూరంగా ఉండను. మన పూర్వీకులు పండుగలు పెట్టడంలో అర్థం.. ఇంటిని శుభ్రం చేసుకోవాలి, కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని అని. ఇంటితో పాటు మన లోపల బూజులు కూడా దులుపుకోవాలని నేను అనుకుంటాను. అందుకు ధ్యానం సాయపడుతుంది. అలాగే, నాలుగు రకాల పిండివంటలు చేసుకొని, ఇంట్లో నలుగురం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటాం. మొన్నటి దీపావళి పండుగే తీసుకుంటే టపాసులు కాల్చడం అనేది కొన్నాళ్ల క్రితమే మానేశాం సౌండ్ పొల్యూషన్ అని. దీపాలతో అలంకరణ మాత్రం చాలా ఇష్టపడతాను.
ఏదైనా మూఢంగా పాటించకూడదు. ప్రకృతికి హాని కలిగించకుండా పండుగలు జరుపుకోవాలి. శివాలయాల్లో అభిషేకాల పేరుతో అన్ని పాలు వృథా చేయాలా పేదవాళ్లకు దానం ఇవ్వచ్చు కదా అని కొంతమంది అంటుంటారు. కానీ అది వృథా కాదు. మన పెద్దవాళ్లు ఎంతో ఆలోచించి ఆ ఆచారం పెట్టి ఉంటారు. కానీ, ప్రతి ఒక్కరూ లీటర్ల కొద్ది పాలు తీసుకెళ్లి పోయనక్కర్లేదు. స్పూన్ పాలతో కూడా స్వామికి అభిషేకం చేయవచ్చు. మనలో దైవం పట్ల ఆర్తి ఉండటమే ముఖ్యం. వినాయక నిమజ్జన సమయంలో ‘బకెట్ గణేశ్’ పేరుతో ఒక క్యాంపెయిన్ చేశాను. మట్టితో చేసినవైనా ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన విగ్రహాలతో చెరువులు నింపేయడం ఎందుకు? ఇంట్లోనే బకెట్ నీటిలో నిమజ్జనం చేసుకోవచ్చు కదా అని వివరించాను. ఆచారాల పేరుతో పర్యావరణానికి హాని తలపెట్టవద్దు.
దైవానికి సంబంధించి జీవితాంతం మరిచిపోలేని ఘటన?
ఐదేళ్ల క్రితం తిరుపతి వెళ్లాం. కింద పద్మావతి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్‌లో నేనూ మా పాప ధన్య నిల్చున్నాం. అంతసేపూ లైన్‌లో నిల్చొని అమ్మవారి ముందుకు దర్శనం ప్లేస్‌కి వచ్చేసరికి మా పాపను అక్కడ సెక్యూరిటీగార్డ్ ‘నడువు నడువు’ అని రెక్కపట్టుకొని లాగేసింది. దాంతో అమ్మవారి దర్శనానికి వచ్చాననే విషయం మర్చిపోయి పాపకోసం పరిగెత్తాను. ఆ సెక్యూరిటీ ఆవిడతో ‘ఏంటమ్మా.. చిన్న పిల్ల. అలా లాVó స్తే జబ్బనొప్పి పెట్టదా..’ అంటూ గొడవపడ్డాను. పాపను కలుసుకున్నాక అది ‘ఏం ఫర్వాలేదమ్మా!’ అని చెప్పాక గానీ అమ్మవారు గుర్తురాలేదు. అక్కడ కొద్ది క్షణాలు భక్తురాలిగా కాకుండా నాలో అమ్మ బయటకు వచ్చేసింది. కళ్లమ్మట నీళ్లొచ్చేశాయి. ‘అయ్యో, అమ్మ దర్శనం చేసుకోలేకపోయానే.. అమ్మా.. నేనేం తప్పు చేశాను. గంటసేపనగా నీ దర్శనం కోసం లైన్‌లో నిల్చున్నాను. తీరా నీ ముందుకు వచ్చేసరికి క్షణమైనా నిన్ను చూడకుండానే బయటకు వచ్చేశాను. నిన్ను చూసే భాగ్యం ఎందుకు కలిగించలేదమ్మా! నాలో అహం ఏదైనా ఉండి ఇలా జరిగిందా?’ అనుకుని బాధగా ద్వారం నుంచి బయటకు వెళ్లబోయాను.
అప్పుడే..మరో ఎగ్జిట్ గేట్ నుంచి వస్తూ ఒక పెద్దావిడ నా భుజం మీద చేయి వేసి.. ‘ఏంటమ్మా, నా కోసం ఇంత దూరం వచ్చావు. పిలుస్తున్నా పలక్కుండా వెళ్లిపోతావేంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా!’ అంది. నుదుటన రూపాయికాసింత బొట్టు, ఎర్రచీర కట్టుకుని.. ఉంది ఆవిడ. నేను ఆమెనే ఆశ్చర్యంగా చూస్తూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాను. ఆ తర్వాత చూస్తే ఆమె ఎక్కడా కనిపించలేదు. అమ్మవాళ్లకు ఈ విషయం చెబుదాం అని బయటకు వస్తుండగా ఒక పెద్దాయన తెల్లపంచె కట్టుకొని ఎదురొచ్చారు. ‘శతమానం భవతీ శతాయుః.. ’ అంటూ వేదాశీర్వాదం ఇస్తూ.. ‘నువ్వు చేస్తున్న కార్యక్రమాలు చాలా మంచివి. అంతా మంచే జరుగుతుంది’ అంటూ పండు ఇచ్చి దీవించారు. ఆ తర్వాత అతనూ కనిపించలేదు. ఆర్తి లోపల ఉంటే చాలు దేవతలే దిగివస్తారు అని ఆ సమయంలో అనిపించింది. వాళ్లు సాధారణ మనుషులే అయి ఉండవచ్చు. కానీ, నాకు మాత్రం స్వామి, అమ్మవారు అంతటా ఉన్నారు అని ఆ ఘటన ద్వారా తెలిసింది. ఇప్పటికీ తలచుకుంటే అదో గొప్ప అనుభూతి.
అంతటా ఉన్న దేవుడే మీ జీవితంలో ఒడిదొడుకులనూ ఇచ్చాడుగా! మరి కోపం లేకుండా ఇంతటి భక్తి ఏంటి?
ఒక్కో సమయంలో ప్రస్టేషన్ ఉంటుంది. అది సహజమైన లక్షణం కూడా! కానీ, దాన్నుంచి బయటపడటం అనేది ముఖ్యం. ఈ జీవితంలో కష్టసుఖాలు మన పూర్వ జన్మ కర్మలు. వాటిని ఫేస్ చేయగలిగే ధైర్యాన్ని మాత్రం నువ్వే ఇవ్వు అనుకుంటాను. నా జీవితంలో చాలా ఎత్తు పల్లాలను చూశాను. అలాంటి సమయంలో ఎమోషనల్‌గా రియాక్ట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. పరిస్థితులే ధైర్యాన్ని పెంచుతుంటాయి. వీటిని దాటడానికి ఆ దైవం నుంచే శక్తి ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. భగవంతునితో ఒక బాండ్ ఉందని ఎప్పుడూ నమ్ముతాను. కొన్ని సందర్భాలలో ‘నువ్వే చేశావు’ అని భగవంతున్ని నిందాస్తుతి చేయవచ్చు. కానీ, ఆ బాండేజ్ మాత్రం తొలగిపోదు. అది ఎలా ఉంటుందంటే తల్లికీ–బిడ్డకూ ఉన్న అనుబంధంలా ఉంటుంది. పిల్లవాడు ఏదో కావాలని అమ్మతో పేచీకి దిగుతాడు. అమ్మ ఇవ్వకపోతే వాడు ఆమెతో మాట్లాడడు. ఆ సమయంలో అమ్మ దగ్గరకు తీసుకున్నా ఆమె నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటాడు, కానీ, ఎంతసేపు ఆ కోపం.. మళ్లీ అమ్మకోసం వస్తాడు. ఇదీ అంతే!
మీ పాపకు దైవాన్ని ఏవిధంగా పరిచయం చేస్తుంటారు?
పిల్లలు వినరు. అయినా విసుగులేకుండా మనమే వారికి ఇలాంటివి పరిచయం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత వారు జీవితాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఇవి ఉపయోగపడతాయి. పాప చిన్నప్పుడు నలుగురిలోకి వచ్చి మాట్లాడటానికే చాలా ఇబ్బంది పడేది. నలుగురు ఉన్నప్పుడు వారేం అనుకుంటారో అని కలవకపోయేది, మాట్లాడకపోయేది. దాన్నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నాలు చేశాను. అదొక్క ఇన్సిడెంట్‌తో ముడిపడిలేదు. అది రోజువారీ ప్రయత్నం. మన ఆచార వ్యవహారాలన్నీ పరిచయం చేస్తుంటాను. పిల్లల్లో మన సంస్కృతి, ఆచార వ్యవహారాల పట్ల బీజం వేయడం వరకు మాత్రం మనం చేయాల్సిన పని. భవిష్యత్తులో వాళ్లు ఎలా ఉంటారో అది వారి ఇష్టం. మనం చెప్పినవి, పాటించిన ఆచారాలు ఎప్పుడో అప్పుడు వారి జీవితంలో తప్పక ఉపయోగపడతాయి.
సేవే దైవం అనిచెబుతుంటారు. అన్నిటికన్నా మిన్న ఏ సేవ గొప్పదని మీరు భావిస్తారు?
తోటి జీవుల పట్ల దయతో, ప్రేమగా ఉండటమే అన్నింటికన్నా మిన్న. ఆటిజం పిల్లలతో ఉన్నప్పుడు ఈ భావన కళ్లకు కట్టింది. శరీరం ఎదిగి, మెదడు వికాసం చెందని ఇలాంటి పిల్లల తల్లిదండ్రులకు దేవుడు ఎంత శక్తి ఇచ్చి ఉంటాడో కదా అనిపిస్తుంది. అలాంటి పిల్లల్లో లోపం పక్కన పెట్టేసి వాడికి ఇంకేదో ఎక్స్‌ట్రా శక్తిని ఇచ్చి ఉంటాడు దేవుడు అదేంటా అని వెతుకుతాను. దానిని వెలికి తీయడానికి ఆరాటపడతాను. ఈ ఇంట్లో అలంకరణ కోసం తగిలించిన ఈ షో పీసులు చూడండి. ఇవి వాళ్లు చేసినవి. ఆ పిల్లలతో ఉన్నంతసేపు దేవునితో ఉన్నట్టే ఉంటుంది. అందుకే అలాంటి సంస్థతో కలిసి పనిచేస్తున్నాను. అలాగే, మహిళలకు ఉపయోగపడే టీవీ ప్రోగ్రాములు చేస్తున్నాను. బాధితులతో ఇంటరాక్ట్ అవుతుంటాను. కష్టాల నుంచి వారు గట్టెక్కిన విధానాలు తెలుసుకుంటాను. కొందరికి ధైర్యం చెబుతుంటాను. దైవం దగ్గర చాలా ఎనర్జీ ఉంది. అది తోడుకున్నవారి తోడుకున్నంత.
యాంకరింగ్‌లో అందం ప్రధాన భూమికగా ఉంటుంది. ఎలాంటి సౌందర్యం దైవత్వానికి చేరువచేస్తుందంటారు?
నిస్సంకోచంగా అంతఃసౌందర్యమే! అందుకు మనల్ని మనం నిత్యం సంస్కరించుకోవాలి. లోపల ఎలాంటి మకిలీ లేకుండా జాగ్రత్తపడితే చాలు ఆ సౌందర్యం ముందు ఏ మేకప్ అయినా దిగదుడుపే. అలాగే, మన చుట్టూ రిలేషన్స్ బాగుండేలా చూసుకోవాలి. ఎదుటివారితో విభేదించవచ్చు కానీ, శత్రువులుగా చూడకూడదు. సాధ్యమైనంతవరకు ఉన్న జీవితంలోని తప్పులను సవరించుకుంటూ, సమాజం పట్ల బాధ్యతగా నడుచుకుంటే చాలు. ప్రత్యేకమైన పూజలు చేయనక్కర్లేదు. అలాగని అన్నింటినీ దూరం పెట్టేయకూడదు. ఇది కార్తీకమాసం. నేనూ ఉదయాన్నే ఓ దీపం వెలిగిస్తాను. ఏదైనా ఒకరోజు ఉపవాసం ఉంటాను. ఏదీ కష్టంగా భావించకూడదు. దైవశక్తిని కూడా మనం ఎంజాయ్ చేయాలి. అప్పుడు ఈ జగత్తు నుంచి కావల్సినంత ఆధ్యాత్మిక శక్తి మనకు అందుతుంది.
ఇక్కడ చూస్తే దేవతా విగ్రహాలు చాలానే అమర్చారు. ధ్యానం ద్వారా అంతర్ముఖులు అవడం గురించి తెలిసిన మీరు ఈ విగ్రహాలను అమర్చడం ఎందుకు?
విగ్రహాలూ దైవానికి చేరువచేసే సాధనాలే. ధ్యానముద్రలో ఉండే బుద్ధుడి రూపం, ప్రతి పూజలో అగ్రతాంబూలమిచ్చే గణనాథుడు ముచ్చటగా అనిపిస్తారు. ఈ నటరాజ విగ్రహాన్ని చిత్తూరు వాకర్ అసోసియేషన్ వాళ్లు కానుకగా ఇచ్చారు. మొన్న మా పై పోర్షన్‌వాళ్లు అయ్యప్పస్వామి పూజ చేస్తూ నన్నూ పిలిచారు. వెళ్లాలనుకున్నాను. కానీ, వందల సంఖ్యలో స్వాములు వస్తున్నారు. అక్కడ స్వామికి అభిషేకాలు జరుగుతున్నాయి. వాళ్లందరిలోకి వెళ్లి ఆ వాతావరణాన్ని డిస్ట్రర్బ్ చేయడం ఇష్టం లేదు. ఆ సమయంలోనే ఈ శివుడికి రంగు వేయాలనిపించింది. ఇది పూర్తి ఇత్తడి విగ్రహం. సిల్వర్ కలర్‌తో పూర్తి పెయింట్ వేసేశాను. పైన వాళ్లు స్వామికి అభిషేకాలు చేస్తున్నారు. అంతసేపు నేను ఈ శివయ్యకు పెయింట్‌తో అభిషేకం చేశాను. ఈ భావన రాగానే కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను.
ధ్యానంలో దైవానికి రూపం ఉండదు. రూపంగా ఏ దైవాన్ని కొలుస్తారు?
శివయ్య అంటే చాలా ఇష్టం. పదేళ్ల వయసు అనుకుంటా – గుళ్లో అభిషేక సమయంలో తెలియకుండానే కళ్లమ్మట నీళ్లు వచ్చేశాయి. కారణమేమీ లేదు. అమ్మకు చెబితే.. గత జన్మ సంస్కారాలు ఈ జన్మకూ వస్తాయమ్మా అంది. శివ క్షేత్రాలలో శ్రీకాళహస్తికి వెళ్లడం కూడా అనుకోకుండా జరిగింది. ఇంట్లో నిత్యం పూజలు చేసినా రాని శక్తి గుడికి వెళితే వస్తుంది. గుడి నిర్మాణానికి ఎందరి చేతులు తోడయ్యాయో వారి ఎనర్జీ అంతా అక్కడే ఉంటుంది. అందుకేనేమో ఎంత మంది వెళ్లినా అందరికీ శక్తి లభిస్తుంది. ఎస్‌విబీసీ ఛానెల్‌లో ‘యాత్రా’ ప్రోగ్రామ్ పాతిక ఎపిసోడ్స్ చేశాను. షూటింగ్ ఉన్నన్నాళ్లూ ఒక తీర్థయాత్రకు వెళుతున్నాను అనిపించేది. ధర్మపురి నరసింహస్వామి క్షేత్రానికి వెళ్లినప్పుడు.. లోపల స్వామికి అభిషేకాలు జరుగుతున్నాయి. నేను కళ్లు మూసుకుని కూర్చున్నాను. నాకు తెలియకుండానే ధ్యానంలో అలా గంట సేపు ఉండిపోయాను. అభిషేకం పూర్తయ్యాక కళ్లు తెరిచాను. అప్పటి వరకు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఆ ఎక్స్‌పీరియన్స్ ఇప్పటికీ నాకో అద్భుతం.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి
Comments
Please login to add a commentAdd a comment