అది... నా గర్ల్‌ఫ్రెండ్! | special chit chat with hero akhil | Sakshi
Sakshi News home page

అది... నా గర్ల్‌ఫ్రెండ్!

Published Thu, Nov 5 2015 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

అది... నా గర్ల్‌ఫ్రెండ్!

అది... నా గర్ల్‌ఫ్రెండ్!

ఇంకొక పవర్‌ఫుల్ వారసుడు వచ్చాడండోయ్.
 
అఖిల్ దిపవర్ ఆఫ్ జువ
 
హీరోగా ‘అఖిల్’ ఎంట్రీకి స్వాగతం. ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి చాలా కసరత్తులు చేసినట్లున్నారు!
 అఖిల్: నిజమే. ‘మనం’ సినిమాలో చిన్న పాత్ర చేసిన తరువాత నేను ఒక జోన్‌లోకి వెళ్ళిపోయా. ఎలాంటి సినిమాలో పూర్తి స్థాయి పాత్ర చేయాలని తర్జనభర్జన పడ్డా. చాలా స్క్రిప్టులు విన్నా. చాలామంది దర్శకుల్ని కలిశా. ఆ టైమ్‌లో నాకు వినయ్ (దర్శకుడు వినాయక్) గారిలో కాన్ఫిడెన్స్, క్లారిటీ కనిపించింది. పైగా ఆయన ఎంచుకున్న ఇలాంటి స్క్రిప్ట్‌తో ఈ మధ్య ఎవరూ తీయలేదు. ఇలాంటి సినిమాతో హీరోగా వస్తే బాగుంటుందనిపించింది. పైగా, వినయ్ గారు మోస్ట్ సేఫ్ అండ్ కమర్షియల్ డెరైక్టర్. అందుకే, ఈ స్క్రిప్ట్‌తో ముందుకొస్తున్నాం.

సర్వసాధారణంగా హీరోగా తొలి సినిమా... అందులోనూ మీ లాంటి కుర్రాళ్ళ మీద అంటే ప్రేమకథ తీస్తారు. భారీ ప్రాజెక్ట్
భుజానికెత్తుకున్నారు. బరువనిపించలేదా?

అఖిల్:  ఫలానా రకం సినిమా చేయాలని ముందే ఏమీ అనుకోలేదు. నా మనసుకు నచ్చాలి అనుకున్నా. ఈ స్క్రిప్ట్ నచ్చింది. ఎమోషనల్‌గా ఫీలయ్యా. అంతే... లవ్‌స్టోరీనా, యాక్షనా - అని చూసుకోలేదు. ఎప్పుడైనా ‘యు హ్యావ్ టు ఫాలో యువర్ హార్ట్’ కదండీ!

ఏ    మీ నాన్న గారి సలహాలు, సూచనలూ ఫాలో అయ్యారా?
 అఖిల్: కచ్చితంగా. నేనెప్పుడూ ఆయన ఎడ్వైజ్ తీసుకొంటా. ఈ కథ నాకు నచ్చాక, ఆయనకు కూడా వినిపించాం. ఆయన తన సూచనలు చెప్పారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని, షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు 8 నెలలు స్క్రిప్ట్‌పై వర్క్ చేశాం. అప్పుడు షూట్‌కు వెళ్ళాం.
 
ఈ సినిమాతో వినాయక్‌లో కొత్త స్టైల్‌ను చూస్తామన్నారు.

 అఖిల్: ఆయన గత చిత్రాలతో చూస్తే, ఈ సినిమా కమర్షియల్‌గా ఉంటూనే కొత్తగా అనిపిస్తుంది. ట్రీట్‌మెంట్ కూడా ఎప్పుడూ ఉండే వినాయక్ సినిమాల పద్ధతిలో ఉండదు. పైగా, కొత్త టీమ్‌తో పనిచేయడం వల్ల వినయ్ గారి సినిమాకు ఫ్రెష్ లుక్ వచ్చింది. అందుకే, ‘అఖిల్’ను తెరపై డిస్కవర్ చేసే క్రమంలో తనను తాను రీ-డిస్కవర్ చేసుకున్నానని ఆయనే నాతో అన్నారు. ప్రతి రోజూ ఇక్కడ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాల్సిన ఈ రంగంలో ఆయన ఆ మాట అనడం హ్యాపీగా ఫీలయ్యా.

క్రికెటర్ కావాల్సింది యాక్టరైనట్లున్నారు. అజరుద్దీన్, అంబటి రాయుడులా మరో మంచి క్రికెటర్‌గా వస్తారనుకున్నామే!
 అఖిల్: (నవ్వుతూ...) సినిమాలు వదిలేసి, క్రికెట్‌కు వెళ్ళిపొమ్మంటారా ఏమిటి! నిజానికి, క్రికెట్ నాకు బాగా ఇష్టం. ప్రొఫెషనల్‌గా క్రికెట్ నేర్చుకొని, ఆడాలనుకున్నా. దాన్ని సీరియస్‌గా తీసుకున్నా. అంతే తప్ప, నేషనల్ క్రికెటర్‌ను అవ్వాలనో, ఆ రంగంలో స్థిరపడాలనో ఎప్పుడూ అనుకోలేదు. నాకెప్పుడూ యాక్టింగ్ మీదే ఇంట్రస్ట్. పైగా, అక్కినేని లాంటి పెద్ద సినీ కుటుంబంలో పుట్టినప్పుడు మనకు తెలియకుండా చిన్నప్పుడే ‘నటన’ అనే పురుగు కుట్టేస్తుంది. అందుకే, ‘నువ్వేమవుతావు’ అని అడిగినప్పుడు ‘ఇంకేమవుతా... యాక్టర్‌నవుతా’ అని చెప్పేవాణ్ణి.

కానీ అప్పట్లో ఆస్ట్రేలియాకు వెళ్ళి మరీ క్రికెట్ నేర్చుకున్నారుగా!
 అఖిల్: స్పోర్ట్స్ అంటే మొదటి నుంచీ నాకు ఇంట్రస్ట్. మన దగ్గర సౌకర్యాలు తక్కువ. కానీ, ఆస్ట్రేలియాలో అన్నీ ఉంటాయి. మా అమ్మ వాళ్ళ అన్నయ్య అప్పట్లో ఆస్ట్రేలియాలోని ‘నూసా’ అనే చోట ఉండేవారు. నా చిన్నప్పుడు సెలవులకు అమ్మ వాళ్ళతో కలసి వెళ్ళి, అక్కడ రెండు వారాలున్నా. ఆ ప్లేస్ నచ్చి, అక్కడే చదువుకుంటానన్నా. ఇంట్లో సరే అన్నారు. అలా పెర్త్‌లో అందరూ మగపిల్లలే ఉండే బోర్డింగ్ స్కూల్‌లో రెండేళ్ళు చదువుకున్నా. ఆ స్కూల్‌లో మధ్యాహ్నం 3 దాకా చదువులు. ఆ తరువాతంతా క్రికెట్ శిక్షణ. నేను రైట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ని. రైట్ ఆర్మ్ పేస్ బౌలర్‌ని. ఆస్ట్రేలియా క్రికెటర్ టామ్ మూడీ మా స్కూల్‌లోనే చదివారట!

సినిమాల్లోకి రావడానికీ బాగా శిక్షణ తీసుకున్నట్లున్నారు!
 అఖిల్: అవునండీ! అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో బిజినెస్ స్టార్ట్ చేశా. ఏడాది తరువాత అది డిస్‌కంటిన్యూ చేసి, యాక్టింగ్‌లో రెండేళ్ళ పాటు డిప్లమా కోర్స్ చదివా. అప్పట్లో చాలా బిడియంగా ఉండేవాణ్ణి. ఆ షెనైస్ పోవడానికీ, మనసు విప్పి ఫ్రీగా అందరితో మాట్లాడడానికీ ఆ శిక్షణ ఉపయోగపడింది. అక్కడ థియేటర్ పెర్ఫార్మెన్స్‌లు వగైరా చేసి, కాన్ఫిడెన్స్ పెంచుకున్నా.

మరి ఫైట్స్, డ్యాన్స్‌ల మాటేమిటి?
అఖిల్: ఫైట్స్ విషయానికొస్తే, థాయిలాండ్‌లోని ‘కిచ్చా’ మాస్టర్ (‘ఇద్దరమ్మాయిలతో’, ‘కత్తి’ సినిమాల ఫేమ్) దగ్గర రెండు నెలలు సినిమా తరహా ఫైట్స్, రోప్ వర్క్ లాంటివి నేర్చుకున్నా. పంచ్‌లు రియల్ అనిపించేలా కనిపించడానికి ఏం చేయాలో తెలుసుకున్నా. ఇక, సినిమాకు కావాల్సిన మూడు, నాలుగు స్టైల్స్ ఆఫ్ డ్యాన్సెస్ కొంత నేర్చుకున్నా. ‘అఖిల్’ ప్రారంభం కావడానికి మూడు నెలల ముందు నుంచి సీరియస్‌గా ప్రాక్టీస్ చేశా. గణేశ్, శేఖర్, జానీ మాస్టర్ల దగ్గర ఎక్కువ నేర్చుకున్నా.

ఒక పాటకు మీ స్టెప్పులు చూసి, నాన్నగారు థ్రిల్లయ్యారట?
 అఖిల్: ఆ ఇంట్రడక్షన్ పాటకి సెట్స్ వేశాం. చేయగలిగినదంతా చేశాం. మామూలుగా మూడున్నర నిమిషాల పాటలుంటాయి. హై ఎనర్జీతో సాగే ఆ పాట 5 నిమిషాలుంటుంది. అంతా డ్యాన్స్... డ్యాన్స్. పన్నెండు రోజులు షూట్ చేశాం. అది చూసి నాన్న చాలా మెచ్చుకున్నారు.

‘అఖిల్’లో కొత్తమ్మాయి సాయేషా ఎంపిక వెనక కారణం?
అఖిల్:  కథానాయిక పాత్ర కోసం ముగ్గురు, నలుగురు అమ్మాయిలతో నాకు టెస్ట్ షూట్ చేశారు. వాళ్ళందరిలోకీ బెస్ట్ - సాయేషానే. దిలీప్‌కుమార్ సతీమణి సైరాబానుకు మనుమరాలి వరస ఆమెది. ముంబయ్‌లోని క్యాస్టింగ్ ఏజెంట్ల ద్వారానే నిర్మాతలు ఆమెను చూశారు. లుక్ టెస్ట్ చేయగానే పర్‌ఫెక్టనిపించింది. ఒక్కరోజులో ఓకె చెప్పాం.

కెమేరా ముందు మీరూ కొత్తే. అమ్మాయీ కొత్తే. మరి మీ మధ్య లవ్ కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి ఏం చేశారు?
 అఖిల్: ‘అఖిల్’ అవుట్ అండ్ అవుట్ లవ్‌స్టోరీ కాదు. సినిమాలో హై పాయింట్స్, ఎలివేటింగ్ ఎపిసోడ్స్, యాక్షన్ ఉంటాయి. ‘ఏం మాయ చేశావే’ లాంటి లవ్‌స్టోరీ అయితే, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇందులో ఆ అవసరం లేదు. కానీ, తెరపై మా జంట బాగుంటుంది. షి ఈజ్ వెరీ గుడ్ డ్యాన్సర్.

‘అఖిల్’ సోషియో - ఫ్యాంటసీ సినిమా అనీ...
 అఖిల్: (అందుకుంటూ...) అలా కాదు. అన్‌నోన్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. రియల్‌గా మనం చూస్తున్నవే ఉంటాయి. సూర్యుడు, సౌరశక్తి లాంటివాటి చుట్టూ ఆసక్తిగా సాగుతుంది. అందుకే, ‘ది పవర్ ఆఫ్ జువ’ అని క్యాప్షన్ పెట్టాం. ‘జువ’ అంటే సూర్యుడని అర్థం.  

సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసినప్పుడు మీ మానసిక స్థితి?
 అఖిల్: (గంభీరంగా మారి...) మానసిక ఒత్తిడి అనిపించింది. బాగా బాధపడ్డా. కానీ, అన్నీ మన చేతుల్లో ఉండవుగా. వాయిదా పడడం కూడా మంచికే జరిగింది. ఇప్పుడు మరింత బెటర్ ప్రొడక్ట్‌తో ముందుకొస్తున్నాం.

అప్పుడు గ్రాఫిక్స్ తృప్తిగా రాలేదన్నారు. ఇప్పుడు తృప్తేనా?
 అఖిల్: చూడండి. గ్రాఫిక్స్ విషయంలో యు కెన్ నెవర్ బి శాటిస్‌ఫైడ్. వాటిని ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా మెరుగుపరుస్తూనే పోవచ్చు. ‘బాహుబలి’ ఆలస్యానికి కూడా కారణం అదే! ఒకే ఎఫెక్ట్ మీద రెండు నెలలు, రెండేళ్ళు, ఇరవయ్యేళ్ళు కూడా వర్క్ చేస్తూనే పోవచ్చు. కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది మనం తెరపై సృష్టించే వాతావరణం. ‘అఖిల్’లో అవన్నీ ప్రేక్షకుల్ని అలరిస్తాయి.

షూటింగ్‌లో మీ కష్టం చూసి తల్లి మనసు తల్లడిల్లిందా?
 అఖిల్: (నవ్వుతూ...) నేనేమీ... చచ్చిపోయేలా కష్టపడలేదండీ! బాగా కష్టపడి వచ్చినప్పుడు, నొప్పులు పోవడానికి మా అమ్మ ఐస్ బ్యాగ్ ఇచ్చేది. నటుడిగా నిరూపించుకోవడానికి నా కృషి, శ్రమ చూసి అమ్మ సంతోషించింది.  

అందరితో ఎప్పుడూ బాగా మాట్లాడే మీ అమ్మ గారు ఆడియో రోజున వేదికపై మాట్లాడడానికి మొహమాటపడ్డట్లున్నారు!
 అఖిల్: అవునండీ. షి ఈజ్ ఫీలింగ్ షై. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ, ఫ్యాన్స్‌కు ఉత్తేజం ఇవ్వాలి. అమ్మ అంత తెలుగు మాట్లాడలేదు. పైగా, మహేశ్, నాన్న, అన్నయ్య అంత మాట్లాడాక అమ్మ ఏం మాట్లాడుతుంది! అయినా, సినిమా ప్రారంభం రోజునే ‘మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నా’ అని ఫ్యాన్‌‌సకి చెప్పేసిందిగా!

అక్కినేని కుటుంబ వారసుడిగా ఒత్తిడి చాలా ఉంటుందిగా..
 అఖిల్: నేనే కాదు... ఒక స్టార్ కుటుంబం నుంచి వచ్చే ఎవరికైనా ఆ ప్రెజర్ ఉంటుంది. పాతికేళ్ళ తరువాత మహేశ్‌బాబు గారబ్బాయి గౌతమ్ హీరోగా వచ్చినా... అంతే! ఎందుకంటే, ఒకప్పటి కన్నా ఇప్పుడు మీడియా పెరిగింది. ప్రచారం బాగా వస్తోంది. అంచనాలు పెరిగిపోతాయి. అంతెందుకు... నాపై, నా సినిమాపై ఇంతగా అంచనాలొస్తాయని ఊహించలేదు. కానీ, ఏ స్టార్ కిడ్‌కైనా ఈ ఇబ్బంది తప్పదు. తట్టుకొని ముందుకెళ్ళాల్సిందే!

కానీ, సినిమాకు మీ పేరే పెట్టడం మరీ ‘నార్సిసిజమ్’ (స్వయంప్రేమ, ఆత్మస్తుతి) అనిపించలేదా?
అఖిల్: (గంభీరంగా...) మీకు అలా అనిపించిందా?

అనిపించడమెలా ఉన్నా కొందరి గుసగుసలు వినిపించాయి!
 అఖిల్: ఈ సినిమాలో నా పాత్ర పేరు కూడా అఖిల్. అదే సినిమాకూ పెట్టాం. దానికి మంచి రెస్పాన్సొచ్చింది.

బ్లాక్‌బస్టర్ ఇస్తానన్నమాట నిలబెట్టుకొనే రోజొచ్చినట్లుంది.
అఖిల్: (నవ్వుతూ...) బ్లాక్‌బస్టర్ హిట్ కోరుకుంటున్నానని చెప్పా. అందు కోసమే అందరం శ్రమించాం. ప్రేక్షకుల ఆశీర్వాదమే ఇక మిగిలింది. హోపింగ్ ఫర్ ది బెస్ట్.

ఇంతకీ, ఒక నటుడిగా ఇప్పుడు మీరు పెట్టుకున్న లక్ష్యం!
అఖిల్:  తొలి నాలుగైదు సినిమాలూ చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ మూడేళ్ళూ ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేస్తా.   

మరి, ‘అఖిల్’ తరువాతి ప్రాజెక్ట్ ఏమిటి?
 అఖిల్: ఆలోచనలు చాలా ఉన్నాయి. కానీ, అన్నీ ప్రస్తుతం ఆపి పెట్టా. ఇప్పుడు దృష్ట్టంతా ‘అఖిల్’ మీదే!

మీ లుక్స్, స్టైల్ బాలీవుడ్‌కి సూపర్. మీకూ ప్లాన్లున్నాయట?
అఖిల్: (నవ్వేస్తూ...) చాలా ప్లాన్స్ ఉన్నాయి. కానీ, ముందుగా నేను తెలుగు వాణ్ణి. మన దగ్గర ముందు బాగా పేరు తెచ్చుకోవాలి. ఆ తరువాతే ఏదైనా!
 
ఇప్పటికీ నైట్ క్రికెట్ ఆడతాం!
 సినిమాల్లోకొచ్చినా క్రికెట్ మీద ఇప్పటికీ అదే ఇంట్రస్ట్. ఫ్రెండ్స్‌తో ఇప్పటికీ మాకు టీమ్ ఉంది. ఇప్పటికీ హైదరాబాద్‌లో రాత్రి ఫ్లడ్‌లైట్స్‌లో సీరియస్‌గా ఆడతాం. అదెక్కడన్నది అడక్కండి (నవ్వులు..)
 
చాలా ‘క్రష్’లు ఉన్నాయి!

గర్ల్‌ఫ్రెండ్స్, లవర్స్ లేరు. కానీ అందరి లానే నాకూ చిన్నప్పటి నుంచి చాలామంది మీద ‘క్రష్’లు (తెలియని ఆకర్షణ) ఏర్పడ్డాయి. నాకు ప్రపోజ్ చేసినవాళ్ళూ ఉన్నారు. అవన్నీ అందరి లైఫ్‌లో ఉండేవే.
 
దీపికా పదుకొనే కనపడితే...
దీపికా పదుకొనే అంటే చాలా ఇష్టం. కలవలేదు కలిస్తే ‘అయామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు’ అని చెప్పేస్తా. ఆమె సినిమాల్లో ‘పీకూ’, ‘యే జవానీ హై దివానీ’ ఇష్టం. ఆమె నటన సహజంగా ఉంటుంది.
 
తాత గారిలో అది నచ్చేది!

తాత గారిని చూసి, విని, గమనించి ఎన్నో తెలుసుకున్నా. ముఖ్యంగా, అవతలి వ్యక్తి హోదాతో సంబంధం లేకుండా అందరితో ఆదరంగా మాట్లాడేవారు. అది నేనూ అలవరచుకోవాలని ఉంది.
 
స్నేహమేరా జీవితం!
కెరీర్ ఎంత ముఖ్యమో, పర్సనల్ లైఫ్, స్నేహం అంతే ముఖ్యమని నా అభిప్రాయం. ఎమోషనల్‌గా డిపెండ్ అవడానికీ, మనసులో మాట పంచుకోవడానికీ మంచి స్నేహితులు కావాలి. ఫ్రెండ్‌‌స లేకుండా నేనుండలేను. సినీ పరిశ్రమలో నితిన్ నా బెస్ట్ ఫ్రెండ్. రామ్‌చరణ్ కూడా మంచి ఫ్రెండ్. అయితే, అవుట్‌సైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీనే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. అలా నలుగురు మంచి ఫ్రెండ్స్ చాలాకాలంగా ఉన్నారు. షూటింగ్ లేకుండా నేను ఖాళీగా ఇంట్లో ఉన్నానూ అంటే... వాళ్ళలో కనీసం ఒకరైనా మా ఇంట్లో ఉండాల్సిందే. వాళ్ళతోనే నా కాలక్షేపం.
 
మేమిద్దరం ఆ క్యాంప్‌లో కలిశాం!

నా వెంటే కనిపించే రతుల్ నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకడు. క్రికెట్ ఆడుతున్న రోజుల నుంచి పరిచయం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ) పెట్టిన క్యాంప్‌లో కలిశాం. అప్పటి నుంచి మా బంధం బలపడింది. మా జర్నీ సాగుతోంది.
 
 వాళ్ళంతా భలే స్వీట్!
 ‘అఖిల్’ ఆడియో లాంచ్‌కి మై బిగ్గెస్ట్ హీరో సచిన్ టెండూల్కర్‌తో సహా ప్రముఖులు నాకు బెస్ట్ విషెస్ చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. అమితాబ్‌జీ అంటే మా కుటుంబం మొత్తానికీ ఎంతో గౌరవం. ఆయనా మాట్లాడారు. ఒక ఫంక్షన్‌లో కలిసిన సల్మాన్‌ఖాన్ భాయ్ అయితే, ట్రైలర్ లాంచ్ చేస్తానంటూ సపోర్ట్‌గా నిలిచారు. మహేశ్‌బాబు గారైతే, ఆడియోకి వీడియోలో మాట్లాడమని అడిగితే, ‘స్వయంగా వస్తా’ అంటూ ఫంక్షన్‌కొచ్చారు. ఇలాంటి పెద్దవాళ్ళ మంచి మనసు, ప్రవర్తన స్వీట్‌గా అనిపించింది.
 
 రీమేక్ చేయను! రీమిక్స్ అనుకున్నా!
 తాత గారి సినిమాల్లో ‘దొంగరాముడు’, నాన్న గారి సినిమాల్లో ‘హలో బ్రదర్’ ఇష్టం. కానీ, ఏదీ రీమేక్ చేయను. జనం మెచ్చిన ఆ కథలు, సినిమాలను చెడగొట్టడం నాకిష్టం లేదు. కాకపోతే, ఒక హిట్ పాట ఈ సినిమాలో రీమిక్స్ చేయాలని అనుకున్నాం. కానీ, చివరకు వద్దనుకున్నాం.

 నేనే షూట్ చేసి, డబ్బింగ్ చెప్పేవాణ్ణి!
 తెలుగు నేర్చుకున్నా. చదవడం, రాయడం వచ్చు. మీ పేపర్, ఈ ఇంటర్వ్యూ చదువుతా! (నవ్వు...) కానీ, నటించడం ఒక ఎత్తు. డబ్బింగ్ చెప్పడం ఇంకో ఎత్తు. ఎవరైనా సరిగ్గా మాట్లాడలేకపోతే తెరపై చూస్తున్నప్పుడు నాకు చిరాకు అనిపించేది. అందుకే, ఉచ్చారణపై పట్టు కోసం కష్టపడ్డా. నేనే కొన్ని సీన్స్ షూట్ చేసుకొని, అన్నపూర్ణా స్టూడియోలో వాటికి డబ్బింగ్ చెప్పుకొనేవాణ్ణి. సీన్ రాసుకొని, వాయిస్ ఓవర్‌లా ఎమోషన్స్‌తో పలికేవాణ్ణి. దర్శకుడు దేవా కట్టా నాకు హెల్ప్ చేశారు.
 
నాతో నేను గడుపుతా!

 షూటింగ్ లేకపోతే లేట్‌గా నిద్ర లేస్తా. ఏ పనీ చేయకుండా, అలా మ్యూజిక్ వింటూ, టీవీ చూస్తూ ఉంటా. అలా ఏమీ చేయకుండా, టీవీ చూడడం కూడా నాకు రిలాక్స్ అవడమే! ఎక్కువగా నాతో నేను గడుపుతా.
 
 బ్లాక్ అండ్ ఎయిట్!

 నేను పుట్టింది 1994 ఏప్రిల్ 8న. అందుకే, నంబర్ 8 అంటే నాకు ఫేవరెట్. నా ట్విట్టర్ ఎకౌంట్ కూడా ‘అఖిల్ అక్కినేని8’ అని ఉంటుంది. ఇక, నాకిష్టమైన కలర్ బ్లాక్. ఆ రంగు డ్రెస్‌లెక్కువ వేసుకుంటా.
 
 అమ్మాయిల్లో నచ్చేది...

 అఫ్‌కోర్స్... అందం, ఆకర్షణ ఉండాలని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అమ్మాయిల్లో నాకు బాగా నచ్చేది - జెన్యూనిటీ. మాటలో, మనిషిలో నిజాయతీ ఉంటే... నేను కనెక్ట్ అవుతాను.
 
 అది... నా గర్ల్‌ఫ్రెండ్!
 అన్నయ్యకు బైక్‌లంటే ఇష్టం. నాకు వాచ్‌లంటే చాలా ఇష్టం. మా ఇంట్లో చాలా వాచ్‌లున్నాయి. అదో పెద్ద కలెక్షన్. బ్రాండ్స్ పేరు చెప్పను కానీ, నిజం చెప్పాలంటే, (చేతికి ఉన్న గడియారాన్ని కదుపుతూ...) మై వాచ్ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్!

 

 - రెంటాల జయదేవ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement