మాతోనే ఉన్నాడు
నేను నా దైవం
నాకు బావే దేవుడు అంటుంది. అలా అయితే దేవుడు భక్తులను వదిలిపోడుగా. బావ వెళ్లిపోయాడు. ఇంతకు ముందు బావ ఎంగిలే ప్రసాదం. ఆ తర్వాత ముద్ద కూడా దిగేది కాదు ఈ కష్టాలలో నాకు తోడుగా ఉంది దేవుడే అంటున్నారు శాంతిశ్రీహరి.
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని శాంతి శ్రీహరి ఇల్లు. ఇంటర్వ్యూ అంటే ‘ససేమిరా!’ అన్న శాంతి ‘నేను–నా దైవం’ అనగానే కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు. తర్వాత తనే ముందుగా చెప్పడం మొదలుపెట్టారు.‘నాలుగేళ్ల క్రితం వరకు మా ఇల్లు రోజూ పండగలా ఉండేది. ఏ కష్టమూ మా ఇంటి గుమ్మం దాటి లోపలికి రాదు అని ధీమాగా ఉండేదాన్ని. కానీ, కాలం బావ (శ్రీహరి)ను తీసుకెళ్లిపోయింది. ఒక్కసారిగా స్వర్గం నుంచి అగాధంలోకి పడిపోయినట్టు అనిపించింది. మూడేళ్లు తిండికి, నీళ్లకు దూరమై బావ ధ్యాసలోనే ఉండిపోయాను. బావను మర్చిపోవడానికి ‘మత్తు’కి దగ్గరయ్యాను. ఆరోగ్యం పాడైంది. పూర్తిగా నీరసించిపోయాను. జీవశ్చవంలా పడుండేదాన్ని. నా కొడుకు తన చేతుల్తో ఎత్తుకుపోయి ఆసుపత్రిలో చేర్చాడు. ఆ రోజు ‘నేను పోతే ఈ పిల్లలేం అయిపోతారు, వీళ్ల కోసమైనా బతికించు దేవుడా’ అనుకున్నాను.
ఈ రోజుకీ పిల్లల (పెద్దబ్బాయి శశాంక్, చిన్నబ్బాయి మేఘాంశ్) కోసం ఇలా ఉన్నానంటే ఇది ఆ దైవ నిర్ణయమే! ఆస్తులు కరుగుతున్నాయి. బాధ లేదు. పెద్దోడి చదువు పూర్తి కావస్తోంది. చిన్నోడి కాలేజీ చదువు ఇంకా మూడేళ్లు ఉంది. వాడికి మూడేళ్ల ఫీజు ఒకేసారి కట్టేశాను. పెద్దోడు అడిగాడు ‘ఏంటమ్మా! ఎవరైనా మూడేళ్ల ఫీజు ఒకేసారి కట్టేస్తారా’ అని. నేను చెప్పాను ‘ఒరే అప్పటి వరకు ఏమౌతుందో.. నేను ఫీజు కట్టలేని స్థితి వస్తే?! ఒక వేళ ఆరోగ్యం క్షీణించి మీ నాన్నలాగే నేనూ పోతే’ అన్నాను. వాడేం మాట్లాడలేదు. బావ దూరమయ్యాడనే బాధ, రేపేం జరుగుతుందో, ఎలా గడుస్తుందో అనే భయం నుంచి ఇప్పుడిప్పుడే ఎలాగైనా పిల్లలను స్థిరపరచాలనే ధైర్యం కలుగుతోంది. ఏదో దైవశక్తి ఉంది కాబట్టే నన్ను నడిపిస్తోంది.’
అసలు మీ జీవితమే కష్టంతోనే మొదలైంది కదా! అప్పట్లో దైవాన్ని తలుచుకుంటూ గడిపేవారా?
నిజమే, కానీ అప్పట్లో అది కష్టం అనిపించలేదు. నలుగురు అక్కచెల్లెళ్లం, ముగ్గురు తమ్ముళ్లు. నాన్న (సి.ఎల్.ఆనందన్ తమిళ సినిమా నటుడు) చనిపోయాడు. కుటుంబం గడవడం కోసం నేనీ సినిమా రంగంలో అడుగుపెట్టాను. అందరి కడుపు నిండాలంటే నేను నటించాలి. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాను అనుకునేదాన్ని. అలా రోజులు గడిచిపోయాయి. దైవం అంటే భయమూ, భక్తి రెండూ ఉన్నాయి. కానీ, తలుచుకోవడం అంటూ ఏమీ ఉండేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు అమ్మవారి ఆలయానికే తీసుకెళ్లేది. భక్తిగా దండం పెట్టుకోవడం వరకే నాకు తెలిసేది. అయితే అప్పుడూ ఇప్పుడూ ఏదో శక్తి ఉందని, అదే ఈ సమస్త లోకాన్ని నడిపిస్తుందని నమ్ముతాను.
మీ ప్రొఫెషన్‌ని పక్కన పెట్టి మిమ్మల్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు శ్రీహరి. ఆ ప్రేమలో దైవత్వం ఉందంటారా?
ముమ్మాటికి. ఆయనా ఎంతో కష్టపడి ఈ రంగంలో ఎదిగినవారు. నన్నుగా ఇష్టపడిన వ్యక్తి. ఆయన పరిచయమ య్యాక నా ప్రపంచమే మారిపోయింది. బావనే దైవం అయ్యాడు నాకు. బావ తప్ప మరో ప్రపంచం లేదన్నట్టుగా ఉండేది. ఎక్కడికెళ్లినా బావతోనే, ఏం చేసినా బావ కోసమే అన్నట్టుగా ఉండేదాన్ని. ఒకసారి బావ వాళ్ల గురువు (దాసరి నారాయణరావు) గారింట్లో పెద్ద లాఫింగ్ బుద్ధని చూశాడట. భలేగా ఉందే అన్నాడు ఇంటికి వచ్చి. అంతే, ఆ రోజు సిటీ అంతా తిరిగాను. ప్రతీ షాప్ వెతికాను. బావ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఎదురుగా ఆయన కోరుకున్న లాఫింగ్ బుద్ధ. ఎంత సంతోషపడిపోయాడో... అలాగే నాకేదైనా నచ్చితే ఎంత కష్టమైనా సరే ఆ రోజుకు దాన్ని నా ముందుంచేవాడు. బావ నన్ను ఎంతలా అర్థం చేసుకున్నాడో ఒక్కమాటలో చెప్పలేను. ఏ దేవుడో కరుణించి నాకు దేవుడిలాంటి భర్తను ఇచ్చాడు అనుకునేదాన్ని. కానీ, ఆ దేవుడే నా బావను తీసుకెళ్లిపోయాడు.
దైవం దగ్గర చేసిన మనిషిని దైవమే తీసుకెళ్లిపోతే ఆ దైవం మీద కోపం రాలేదా?
బావ పోయాక నా ప్రపంచమే తలకిందులైపోయింది. దేవుడ్ని తిట్టుకున్న సందర్భాలు ఎన్నో. కానీ, నా రాత ఇలా ఉంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? అని ఇప్పుడు నాకు నేను నచ్చజెప్పుకుంటాను. ఈ మిగిలిన జీవితాన్ని గడిపే ధైర్యం ఇవ్వు స్వామి అని వేడుకుంటున్నాను. బావ ఉన్నప్పుడు అంతా చుట్టూ ఉన్నారు. ఇప్పుడు ఎవరూ లేరు. జీవితం నేర్పిన కఠినపాఠాలను అర్థం చేసుకుంటున్నాను. చాలాసార్లు అనిపించింది నేనూ బావతో పాటే వెళ్లిపోతే బాగుండు అని. కానీ, పిల్లలు... మా బావ శరీరంగా లేడు. కానీ, మాతోనే ఉన్నాడు. లేకపోతే, ఈ నాలుగేళ్లలో నేనూ నా పిల్లలు రోడ్డు మీద ఉండేవాళ్లమే కదా! అలా జరగకుండా మా బావనే మమ్మల్ని చూసుకుంటున్నాడు. బావ ముందు కూర్చుని ఇప్పుడూ మాట్లాడతాను. ఎందుకిలా చేసి పోయావని తిడతాను. ఏడుస్తాను. (చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ) రోజుకు మూడుపూటలా ఆయన ఫొటో ముందు భోజనం పెట్టిన తర్వాతే నేనూ పిల్లలు తింటాం. పిల్లలు ఏం తెచ్చుకున్నా వాళ్ల నాన్నకు ముందు పెట్టి తర్వాత వాళ్లు తింటారు.
ఆలయాలకు వెళ్లిన సందర్భాలు?
చెన్నైలో మేల్‌మలయనూర్‌లో అంగలమ్మన్ ఆలయం ఉంది. అక్కడి అమ్మవారు శక్తిమాత. వెయ్యేళ్ల నాటి గుడి అని చెబుతారు. వారం క్రితమే మా తమ్ముడు కుటుంబంతో కలిసి ఆ అమ్మవారి ఆలయానికి వెళ్లి, మొక్కుతీర్చుకొని వచ్చాను. వేపాకులే దుస్తులుగా కట్టుకొని చెల్లించే మొక్కు అది. నేను, మా బావ అక్కడే పెళ్లి చేసుకున్నాం. శ్రీశైలం, తిరుపుతి, ఇక్కడి పెద్దమ్మగుడి, వరంగల్‌లోని భద్రకాళి ఆలయాలకు చాలాసార్లు వెళ్లాం. తిరుపతిలో నేనూ, పిల్లలు గుండు కూడా చేయించుకున్నాం. ఒకసారి కంచికి వెళ్లాం. అక్కడ మఠంలోని పెద్దస్వామిని దర్శించుకున్నప్పుడు చెయ్యెత్తి ఆశీర్వదించారు. ఎందుకో తెలియదు కళ్లలో నీళ్లు వచ్చాయి. అక్కడ ఏదో శక్తి ఉందనిపించింది.
నిత్యం ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు?
మా బావకు శివయ్య అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. అలా నేనూ శివయ్యను పూజించేదాన్ని. బావతో పాటు నేనూ పూజలో పాల్గొనేదాన్ని. గణేషుడు, శివుడు, లక్ష్మీ దేవి శ్లోకాలన్నీ బావ ఒక డైరీలో రాయించి నాకు ఇచ్చాడు. పూజ సమయంలో వాటిని చదివేదాన్ని. బావ ఎక్కడి నుంచి తెప్పించాడో కానీ శివుడి స్వర్ణలింగం మా ఇంట్లో ఉండేది. దాదాపు మూడు వందల గ్రాముల బరువని చెప్పాడు. ఉదయాన్నే రోజూ పంతులుగారు వచ్చి మా ఇంట్లోని స్వర్ణలింగానికి పూజలు జరిపించేవారు. బావ దాదాపు గంటన్నరసేపు పూజ చేసేవాడు. పూజకు కావల్సినవన్నీ నేను సిద్ధం చేసేదాన్ని. ఇప్పుడు ఇంట్లో నిత్య పూజలు లేవు. కానీ, స్నానం చేసిన తర్వాత దేవుని గదికి వెళ్లి రెండు అగరువత్తులు వెలిగించి దండం పెట్టుకొని వస్తాను.
ఈ మధ్యే అమితమైన బాధ కలిగించిన సంఘటన ఒకటి జరిగింది. నాలుగురోజుల క్రితం ఎప్పటిలాగే నేను స్నానం చేసి, దేవుడి గదికి వెళ్లాను. అక్కడ చూస్తే ఏదో వెలితిగా అనిపించింది. బంగారు శివలింగం లేదు. ఎవరో దొంగిలించారు. ఎవరినీ నిందించలేదు. ఎవరికీ కంప్లైంట్ చేయలేదు. ఇంతటి సహనం నాకు ఎలా అబ్బిందా! అని ఆశ్చర్యం కలిగింది. దేవుడు విగ్రహంలో కాదు నా నిగ్రహంలో ఉన్నాడు అనిపించింది. శివయ్య మళ్లీ నా ఇంటికి వస్తాడని నమ్మకం ఏర్పడింది.
మీ పిల్లలకు దైవం గురించి ఏం చెబుతుంటారు?
పిల్లల చిన్నతనం అంతా వాళ్లు నిద్ర లేస్తూనే శ్లోకాలు వినపడేవి. ఇప్పుడు దేవుడి గదివైపు కూడా రారు. ‘దేవుడికి దండం పెట్టుకోండ్రా’ అని చెబుతాను. కానీ, వారు ఇష్టపడరు. మా నాన్న అన్నేసి గంటలు పూజలు చేసేవాడు. మరి ఆ దేవుడు మా నుంచి మా నాన్నను ఎందుకు తీసుకెళ్లాడు అంటారు. పెద్దవాళ్లయ్యాక వాళ్లే తెలుసుకుంటారని ఊరుకుంటాను. పుష్కరాలప్పుడు మాత్రం పిల్లలను తీసుకెళ్లి వాళ్ల నాన్నకు చేయవలసిన క్రతువును చేయించి వచ్చాను.
ఇంత జీవితంలో మనుషుల్లో మీరు చూసిన దైవత్వం...?
బావలోనే చూశాను. ఎవరు సాయం అడిగినా లేదనేవారు కాదు. మా పాప జ్ఞాపకంగా అక్షర పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి మేడ్చల్ మండలంలోని నాలుగు ఊళ్లలోని స్కూళ్లకు ఫ్లోరైడ్ ఫ్రీ వాటర్ సదుపాయం కల్పించాడు. ఆ ఫౌండేషన్‌కి నిధులు ఎప్పుడూ అందేలా తనే జాగ్రత్తలు తీసుకున్నాడు. మా ఫామ్‌హౌజ్ నుంచి వచ్చే బియ్యం, కూరగాయలు ఆశ్రమాలకు, జూనియర్ ఆర్టిస్టులకూ పంపించేవాడు. పుట్టినరోజులకు హోమ్‌లకు వెళ్లేవాడు. అన్నదానాలు చేసేవాడు.
బావకు సీరియస్‌గా ఉందని తెలిసినక్షణం నుంచి ఆయనను గౌరవంగా సాగనంపేవరకు బావ దగ్గర అన్నం నీళ్లు మాని ఆయన స్నేహితులు సి.కళ్యాణ్, ఆలగడ్డ శ్రీనివాస్ ఉన్నారు. ప్రతియేటా బావ పోయిన రోజున ఆ ఇద్దరు వచ్చి దండంపెట్టుకొని వెళతారు. వాళ్లను చూసినప్పుడు అనిపిస్తుంది దైవం ఇలా కొందరి రూపం లో కనిపిస్తుంటాడని. ఈ నెల 15న బావ పుట్టినరోజు. ఆ రోజున బావ సమాధి దగ్గరే రోజంతా గడుపుతుంటాను. ఈసారి బావ చేసిన కార్యక్రమాలనే నేనూ చేయాలను కుంటున్నాను. సేవలో భాగం అవ్వాలనుకుంటున్నాను.
ఈ క్షణం దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమంటే..?
పిల్లల భవిష్యత్తు. వాళ్లు ఈ లోకాన్ని అర్థం చేసుకొని నిలదొక్కుకోవాలి. అంతవరకు నన్ను బతికించు స్వామి అని దండం పెట్టుకుంటాను.
అమ్మనాన్నలతో చిన్నప్పుడు గుళ్లకు తిరిగాం. పూజల్లో పాల్గొన్నాం. కానీ, అమ్మనాన్నలెప్పుడూ పూజలు చేయమని ఒత్తిడి చేయలేదు. ‘మనల్ని నడిపే శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి నుంచే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్‌గా ఆలోచిస్తే మంచి జరుగుతుంద’ ని నాన్న చెప్పేవారు. అదే నమ్ముతాం.
శశాంక్ శ్రీహరి మేఘాంశ్ శ్రీహరి
– నిర్మలారెడ్డి చిల్కమర్రి