త్రీ వీఐపీస్ | special chit chat with vip-2 team | Sakshi
Sakshi News home page

త్రీ వీఐపీస్

Published Sun, Jul 23 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

త్రీ వీఐపీస్

త్రీ వీఐపీస్

(వెరీ ఇండివిడ్యువల్‌ పీపుల్‌)

సౌందర్యను రజనీకాంత్‌ కూతురిగా పరిచయం చేయడం కరెక్ట్‌ కాదనిపిస్తోంది. ‘వీఐపీ–2’ చిత్రంతో సత్తా చాటుకోవడానికి రెడీ అయిన డైరెక్టర్‌ ఆమె.

కాజోల్‌ని అజయ్‌ దేవగన్‌ భార్యగా పరిచయం చేయడం కరెక్ట్‌ కాదనిపిస్తోంది. ఆమె యాక్ట్‌ చేసిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా 22 ఏళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో ఇంకా ఆడుతోంది. ఆమె అంతటి వీఐపీ.

ధనుష్‌ను సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడిగా పరిచయం చేయడం కరెక్ట్‌ కాదనిపిస్తోంది. వీఐపీలంతా క్లాస్‌ అనుకుంటారు కదా..
ధనుష్‌ మాస్‌లకే వీఐపీ.


వీళ్లు ముగ్గురూ ఒక్క చోట దొరికితే ఏమవుతుంది? ‘వీఐపీ’ ఇంటర్వ్యూ అవుతుంది. ముగ్గురు వీఐపీలు... అవును..  ముగ్గురూ ‘వెరీ ఇండివిడ్యువల్‌ పీపుల్‌’.

నాన్నే బెటర్‌ డాన్‌!
హాయ్‌ సౌందర్యా... మోషన్‌ కాప్చర్‌ టెక్నాలజీతో ‘కొచ్చడయాన్‌’ తీశారు. ఇప్పుడు ప్రాపర్‌ కమర్షియల్‌ లైవ్‌ మూవీని హ్యాండిల్‌ చేయడం ఎలా ఉంది?
‘వీఐపీ 2’ పక్కా మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌. హ్యూమన్‌ ఎమోషన్స్, డ్రామా, హ్యూమర్‌ ఉన్న సినిమా. ఇందులో చాలామంది సీనియర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లందర్నీ డైరెక్ట్‌ చేయడం బాగా అనిపించింది.
     
మీ బావ (సౌందర్య అక్క ఐశ్వర్య భర్త ధనుష్‌)గారు ఈ సినిమాకి హీరో కమ్‌ స్టోరీ రైటర్‌.. మరదలికి ఫ్రీడమ్‌ ఇచ్చారా? డైరెక్షన్‌లో ఇన్‌వాల్వ్‌ అయ్యారా?
ధనుష్‌ డైరెక్టర్స్‌ ఆర్టిస్ట్‌. స్క్రిప్ట్‌ వర్క్‌ మాత్రమే ఆయనది. మిగతా విషయాలన్నీ నాకే వదిలేశారు. సెట్స్‌కి వెళ్లేముందు మా రిలేషన్స్‌ తీసి పక్కన పెట్టేశాం. ‘వీఐపీ’ (తెలుగులో ‘రఘువరన్‌ బీటెక్‌’) పెద్ద హిట్‌. నన్నీ సినిమాను డైరెక్ట్‌ చేయమనప్పుడు ప్రెజర్‌గా కాక రెస్పాన్సిబిలిటీగా ఫీలయ్యా.

ఏదైనా విషయంలో వాదనలు జరిగాయా?
ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు ‘ఒకవేళ ఏదైనా విషయాల్లో అభిప్రాయాలు కలవకపోతే మనం కచ్చితంగా వాదించుకోవాలి’ అనుకున్నాం. అలాగే చాలాసార్లు మా మధ్య వాదనలు జరిగాయి. సినిమా బాగా రావడం కోసం డిబేట్స్‌ జరుగుతాయి.
        
ఈ సినిమా షూటింగ్‌ స్పాట్‌కి మీ నాన్నగారు (రజనీకాంత్‌) వచ్చినప్పుడు ఏమనిపించింది?
 చాలా హ్యాపీ అనిపించింది కానీ, ఆయన ముందు ‘స్టార్ట్‌... కట్‌’ చెప్పడానికి మాత్రం కొంచెం ఇబ్బందిపడ్డాను. కాసేపు షూటింగ్‌ చూసేసి, వెళ్లిపోయారాయన. నేను ఇంటికి వెళ్లిన తర్వాత ‘బాగా తీస్తున్నావ్‌’ అని కాంప్లిమెంట్‌ ఇచ్చారు. అది చాలు నాకు.
     
మరి.. మీ నాన్నగారిని మళ్లీ ఎప్పుడు డైరెక్ట్‌ చేస్తారు?
‘కొచ్చడయాన్‌’ లైవ్‌ యాక్షన్‌ మూవీ కాదు కాబట్టి, కార్టూన్‌ మూవీ అనుకున్నారు. ఆ సినిమాలో నాన్నగారు లైవ్‌లో కనిపించరు. అయినప్పటికీ కొన్ని సీన్స్‌ కోసం ఆయనతో నటింపజేశాం. స్క్రీన్‌ మీద యానిమేషన్‌ రూపంలో చూపించాం. అయితే, లైవ్‌ యాక్షన్‌ సినిమా చేస్తే ఆ సంతృప్తే వేరు. ఆ ఛాన్స్‌ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా. ఒకవేళ మళ్లీ ‘కొచ్చడయాన్‌’ చేసే ఛాన్స్‌ వస్తే లైవ్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా చేస్తా.
     
మీ నాన్నగారు చేసిన సినిమాల్లో మీకు ఏది బాగా ఇష్టం!
అప్పా (నాన్న)ను డాన్‌గా చూడడం నాకిష్టం. అందుకే ‘భాషా’ నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌. ఆయన కంటే బెటర్‌ డాన్‌ ఎవరూ ఉండరు.
     
మీ నాన్నగారు సూపర్‌స్టార్‌ అయినా చాలా సింపుల్‌గా ఉంటారు. ఎప్పుడైనా హెయిర్‌కి డై వేసుకోమని, అదీ ఇదీ చెబుతుంటారా?
ఆయన నిజమైన వ్యక్తి. ఎక్కడనుంచి వచ్చామనేది మర్చిపోరు. అప్పా  సింప్లిసిటీ నుంచి మేం నేర్చుకోవలసింది చాలా ఉంది. సింప్లిసిటీ చూసే చాలామంది అభిమానులయ్యారు. హి ఈజ్‌ వన్నాఫ్‌ ద మోస్ట్‌ స్టైలిష్‌ పర్సన్స్‌. డై వేసుకుని, స్టైల్‌గా డ్రస్సప్‌ చేసుకోవలసిన అవసరం లేదు.

వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? ఇటీవలే మీరు డైవోర్స్‌ తీసుకున్నారు?
నో కామెంట్స్‌. ప్రస్తుతం హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను.

విజయాలతో పాటు విలువలు ముఖ్యం
హాయ్‌ కాజోల్‌... సినిమాలు తగ్గించేశారు..?
సినిమా పుస్తకం లాంటిది. మంచి బుక్‌ చదవడం ప్రారంభిస్తే పూర్తయ్యే వరకు వదలిపెట్టం! అలాగే, చివరివరకు నన్ను చదివించగల స్క్రిప్ట్‌ వచ్చినప్పుడు చేస్తున్నా.

‘వీఐపీ–2’లో మిమ్మల్నంతగా ఆకర్షించినవి?
నా రోల్‌ వసుంధరా పరమేశ్వరన్‌. వెరీ స్ట్రాంగ్‌ అండ్‌ సెల్ఫ్‌ మేడ్‌ విమెన్‌. ఆమెకు ఆత్మగౌరవం ఎక్కువ. ఎంత ఆత్మవిశ్వాసం అంటే... ‘మీరు ఎక్కడ, ఎలాంటి సిట్యువేషన్స్‌లో వదిలేసినా తిరిగొస్తా ఐ విల్‌ కమ్‌ బ్యాక్‌ టు ద టాప్‌’ అనే వ్యక్తి. తన దృష్టిలో తానొక ఆదర్శ వ్యక్తి. మిసెస్, సీఈఓ వంటి లేబుల్స్‌ ఆమెకు నచ్చవు.
     
రోల్‌ బాగుంది... తమిళ్‌ మీకు రాదు కదా!
అందుకే చేయగలనా?లేదా? అని ఆలోచించా. ధనుష్, సౌందర్య.. నా డైలాగుల్లో 50 శాతం ఇంగ్లిష్‌లో ఉంటాయంటే మేనేజ్‌ చేయొచ్చనుకున్నా! ఫస్ట్‌డే 3 పేజీల తమిళ డైలాగులు నా చేతిలో పెట్టారు. ‘ఇవి చెప్పడం నా వల్ల కాదు. ఇంకో యాక్టర్‌ను చూసుకోండి’ అన్నా. అప్పుడు వాళ్లు ‘లెట్స్‌ ట్రై ఫర్‌ వన్‌ ఆర్‌ టు డేస్‌. ఆ తర్వాత కూడా కష్టం అనిపిస్తే వేరే యాక్టర్‌ను చూసుకుంటాం’ అన్నారు. అలా అలా నటించేశా.

కాజోల్‌ విలన్‌గానా? చాలామంది షాక్‌!
(నవ్వుతూ) నా దృష్టిలో వసుంధర విలన్‌ కాదు. ఇద్దరు వ్యక్తులు, వాళ్ల వ్యక్తిత్వా లు, ఐడియాల మధ్య ఘర్షణపై తీసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరూ వేర్వేరుగా ఆలోచిస్తారు. ఎవరి ఆలోచనలను వాళ్లు నమ్ముతారు. అప్పుడు తప్పకుండా గొడవ వస్తుంది. అలాంటి కథే ఇది.
     
ప్రతి గణేష్‌ చతుర్థికి, నవరాత్రులకు మీరు చీర కట్టుకుని మండపాలకు వెళుతుంటారు..
నాకు తెలిసి రెండేళ్ల వయసున్నప్పట్నుంచి వెళుతునాన్ను. అప్పట్నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయం కొనసాగుతోంది. శిరస్సు వంచి దుర్గాదేవికి నమస్కరించడం, గణేష్‌ పూజలు చేయడం నాకు ఇష్టం. ఐ లవ్‌ శారీస్‌. మహిళ అందమంతా చీరలోనే ఉంటుంది. గౌన్, శారీ... రెండిటిలో ఏదొకదాన్ని ఎంచుకోమంటే నేను చీరకే ఓటేస్తాను.

దేవుడిపై మీ అభిప్రాయం ఏంటి?
నా చిన్నప్పుడు ‘దేవుడు అమ్మానాన్నల వంటివాడు’ అని అమ్మ చెప్పింది. మనం ఏం చేసినా తల్లిదండ్రులు ప్రేమిస్తారు. తప్పులుంటే క్షమిస్తారు. దేవుడూ అంతే. నెత్తి మీద మొట్టికాయ వేసి పగ తీర్చుకునే రకం కాదు.
     
మీ పిల్లలకు కూడా ఈ మాటలు చెబుతారా?
అఫ్‌కోర్స్‌. లైఫ్‌లో సక్సెస్‌ కావడం చాలా ఇంపార్టెంట్‌. అదే టైమ్‌లో విలువలతో మంచి మనిషిగా మెలగడం కూడా ముఖ్యం. పిల్లలను మంచిగా పెంచడం నా బాధ్యత. ఎవరైనా మీతో చెడుగా ప్రవర్తిస్తే ‘మీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదా?’ అని అడుగుతారు. నా పిల్లలకు ఆ ప్రశ్న ఎదురు కాదు. వాళ్లను ఎవరూ వేలెత్తి చూపే సందర్భం రాదు.

పర్సనల్‌ లైఫ్, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్‌ చేస్తారు?
నేనిప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాను. మా అబ్బాయి నేను లేకుండానే డిన్నర్‌ చేస్తున్నాడు. చాలా గిల్టీగా ఉంది. అలాగని రాత్రంతా కూర్చుని ఏడవను. నటిగా మూవీని ప్రమోట్‌ చేయడం నా బాధ్యత. రేపటి నుంచి వాడితో టైమ్‌ స్పెండ్‌ చేస్తాను. ఈ విధంగా పర్సనల్, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకుంటాను. నా లైఫ్‌ని నా కొడుకు చూస్తూ, పెరుగుతాడు కాబట్టి పెదై్దన తర్వాత వర్కింగ్‌ విమెన్‌ను ఎక్కువ రెస్పెక్ట్‌ చేస్తాడు.

నెక్ట్స్‌ క్వశ్చన్‌ ప్లీజ్‌...!

‘వీఐపీ’ (తెలుగులో ‘రఘువరన్‌ బీటెక్‌’)ని వేల్‌రాజ్‌ డైరెక్షన్‌లో చేశారు.. సీక్వెల్‌కి సౌందర్యని అనుకున్నారెందుకని?
ధనుష్‌: సీక్వెల్‌ చేయాలని వేల్‌రాజ్‌ అనుకోలేదు. రఘువరన్‌ని మళ్లీ స్క్రీన్‌పైకి తీసుకు రావాలని నేను అనుకున్నా. అందుకే స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ రాశాను. నేను హీరోగా సౌందర్య డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాలనుకున్నా. ఇదైతే బాగుంటుందనిపించింది. సౌందర్యకీ స్క్రిప్ట్‌ నచ్చింది.

కోలీవుడ్‌ టు బాలీవుడ్‌.. ఇప్పుడు ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ఫకీర్‌’ ద్వారా హాలీవుడ్‌కి వెళుతున్నారు... ఎలా ఉంది?
ఐయామ్‌ బ్లెస్డ్‌. నేనెప్పుడూ కథకు విలువ ఇచ్చి సినిమాలు సెలక్ట్‌ చేసుకుంటాను. ‘రాంజ్‌నా’కి అవకాశం వచ్చినప్పుడు హిందీ ఇంట్రడక్షన్‌కి ఈ సినిమా బాగుంటుందనిపించి, ఒప్పుకున్నాను. నా ఊహ నిజమైంది. అనుకున్నట్లే ఆ సినిమా బాగా ఆడింది. హాలీవుడ్‌ సినిమా చేయాలని ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ...’ ఒప్పుకోలేదు. కథ, నా క్యారెక్టర్‌ నచ్చి ఒప్పుకున్నాను. డిఫరెంట్‌ లాంగ్వేజెస్‌ ట్రే చేయడం నాకిష్టమే.
     
హిందీలో మీ రెండో సినిమా ‘షమితాబ్‌’ అనుకున్నంతగా ఆడలేదు కదా?
నిజమే. ఒక్కోసారి మన ఊహలు నిజం కావు. అయితే ఆ సినిమా చేసినందుకు నేనం పశ్చాత్తాపపడటంలేదు. బాల్కీలాంటి దర్శకుడితో సినిమా అంటే అదొక మంచి ఎక్స్‌పీరియన్స్‌. అమితాబ్‌గారి కాంబినేషన్‌ అంటే మాటలా? ఆ విధంగా సినిమా నాకు మంచి మెమరీ అయింది.

మరి మీ మామగారు (రజనీకాంత్‌) కాంబినేషన్‌లో సినిమా చేయాలని లేదా?
రజనీ సార్‌తో కాంబినేషన్‌ కుదిరితే హ్యాపీ.

అదేంటీ.. సార్‌ అంటున్నారు.. మావయ్యా అని పిలవరా?
కొన్ని పిలుపులను ఇంటి వరకే పరిమితం చేయాలి. రజనీ సార్‌ ప్రజల మనిషి. ఆయన గురించి పబ్లిక్‌గా మాట్లాడేటప్పుడు ‘సార్‌’ అంటేనే గౌరవంగా ఉంటుంది.

మరి.. ప్రజల మనిషి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందా?
నాకు రాజకీయాలు తెలియవు. రజనీ సార్‌కి ఏం అనిపిస్తే అది చేస్తారు. ఒకవేళ సీయం కావాలని ఆయన అనుకుంటే హ్యాపీయే. ఆయన అభిమానులు కూడా ఇష్టపడుతున్నారు.

ఈ మధ్య తమిళ పరిశ్రమలో ‘నటీనటుల సంఘం’, ‘నిర్మాతల మండలి’ ఎన్నికలు హాట్‌ హాట్‌గా జరిగాయి? ఈ రెండింటికీ విశాల్‌ అధ్యక్షుడిగా వ్యవహరించడం కరెక్టేనా?
అంత దూరం ఆలోచించను. రాజకీయాలు తెలియవని ఇంతకుముందు అన్నాను కదా. ఇక్కడ కూడా అదే మాట అంటున్నా. నేను ఇతరుల వ్యవహారాల్లోకి తొంగిచూడను. నేను, నా సినిమాలు, నా కుటుంబం తప్ప నాకు మరో ధ్యాస ఉండదు. ఆ మాటకొస్తే నాకు జనరల్‌ నాలెడ్జ్‌ తక్కువ. మీరు ఏదైనా క్లిష్టమైన ప్రశ్న వేశారనుకోండి.. ‘నెక్ట్స్‌ క్వశ్చన్‌ ప్లీజ్‌..’ అంటా (నవ్వుతూ).
     
బాక్సాఫీస్‌ లెక్కల పరంగా ఇతర హీరోలతో పోటీ పడరా?
అస్సలు లేదండి. నా సినిమాలతో నేను పోటీ పడతా. ‘రఘువరన్‌ బీటెక్‌’ బాగా ఆడింది కదా. నా నెక్ట్స్‌ మూవీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటా. నా సినిమాల రికార్డ్స్‌ని మళ్లీ నా సినిమాలే బ్రేక్‌ చేయాలనుకుంటా. కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని నమ్ముతా. మంచి కథలు సెలక్ట్‌ చేసుకుని, వెళ్లిపోవడం. అంతే.

ఫైనల్లీ... ఇంత సన్నగా ఉన్నారు కదా... ఒకవేళ ‘బాహుబలి’లో భల్లాలదేవా లాంటి క్యారెక్టర్‌కు అవకాశం వస్తే చేస్తారా?
అమ్మో.. ఏదో కొంచెం బరువు పెరగమంటే ఓకే కానీ, భల్లాలదేవాకి తగ్గట్టు బాడీని బిల్డ్‌ చేయడమంటే నా వల్ల కాదు. ఇలా సన్నగా ఉండనివ్వండి (నవ్వేస్తూ).

మేం నవ్వుకున్నాం
ఆ మధ్య మీరు వాళ్ల కొడుకంటూ ఓ దంపతులు కోర్టుకెక్కారు.. ఆధారాలు కూడా చూపించారు?
ఇవాళ ఆధారాలు సృష్టించడం కష్టమా? చెప్పండి. ఫొటోలను మార్చేయడం చాలా ఈజీ. అందుకే ‘మా దగ్గర ఫొటోలున్నాయి’ అని ఆ దంపతులు చూపించినప్పుడు నేను, నా భార్య, ఇతర కుటుంబ సభ్యులు... మేమంతా నవ్వుకున్నాం.
     
సెలబ్రిటీలకు ఇలాంటి వ్యవహారాలు తలనొప్పిగానే ఉంటాయి... అందుకే ఈ స్టేటస్‌ ప్రమాదమే?
అఫ్‌కోర్స్‌ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రమాదం అనిపిస్తుంది. కానీ, ఈ స్టేటస్‌ అందరికీ రాదండి. అదృష్టం ఉండాలి. వేలాది, లక్షలాది మంది అభిమానం సంపాదించుకోవడం అంటే చిన్న విషయం కాదు. అందుకే సెలబ్రిటీ అయినందుకు నాకు ఆనందమే.
– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement