ఏదీ ఇంకోసారి అనూ! | special chit chat with hreoine anushkasharma | Sakshi
Sakshi News home page

ఏదీ ఇంకోసారి అనూ!

Published Thu, Jul 16 2015 10:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఏదీ ఇంకోసారి  అనూ! - Sakshi

ఏదీ ఇంకోసారి అనూ!

ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా సినిమా తీద్దామనుకుంటే హీరోయిన్ విషయంలో మాత్రం ‘అనుష్కాశర్మ అయితే బాగుంటుంది’ అని అనుకుంటున్నారు. దానికి అనుష్కా శర్మ డేట్స్ చూసేవాళ్లు మాత్రం ‘ఏదీ ఇంకోసారి అనూ’ అని కస్సుమంటున్నారు! మేడ మ్ డేట్‌లు అంత టైట్‌గా ఉన్నాయి.డేట్ అంటే విరాట్ కొహ్లీతో కాదు. డేట్ అంటే లిప్‌లాక్ సీన్ కోసం కాదు. డేట్ అంటే ఖర్జూర పండు కాదు. డేట్ అంటే అసలైన, సిసలైన సినిమా డేటు. డైరీ ఫుల్. కాల్షీట్స్ నాట్ అవైలబుల్. నో డేట్స్ ప్లీజ్. ఎంత కాళ్లావేళ్లా పడినా... ‘ఏదీ ఇంకోసారి అనూ’ అని మేనేజరు రుసరుసలాడుతున్నాడు.
 
ఇంటర్వ్యూ మొదలైంది.
విలేకరి: విరాట్ కోహ్లీతో..
అనుష్క: ఈ సోఫా చాలా బాగుందండీ.
విలేకరి: విరాట్...
అనుష్క: మీ స్టూడియో కూడా చాలా బాగుంది.
విలేకరి: విరా...
అనుష్క: మీ జర్నలిస్టులకు జీతాలు కూడా బాగుంటాయనుకుంటాను.
విలేకరి: సరే. వేరే ప్రశ్న అడుగుతాను.
అనుష్క: ఆ పని చేయండి.
    
ఇప్పటికి పదకొండు సినిమాలు చేసిన నటికి ఒక క్రికెటర్‌తో తప్ప మరో ఉనికి లేకపోవడం ఎంత విషాదం. ఆర్మీ కుటుంబంలో పుట్టింది. బెంగుళూరులో పెరిగింది. మోడలింగ్ చేసింది. ముంబైలో ఆ రంగంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో పోరాటాలు చేసింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ వాళ్లు ఆడిషన్స్‌కు పిలిస్తే ఒక రోజంతా పడిగాపులు కాసి చివరకు షారూక్‌ఖాన్ పక్కన నువ్వే హీరోయిన్ అని చెప్తే అవునా అని ఆశ్చర్యపోయింది. బ్యాండ్ బాజా బారాత్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చింది. పికె లాంటి సూపర్ డూపర్ మెగా గిగా హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రొడ్యూసర్‌గా ‘ఎన్‌హెచ్ 10’ వంటి కొత్త తరహా సినిమా చేసింది. ఇన్ని చేయగా ఇంటర్వ్యూలో కూచుని విరాట్... అనగానే మండదూ.  చెంప పగుల కొట్టాలనే కోపం రాదూ?
    
చాలా ఉంటుంది జీవితంలో..
మన ఎదురుగా నవ్వుతూ ఉన్న వాళ్ల వెనుక చాలా పోరాటం కూడా ఉంటుంది. దానిని తెలుసుకోవాలి. 2008లో ‘రబ్ నే బనాదీ జోడీ’ రిలీజ్ అయ్యింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ నిర్మించిన సినిమా అది. హీరో షారూక్. డెరైక్టర్ ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ వంటి చరిత్రాత్మక హిట్ ఇచ్చిన ఆదిత్య చోప్రా. హీరోయిన్ అనుష్కా శర్మ. ఇక పెట్టుకోవడానికి డౌట్స్ ఏముంటాయి? సినిమా రిలీజ్ అవుతుంది. తను సూపర్‌స్టార్ అవుతుంది. అంతే అంచనా. సినిమా రిలీజ్ అయ్యింది. కాని అనుకున్నంత ఆడలేదు. తన నటన బాగుంది. కాని అనుకున్నంత పేరు రాలేదు.
 
ఎట్‌లీస్ట్ బెస్ట్ డెబ్యూ అవార్డ్ వస్తుందని ఆశించి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫంక్షన్‌కు వెళ్లింది. లోకంలో పోటీ ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది. అండ్ అవార్డ్ గోస్ టూ.... అసిన్. అదే సంవత్సరం రిలీజ్ అయిన గజనీ ముందు ప్రేక్షకులకు అనుష్క పట్ల మరుపు వచ్చేసింది.కాన్ఫిడెన్స్ మొత్తం పోయే సందర్భం అది. జనంలో కూచుని ఏడిస్తే బాగుండదని స్టేజ్ వెనక్కు వెళ్లి ఏడుస్తూ ఉంది. ఇంతలో ఒక సీనియర్ నటుడు అవార్డు తీసుకుని వెళుతూ ఆమెను చూసి ఆగాడు. ‘అనుష్కా?’... ఆశ్చర్యపోతూ చూసింది.

‘నీ సినిమా చూశానమ్మా. చాలా బాగా చేశావ్. ఈ మధ్య అంత స్థిరంగా కనిపించిన నటనను చూడలేదు. కీప్ ఇట్ అప్’.... క్షణం క్రితం ఏ అవార్డూ లేదు. ఇప్పుడు ఇంతకు మించిన అవార్డు లేదు. మరి కాంప్లిమెంట్ చేసింది ఎవరు? అమితాబ్ బచ్చన్.
    
యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో మూడు సినిమాల కాంట్రాక్ట్‌లో రెండు వీగిపోయాయి. ఒకటి రబ్‌నే బనాదీ జోడీ. రెండు బద్మాష్ కంపెనీ. ఇక లాస్ట్ చాన్స్. బ్యాండ్ బాజా బారాత్. హీరో కూడా పెద్ద చెప్పుకోదగ్గ వాడు కాదు. రణ్‌వీర్ సింగ్. ఎలాగోలా చేసేసి మళ్లీ మోడలింగ్‌కు వెళ్లిపోదామా? అప్పుడే జయ్‌దీప్ సహానీ ఫోన్ చేశాడు. చక్ దే ఇండియా, ఖోస్లా కా ఘోస్లా, కంపెనీ వంటి హిట్ సినిమాల రచయిత అతడు.

అనుష్కా... నీ బద్మాష్ కంపెనీ చూశాను. కొన్ని చోట్ల నువ్వు రిలాక్స్ అయిపోయావ్. ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. సినిమా హీరోను మోస్తుంది. హీరో సినిమాను మోస్తాడు. కాని హీరోయిన్ మాత్రం తనను తాను మోసుకోవాలి. నువ్వు ఇచ్చే ప్రతి షాట్ ఇదే నా ఆఖరి షాట్ అన్నట్టుగా చేయి. ఇంకో సినిమా లేదు అన్నంత బాగా పని చేయి. నిలబడతావు అన్నాడు.

ఎంత గొప్ప సలహా. పాటించింది. బ్యాండ్ బాజా బారాత్ సూపర్ హిట్. డెరైక్టర్, హీరో... కాస్తో కూస్తో పేరు గడించారు. కాని అసలు పేరంతా అనుష్కా శర్మకే. ఇది పెద్ద ఇరకాటమే. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఒక రోల్ ఆఫర్ చేసింది. హీరో షారూక్ ఖాన్. కాని తను హీరోయిన్ కాదు. రెండో హీరోయిన్. మొదటి హీరోయిన్ కత్రీనా కైఫ్. వద్దు అంటే తన మాతృసంస్థ. చేస్తానంటే బయట తన పని అయిపోయింది అనే పుకార్లు. కత్రీనా పక్కన తను అస్సలు కనిపించదు అని కూడా సెటైర్లు  తనకు ధ్యానం చేయడం అలవాటు. ఆరోజు ధ్యానం చేసి నిర్ణయం తీసుకుంది.

 ఎదుటివాళ్లు నీ గురించి ఏమనుకుంటున్నారనేదాని కంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావన్నదే ముఖ్యం. కత్రినా ఉందా షారూక్ ఖాన్ ఉన్నాడా అన్నది ముఖ్యం కాదు. నీకిచ్చిన రోల్‌ను నువ్వు సరిగ్గా చేయగలిగావా లేదా అన్నదే ముఖ్యం. నువ్వు చేయగలవా? చేయగలను అని అంతరాత్మ సమాధానం చెప్పింది. ఆ సినిమా చేసింది. అనుష్క మంచి పాత్రలు చేయగలదు అని పేరు తెచ్చుకుంది.
    
అనుష్కాకు నగలు కొనడం, చీటికి మాటికి దుబాయ్‌కు వెళ్లి షాపింగ్ చేయడం తెలీదు. బోర్. తను నటి కాబట్టి అద్దంలో చూసుకోవాలి తప్పదు. కాని తన పక్కన ఉన్న మగాడు కూడా అస్తమానం అద్దంలో చూసుకునేవాడే అయితే? చాలా బోర్. అందుకే సాటి నటులతో డేటింగ్ పెట్టుకోదు. ముఖ్యంగా బాత్‌రూమ్‌లో ఫేస్‌వాష్ క్రీమ్ పెట్టుకునే మగాళ్లంటే ఆమెకు అసహ్యం. తనకు ఆర్థికంగా ఇండిపెండెంట్‌గా ఉండటం ఇష్టం. నిజానికి ప్రతి స్త్రీ అలాగే ఉండాలని కోరిక. అలాంటి ప్రతి స్త్రీని గౌరవించి ఆమెకు మద్దతు పలికే మగాళ్లతో ఈ ప్రపంచం నిండాలని కూడా కోరిక. అన్నయ్యతో కలిసి సొంత నిర్మాణ సంస్థ స్థాపించడం వెనుక కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌లంటే ఉత్త తోలుబొమ్మలు కాదు అని నిరూపించాలనే తాపత్రయం.

ఇంత స్టార్ అయ్యాక కూడా కరెస్పాండెన్స్ ద్వారా మాస్టర్ ఆఫ్ ఎకనమిక్స్ చదువుతోంది. శాకాహారమే మేలు అని నమ్ముతూ ఆచరిస్తూ ఉంది. సంఘ ప్రయోజన కార్యక్రమాలలో పాల్గొనడం కనీస కర్తవ్యంగా భావించి వాటిలో నిమగ్నమవుతూ ఉంది.

ఇన్ని చేస్తూ ఉంటే బంతి బ్యాట్‌కు తగిలినప్పుడు ఆ షాట్ అతను కొట్టినప్పుడు అని అడగడం ఆమె దృష్టిలో పనికి మాలిన పని అవుతుంది.
     
విరాట్ గురించి తెలుసుకోవాలంటే విరాట్‌తో మాట్లాడదాం. ఇక్కడ మాత్రం- ఓన్లీ అనుష్కా.  - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement