వంగదండు | special chit chat with vanga pandu prasad rao | Sakshi
Sakshi News home page

వంగదండు

Published Tue, Nov 7 2017 11:37 PM | Last Updated on Wed, Nov 8 2017 5:37 AM

special  chit chat with vanga pandu prasad rao - Sakshi

ఒక్క మాట చాలు... మనిషిని ఉద్యమ దండుగా మార్చేయడానికి! అలా.. దండు అయిన మనిషే.. వంగపండు. పొట్ట కోసం పని చేసుకునేవాడు ఆకలి తీరేందుకు ఆలోచించాలి కానీ... ఆకలి తీర్చేందుకు గొంతెత్తడం ఏంటి?! పాటకు ఉన్న దైవశక్తి అది. పదాలను అల్లి దేవుడికి దండ వేసినట్లు... పాటల్ని అల్లి ఉద్యమానికి వేసిన దండ ఇది!

పల్లె పదాలతో జనహృదయాలను ఆకట్టుకున్నారు. ఈ కళ దైవమిచ్చినదిగా భావిస్తారా?
ఇప్పటికీ నా అభివృద్ధి ఆగకుండా నడిపిస్తున్న శక్తిని దైవం అనే నమ్ముతాను. ఆ శక్తి నాలో ఉంది. అదే పాట రూపంగా వచ్చింది. అలాగని, పూజల పేరిట వృథాగా డబ్బు ఖర్చుపెట్టను. నా చిన్నతనంలో పంట నూర్పిళ్లప్పుడు రాత్రిపూట మా తాత వాళ్లు పొలం దగ్గరకి వెళితే నేనూ వాళ్లతో పోయేవాడిని. అప్పుడు మా తాత, నాయిన, పెదనాయిన దేవుళ్ల కథలు చెప్పేవారు. శివుడు, రాముడు, కృష్ణుడు గురించి చెబుతూ వాళ్లను తలుచుకుంటూ పడుకోమనేవారు. ఇన్నేళ్లయ్యాక కూడా ఇప్పుడు పడుకున్నాసరే నాటి సంఘటనలు, దేవుళ్ల కథలు అన్నీ గుర్తుకువస్తాయి,
     
జానపదం దైవం అయితే.. దారి ఉద్యమం వైపుగా ఎలా మళ్లింది?
మాది విజయనగరం జిల్లా పెదగొండపల్లి. పెరిగింది గ్రామీణ వాతావరణం. సామాన్య రైతు కుటుంబం. ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ముగ్గురు అన్నదమ్ములం. నేనే పెద్దవాడిని. చదువు పెద్దగా అబ్బలేదు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫెయిల్‌ కావడంతో బొబ్బిలిలో ఐటీఐ చేశాను. అప్పట్లో చైనా యుద్ధంలో పాల్గొనాలనే పిలుపు వస్తే, ఆ ట్రైనింగ్‌ తీసుకున్నా. ఆ యుద్ధం ఆగిపోవడంతో ఊరుబాట పట్టా. అప్పటికే మా నాన్న ఊళ్లో భూమి అమ్మేసి, రాయగఢ్‌లో కొన్నాడు. అక్కడ ఆయనకు వ్యవసాయంలో కొన్నాళ్లు తోడుగా ఉన్నా. ఆ భూమి అడవికి దగ్గరగా ఉండేది. దీంతో అక్కడి గిరిజనులతో పరిచయాలు.. వారి పదాలు నా పాటల్లో బాగా దొర్లాయి. ఈ పనుల్లో పడి తెలిసిన పల్లె పదాలతో తోచిన బాణీలు కట్టుకుని పాడుతుంటే ఊళ్లో అంతా ‘ఓరేయ్‌ కవీ’ అని పిలిచేవారు. అప్పట్లో అర్థంకాని పదాలు రాస్తేనే కవిత్వం అనుకునేవాడిని. నేనేదో లల్లాయ పదాలతో పాటలు అల్లుకుపోయేవాడిని. నాచేత పాటలు పాడించుకుని, సరదా పడేవారు. అంతవరకు సరదా సరదాగా గడిచిపోయింది. పెళ్లైన రెండేళ్లకు మొదలైన నక్సల్స్‌బరి ఉద్యమం నాలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఎక్కడ ఉన్నా సరే ఉద్యమమే. అదే జీవితమైంది. ఆ ఉద్యమంలో ఎంతోమందిని కలిశా, ఎందరి కష్టాలనో చూశాను. జనాన్ని జాగృతం చేయడానికి వాటన్నిటినీ పాటగా రూపుకట్టా. ఆ ఊపులో 400కు పైగా జాన పద పాటలు రాసాను. వాటిలో 200కు పైగా గీతాలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చాయి. నా పాటల్లో చాలావరకు దేశంలోని అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి.
     
మీ దైవానికి అదే మీ పాటకు 50 ఏళ్లు నిండాయి. అదే మీకు జీవన భృతిని కలిగించిందా?  
ఉద్యమంలోకి వెళ్లిన ఏడాదికే విశాఖ షిప్‌ యార్డులో ఫిట్టర్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగం కంటే ఉద్యమమే నాకు ఆత్మసంతృప్తినిచ్చేది. షిప్‌యార్డులో పని చేస్తూ ఉన్నా మనసంతా ఉద్యమం వైపే ఉండేది. దీంతో పదిరోజులు పనికెళ్లడం, ఇరవై రోజులు పాటలు పాడుకుంటూ ఊళ్లమ్మట పడి తిరగడం చేశా. అలా కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ , కర్ణాటక రాష్ట్రాలన్నీ తిరిగా. ఇలా తిరుగుతూ ఉంటే ఏమౌతుంది.. ఇంట్లో పూట గడవని స్థితి. ఒక పూట తింటే మరో పూట పస్తే! అయినా సరే నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. ఆరేళ్ల సర్వీసులో ఉన్నా తర్వాత  స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, పూర్తిస్థాయి ఉద్యమంలోనే ఉన్నాను.  

ఈ మార్గం సరైనది కాదని.. ఎప్పుడైనా అనిపించిందా?
చాలాసార్లు అనిపించింది. మధ్యతరగతి కుటుంబాలకు ఉద్యమాలు కరెక్ట్‌ కాదని అనుకున్నా. ఉద్యోగం వదులుకున్నప్పుడైతే పడిన మానసిక క్షోభ మాటల్లో చెప్పలేను. ఇంట్లో నలుగురు పిల్లలు, భార్య. వారికి కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేనప్పుడు ఈ ఉద్యమాలెందుకన్న ఆలోచన. బాగా మధనపడేవాడిని. మళ్లీ కొన్నాళ్లు సొంతూళ్లో వ్యవసాయం చేశాను. కలిసిరాలేదు. అన్నీ నష్టాలు. అప్పులు. ఆకలి బాధ కోసం ఆత్మాభిమానం చంపుకోకూడద నిపించింది. దీంతో మళ్లీ ఉద్యమం బాటే పట్టాను.

దైవం పాటగా మిమ్మల్ని పలకరించింది. ఆ పాట మిమ్మల్ని ఆదుకోలేదా?
అదే నన్ను బతికించింది. జనాల్ని ఉత్తేజపరిచే నా జానపద గీతాలు సినిమా వాళ్లనూ ఆకట్టుకు న్నాయి. దర్శకులు టి.కృష్ణ, ఆర్‌. నారాయణమూర్తిలతో పాటు మరికొందరు మా సినిమాలకు పాటలు రాయమని కోరారు. అలా 30 సినిమాల వరకు రాశాను. అలాగే ఆరేడు సినిమాల్లోనూ నటించాను. కొన్ని సినిమాలకు పాటలు రాసే అవకాశాలొచ్చినా జననాట్యమండలి నిబంధనలకు కట్టుబడ్డాను. వాటిని వదులు కున్నా. సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే నా జీవితం మరోలా ఉండేది.

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే శక్తిని, అదృష్టాన్ని దైవం కలిగించలేదని.. కోపం తెచ్చుకున్న సందర్భాలు...
అదృష్టం, దురదృష్టం వంటి పదాలను ఎప్పుడూ పట్టించుకున్నది లేదు. వాటి మీద నమ్మకమూ లేదు. ఇప్పటికైతే ఆస్తులూ లేవు, అప్పులూ లేవు. ఇది కావాలని కోరుకుంటూ ఎన్నడూ గుళ్లకు వెళ్లింది లేదు. కనపడని దైవాన్ని నిందించడం, కోపం తెచ్చుకోవడం అంటూ ఏముంటాయి. అప్పుడు మనలోని శక్తిని మనమే తిట్టుకున్నట్టు అవుతుంది కదా! దైవం, దైవత్వం అంటే ఆపదలో ఉన్నవాడికి సాటిమనిషిగా సాయపడటం అని నమ్ముతాను. అది నిజం కూడా! దీనికో ఉదాహరణ చెబుతాను.

ఆదిభట్ల కైలాసం అని నాకు మంచి మిత్రుడు. ఉద్యమకారుడు. నమ్మిన సిద్ధాంతం కోసం సెంటు భూమికూడా ఉంచుకోకుండా తనకున్న 150 ఎకరాలను నిరుపేదలకు రాసిచ్చేశాడు. ఆ భూములు పొందిన వారు ఇళ్లలో ఆయన్ని ఓ దేవుడిగా కొలుస్తారు. మూర్తీభవించిన మానవత్వానికి ఇంతకంటే ఉదాహరణ  ఉంటుందా? ఇలాంటి వారు మన కళ్లెదుటే చాలా మంది ఉంటారు. మనం గమనించం. ఎదుటివాడికి సాయపడమనే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ బోధిస్తున్నాయి. మనమేం చేస్తున్నాం వాటిని మతగ్రం«థాలుగానే చూస్తున్నాం.
     
మీ పిల్లలకు దైవాన్ని ఎలా పరిచయం చేస్తారు?
వారికి ఏ విషయంలోనూ ఎలాంటి ఆంక్షలు లేవు. భార్య, నలుగురు పిల్లలు. మీకు నచ్చిన దైవాన్ని పూజించుకోమంటాను. జనానికి దారి చూపిన మహనీయులను మాత్రం స్మరించుకోమంటాను. వారు చూపిన బాటలో పయనించమంటాను. ముగ్గురు కొడుకుల్లో ఒకరు టీచర్‌గా ఉంటే, ఇంకొకరు వ్యవసాయం చేస్తున్నాడు. చిన్నవాడు చదువుకుంటున్నాడు. అమ్మాయి ఉష నాలాగే పాటలు పాడుతూ నా వారసురాలు అనిపించుకుంది. జానపదకళ కాపాడాలంటే విద్యార్థి దశ నుంచే భావి తరాలకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఈ కళ అంతరించిపోకూడదని, తెలిసిన ఈ కళను నా తుది శ్వాస వరకు పదిమందికి చేరువచెయ్యాలన్నదే నా తపన.

మీ పాటలోనూ, సాయపడేవారిలోనూ దేవుడిని చూసే మీరు దైవం మీదా పాటలు కట్టారు..?
నాకు చిన్నప్పటి నుంచి శివుడంటే ఇష్టం. ఆయన చాలా సింపుల్‌గా ఉంటాడు. జంతు చర్మం కట్టుకుంటాడు. శ్మశానంలో తిరుగుతాడు. పిలవగానే పలుకుతాడని పేరు. ఆయన ది సామాన్యుల జీవితం. అందుకే చాలామంది శివుడ్నే కొలుస్తారు. అమ్మవారి మీదా, శివుడి మీదా .. ‘ఓమ్‌ ఉమాశంకరా .. వందిత పురంధరా.. హిమాచలాద్రి మందిరా.. ’ అంటూ చాలా పాటలు పాడాను. శివయ్య బుర్ర కథలకూ బాణీలు కట్టా. అలాగని, ఏనాడూ శివాలయానికి వెళ్లిందీ లేదు. ఇప్పుడు కూడా శ్రీకాకుళంలోని ఓ పల్లెటూరులో ‘శివకోలలు’ అని పండుగ జరుగుతుంది. దీనికి నన్ను అతి«థిగా పిలిచారు. ఇక్కడ వేదిక మీద జానపద పాటలు పాడాలి. అన్నింటితో పాటు శివుడికి సంబంధించిన పాటలూ ఉంటాయి. దైవం అంటే భక్తి ఉండాలా, భయం ఉండాలా.. అంటే భక్తే ఉండాలంటాను. ఎందుకంటే మనం నమ్మి భక్తిగా ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుంది. భయంతో ఏ పని చేసినా ఫలితం దక్కదు. 
– పంపన వరప్రసాదరావు, సాక్షి, విశాఖపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement