
ఇలాంటి పిల్ల ఎక్కడైనా కనపడితే...
అబ్బాయిలూ! ఓ సెల్యూట్ కొట్టేయండి.
నిజంగా దమ్మున్న పిల్ల.
తన వర్త్‌ని తెలుసుకున్న పిల్ల.
ఇంకొకరి గురించి తక్కువగా మాట్లాడదు.
తన గురించి తక్కువగా మాట్లాడనివ్వదు.
ఒక రకంగా నేటి ప్రపంచంలో
ఇలాంటి అమ్మాయిల సంఖ్య పెరిగితే
అబ్బాయిలు దారికొస్తారేమో!
మోడర్న్ గర్ల్.. మోడర్న్ థాట్స్
‘నా లైఫ్.. నా ఇష్టం.’
అంటోంది ఆండ్రియా జెర్మియా
ఈ మధ్య ‘కాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడుతూ.. ‘ఎవరితో ‘స్లీప్’ చేయాలన్నది ఆడవాళ్ల ఇష్టం. వాళ్లను ఫోర్స్ చేసే అధికారం మగవాళ్లకు లేదు’ అని బోల్డ్‌గా అన్నారు... ఇలాంటి స్టేట్‌మెంట్ ద్వారా సమాజానికి మీరు చెబుతున్నదేంటి?
మగవాళ్లకు ఉండే స్వేచ్ఛ ఆడవాళ్లకూ ఉంటుందని చెబుతున్నా. నిజమే... ఎవరితో అన్నది ఆడవాళ్ల హక్కు. ఎవరూ ఫోర్స్ చేయకూడదు. ఆ రోజు ప్రెస్‌మీట్‌లో నేనీ మాట మాత్రమే చెప్పాను. కానీ, ‘కాస్టింగ్ కౌచ్’ గురించి ఇంకో మాట చెప్పాల్సింది. మిస్సయ్యాను. అదేంటంటే.. ‘కాస్టింగ్ కౌచ్’ కూడా ఆడవాళ్ల ఇష్టప్రకారమే జరుగుతుంది. ఇష్టపడినవాళ్లు ఒప్పుకుంటారు. లేనివాళ్లు ‘కుదరదు’ అని మొహం మీదే చెప్పేస్తారు. బయట చాలామందికి ఈ విషయం తెలియదు. ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ పేరుతో హెరాస్ చేస్తారని చెప్పుకుంటారు. కానీ, అది నిజం కాదు.
ఉండలేక... వెళ్లలేక డైలమాలో ఉన్నవాళ్లు వేరే దారి లేక ‘ఇష్టం లేని ప్రపోజల్స్’ ఒప్పుకునే పరిస్థితి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. చాలా చోట్ల ఉంది..
అది నిజమే. ‘ఫిమేల్’ అనగానే ముందు ఆమె టాలెంట్ గురించి ఆలోచించేవాళ్లు తక్కువమంది ఉన్నారు. అది తప్పు. అవకాశం ఇవ్వడం కోసం ఏదో ఆశించడం సరి కాదు. ఆ ‘ఆఫర్’ కావాలంటే అడ్జస్ట్ కాక తప్పదనే పరిస్థితిలో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవడం టఫ్ అవుతుంది. ఆ పరిస్థితిలో కొంతమంది ఒప్పుకుంటున్నారు. అయితే ఫైనల్‌గా ఇలాంటివి కెరీర్‌కి ఉపయోగపడవు. టాలెంట్, హార్డ్‌వర్కే నిలబెడతాయి. వాటికి లాంగ్విటీ ఉంటుంది. అందుకే అంటున్నా... తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
యాక్చువల్‌గా నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ఆడవాళ్లను కొందరు ఆడిపోసుకుంటారు కానీ, వాళ్లది దయనీయమైన స్థితి అనాలి...
ఎగ్జాట్లీ. ప్రపోజల్ పెట్టిన మగవాడి గురించి ఎవరూ మాట్లాడరు. అయితే ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నా. ‘ఈజీ రూట్’లో పైకి రావాలని ఎవరూ అనుకోకూడదు. నేను అనుకోను. అవకాశం వస్తే.. వస్తుంది. రాకపోతే రాదు. ఓపికగా వెయిట్ చేద్దామనుకుంటా. మన ఆలోచనల్లో నిజాయితీ, మన కష్టంలో క్రమశిక్షణ ఉంటే తప్పకుండా అవకాశాలొస్తాయి. అప్పటివరకూ ఎదురు చూసే ఓపిక లేనివాళ్లు ప్రపోజల్స్‌కి ఒప్పుకుంటారేమో! అది కూడా అందరూ అలా చేస్తారని అనలేం.
ఓకే.. మూడు నాలుగు నెలల క్రితం సింగర్ సుచిత్ర తన ట్విట్టర్ ద్వారా కొందరి రహస్యాలను బయటపెట్టారు. మీకు సంబంధించిన పోస్ట్ కూడా ఉంది. అంటే ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నామనే విషయంలో జాగ్రత్తపడాలంటారా...
అవును. ఎవరైతే మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకుంటారో వాళ్ల మీద మాటల దాడి, ఎలాంటి దాడి అయినా చేయడానికి కొందరు రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ల లైఫ్ అందరికీ ఓపెనే. అది సినిమా స్టార్స్ అయినా.. పొలిటికల్ లీడర్స్ అయినా. వాళ్ల జీవితం గురించి అందరికీ కావాలి. వాళ్లకి మంచి పేరు ఉంటే దాన్ని చెడగొట్టెయ్యాలని చూస్తారు. నా విషయానికి వస్తే... నేను సిగ్గుపడాల్సిన పనులేవీ నా లైఫ్‌లో చేయలేదు. ఒకవేళ చేసినా ‘అది నేను కాదు’ అని తప్పించుకునే టైప్ కాదు. ‘అవును.. నాకు ఏం అనిపించిందో అదే చేశాను. అది నా ప్రాబ్లమ్. మీ ప్రాబ్లమ్ కాదు. ఇది నా జీవితం. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరంలేదు’ అని ఓపెన్‌గా చెప్పే దమ్ము ఉంది.
కరెక్టే.. మన లైఫ్‌ని మనం ఇష్టపడినట్లుగా జీవించాలి.. అయితే సమాజం గురించి కూడా ఆలోచించాలి కదా!
కచ్చితంగా. సామాజిక స్పృహ ఉండాలి. ఆ స్పృహ ఉంటే.. మనకు ఇష్టం వచ్చినది చేయకూడదు. సొసైటీ ఇష్టపడేవి చేయాలి. సొసైటీయా? మన లైఫా? అనే క్లారిటీ ఉండాలి. ఏదో ఒక్కదానికే కమిట్ అవ్వాలి.
సొసైటీ వ్యతిరేకించే పనులు చేసినప్పుడు విమర్శలు చుట్టుముడుతాయి. అలాంటివి తట్టుకునేంత ధైర్యం మీకు ఉందా?
ఎప్పుడైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తామో అప్పుడు ‘పర్సనల్ ఫ్రీడమ్’ అనేది పోతుంది. ఇక్కడ ఉన్నందుకు మేం చెల్లించే మూల్యం అది. దాన్నే ‘ఆక్యుపేషన్ హాజర్డ్’ (వృత్తి సంబంధిత ప్రమాదాలు) అనాలి. ఫర్ ఎగ్జాంపుల్... ఓ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుందనుకోండి.. కట్టే సమయంలో ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోయి చనిపోతే, అది ‘ఆక్యుపేషన్ హాజర్డ్’ అంటాం. అక్కడ అలాంటి ప్రమాదాలు.. సినిమా ఇండస్ట్రీలో ఇంకో రకమైన ప్రమాదాలు. వేరే చోట వేరే రకమైనవి. అండ్.. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ల గురించి వచ్చే వార్తలన్నీ నిజం కావు. జనాలు మా గురించి వచ్చే వార్తలు చదువుతున్నప్పుడు.. ఆ స్టోరీకి రెండు కోణాలుంటాయని ఆలోచించాలి. అయితే గుడ్‌ని ఫోకస్ చేయరు. దాంతో బ్యాడ్ ఎలివేట్ అవుతుంది. అంత మాత్రాన వాళ్లు ‘బ్యాడ్’ అనలేం. బయటి జనాల గురించి వదిలేద్దాం. ఫైనల్‌గా మన లైఫ్‌లో ఉన్న పీపుల్ మన గురించి ఏం అనుకుంటున్నారన్నదే ముఖ్యం. నా గురించి విమర్శలు వస్తే... అస్సలు పట్టించుకోను.
న్యూస్ పేపర్స్ చదువుతారా?
చదవడం మానేశాను. నేను, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్... ఇదే నా జీవితం. మిగతావాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి లేదు. అలా తెలుసుకోవాలంటే ఎంతమంది గురించి తెలుసుకుంటాం? ఇన్‌ఫాక్ట్ మన చుట్టూ ఉన్నవాళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక్క రోజు కూడా సరిపోదు. మన లైఫ్‌లో ఎక్కువ టైమ్‌ని మనకోసం కేటాయించాలి కానీ, అవతలివాళ్ల కోసం ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏంటి? ‘ఐ వర్క్.. ఐ ట్రావెల్.. ఐ ఎంజాయ్ మై లైఫ్’. అంతే. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాను.
సొసైటీలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవడానికి చదవాలి కదా?
ఒకవేళ తెలుసుకోదగ్గ విషయాలుంటే అది ఏదో రకంగా మన చెవికి వచ్చేస్తుంది. చెప్పడానికి చాలామంది ఉన్నారు. ‘అక్కడ భూకంపం వచ్చిందట’, ‘ఆ ప్లేస్‌లో ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందట’ అని చెప్పేవాళ్లు నా చుట్టూ చాలామంది ఉన్నారు.
మీరు ‘ఫెమినిస్టా’?
ఆడ–మగ సమానం అనుకుంటా. దాన్నే ఫెమినిజమ్ అంటే.. అవును. నేను స్త్రీవాదినే. ఇవాళ ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి, వాళ్లకు ఆర్థిక స్వాతంత్య్రం వచ్చింది. నాకు తెలిసిన ఒకామె ఉంది. ఆవిడ ఇళ్లలో పనులు చేస్తుంది. నెలకి 20వేల రూపాయలు సంపాదిస్తుంది. అంటే.. ఎన్ని ఇళ్లలో పనులు చేస్తుంది? ఎంత కష్టపడుతుంది? అని ఊహించవచ్చు. ఆవిడ భర్త తాగుబోతు. తాగి, ఆమెను తిడతాడు. కొడతాడు. భరించలేక అతన్నుంచి విడిపోయింది. పిల్లలను చక్కగా చదివించుకుంటోంది. అంటే.. ఆవిడకిప్పుడు డబ్బుకోసం మగాడు అక్కర్లేదు. వస్తువుల కోసం అక్కర్లేదు. అంతెందుకు? ఆవిడకి మగాడే అవసరం లేదు. అందుకే అంటున్నా.. ఇప్పుడు తమకెలాంటి భర్త కావాలో సెలక్ట్ చేసుకోవడం అనేది ప్యూర్లీ అమ్మాయి చాయిస్సే. అలా ఆడవాళ్లు తమను ఎన్నుకోవడం అనేది మగాళ్లు భరించలేరు.
అలాంటివాళ్లను మీరు కలిసిన సందర్భాలున్నాయా?
ఉన్నాయి. ‘ఇతను మంచివాడు. ఆడవాళ్లను హీనంగా చూడడు’ అనే నమ్మకంతో ఆ వ్యక్తితో మాట్లాడేదాన్ని. కానీ, నిరుత్సాహమే ఎదురైంది. ఇప్పటివరకూ ఆడవాళ్లను తమతో పాటు సమానంగా గౌరవించే మగాడు నాకు తారసపడలేదు. అందుకే నేను ‘సింగిల్’గా ఉన్నాను.
అందరూ సమానం అంటాం.. హీరోలతో పోల్చితే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువ కదా.. పోనీ లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసినప్పుడు హీరోయిన్లకు ఎక్కువ పారితోషికం ఇస్తారా?
‘తరమణి’ (తమిళ చిత్రం – లేడీ ఓరియెంటెడ్)కి ముందు నేను చాలా స్క్రిప్ట్స్ విన్నాను. అవన్నీ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీసే. రెమ్యునరేషన్ ఎక్కువ అడిగితే, ‘మేడమ్.. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. అందుకని ఎక్కువ పారితోషికం ఇవ్వలేం’ అన్నారు. ఇక్కడ లేడీ ఆర్టిస్టులు ఎంత కష్టపడినా మేల్ ఆర్టిస్టులకు ఇచ్చినంత పారితోషికం ఇవ్వరు. ఇప్పుడిప్పుడే కొంచెం మార్పు కనపడుతోంది. ఆ మార్పుకి హ్యాపీ.
‘తరమణి’ సినిమాలో మీరు మందు పుచ్చుకుంటారు.. సిగరెట్ తాగారు.. ఇవి ఆడవాళ్లు చేయదగ్గ పనులు కాదంటారు కదా...
ఎవరన్నారు? ఇవి తయారు చేసేటప్పుడు మగవాళ్ల కోసమే అని ఎవరూ చెప్పలేదే? మందు, సిగరెట్ తాగడం మగవాళ్ల హక్కు అంటే ఒప్పుకోను. ఇష్టపడితే ఆడవాళ్లూ తాగొచ్చు.
అంటే.. స్మోకింగ్‌ని ఎంకరేజ్ చేస్తున్నారా?
నెవర్. ఆల్కహాల్, స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం. ఆడవాళ్ల రైట్స్ గురించి మాట్లాడానంతే. వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ముఖ్యంగా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఆల్కహాల్, సిగరెట్‌కి దూరంగా ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఆ మహిళకు ఆమె శరీరం మీద మాత్రమే కాదు.. ఇంకో శరీరం మీద బాధ్యత ఉంటుంది. ఒకరికి జన్మనివ్వాలి. హెల్దీ లైఫ్ ఇవ్వాలి కాబట్టి, ప్రెగ్నెన్సీ సమయంలో చాలా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి.
ఫైనల్లీ... ‘తడాఖా’ తర్వాత డబ్బింగ్ సినిమాల్లో తప్ప స్ట్రయిట్ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు.. మావైపు కూడా రావొచ్చు కదా?
మీ దర్శక–నిర్మాతలను పిలవమనండి. కచ్చితంగా వస్తా. నా అంతట నేను ఎవర్నీ అవకాశాలు అడగను. అది సింగర్‌గా అయినా.. ఆర్టిస్ట్‌గా అయినా. లైఫ్‌లో ఇప్పటివరకూ ‘సార్.. నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి’ అని ఎవర్నీ అడగలేదు. భవిష్యత్తులోనూ అడగను. ఇది నా స్టయిల్. అవకాశం వస్తే చేస్తా. లేకపోతే లేదు.
ఫైట్స్‌కన్నా సాంగ్స్ ఈజీ!
ఇటీవల విడుదలైన ‘డిటెక్టివ్’లో ఫైట్స్ చేశాను. సాంగ్స్ చేయడం చాలా ఈజీ అనిపించింది. ఆ సినిమాలో హార్లీ డేవిడ్‌సన్ బైక్ నడిపాను. సీన్ తీసేటప్పుడు బైక్ టర్న్ చేస్తే.. ఓ కారు అడ్డం వచ్చింది. భయపడ్డాను.
ప్రొఫెషన్ అంటే ప్రేమ
నేను స్టేజీ ఆర్టిస్ట్‌ని. అక్కడ రిజల్ట్ అప్పటికప్పుడు తెలుస్తుంది. సినిమాలకు అలా కాదు. లాంగ్ ప్రాసెస్. లొకేషన్లో మేం చేసినప్పుడు కూడా రిజల్ట్‌ని ఊహించలేం. ప్రేక్షకుల దగ్గరకు వెళ్లాక అసలు విషయం తెలుస్తుంది. సింగింగ్, డబ్బింగ్, యాక్టింగ్.. ఈ మూడింటిలో మీకేది ఇష్టం? అంటే చెప్పలేను. నాకు ప్రొఫెషన్ అంటే ప్రేమ. మూడింటినీ ఎంజాయ్ చేస్తాను.
‘తరమణి’ గురించి 20 నిమిషాలు మాట్లాడింది
ఆర్టిస్ట్‌గా ఉండటం అనేది లక్. కొన్నిసార్లు మేం చేసే సినిమాలు కొందరి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఒకసారి నేను బయటికెళితే, ఒకావిడ ‘మీతో మాట్లాడొచ్చా’ అనడిగి, ‘తరమణి’ గురించి 20 నిమిషాలు మాట్లాడింది. ‘నా సమస్యలకు ఆ సినిమా పరిష్కారం చూపింది. మీ క్యారెక్టర్ నాలో ధైర్యాన్ని నింపింది’ అని ఆవిడ అన్నప్పుడు నాక్కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment