కిచెన్ కుచేల
అటుకులు అతుకేసే స్నేహాన్ని మించిన స్నేహం లేదు.
అంటే, పేదరికం స్నేహానికి అడ్డం రాదు.
అంత పవిత్రమైంది అటుకుల స్నేహం.
శ్రీకృష్ణుడిని కలవడానికి వెళ్లిన
కుచేలుడు తీసుకెళ్లిన కానుక అటుకుల మూట.
పంచభక్ష్య పరమాన్నాలు తినే శ్రీకృష్ణుడు అటుకులు తిని
తన్మయత్వం చెందాడు. రేపు స్నేహితుల దినోత్సవం.
అటుకులు పంచండి. స్నేహం పెంచండి.
హాట్ పోహా!
కావల్సినవి: అటుకులు–4 కప్పులు; పచ్చిమిర్చి – 2; ఎండుమిర్చి – 3; జీడిపప్పు – 3 టేబుల్ స్పూన్లు; శనగపప్పు – 5 టేబుల్‌స్పూన్లు; పుట్నాల పప్పు – 5 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్; ఆలివ్ నూనె–4 టేబుల్ స్పూన్లు
తయారీ: ∙కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి ∙దీంట్లో పల్లీలు వేసి వేయించాలి ∙తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి ∙ఆ తర్వాత కరివేపాకు, పసుపు, పుట్నాలపప్పు వేయించి మంట తగ్గించాలి ∙ఉప్పు కలిపి ఆ తర్వాత కప్పు అటుకులు వేసి కలపాలి ∙అటుకులకు పసుపు, నూనె పట్టిన తర్వాత మిగతా అటుకులు వేసి కలపాలి ∙ ఇలా చేయడం వల్ల మిగతా అటుకులకంతా పోపు మిశ్రమం బాగా పడుతుంది ∙5–8 నిమిషాల సేపు అలా సన్నని మంట మీద ఉంచి, అడుగుమాడకుండా మధ్య మధ్య కలుపుతూ ఉండాలి ∙తర్వాత మంట తీసేసి, చల్లారాక నిమ్మముక్కతో సర్వ్ చేయాలి.
రోల్స్
కావల్సినవి: గుడ్డు – 1; అటుకులు – పావు కప్పు; బంగాళదుంప ముక్కలు – 100 గ్రాములు; పచ్చిమిర్చి – 2; పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; ఆమ్చూర్ – పావు టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; కారం – పావు టీ స్పూన్; బ్రెడ్ క్రంబ్స్ – 2; నూనె – వేయించడానికి తగినంత; కొత్తిమీర – కొన్ని ఆకులు
తయారీ: ∙బంగాళదుంపపై పొట్టు తీసి, ఉడకబెట్టాలి ∙తర్వాత గరిటతో గుజ్జులా చేయాలి ∙అటుకులను కడిగి, జల్లెడలో పోయాలి ∙కడాయిలో నూనె పోసి, స్టౌ మీద పెట్టి పల్లీలు వేయించాలి ∙దీంట్లో అటుకులు, పల్లీలు, మిర్చి, కరివేపాకు, మెత్తగా చేసిన బంగాళదుంపల గుజ్జు వేసి బాగా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేత్తో రోల్‌లా చేయాలి ∙ పొయ్యిమీద కడాయి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి ∙సిద్ధంగా ఉంచుకున్న అటుకుల రోల్స్‌ని గుడ్డు సొనలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి అన్ని వైపులా వేయించాలి ∙టొమాటో సాస్ లేదా పచ్చడితో వేడి వేడిగా వడ్డించాలి.
కట్లెట్
కావల్సినవి: అటుకులు – కప్పు; శనగపిండి – 2 1/2 కప్పులు; క్యాప్పికమ్ తరుగు – పావు కప్పు; అల్లం ముద్ద – అర టీ స్పూన్; పచ్చిమిర్చి పేస్ట్ – అర టీ స్పూన్; కారం – టీ స్పూన్; నిమ్మరసం – అర టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; జీలకర్ర – 1/4 టీ స్పూన్; కొత్తిమీర – పావు కప్పు; పుదీనా ఆకులు – కొన్ని (తరగాలి); టీ స్పూన్ – పంచదార; ఉప్పు – తగినంత; నూనె – వేయించడానికి తగినంత
తయారీ: ∙అటుకులను కడిగి 2 నిమిషాలు జల్లెడలో నీళ్లన్నీ పోయేదాక ఉంచాలి ∙ఒక గిన్నెలో మిగిలిన దినుసులు, పిండి అన్నీ వేసి కలపాలి ∙దీంట్లో అటుకులు కూడా వేసి బాగా కలిపి ముద్దలా చేయాలి ∙సుమారు 8 నుంచి 10 చిన్న చిన్న ఉండలు చేసి, చేత్తో అదమాలి ∙పొయ్యి మీద కడాయి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి ∙దీంట్లో సిద్ధం చేసుకున్న పట్టీలను వేసి రెండువైపులా ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీయాలి ∙పుదీనా లేదా టోమాటో చట్నీ లేదా కెచప్‌తో వేడి వేడిగా అటుకుల కట్లెట్‌ను సర్వ్ చేయాలి.
లడ్డు
కావల్సినవి అటుకులు – కప్పు; బెల్లం – ముప్పావు కప్పు; యాలకులు – 2 (పొడి చేయాలి); ఎండుకొబ్బరి తురుము – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; జీడిపప్పు – 10; కిస్‌మిస్ – 10
తయారీ : అటుకులను వేయించాలి. దీంట్లో కొబ్బరి తురుము కలిపి సన్నని మంట మీద మళ్లీ కొద్దిగా వేయించాలి సువాసన వస్తుండగా మంట తీసేసి చల్లారనివ్వాలి ∙యాలకుల పొడి, బెల్లం కలిపి మిక్సర్‌లో బ్లెండ్ చేయాలి ∙ఈ మిశ్రమాన్ని ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙పాన్‌లో నెయ్యి, జీడిపప్పులు వేయించిన తర్వాత కిస్‌మిస్ వేసి మంట తీసేయాలి ∙దీంట్లో మిగిలినవన్నీ వేసి కలపాలి చిన్న చిన్న ముద్దలు తీసుకొని, బాల్స్ చేయాలి ∙ దీంట్లో వేయించిన ఇతర నట్స్ కూడా కలుపుకోవచ్చు ∙త్వరగా, సులువుగా, రుచిగా ఈ లడ్డూలను తయారుచేసుకోవచ్చు.
స్వీట్ పోహా!
కావల్సినవి : అటుకులు – కప్పు; బెల్లం – అర కప్పు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; కొబ్బరిపొడి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు – 8 (సగం పలుకుగా చేయాలి); బాదం పప్పులు – 7 (సన్నగా తరగాలి); నెయ్యి – అర టేబుల్ స్పూన్లు.
తయారీ: ∙అటుకులను కడిగి, జల్లిలో వేసి, పూర్తిగా నీళ్లు పోయాక గిన్నెలోకి తీసుకోవాలి ∙వీటిపైన మళ్లీ 2 టేబుల్ స్పూన్ల నీళ్లు చల్లాలి పది నిమిషాల తర్వాత పొయ్యిమీద మూకుడు పెట్టి, దాంట్లో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, బాదం పలుకులు వేయించాలి ∙దీంట్లో కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి కలపాలి ∙అర కప్పు నీళ్లలో బెల్లం వేసి కరిగించాలి. సన్నని మంట మీద 8 నిమిషాల సేపు ఉంచితే బెల్లం పూర్తిగా కరుగుతుంది ∙ఈ బెల్లం పాకంలో నానిన అటుకులు, కొబ్బరి తురుము, వేయించిన నట్స్ వేసి కలపాలి ∙వడ్డించే ముందు మరిన్ని నట్స్ వేసుకోవచ్చు ∙ఎండుకొబ్బరి బదులుగా పచ్చికొబ్బరి తురుము కూడా వాడుకోవచ్చు.
దద్ద్యోజనం
కావల్సినవి : అటుకులు – కప్పు; పెరుగు – 3 కప్పులు; ఆవాలు – టీ స్పూన్; మినప్పప్పు – టేబుల్ స్పూన్; శనగపప్పు – టేబుల్ స్పూన్; ఎండుమిర్చి – 3; నూనె – టేబుల్ స్పూన్; కరివేపాకు – రెమ్మ; ఉప్పు – తగినంత
తయారీ: ∙అర టీ స్పూన్ ఉప్పు 2 కప్పుల నీళ్ళలో కలిపి, అటుకులు నిమిషంసేపు నానబెట్టాలి ∙తర్వాత అటుకులను వడకట్టాలి పెరుగును గరిటతో మృదువుగా అయ్యేంత వరకు చిలికి, కొద్దిగా ఉప్పు కలపాలి ∙మందపాటి గిన్నె పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి ∙దీంట్లో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేయించి మంట తీసేయాలి ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలిపి 10–20 సెకన్లు అలాగే ఉంచాలి ∙దీంట్లో నానబెట్టిన అటుకులు, పెరుగు వేసి కలపాలి ∙కావాలనుకుంటే పోపులో పావు టీ స్పూన్ శొంఠి వేసుకోవచ్చు.
దోసె
కావల్సినవి: బాయిల్డ్ రైస్ – కప్పు; అటుకులు – అర కప్పు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మజ్జిగ – కప్పు; బేకింగ్ సోడా – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్; నూనె – తగినంత
తయారీ: ∙బియ్యం కడిగి నీళ్లుపోసి నానబెట్టాలి ∙మరోగిన్నెలో అటుకులు, మినప్పప్పు వేసి నీళ్లతో కడిగి వడబోయాలి ∙దీంట్లో మజ్జిగను కలిపి 3 గంటల సేపు నానబెట్టాలి ∙ముందుగా బియ్యం, తర్వాత నీళ్లను వడకట్టి అటుకుల మిశ్రమం మిక్సర్‌జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ∙పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత బేకింగ్ సొడా, ఉప్పు కలపాలి ∙4 గంటలసేపు పిండిని అలాగే ఉంచి, ఆ తర్వాత దోసెలు వేసుకోవాలి ∙పొయ్యి మీద నాన్‌స్టిక్ పెనం పెట్టి, పైన 2–3 చుక్కల నూనె వేసి మెత్తటి బ్రష్ లేదా గుడ్డతో తుడిచేయాలి ∙తర్వాత గుంట గరిటతో పిండి తీసుకొని పెనం మీద వేసి, ఆ పైన గుండ్రంగా పిండి విస్తరించేలా గరిటను తిప్పాలి తర్వాత దోసె చుట్టూత నూనె వేసి, కాలనివ్వాలి ∙ఇష్టాన్ని బట్టి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. కొబ్బరి పచ్చడి లేదా సాంబార్‌తో వడ్డించాలి.