స్నేహం ఓ సందేహం
యాడ్ ఫ్రెండ్ అంటూ రిక్వెస్ట్ మెయిల్ వస్తుంది. మరో మంచి స్నేహం మన జీవితానికి తోడవుతుందనే ఆశతో యాక్సెప్ట్ చేస్తాం. అలా అల్లుకున్న అనుబంధం ఒక్కోసారి మన జీవితాన్ని అల్లరిపాలు చేయవచ్చు. లేదా మన భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేయవచ్చు. ఈ చేదు నిజాన్ని గ్రహిస్తున్న నగరయువత ఇప్పుడు నెట్ ఫ్రెండ్ షిప్‌ను నమ్మం అని తేల్చి చెబుతున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా నగరంలో 18 నుంచి 25 ఏళ్ల వయసున్న 500 మందిని శనివారం ‘సాక్షి’ ప్రశ్నించింది. వారి స్పందనను క్రోడీకరిస్తే..
ఈ-స్నేహం అశాశ్వతం...
ఫేస్‌బుక్‌లో పరిచయాలు.. స్నేహాలు నాలుగు రోజులు కూడా నిలవవని 43 శాతం మంది అభిప్రాయపడగా.. ఫేస్‌బుక్ ద్వారా శాశ్వత స్నేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని 18 శాతం మంది చెప్పారు. అవుననీ కాదని చెప్పలేమంటూ 39 శాతం మంది స్పందించారు.
పోల్చడం సాధ్యం కాదు...
ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడే స్నేహాలను బయటి స్నేహాలతో పోల్చవచ్చా అన్న ప్రశ్నకు 17 శాతం మంది రెండూ ఒకటే అని చెప్పారు. రెండూ వేర్వేరు అంటూ 42 శాతం మంది స్పందించారు. ఎలా పోల్చుతాం.. అంటూ మరో 41శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు.
స్వచ్ఛత శూన్యం...
ఫేస్‌బుక్ స్నేహాల్లో స్వచ్ఛత వెతకటం అవివేకమంటున్నారు సిటీ యూత్. మొత్తం 81 శాతం మంది ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్ స్వచ్ఛమెనది కాదని అభిప్రాయపడ్డారు. 19 శాతం మంది ఫేస్‌బుక్‌లో కూడా స్వచ్ఛమెన స్నేహాలు సాధ్యమే అని ఇంకా నమ్ముతున్నారు.
నమ్మలేం...
ఫేస్‌బుక్‌లోని స్నేహాలను ఎంతవరకూ నమ్మవచ్చనే విషయంలో కాస్త భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. 18 శాతం మంది పూర్తిగా నమ్మచ్చని అభిప్రాయపడితే.. 37 శాతం మంది అస్సలు నమ్మలేం అన్నారు. 45 శాతం మంది మాత్రం కొంతవరకూ ఒక పరిధిలో ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌ని కూడా నమ్మచ్చని చెప్పారు.
మనమే నిర్ణయకర్తలం...
ప్రస్తుతం వందల, వేల సంఖ్యలో స్నేహితుల్ని సరఫరా చేస్తున్న ఫేస్‌బుక్... నిజానికి స్నేహాలకు వారథిగా నిలుస్తోందా? లేక తెంచేస్తుందా అంటూ ప్రశ్నిస్తే... వారథిగానే అంటూ18 శాతం యువత నమ్మకంగా చెప్పగా.. ఫేస్‌బుక్ స్నేహాలను తెంచేస్తోంది అంటూ 25 శాతం మంది స్పందించారు. దీనిలో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.. పరిధుల్లో ఉండడాన్ని బట్టి.. మన పద్ధతిని బట్టే ఇది వారథిగానో లేక తెంచేదిగానో ఉంటుందని.. ఈ విషయంలో జరిగే మంచైనా చెడైనా మన మీదే ఆధారపడి ఉంటుందని 57 శాతం మంది స్పష్టం చేశారు.