హన్నన్న... నాకేంటి? నాకేంటని? | special edition to aha na pellinta movie | Sakshi
Sakshi News home page

హన్నన్న... నాకేంటి? నాకేంటని?

Published Mon, May 4 2015 9:56 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

హన్నన్న...  నాకేంటి? నాకేంటని?

హన్నన్న... నాకేంటి? నాకేంటని?

‘‘గయ్యాళితనం అంటే సూర్యకాంతం గుర్తొస్తారు. అలాగే పిసినారితనం అంటే ఈ పాత్ర గుర్తుకు రావాల్సిందే. ఒక సామెతలా మిగిలిపోయిన పాత్ర ఇది. పిసినారి పాత్రలు ఎన్నొచ్చినా దీన్ని కొట్టేదే లేదు’’
 - కోట శ్రీనివాసరావు

 
 ఆ పాత్రతో కెమిస్ట్రీ బాగా కుదిరింది


 ‘‘నటుడిగా నాకది ఏడవ సినిమా. అప్పటివరకూ చేసినవన్నీ చిరు పాత్రలే. దీనిలో పాత్రతో నాకు బ్రేక్ వచ్చింది. కోట చేసిన లక్ష్మీపతి పాత్రకు నేను అసిస్టెంట్‌ని. ఆయన పిసినారితనానికి ప్రతి క్షణం బలయిపోతుంటానన్నమాట. ఈ రెండు పాత్రల మధ్యా మంచి కెమిస్ట్రీ కుదిరింది. లక్ష్మీపతి పాత్రలో కోట శ్రీనివాసరావును తప్ప ఇంకెవరినీ ఊహించలేం. అంత బాగా జీవించారాయన.’’
 - బ్రహ్మానందం
 
 హూ ఈజ్... వాష్ బేసిన్‌లో చేపలు పట్టేవాడు?


పోనీ... శవం మీద మరమరాలేరుకునేవాణ్ణి ఎక్కడైనా చూశారా?  ఎర్రటి ఎండలో వేణ్ణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకుని తిరిగేవాడు... శవం మీద కప్పిన గుడ్డ ఎత్తుకెళ్లిపోయి చొక్కా కుట్టించుకునేవాడు...

ఇలాంటివాళ్లు ఎక్కడైనా కనబడ్డారా?

అయితే మీకు ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న ఒక వ్యక్తిని పరిచయం చేయాల్సిందే. అర్జంట్‌గా ‘అహ నా పెళ్లంట’ (1987) మూవీ డీవీడీ ప్లే చేయండి. సరిగ్గా 63వ నిమిషంలో ఎంటర్ ది డ్రాగన్. నిజంగానే అతను డ్రాగన్ కన్నా పదునైనవాడు. పదునంటే పిసినారితనంలోనేనండోయ్..!
 
పేరు లక్ష్మీపతి.

 
లక్ష్మీదేవిని తన ఇంటి బీరువాలోనే బంధించేద్దామనుకునే డబ్బు వెర్రి పిచ్చివాడు. ఇతని గురించి మనకంటే... గోవిందం బాగా చెబుతాడు. ప్రపంచంలో నీ అంత నికృష్టుడు ఎవ్వడూ ఉండడని మొహం మీద తిట్టేశాడు.

ఆఫ్ట్రాల్ అతని అసిస్టెంటు అన్నేసి మాటలన్నాడంటే ఎన్ని తిప్పలు పెట్టుంటాడో ఇమేజిన్ చేసుకోండి. ఇమాజిన్ అంటే గుర్తొచ్చిందండోయ్... మీకు చికెన్ కర్రీ తినాలని ఉందనుకోండి.. ఏం చేస్తారు? కోడి కొనుక్కుని... దానికి మసాలా దట్టించి కిచెన్‌లో కూరొండేస్తారు. అదే లక్ష్మీపతి అయితే ఏం చేస్తాడో తెలుసా? ఎదురుగా బతికున్న కోడిని వేలాడదీసుకుని వట్టి అన్నం తింటూ కోడికూర తిన్నట్టుగానే లొట్టలేసుకుంటుంటాడు. ఇమాజినేషన్‌కి పరాకాష్ఠ అంటే ఇదేనేమో!

నిజంగా పిసినారి సంఘం అనేది ఉంటే కనుక కచ్చితంగా లక్ష్మీపతి ప్రెసిడెంట్‌గా యునానిమస్‌గా ఎలక్ట్ అయిపోతాడు. అబ్బబ్బా... ఇతగాడి చేష్టలు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. సొంత బామ్మర్దికే బస్టాప్‌లో టీ అమ్ముతూ కనబడి పిచ్చెక్కించేశాడు. అమ్మో అమ్మో... ఇంకా నయం. కొంచెం ఉంటే భార్యతో పేపర్ శారీ కట్టించినా కట్టించేసేవాడు. ఈ పిసినారి లక్ష్మీపతి కూతుర్నే మన హీరో లవ్వాడతాడు. ఈ లక్ష్మీపతిని ఒప్పిస్తే తప్ప, ఆ పద్మకు పతి కాలేడు. అందుకే నానా తిప్పలు పడతాడు. సీత కోసం రాముడు చాలా ఈజీగా విల్లు విరిచేశాడు కానీ, ఈ డబ్బు జబ్బున్న లక్ష్మీపతి మనసు మార్చడం చాలా కష్టం. ఆ తంటాలూ తిప్పలే ‘అహ నా పెళ్లంట’ సినిమా.
 కోట శ్రీనివాసరావుని సూపర్ స్టార్‌ని చేసిన పాత్ర లక్ష్మీపతి. పిసినారి అనగానే టకీమని లక్ష్మీపతి గుర్తుకు రావాల్సిందే. ‘‘హన్నన్నా... నాకేంటి? నాకేంటని’’ అంటూ అరచేతులతో తప్పెట కొడుతూ అడగడాన్ని మనం ఎన్నిసార్లు సరదాగా ఫాలో అయ్యుంటాం కదా.
 మొదట రావు గోపాలరావుతో వేయిద్దామనుకున్నారీ పాత్ర. కానీ కోటకు రాసిపెట్టి ఉంది.  అసలు గెటప్పే సూపర్. ముతక పంచె - బనీను...పగిలిన కళ్లద్దాలతో

కోట ఇచ్చే ఎక్స్‌ప్రెషన్సు, చెప్పే డైలాగులు,  బాడీ లాంగ్వేజ్ ఇప్పటికీ గుర్తున్నాయంటే ఎంత ముద్రేసినట్టు! షూటింగ్ టైమ్‌లోనే నిర్మాత రామానాయుడు ‘‘ఈ పాత్ర హిట్టయితే... సినిమా సూపర్ హిట్టు’’ అనేశారు. అదే జరిగింది కూడా.
 
ముక్తాయింపు


 లక్ష్మీపతి గురించి ఇంకా పేజీల కొద్దీ రాయొచ్చు. కానీ ఈ పిసినారితనం ఉంది చూశారూ... అందుకే సింగిల్ పేజీలోనే హిస్టరీ అంతా చెప్పేశాం.  పిసినారితనం... జిందాబాద్!
 - పులగం చిన్నారాయణ
 
 దటీజ్ జంధ్యాల!


ఒక వేదిక మీద ఒక డెరైక్టర్ జంధ్యాలను పలకరిస్తూ-‘‘మీరు తీసే కామెడీ సినిమాల గురించి అందరూ గొప్పగా చెబుతుంటారు... నాకేమో నవ్వేరాదు’’ అన్నాడట.ఈ కామెంట్‌కు జంధ్యాల ఇలా ఫన్‌పంచ్ ఇచ్చారట-‘‘మీ హారర్ సినిమాలు చూస్తే మాత్రం నాకు భలే నవ్వొస్తుందండీ’’ దటీజ్ జంధ్యాల! ఆయన సృష్టించిన లక్ష్మీపతి క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా!!
 -జోష్ రవి, నటుడు
 
కొత్త అంశాలతో ఈ పిసినారిని డిజైన్ చేశాం!

‘‘‘పల్లకి’ వారపత్రికలో నేను రాసిన ‘సత్యంగారి ఇల్లు’ నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. అయితే నవలలో లక్ష్మీపతి పాత్ర పిసినారే కానీ ఇంత కామెడీగా ఉండదు. సినిమా కోసం ఈ పాత్ర నిండా కామెడీ చేర్చాం.  పిసినారి పాత్రలు వెండితెరపై బాగా పాపులర్. వాటన్నిటికన్నా పూర్తి భిన్నంగా ఉండే ఉద్దేశంతో ఎన్నో కసరత్తులు చేసి చాలా కొత్త అంశాలతో లక్ష్మీపతి పాత్రను తీర్చిదిద్దాం. ’
 - ఆదివిష్ణు, రచయిత
 
 లక్ష్మీపతి హిట్ డైలాగ్

‘‘ఆ శరీరాలు చూశావా...! వాటిని తోమాలి అంటే తొంబై బావుల నీళ్లు కావాలి. ఏనుగులు, అవీ జలకాడినట్టు చెరువులు, సరస్సులే తప్ప చెంబులు, చేదలు పనికి రావు ఆ దేహాలకు. ఇక భోజనం అన్నావో...అంతే! కుంభాలకు కుంభాలు లాగించేస్తారు శుంఠలు. వంద ఎకరాల పంట వండిపెట్టాలి వాళ్లకు.’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement