Friends Day
-
బాలికపై స్నేహితుల అత్యాచారం
థానే: స్నేహితుల దినోత్సవం పేరు చెప్పి ఓ బాలికను పార్టీకి ఆహ్వానించిన ఇద్దరు స్నేహితులు..ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. స్నేహితుల రోజు వేడుకను చేసుకుందాం రమ్మని ఆదివారం సాయంత్రం బాలిక(16) వద్దకు ఆమె ఇద్దరు స్నేహితులు వచ్చారు. తెలిసినవారు కావటంతో ఆమె వారి వెంట వెళ్లింది. తర్వాత నిందితులిద్దరూ బాలికను బైక్ డోమ్బివ్లీలోని ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి రేప్ చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించిన నిందితులు..ఆమెను ఇంటి వద్ద దింపారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు విద్యార్థి కాగా, మరొకరు చేపల వ్యాపారం చేస్తున్నాడు. -
స్నేహానికి ప్రేమతో...
స్నేహాన్ని సుకుమారంగా పెంచుకుని ప్రసాదంగా పంచుకున్న ఇద్దరు స్నేహితుల కథ ఇది. ఈ ఇద్దర్నీ పట్టుకోవడం అంటే... అటువంటి స్నేహాన్ని పొందడమంత ఇంపాజిబుల్. ఇవాళ ‘స్నేహితుల దినోత్సవం’ అని సుకుమార్ చెవిలో ఊదాం. దానికి దేవిశ్రీ వంత పాడారు.మ్యూజిక్–డైరెక్టర్ కలిస్తే ‘జుగుల్బందీ’ అవుతుంది. అసలు ‘మ్యూజిక్ డైరెక్టర్’ అనే పద బంధంలోనే ఇద్దరూ ఉన్నారు. వీళ్ల స్నేహాన్ని చూసి మీరంతా పాడుకునే పాట ‘ఐ వన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ....’ సినిమా ఇండస్ట్రీలో ఆర్థిక అవసరాల కోసం స్నేహం చేసేవాళ్లే ఎక్కువ అంటారు.. మరి మీ ఇద్దరి స్నేహానికి లెక్కలేమైనా? దేవి: లెక్కలా? ఏమీ లేవండి. గ్లామర్ ఇండస్ట్రీ గురించి చాలావరకు బయట అనుకునేవన్నీ అబద్ధాలే. ‘మనం ఇది చేయకపోతే వాళ్లు ఇది చేయరేమో... మనం ఇలా ఉండకపోతే మనతో వాళ్లు బాగుండరేమో’ అనే ఇన్‌సెక్యూర్టీ చాలామందికి ఉంటుంది. దాంతో దేనికైనా లెక్కలేసుకుంటారు. అలాంటివాళ్లు ఒక్క గ్లామర్ ఇండస్ట్రీలోనే కాదు... అన్ని చోట్లా ఉంటారు. కాకపోతే ఇండస్ట్రీలో ఏ విషయమైనా భూతద్దంలా కనిపిస్తుంది. కాబట్టి అందరూ గ్లామర్ ఇండస్ట్రీ మీదే పడతారు. మంచి కన్నా చెడునే తొందరగా ప్రొజెక్ట్ చేసి, సంతోషపడిపోతారు. ఇప్పుడు నన్ను తీసుకోండి. నేనెవరి గురించీ చెడుగా మాట్లాడను. ఎందుకంటే దాని వల్ల ‘పెద్ద స్థాయి’కి వెళ్లనని తెలుసు కాబట్టి. సుక్కు కూడా నాలాంటి వాడే. మా ఇద్దరి మధ్య స్నేహం కుదరడానికి ఈ లెక్క మాత్రమే కారణం. వేరే లెక్కలు లేవు. సుక్కు: దేవీతో నాకు స్నేహం ఇష్టం. అది అవసరానికైనా.. అనవసరానికైనా (నవ్వుతూ). కారణం ఏదైనా తనతో ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా. నిజంగా అవసరం కొరకే ఫ్రెండ్షిప్ అయితే నేనే నీతో (దేవి) ఫ్రెండ్షిప్ చేయాలి. నీకు నాతో ఫ్రెండ్‌ఫిప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌వి. దేవి: భలే చెప్పావు డార్లింగ్. నువ్వు మాత్రం తక్కువా? సుక్కూగారి ఫోన్లో ‘దేవి డార్లింగ్’ అని మీ ఫోన్ నంబర్ ఫీడ్ చేసి ఉంది.. మరి మీ ఫోన్లో? దేవి: సుక్కూ భాయ్ అని ఉంటుంది. మా ఇద్దరికీ కామన్‌గా ఒక ట్యూన్ ఉంది. ‘మిర్చి’లో ‘డార్లింగే... ఓసినా డార్లింగే’ సాంగ్ ఉంది కదా. నాకు సుక్కు ఎప్పుడు ఫోన్ చేసినా ఆ పాట పాడతాడు. నేను కూడా పాడతాను. సుక్కు: ఎప్పుడు ఫోన్ చేసినా తనూ ఫుల్ లైన్ పాడాలి. నేనూ పాడాల్సిందే. ఆ తర్వాతే మా సంభాషణ మొదలవు తుంది. కామెడీ ఏంటంటే ఏదైనా సీరియస్ మ్యాటర్ మాట్లాడాల్సి వచ్చినప్పుడూ పాడుకున్న తర్వాతే మాట్లాడుకుంటాం. అంటే.. ఆ విషయాన్ని మేం లైట్‌గా తీసుకున్నట్లు కాదు. ఆ పాట పాడటం అంత అలవాటైపోయింది. ఇప్పటివరకూ ఒకరికి మరొకరు చెప్పాలని చెప్పలేకపోయిన విషయాన్ని షేర్ చేసుకుంటారా? సుక్కు: అలాంటివేవీ లేవండి. ప్రొఫెషనల్, పర్సనల్ ఏదైనా ఇద్దరం షేర్ చేసుకోదగ్గవి ఓపెన్‌గా చెప్పుకుంటాం. దేవి: అవును. అది కరెక్టే. ఏ విషయాన్నయినా నాతో సూటిగా చెప్పగలవాళ్లల్లో సుక్కు ఒకడు. తనంటే నాకు గౌరవం. జిమ్‌కు వెళ్లమంటాడు. నేను కాస్త నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు... ‘ఏంటీ పొట్ట పెంచేస్తున్నావ్’ అని తిడతాడు. నేను ఫీలవ్వను. సుక్కు తిడతాడనే భయంతో పొట్ట తగ్గించేస్తుంటాను. సుక్కు: ఇండియాలోనే దేవి బెస్ట్ ఫెర్ఫార్మర్. స్టేజి మీద పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తుంటాడు. అలా చేయాలంటే ఫిట్‌గా ఉండాలి. అందుకే జాగ్రత్తలు చెబుతా. పైగా తనకు చాలా ఫాలోయింగ్ ఉంది. దేవి చూడ్డానికి బాగుండాలనుకుంటాను. నా దృష్టంతా ఎప్పుడూ తన ఫిజిక్ మీదే ఉంటుంది. అందుకే కొంచెం లావైనట్లు కనిపిస్తే, తిట్టేస్తాను. సరే.. మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో దేవీ ‘నంబర్’ ఎంత? సుక్కు: నాకు చాలా తక్కువమంది స్నేహితులు. హరిప్రసాద్, రవికుమార్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి దేవీ ఫస్ట్ ఫ్రెండ్. ఇందులో ఎవరికి ఏ ‘నంబర్’ ఇచ్చినా ఎవరూ ఫీలవ్వరు. దేవీకే నంబర్‌వన్ ప్లేస్. దేవీ చాలా కేరింగ్‌గా ఉంటాడు. నాకు ‘కోస్తా కాఫీ’ ఇష్టం. లండన్, దుబాయ్, యూరప్ ఎక్కడికి వెళ్లినా కోస్తా కాఫీ షాప్ ఎక్కడా ఉందా? అని వెతుకుతుంటాం. ఒకసారి దుబాయ్ వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో దేవీకి కోస్తా కాఫీ షాప్ కనిపిస్తే, సెల్ఫీ దిగి ‘సుక్కూ... నీ కోస్తా కాఫీ’ అంటూ ఆ ఫొటో పంపించాడు. తనకు నేనెప్పుడూ గుర్తు ఉంటాననడానికి ఇదో ఎగ్జాంపుల్. ఆ సెల్ఫీ చూసి, కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దేవి: సుక్కూకి నంబర్ ఇవ్వను. తను నాకు ఫ్రెండ్‌కి మించి. నా మీద సుక్కూకి ఎంత ప్రేమ అంటే... మొన్న నా పుట్టినరోజుకి నేను హైదరాబాద్‌లో లేను. అయినా కేక్ కట్ చేసి, ఆ సెలబ్రేషన్ చూపించడం కోసం నాకు వీడియో కాల్ చేశాడు. గుర్తు పెట్టుకోవడంతో పాటు నేనక్కడ లేకపోయినా సెలబ్రేట్ చేయాలనుకోవడం నాకు ఆనందంగా అనిపించింది. ఎవరైనా నన్ను ఒక్క మాట అంటే తను చాలా ఫీౖలైపోతాడు. నేను ఫీలవ్వకపోయినా తను ఫీలవుతుంటాడు. ఏమోనండి.. ‘కుమారి 21ఎఫ్’ అనే చిన్న సినిమాకి మీలాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవడంతో మీ స్నేహాన్ని సుక్కూ వాడుకున్నారని కొందరి ఫీలింగ్? సుక్కు: అవునండి. దేవీని చాలా దారుణంగా వాడుకున్నాను. కరెక్టే (నవ్వులు). దేవి: అలా ఎవరైనా అనుకుంటే పొరపాటు. సుక్కు ‘కుమారి 21ఎఫ్’ సినిమా తీయాలనుకున్నప్పుడే నాకు తెలుసు అది డిఫరెంట్ మూవీ అని. ఒక రోజు ‘నువ్వు చాలా బిజీ. మంచి మ్యూజిక్ ఇస్తావ్’ అని స్టార్ట్ చేసి, అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడాడు. ‘చెప్పు సుక్కూ’ అంటే, మొహమాటపడుతూ మ్యూజిక్ ఇవ్వాలన్నాడు. ‘ఓస్... ఇంతేనా’ అనిపించింది. సుక్కూగారిప్పుడు తీసిన ‘దర్శకుడు’ మూవీకి వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారు. మిమ్మల్ని అడగడానికి మళ్లీ మొహమాటపడ్డారా? సుక్కు: ‘దర్శకుడు’ చిన్న సినిమా. హీరో మా అన్నయ్య కొడుకు. షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు దేవీకి చెప్పలేదు. మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయమని అడిగితే కాదనడు. ఇందాక మీరు అన్నట్లు ఫ్రెండ్షిప్కు ఆర్థిక సంబంధాలు కారణం అయ్యుంటే ఈ సినిమాకు నేను తప్పకుండా దేవీని ఉపయోగించుకుని ఉండేవాణ్ణి. దేవి: డార్లింగ్... చాలా అన్యాయం. నీ అన్న కొడుకు మీద నాకు అభిమానం ఉండదా? నాకు చెప్పకుండా నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా అనౌన్స్ చేసి ఉండాల్సింది. సుక్కు: డోంట్ వర్రీ డార్లింగ్. ఈ మధ్య నీకు చెప్పకుండా ఓ సినిమా అనౌన్స్ చేశా. దేవి: హ్యాపీ డార్లింగ్ (నవ్వుతూ). ఒకరిలో మరికొరికి కనిపించే మైనస్ పాయింట్? దేవి: ‘సుక్కూ.. నువ్వు వచ్చేటప్పడు ఇది తీసుకురా’ అని చెబితే అది తప్పకుండా మర్చిపోయి వస్తాడు. ‘ఈ హార్డ్‌డిస్క్‌ను మా ఇంట్లో ఇవ్వ’మని చెప్పాననుకోండి.. మా ఇంటికి వెళతాడు.. మాట్లాడతాడు. హార్డ్ డిస్క్ మాత్రం మర్చిపోతాడు. తనలో ఇంకో క్వాలిటీ కూడా ఉంది. అదేంటంటే.. ఫలనా వ్యక్తికి ఏదైనా ఇవ్వమని స్ట్రాంగ్‌గా చెప్తే కచ్చితంగా ఇస్తాడు. అయితే ఫన్ ఏంటంటే తనకు సంబంధించిన మిగతా విషయాలను మర్చిపోతాడు. ఇలా మర్చిపోవడం మినహా సుక్కూ లో మైనస్ పాయింట్స్ ఏమీ లేవు. సుక్కు: దేవీ సమయానికి భోజనం చేయడు. నాకిష్టమైన వాళ్లకు ఫిట్‌గా ఉండమని చెబుతాను. ముందు ఫిట్నెస్ తర్వాత మ్యూజిక్ అని తనతో అంటుంటాను. తను మాత్రం ముందు మ్యూజిక్ తర్వాతే ఇంకేదైనా అన్నట్లు ఉంటాడు. ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టడు. నాకది నచ్చదు. మీరు ఒకరికి ఒకరు ఇచ్చుకున్న గిఫ్ట్? దేవి: సుక్కూతో ఫ్రెండ్షిప్ నాకు పెద్ద గిఫ్ట్ అండి. నాకు ఎనీ టైమ్ ఏ హెల్ప్ అయినా అడగడానికి ఎవరైనా ఉన్నారంటే అది సుక్కూనే అని చెప్పవచ్చు. సుక్కు: ‘కుమారి 21 ఎఫ్’ కోసం బ్యాంకాక్ సాంగ్ చేశాం. అప్పుడు దేవీకి ఐఫోన్ ఇద్దామనుకున్నాను. కానీ, అది చిన్నదైపోతుందేమో అనిపించింది. ఏదైనా పెద్ద గిఫ్ట్ ఇస్తే ఇంత చిన్న విషయానికి అంత ఖర్చు చేయాలా? అని తిడతాడని భయం. ఇప్పటివరకూ ఏమీ ఇవ్వలేకపోయా. ఏమిస్తే బాగుంటుంది? అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఫైనల్లీ.. ఫ్రెండ్షిప్ హిట్ అవ్వాలంటే ఏం చేయాలి? సుక్కు: ఒక సాంగ్ హిట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఏం చేయాలి? అన్న ప్రశ్నలకే సమాధానం లేదు. అలాంటిది ఒక ఫ్రెండ్షిఫ్ హిట్ అవ్వాలంటే ఏం చేయాలి? అని అడిగితే చెప్పడం కష్టం. పదీ పదిహేను రోజులు, లేకపోతే ఇంకొన్ని రోజులు గుర్తుండే సాంగ్సే అలా ఉంటే ఇక లైఫ్‌లాంగ్ ఫ్రెండ్షిప్ని హిట్ ట్రాక్‌లో తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? సింపుల్‌గా చెప్పాలంటే.. నమ్మకం ఉండాలి. ఇగో ఉండకూడదు. దేవి: ఒక సినిమా హిట్టయితే 100 రోజులాడుతుంది. అదే స్నేహం అంటే లైఫ్ లాంగ్ ఆడే సూపర్‌హిట్ సినిమా. ఫ్రెండ్షిప్ హిట్టవడానికి రీజన్స్ చెప్పలేను. ఒక్కటి మాత్రం చెబుతాను. ‘ఈ ఫ్రెండ్షిప్ అనే థియేటర్లో నుంచి మనం మాత్రం ఎప్పటికీ బయటికి రాలేం డార్లింగ్’ (సుక్కూని ఉద్దేశించి). సుక్కు: థ్యాంక్స్... లవ్ యూ డార్లింగ్... దేవి: లవ్ యు టు డార్లింగ్. లైఫ్‌కి ఫ్రెండ్స్ అవసరమా? సుక్కు: చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో నేను చాలా ఎమోషనల్‌గా ఉండేవాణ్ణి. డిగ్రీ చుదువుకునే రోజుల్లో ఎవరైనా ఫ్రెండ్ మాట్లాడకపోతే ఎంతో ఎమోషన్ అవుతాం. వాడు ఏడిస్తే మనం ఏడుస్తాం. అసలిదంతా ఎందుకు జరుగుతోందంటే, కలిసి ఉండటం అనేది ఎక్కడో జెనిటికల్గా ఉంది. కలిసి ఉండాలనే మనుషుల తత్త్వం వల్లే ఫ్రెండ్షిప్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్షిప్లో ఓ థ్రిల్ ఉంటుంది. ఇష్టమైన వ్యక్తితో షేరింగ్ అనేది బాగుంటుంది. తప్పకుండా ఫ్రెండ్ అవసరం. 10 కిలోమీటర్ల దూరం నుంచి గోల్ఫ్ బాల్ని కొడితే గోల్ పడినప్పుడు సంతోషపడతాం. కానీ, ఆ సంతోషాన్ని చూడడానికి, వినడానికి ఓ ఫ్రెండ్ లేకపోతే ఆ అద్భుతం వృధా. ఒక విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఓ ఫ్రెండ్ లేకపోతే... ఆ విషయానికి అర్థం ఏముంటుంది? మంచైనా.. చెడైనా. ఎవరితోనైనా పంచుకుంటేనే బాగుంటుంది. దేవి: లైఫ్‌లో ఫ్రెండ్ కావాలండి. లేకపోతే కొన్ని విషయాలు పంచుకోవడానికి మనుషులు లేక మనసులోనే ఉండిపోతాయ్. పంచుకోవాలనుకున్న విషయాలు చెప్పుకోవడానికి ఓ ఫ్రెండ్ ఉంటే చాలా అదృష్టం అండి. అందుకే ఫ్రెండ్ చాలా అవసరం. ‘నాన్న’ గురించి మాట్లాడితే మీ ఇద్దరూ ఎమోషన్ అయిపోతారు. మీ ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్స్‌లో ‘ఫాదర్ లవింగ్ సన్స్’ ఒకటేమో.. దేవి: ఎగ్జాట్లీ. ఏడాదిన్నర గ్యాప్‌లో మా ఇద్దరి ఫాదర్స్ పోయారు. మా నాన్నగారు చనిపోయిన టైమ్‌లో నా పక్కన ఉన్నది సుక్కూనే. నా సొంత బ్రదర్ ఉంటే ఎలా చూసుకునేవాడో అలా నన్ను చూసుకున్నాడు. అలాగే సుక్కూ నాన్నగారు చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. సుక్కు: దేవీకి తన నాన్నగారు అంటే చాలా ఇష్టం. ఒక మంచి సక్సెస్ వచ్చిందనుకోండి... ‘డార్లింగ్.. నాన్నగారు పై నుంచి చూస్తున్నారు’ అంటాడు. ఆయన ఆశీర్వాదం ఉండటం వల్లే ఈ సక్సెస్ వచ్చింది అంటుంటాడు. ఇప్పుడు రామ్‌చరణ్‌తో నేను చేస్తున్న ‘రంగస్థలం’కు మంచి ట్యూన్ వచ్చింది. ఈ సాంగ్ నాన్నగారు వింటే ఎంత ఆనందపడేవారు అంటుంటాడు. తన క్రియేషన్‌ని వాళ్ల నాన్నగారు చూడలేదని బాధపడుతుంటాడు. ఈ మధ్య తన బర్త్‌డేని సెలబ్రేట్ చేసి, వాటిని వీడియోలో చూపించాను కదా. అప్పుడు దేవి ‘చూడు డార్లింగ్.. నాన్న నా వెనకాలే ఉన్నారు. సెలబ్రేషన్స్ చూస్తున్నారు’ అని వెనకాల ఉన్న సత్యమూర్తిగారి ఫొటో చూపించాడు. వెంటనే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. దేవీగారిని ఆన్–స్క్రీన్ ఎప్పుడు చూపిస్తారు? తను హీరోగా మీరే సినిమా చేయాలనుకున్నారు కదా? సుక్కు: దేవీని హీరోగా చేయమని నేనే ప్రపొజ్ చేశాను. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. అంటే, నేను వెంటనే వేరే సినిమా చేయాల్సి వచ్చింది. ఇక్కడ నేను స్వార్థం చూసుకున్నానని చెప్పాలి. దేవీతో సినిమా అనుకున్నప్పుడు, మనీ కోసం ఇంకో సినిమా చేశాను. అప్పుడు కుదరలేదు. ఇప్పటివరకూ కుదరలేదు. కానీ తప్పకుండా తనని హీరోగా పెట్టి ఒక్క సినిమా అయినా తీస్తాను. అలా అని తనను హీరోగా కంటిన్యూ చేయమని నా ఉద్దేశం కాదు. హీరోగా ఎవరైనా చేయగలరు కానీ మ్యూజిక్ అందరూ చేయలేరు కదా. – డి.జి. భవాని -
కిచెన్ కుచేల
అటుకులు అతుకేసే స్నేహాన్ని మించిన స్నేహం లేదు. అంటే, పేదరికం స్నేహానికి అడ్డం రాదు. అంత పవిత్రమైంది అటుకుల స్నేహం. శ్రీకృష్ణుడిని కలవడానికి వెళ్లిన కుచేలుడు తీసుకెళ్లిన కానుక అటుకుల మూట. పంచభక్ష్య పరమాన్నాలు తినే శ్రీకృష్ణుడు అటుకులు తిని తన్మయత్వం చెందాడు. రేపు స్నేహితుల దినోత్సవం. అటుకులు పంచండి. స్నేహం పెంచండి. హాట్ పోహా! కావల్సినవి: అటుకులు–4 కప్పులు; పచ్చిమిర్చి – 2; ఎండుమిర్చి – 3; జీడిపప్పు – 3 టేబుల్ స్పూన్లు; శనగపప్పు – 5 టేబుల్‌స్పూన్లు; పుట్నాల పప్పు – 5 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్; ఆలివ్ నూనె–4 టేబుల్ స్పూన్లు తయారీ: ∙కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి ∙దీంట్లో పల్లీలు వేసి వేయించాలి ∙తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి ∙ఆ తర్వాత కరివేపాకు, పసుపు, పుట్నాలపప్పు వేయించి మంట తగ్గించాలి ∙ఉప్పు కలిపి ఆ తర్వాత కప్పు అటుకులు వేసి కలపాలి ∙అటుకులకు పసుపు, నూనె పట్టిన తర్వాత మిగతా అటుకులు వేసి కలపాలి ∙ ఇలా చేయడం వల్ల మిగతా అటుకులకంతా పోపు మిశ్రమం బాగా పడుతుంది ∙5–8 నిమిషాల సేపు అలా సన్నని మంట మీద ఉంచి, అడుగుమాడకుండా మధ్య మధ్య కలుపుతూ ఉండాలి ∙తర్వాత మంట తీసేసి, చల్లారాక నిమ్మముక్కతో సర్వ్ చేయాలి. రోల్స్ కావల్సినవి: గుడ్డు – 1; అటుకులు – పావు కప్పు; బంగాళదుంప ముక్కలు – 100 గ్రాములు; పచ్చిమిర్చి – 2; పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; ఆమ్చూర్ – పావు టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; కారం – పావు టీ స్పూన్; బ్రెడ్ క్రంబ్స్ – 2; నూనె – వేయించడానికి తగినంత; కొత్తిమీర – కొన్ని ఆకులు తయారీ: ∙బంగాళదుంపపై పొట్టు తీసి, ఉడకబెట్టాలి ∙తర్వాత గరిటతో గుజ్జులా చేయాలి ∙అటుకులను కడిగి, జల్లెడలో పోయాలి ∙కడాయిలో నూనె పోసి, స్టౌ మీద పెట్టి పల్లీలు వేయించాలి ∙దీంట్లో అటుకులు, పల్లీలు, మిర్చి, కరివేపాకు, మెత్తగా చేసిన బంగాళదుంపల గుజ్జు వేసి బాగా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేత్తో రోల్లా చేయాలి ∙ పొయ్యిమీద కడాయి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి ∙సిద్ధంగా ఉంచుకున్న అటుకుల రోల్స్‌ని గుడ్డు సొనలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి అన్ని వైపులా వేయించాలి ∙టొమాటో సాస్ లేదా పచ్చడితో వేడి వేడిగా వడ్డించాలి. కట్లెట్ కావల్సినవి: అటుకులు – కప్పు; శనగపిండి – 2 1/2 కప్పులు; క్యాప్పికమ్ తరుగు – పావు కప్పు; అల్లం ముద్ద – అర టీ స్పూన్; పచ్చిమిర్చి పేస్ట్ – అర టీ స్పూన్; కారం – టీ స్పూన్; నిమ్మరసం – అర టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; జీలకర్ర – 1/4 టీ స్పూన్; కొత్తిమీర – పావు కప్పు; పుదీనా ఆకులు – కొన్ని (తరగాలి); టీ స్పూన్ – పంచదార; ఉప్పు – తగినంత; నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙అటుకులను కడిగి 2 నిమిషాలు జల్లెడలో నీళ్లన్నీ పోయేదాక ఉంచాలి ∙ఒక గిన్నెలో మిగిలిన దినుసులు, పిండి అన్నీ వేసి కలపాలి ∙దీంట్లో అటుకులు కూడా వేసి బాగా కలిపి ముద్దలా చేయాలి ∙సుమారు 8 నుంచి 10 చిన్న చిన్న ఉండలు చేసి, చేత్తో అదమాలి ∙పొయ్యి మీద కడాయి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి ∙దీంట్లో సిద్ధం చేసుకున్న పట్టీలను వేసి రెండువైపులా ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీయాలి ∙పుదీనా లేదా టోమాటో చట్నీ లేదా కెచప్‌తో వేడి వేడిగా అటుకుల కట్లెట్ను సర్వ్ చేయాలి. లడ్డు కావల్సినవి అటుకులు – కప్పు; బెల్లం – ముప్పావు కప్పు; యాలకులు – 2 (పొడి చేయాలి); ఎండుకొబ్బరి తురుము – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; జీడిపప్పు – 10; కిస్మిస్ – 10 తయారీ : అటుకులను వేయించాలి. దీంట్లో కొబ్బరి తురుము కలిపి సన్నని మంట మీద మళ్లీ కొద్దిగా వేయించాలి సువాసన వస్తుండగా మంట తీసేసి చల్లారనివ్వాలి ∙యాలకుల పొడి, బెల్లం కలిపి మిక్సర్‌లో బ్లెండ్ చేయాలి ∙ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ∙పాన్‌లో నెయ్యి, జీడిపప్పులు వేయించిన తర్వాత కిస్మిస్ వేసి మంట తీసేయాలి ∙దీంట్లో మిగిలినవన్నీ వేసి కలపాలి చిన్న చిన్న ముద్దలు తీసుకొని, బాల్స్ చేయాలి ∙ దీంట్లో వేయించిన ఇతర నట్స్ కూడా కలుపుకోవచ్చు ∙త్వరగా, సులువుగా, రుచిగా ఈ లడ్డూలను తయారుచేసుకోవచ్చు. స్వీట్ పోహా! కావల్సినవి : అటుకులు – కప్పు; బెల్లం – అర కప్పు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; కొబ్బరిపొడి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు – 8 (సగం పలుకుగా చేయాలి); బాదం పప్పులు – 7 (సన్నగా తరగాలి); నెయ్యి – అర టేబుల్ స్పూన్లు. తయారీ: ∙అటుకులను కడిగి, జల్లిలో వేసి, పూర్తిగా నీళ్లు పోయాక గిన్నెలోకి తీసుకోవాలి ∙వీటిపైన మళ్లీ 2 టేబుల్ స్పూన్ల నీళ్లు చల్లాలి పది నిమిషాల తర్వాత పొయ్యిమీద మూకుడు పెట్టి, దాంట్లో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, బాదం పలుకులు వేయించాలి ∙దీంట్లో కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి కలపాలి ∙అర కప్పు నీళ్లలో బెల్లం వేసి కరిగించాలి. సన్నని మంట మీద 8 నిమిషాల సేపు ఉంచితే బెల్లం పూర్తిగా కరుగుతుంది ∙ఈ బెల్లం పాకంలో నానిన అటుకులు, కొబ్బరి తురుము, వేయించిన నట్స్ వేసి కలపాలి ∙వడ్డించే ముందు మరిన్ని నట్స్ వేసుకోవచ్చు ∙ఎండుకొబ్బరి బదులుగా పచ్చికొబ్బరి తురుము కూడా వాడుకోవచ్చు. దద్ద్యోజనం కావల్సినవి : అటుకులు – కప్పు; పెరుగు – 3 కప్పులు; ఆవాలు – టీ స్పూన్; మినప్పప్పు – టేబుల్ స్పూన్; శనగపప్పు – టేబుల్ స్పూన్; ఎండుమిర్చి – 3; నూనె – టేబుల్ స్పూన్; కరివేపాకు – రెమ్మ; ఉప్పు – తగినంత తయారీ: ∙అర టీ స్పూన్ ఉప్పు 2 కప్పుల నీళ్ళలో కలిపి, అటుకులు నిమిషంసేపు నానబెట్టాలి ∙తర్వాత అటుకులను వడకట్టాలి పెరుగును గరిటతో మృదువుగా అయ్యేంత వరకు చిలికి, కొద్దిగా ఉప్పు కలపాలి ∙మందపాటి గిన్నె పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి ∙దీంట్లో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేయించి మంట తీసేయాలి ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలిపి 10–20 సెకన్లు అలాగే ఉంచాలి ∙దీంట్లో నానబెట్టిన అటుకులు, పెరుగు వేసి కలపాలి ∙కావాలనుకుంటే పోపులో పావు టీ స్పూన్ శొంఠి వేసుకోవచ్చు. దోసె కావల్సినవి: బాయిల్డ్ రైస్ – కప్పు; అటుకులు – అర కప్పు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మజ్జిగ – కప్పు; బేకింగ్ సోడా – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్; నూనె – తగినంత తయారీ: ∙బియ్యం కడిగి నీళ్లుపోసి నానబెట్టాలి ∙మరోగిన్నెలో అటుకులు, మినప్పప్పు వేసి నీళ్లతో కడిగి వడబోయాలి ∙దీంట్లో మజ్జిగను కలిపి 3 గంటల సేపు నానబెట్టాలి ∙ముందుగా బియ్యం, తర్వాత నీళ్లను వడకట్టి అటుకుల మిశ్రమం మిక్సర్జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ∙పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత బేకింగ్ సొడా, ఉప్పు కలపాలి ∙4 గంటలసేపు పిండిని అలాగే ఉంచి, ఆ తర్వాత దోసెలు వేసుకోవాలి ∙పొయ్యి మీద నాన్‌స్టిక్ పెనం పెట్టి, పైన 2–3 చుక్కల నూనె వేసి మెత్తటి బ్రష్ లేదా గుడ్డతో తుడిచేయాలి ∙తర్వాత గుంట గరిటతో పిండి తీసుకొని పెనం మీద వేసి, ఆ పైన గుండ్రంగా పిండి విస్తరించేలా గరిటను తిప్పాలి తర్వాత దోసె చుట్టూత నూనె వేసి, కాలనివ్వాలి ∙ఇష్టాన్ని బట్టి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. కొబ్బరి పచ్చడి లేదా సాంబార్‌తో వడ్డించాలి. -
స్నేహ పురాణం
నేడు స్నేహితుల దినోత్సవం స్నేహం గురించి, స్నేహం ఔన్నత్యాన్ని గురించి రామాయణమహాభారతాలలో అద్భుతంగా వర్ణించారు. రామాయణంలోని శ్రీరామ సుగ్రీవుల మైత్రి, మహాభారతంలో కుచేల శ్రీకృష్ణుల మైత్రి, కర్ణదుర్యోధనుల మైత్రీబంధం... ఈ మూడు స్నేహాలూ గొప్పవే. అయితే ఒక్కొక్క స్నేహంలో ఒక్కో కోణం ఉంది. ముందుగా రామాయణం విషయానికొస్తే... అవసరానుగుణమైన స్నేహం రామసుగ్రీవులది... తన ప్రియసఖి సీతను వెదుకుతూ అడవిమార్గంలో వెళుతున్నాడు రాముడు తన సోదరుడు లక్ష్మణునితో కలిసి. వారిని చూసిన వానర రాజు సుగ్రీవుడు తన అన్న వాలి తనను సంహరించడానికి ఎవరినో పంపాడేమోనని భయపడ్డాడు. అది గమనించిన ఆంజనేయుడు వారి రాకకు కారణం తెలుసుకుని, అటు రాముడికీ, ఇటు సుగ్రీవుడికీ ప్రయోజనం చేకూరే విధంగా వారి మధ్య మైత్రి కుదిర్చాడు. ఇది పరస్పర ప్రయోజనాన్ని చేకూర్చేదే అయినా, రాముడితో పోల్చితే సుగ్రీవుడి బలం ఏపాటి? అయితే సీతావియోగ దుఃఖంలో ఉన్న రాముడికి సుగ్రీవుడు చేస్తానన్న సాయం ఆశాకిరణంలా తోచింది. పైగా అధర్మపరుడు, అమిత బలశాలి అయిన అతడి అన్న వాలి నుంచి అతడిని కాపాడ్డం కర్తవ్యంగా భావించాడు. అందుకే సుగ్రీవుడికి తన స్నేహహస్తాన్ని అందించాడు. అంతేకాదు, వాలిని సంహరించి, సుగ్రీవుడికి రాజ్యాన్ని కట్టబెట్టేవరకు అండగా నిలిచి స్నేహధర్మానికి మారుపేరుగా నిలిచాడు. సుగ్రీవుడు కూడా అమిత బలపరాక్రమాలు గల ఆంజనేయుడి తో సహా ఎందరో వానర వీరులను సీతాన్వేషణలో భాగస్వాములను చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇక్కడ గ్రహించలసిందేమంటే, రాముడు బలశాలి అయిన వాలితో స్నేహం చేస్తే, అతని సాయంతో అవలీలగా రావణుని జయించగలడు. కానీ బలహీనుడైన సుగ్రీవుడితోనే స్నేహం చేశాడు. అవతలివారి ధనబ లాన్నో, అంగబలాన్నో చూసి, వారితో స్నేహం చేయాలని ఉవ్విళ్లూరేవారు ఇది గ్రహించాలి. పూలూ దారంలాంటి స్నేహం శ్రీకృష్ణ కుచేలురది... శ్రీకృష్ణుడు, కుచేలుడు సాందీపుని ఆశ్రమంలో సహాధ్యాయులు, స్నేహితులు. కాల క్రమేణా కృష్ణుడేమో రాజయ్యాడు, కుచేలుడేమో గంపెడంత మంది పిల్లలతో చాలీచాలని ఆదాయంతో సంసారాన్ని ఈదలేక మరింత పేదవాడయ్యాడు. దుర్భరమైన పరిస్థితుల్లో భార్య సలహా మేరకు స్నేహితుడైన కృష్ణుడి వద్దకు బయలేరాడు సాయం కోరడానికి. ఉట్టిచేతులతో వెళ్లలేక ఇంట్లో ఉన్న కాసిన్ని అటుకులను మూటకట్టుకుని వెళ్లాడు. అతని అవతారాన్ని చూసిన ద్వారపాలకులు లోపలికి పోనివ్వకుండా అడ్డుపడ్డారు. కృష్ణుడది చూసి వారిని వారించి, ఎదురెళ్లి మరీ బాల్యస్నేహితుడికి ఘన స్వాగతం పలికాడు. కావలించుకుని, కుశలప్రశ్నలు వేస్తూ, నాకోసం ఏం తెచ్చావని అడుగుతూనే అతని మూటలో ఉన్న అటుకులను చూసి, వాటినే ఎంతో ప్రీతితో తిన్నాడు. రాచమర్యాదలతో అతనికి ఆతిథ్యమిచ్చాడు. ఈ స్నేహమాధుర్యంలో తడిసి ముద్దయిన కుచేలుడు తానక్కడికెందుకు వచ్చాడో కూడా మర్చిపోయాడు. అయితే కృష్ణుడు ఆ మాత్రం గ్రహించకుండా ఉంటాడా... స్నేహితుడు ఇల్లు చేరేసరికే అతని దారిద్య్రాన్ని తీర్చేశాడు. తరాలపాటు కూర్చుని తిన్నా తరగని సంపదను ఇచ్చాడు. స్నేహమంటే అది! తాను రాజైనా, అవతలివాడు కూటికి లేని పేదవాడైనా సరే, తనను వెతుక్కుంటూ వచ్చిన మిత్రుడు నోరు తెరిచి అడక్కుండానే అతనిక్కావలసిన దానిని అనుగ్రహించాడు. అడిగేవరకూ ఊరుకోలేదు. అడగాలని కోరుకోలేదు. అవసరమైనది ఇచ్చాడు. అవసరార్థస్నేహం కర్ణదుర్యోధనులది... వీరిద్దరూ గొప్ప స్నేహితులనే విషయాన్ని ఎవరూ కాదనలేరు కానీ వారిది కేవలం అవసరానుగుణమైన స్నేహమే. ఒకరి స్వార్థం కోసం ఒకరు స్నేహితులయ్యారు. ఎలాగంటే కర్ణుడు కూడా రాజపుత్రుడే! సూర్యుని అనుగ్రహంతో సహజ కవచకుండలాలతో జన్మించిన ఉత్తమ కుల సంజాతుడే!! అయినప్పటికీ, కారణాంతరాలవల్ల సూతపుత్రుడుగా పెరిగిన వాడు కాబట్టి కురుపాండవుల బలాబలాల్ని పరీక్షించే క్షాత్ర పరీక్షలో అర్జునుడితో తలపడేందుకు అతి సామాన్యుడిగా, దాసీపుత్రునిగానే కొలువుకు వచ్చాడు. అతని తేజస్సును, బలపరాక్రమాలను, వీర్యశౌర్యాలను అంచనా వేసిన దుర్యోధనుడు అతడు తనకు బాగా పనికి వస్తాడని గ్రహించి, అప్పటికప్పుడు అంగరాజ్యానికి రాజును చేశాడు. కర్ణుడు కూడా తానెవరో, తన అర్హత ఏమిటో, దుర్యోధనుడు తనను రాజుగా ఎందుకు చేస్తానంటున్నాడో తెలుసుకోలేనంతటి అమాయకుడు కాడు. అయినా సరే, అంగరాజుగా సుయోధన సార్వభౌమునితో పట్టం కట్టించుకున్నాడు. ఆ కృతజ్ఞతాభావంతోనే దుర్యోధనుడికి ఆఖరివరకు అండగా నిలిచాడు. తెలిసి తెలిసీ, తన వీర్యశౌర్యపరాక్రమాలన్నింటినీ నీచుడు, స్వార్థపరుడు, అధికార దాహంతో తపించిపోయే దుర్యోధనుడికే ధారపోశాడు. దుర్యోధనుడు కూడా కర్ణుడున్నాడనే ధైర్యంతోనే పాండవులతో పోరాటానికి సిద్ధపడ్డాడు. అర్జునుడి చేతిలో చస్తాడని తె లిసినా, కర్ణుడిని తన స్వార్థానికే ఉపయోగించుకున్నాడు. స్నేహమనేది వీరిలా ఉండకూడదని నిరూపించారు ఇద్దరూ. -
స్నేహం ఓ సందేహం
యాడ్ ఫ్రెండ్ అంటూ రిక్వెస్ట్ మెయిల్ వస్తుంది. మరో మంచి స్నేహం మన జీవితానికి తోడవుతుందనే ఆశతో యాక్సెప్ట్ చేస్తాం. అలా అల్లుకున్న అనుబంధం ఒక్కోసారి మన జీవితాన్ని అల్లరిపాలు చేయవచ్చు. లేదా మన భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేయవచ్చు. ఈ చేదు నిజాన్ని గ్రహిస్తున్న నగరయువత ఇప్పుడు నెట్ ఫ్రెండ్ షిప్‌ను నమ్మం అని తేల్చి చెబుతున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా నగరంలో 18 నుంచి 25 ఏళ్ల వయసున్న 500 మందిని శనివారం ‘సాక్షి’ ప్రశ్నించింది. వారి స్పందనను క్రోడీకరిస్తే.. ఈ-స్నేహం అశాశ్వతం... ఫేస్బుక్లో పరిచయాలు.. స్నేహాలు నాలుగు రోజులు కూడా నిలవవని 43 శాతం మంది అభిప్రాయపడగా.. ఫేస్బుక్ ద్వారా శాశ్వత స్నేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని 18 శాతం మంది చెప్పారు. అవుననీ కాదని చెప్పలేమంటూ 39 శాతం మంది స్పందించారు. పోల్చడం సాధ్యం కాదు... ఫేస్బుక్ ద్వారా ఏర్పడే స్నేహాలను బయటి స్నేహాలతో పోల్చవచ్చా అన్న ప్రశ్నకు 17 శాతం మంది రెండూ ఒకటే అని చెప్పారు. రెండూ వేర్వేరు అంటూ 42 శాతం మంది స్పందించారు. ఎలా పోల్చుతాం.. అంటూ మరో 41శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. స్వచ్ఛత శూన్యం... ఫేస్బుక్ స్నేహాల్లో స్వచ్ఛత వెతకటం అవివేకమంటున్నారు సిటీ యూత్. మొత్తం 81 శాతం మంది ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ స్వచ్ఛమెనది కాదని అభిప్రాయపడ్డారు. 19 శాతం మంది ఫేస్బుక్లో కూడా స్వచ్ఛమెన స్నేహాలు సాధ్యమే అని ఇంకా నమ్ముతున్నారు. నమ్మలేం... ఫేస్‌బుక్‌లోని స్నేహాలను ఎంతవరకూ నమ్మవచ్చనే విషయంలో కాస్త భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. 18 శాతం మంది పూర్తిగా నమ్మచ్చని అభిప్రాయపడితే.. 37 శాతం మంది అస్సలు నమ్మలేం అన్నారు. 45 శాతం మంది మాత్రం కొంతవరకూ ఒక పరిధిలో ఫేస్బుక్ ఫ్రెండ్స్‌ని కూడా నమ్మచ్చని చెప్పారు. మనమే నిర్ణయకర్తలం... ప్రస్తుతం వందల, వేల సంఖ్యలో స్నేహితుల్ని సరఫరా చేస్తున్న ఫేస్బుక్... నిజానికి స్నేహాలకు వారథిగా నిలుస్తోందా? లేక తెంచేస్తుందా అంటూ ప్రశ్నిస్తే... వారథిగానే అంటూ18 శాతం యువత నమ్మకంగా చెప్పగా.. ఫేస్బుక్ స్నేహాలను తెంచేస్తోంది అంటూ 25 శాతం మంది స్పందించారు. దీనిలో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.. పరిధుల్లో ఉండడాన్ని బట్టి.. మన పద్ధతిని బట్టే ఇది వారథిగానో లేక తెంచేదిగానో ఉంటుందని.. ఈ విషయంలో జరిగే మంచైనా చెడైనా మన మీదే ఆధారపడి ఉంటుందని 57 శాతం మంది స్పష్టం చేశారు.