స్నేహానికి ప్రేమతో... | friendship day special chit chat with sukumar and devisri prasad | Sakshi
Sakshi News home page

స్నేహానికి ప్రేమతో...

Published Sun, Aug 6 2017 12:06 AM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

స్నేహానికి ప్రేమతో...

స్నేహానికి ప్రేమతో...

స్నేహాన్ని సుకుమారంగా పెంచుకుని ప్రసాదంగా పంచుకున్న ఇద్దరు స్నేహితుల కథ ఇది. ఈ ఇద్దర్నీ పట్టుకోవడం అంటే... అటువంటి స్నేహాన్ని పొందడమంత ఇంపాజిబుల్‌. ఇవాళ ‘స్నేహితుల దినోత్సవం’ అని సుకుమార్‌ చెవిలో ఊదాం. దానికి దేవిశ్రీ వంత పాడారు.మ్యూజిక్‌–డైరెక్టర్‌ కలిస్తే ‘జుగుల్‌బందీ’ అవుతుంది. అసలు ‘మ్యూజిక్‌ డైరెక్టర్‌’ అనే పద బంధంలోనే ఇద్దరూ ఉన్నారు. వీళ్ల స్నేహాన్ని చూసి మీరంతా పాడుకునే పాట ‘ఐ వన్నా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ....’

సినిమా ఇండస్ట్రీలో ఆర్థిక అవసరాల కోసం స్నేహం చేసేవాళ్లే ఎక్కువ అంటారు.. మరి మీ ఇద్దరి స్నేహానికి లెక్కలేమైనా?
దేవి: లెక్కలా? ఏమీ లేవండి. గ్లామర్‌ ఇండస్ట్రీ గురించి చాలావరకు బయట అనుకునేవన్నీ అబద్ధాలే. ‘మనం ఇది చేయకపోతే వాళ్లు ఇది చేయరేమో... మనం ఇలా ఉండకపోతే మనతో వాళ్లు బాగుండరేమో’ అనే ఇన్‌సెక్యూర్టీ చాలామందికి ఉంటుంది. దాంతో దేనికైనా లెక్కలేసుకుంటారు. అలాంటివాళ్లు ఒక్క గ్లామర్‌ ఇండస్ట్రీలోనే కాదు... అన్ని చోట్లా ఉంటారు. కాకపోతే ఇండస్ట్రీలో ఏ విషయమైనా భూతద్దంలా కనిపిస్తుంది. కాబట్టి అందరూ గ్లామర్‌ ఇండస్ట్రీ మీదే పడతారు. మంచి కన్నా చెడునే తొందరగా ప్రొజెక్ట్‌ చేసి, సంతోషపడిపోతారు. ఇప్పుడు నన్ను తీసుకోండి. నేనెవరి గురించీ చెడుగా మాట్లాడను. ఎందుకంటే దాని వల్ల ‘పెద్ద స్థాయి’కి వెళ్లనని తెలుసు కాబట్టి. సుక్కు కూడా నాలాంటి వాడే. మా ఇద్దరి మధ్య స్నేహం కుదరడానికి ఈ లెక్క మాత్రమే కారణం. వేరే లెక్కలు లేవు.

సుక్కు: దేవీతో నాకు స్నేహం ఇష్టం. అది అవసరానికైనా.. అనవసరానికైనా (నవ్వుతూ). కారణం ఏదైనా తనతో ఫ్రెండ్‌షిప్‌ ఉంటుంది కదా. నిజంగా అవసరం కొరకే ఫ్రెండ్‌షిప్‌ అయితే నేనే నీతో (దేవి) ఫ్రెండ్‌షిప్‌ చేయాలి. నీకు నాతో ఫ్రెండ్‌ఫిప్‌ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌వి.

దేవి: భలే చెప్పావు డార్లింగ్‌. నువ్వు మాత్రం తక్కువా?  సుక్కూగారి ఫోన్‌లో ‘దేవి డార్లింగ్‌’ అని మీ ఫోన్‌ నంబర్‌ ఫీడ్‌ చేసి ఉంది.. మరి మీ ఫోన్‌లో?
దేవి: సుక్కూ భాయ్‌ అని ఉంటుంది. మా ఇద్దరికీ కామన్‌గా ఒక ట్యూన్‌ ఉంది. ‘మిర్చి’లో ‘డార్లింగే... ఓసినా డార్లింగే’ సాంగ్‌ ఉంది కదా. నాకు సుక్కు ఎప్పుడు ఫోన్‌ చేసినా ఆ పాట పాడతాడు. నేను కూడా పాడతాను.

సుక్కు: ఎప్పుడు ఫోన్‌ చేసినా తనూ ఫుల్‌ లైన్‌ పాడాలి. నేనూ పాడాల్సిందే. ఆ తర్వాతే మా సంభాషణ మొదలవు తుంది. కామెడీ ఏంటంటే ఏదైనా సీరియస్‌ మ్యాటర్‌ మాట్లాడాల్సి వచ్చినప్పుడూ పాడుకున్న తర్వాతే మాట్లాడుకుంటాం. అంటే.. ఆ విషయాన్ని మేం లైట్‌గా తీసుకున్నట్లు కాదు. ఆ పాట పాడటం అంత అలవాటైపోయింది.

ఇప్పటివరకూ ఒకరికి మరొకరు చెప్పాలని చెప్పలేకపోయిన విషయాన్ని షేర్‌ చేసుకుంటారా?
సుక్కు: అలాంటివేవీ లేవండి. ప్రొఫెషనల్, పర్సనల్‌ ఏదైనా ఇద్దరం షేర్‌ చేసుకోదగ్గవి ఓపెన్‌గా చెప్పుకుంటాం.

దేవి: అవును. అది కరెక్టే. ఏ విషయాన్నయినా నాతో సూటిగా చెప్పగలవాళ్లల్లో సుక్కు ఒకడు. తనంటే నాకు గౌరవం. జిమ్‌కు వెళ్లమంటాడు. నేను కాస్త నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు... ‘ఏంటీ పొట్ట పెంచేస్తున్నావ్‌’ అని తిడతాడు. నేను ఫీలవ్వను. సుక్కు తిడతాడనే భయంతో పొట్ట తగ్గించేస్తుంటాను.

సుక్కు: ఇండియాలోనే దేవి బెస్ట్‌ ఫెర్ఫార్మర్‌. స్టేజి మీద పాటలు పాడుతూ, డ్యాన్స్‌ చేస్తుంటాడు. అలా చేయాలంటే ఫిట్‌గా ఉండాలి. అందుకే జాగ్రత్తలు చెబుతా. పైగా తనకు చాలా ఫాలోయింగ్‌ ఉంది. దేవి చూడ్డానికి బాగుండాలనుకుంటాను. నా దృష్టంతా ఎప్పుడూ తన ఫిజిక్‌ మీదే ఉంటుంది. అందుకే కొంచెం లావైనట్లు కనిపిస్తే, తిట్టేస్తాను.

సరే.. మీ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో దేవీ ‘నంబర్‌’ ఎంత?
సుక్కు: నాకు చాలా తక్కువమంది స్నేహితులు.  హరిప్రసాద్, రవికుమార్‌ అనే ఇద్దరు ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి దేవీ ఫస్ట్‌ ఫ్రెండ్‌. ఇందులో ఎవరికి ఏ ‘నంబర్‌’ ఇచ్చినా ఎవరూ  ఫీలవ్వరు. దేవీకే నంబర్‌వన్‌ ప్లేస్‌. దేవీ చాలా కేరింగ్‌గా ఉంటాడు. నాకు ‘కోస్తా కాఫీ’ ఇష్టం. లండన్, దుబాయ్, యూరప్‌ ఎక్కడికి వెళ్లినా కోస్తా కాఫీ షాప్‌ ఎక్కడా ఉందా? అని వెతుకుతుంటాం. ఒకసారి దుబాయ్‌ వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో దేవీకి కోస్తా కాఫీ షాప్‌ కనిపిస్తే, సెల్ఫీ దిగి ‘సుక్కూ... నీ కోస్తా కాఫీ’ అంటూ ఆ ఫొటో పంపించాడు. తనకు నేనెప్పుడూ గుర్తు ఉంటాననడానికి ఇదో ఎగ్జాంపుల్‌. ఆ సెల్ఫీ చూసి, కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

దేవి: సుక్కూకి నంబర్‌ ఇవ్వను. తను నాకు ఫ్రెండ్‌కి మించి.  నా మీద సుక్కూకి ఎంత ప్రేమ అంటే... మొన్న నా పుట్టినరోజుకి నేను హైదరాబాద్‌లో లేను. అయినా కేక్‌ కట్‌ చేసి, ఆ సెలబ్రేషన్‌ చూపించడం కోసం నాకు వీడియో కాల్‌ చేశాడు. గుర్తు పెట్టుకోవడంతో పాటు నేనక్కడ లేకపోయినా సెలబ్రేట్‌ చేయాలనుకోవడం నాకు ఆనందంగా అనిపించింది. ఎవరైనా నన్ను ఒక్క మాట అంటే తను చాలా ఫీౖలైపోతాడు. నేను ఫీలవ్వకపోయినా తను ఫీలవుతుంటాడు.

ఏమోనండి.. ‘కుమారి 21ఎఫ్‌’ అనే చిన్న సినిమాకి మీలాంటి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ని తీసుకోవడంతో మీ స్నేహాన్ని సుక్కూ వాడుకున్నారని కొందరి ఫీలింగ్‌?
సుక్కు: అవునండి. దేవీని చాలా దారుణంగా వాడుకున్నాను. కరెక్టే (నవ్వులు).

దేవి: అలా ఎవరైనా అనుకుంటే పొరపాటు. సుక్కు ‘కుమారి 21ఎఫ్‌’ సినిమా తీయాలనుకున్నప్పుడే నాకు తెలుసు అది డిఫరెంట్‌ మూవీ అని. ఒక రోజు ‘నువ్వు చాలా బిజీ. మంచి మ్యూజిక్‌ ఇస్తావ్‌’ అని స్టార్ట్‌ చేసి, అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడాడు. ‘చెప్పు సుక్కూ’ అంటే, మొహమాటపడుతూ మ్యూజిక్‌ ఇవ్వాలన్నాడు. ‘ఓస్‌... ఇంతేనా’ అనిపించింది.
     
సుక్కూగారిప్పుడు తీసిన ‘దర్శకుడు’ మూవీకి వేరే మ్యూజిక్‌ డైరెక్టర్‌ని పెట్టుకున్నారు. మిమ్మల్ని అడగడానికి మళ్లీ మొహమాటపడ్డారా?
సుక్కు: ‘దర్శకుడు’ చిన్న సినిమా. హీరో మా అన్నయ్య కొడుకు. షూటింగ్‌ స్టార్ట్‌ చేసినప్పుడు దేవీకి చెప్పలేదు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేయమని అడిగితే కాదనడు. ఇందాక మీరు అన్నట్లు ఫ్రెండ్‌షిప్‌కు ఆర్థిక సంబంధాలు కారణం అయ్యుంటే ఈ సినిమాకు నేను తప్పకుండా దేవీని ఉపయోగించుకుని ఉండేవాణ్ణి.

దేవి: డార్లింగ్‌... చాలా అన్యాయం. నీ అన్న కొడుకు మీద నాకు అభిమానం ఉండదా? నాకు చెప్పకుండా నన్ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనౌన్స్‌ చేసి ఉండాల్సింది.

సుక్కు: డోంట్‌ వర్రీ డార్లింగ్‌. ఈ మధ్య నీకు చెప్పకుండా ఓ సినిమా అనౌన్స్‌ చేశా.

దేవి: హ్యాపీ డార్లింగ్‌ (నవ్వుతూ).

ఒకరిలో మరికొరికి కనిపించే మైనస్‌ పాయింట్‌?
దేవి: ‘సుక్కూ.. నువ్వు వచ్చేటప్పడు ఇది తీసుకురా’ అని చెబితే అది తప్పకుండా మర్చిపోయి వస్తాడు. ‘ఈ హార్డ్‌డిస్క్‌ను మా ఇంట్లో ఇవ్వ’మని చెప్పాననుకోండి.. మా ఇంటికి వెళతాడు.. మాట్లాడతాడు. హార్డ్‌ డిస్క్‌ మాత్రం మర్చిపోతాడు. తనలో ఇంకో క్వాలిటీ కూడా ఉంది. అదేంటంటే.. ఫలనా వ్యక్తికి ఏదైనా ఇవ్వమని స్ట్రాంగ్‌గా చెప్తే కచ్చితంగా ఇస్తాడు. అయితే ఫన్‌ ఏంటంటే తనకు సంబంధించిన మిగతా విషయాలను మర్చిపోతాడు. ఇలా మర్చిపోవడం మినహా సుక్కూ లో మైనస్‌ పాయింట్స్‌ ఏమీ లేవు.

సుక్కు: దేవీ సమయానికి భోజనం చేయడు. నాకిష్టమైన వాళ్లకు ఫిట్‌గా ఉండమని చెబుతాను. ముందు ఫిట్‌నెస్‌ తర్వాత మ్యూజిక్‌ అని తనతో అంటుంటాను. తను మాత్రం ముందు మ్యూజిక్‌ తర్వాతే ఇంకేదైనా అన్నట్లు ఉంటాడు. ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధ పెట్టడు. నాకది నచ్చదు.
     
మీరు ఒకరికి ఒకరు ఇచ్చుకున్న గిఫ్ట్‌?
దేవి: సుక్కూతో ఫ్రెండ్‌షిప్‌ నాకు పెద్ద గిఫ్ట్‌ అండి. నాకు ఎనీ టైమ్‌ ఏ హెల్ప్‌ అయినా అడగడానికి ఎవరైనా ఉన్నారంటే అది సుక్కూనే అని చెప్పవచ్చు.

సుక్కు: ‘కుమారి 21 ఎఫ్‌’ కోసం బ్యాంకాక్‌  సాంగ్‌ చేశాం. అప్పుడు దేవీకి ఐఫోన్‌ ఇద్దామనుకున్నాను. కానీ, అది చిన్నదైపోతుందేమో అనిపించింది. ఏదైనా పెద్ద గిఫ్ట్‌ ఇస్తే ఇంత చిన్న విషయానికి అంత ఖర్చు చేయాలా? అని తిడతాడని భయం. ఇప్పటివరకూ ఏమీ ఇవ్వలేకపోయా. ఏమిస్తే బాగుంటుంది? అని ఆలోచిస్తూనే ఉన్నాను.
   
ఫైనల్లీ.. ఫ్రెండ్‌షిప్‌ హిట్‌ అవ్వాలంటే ఏం చేయాలి?
సుక్కు: ఒక సాంగ్‌ హిట్‌ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఒక సినిమా హిట్‌ అవ్వాలంటే ఏం చేయాలి? అన్న ప్రశ్నలకే సమాధానం లేదు. అలాంటిది ఒక ఫ్రెండ్‌షిఫ్‌ హిట్‌ అవ్వాలంటే ఏం చేయాలి? అని అడిగితే చెప్పడం కష్టం. పదీ పదిహేను రోజులు, లేకపోతే ఇంకొన్ని రోజులు గుర్తుండే సాంగ్సే అలా ఉంటే ఇక లైఫ్‌లాంగ్‌ ఫ్రెండ్‌షిప్‌ని హిట్‌ ట్రాక్‌లో తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? సింపుల్‌గా చెప్పాలంటే.. నమ్మకం ఉండాలి. ఇగో ఉండకూడదు.

దేవి: ఒక సినిమా హిట్టయితే 100 రోజులాడుతుంది. అదే స్నేహం అంటే లైఫ్‌ లాంగ్‌ ఆడే సూపర్‌హిట్‌ సినిమా. ఫ్రెండ్‌షిప్‌ హిట్టవడానికి రీజన్స్‌ చెప్పలేను. ఒక్కటి మాత్రం చెబుతాను. ‘ఈ ఫ్రెండ్‌షిప్‌ అనే థియేటర్‌లో నుంచి మనం మాత్రం ఎప్పటికీ బయటికి రాలేం డార్లింగ్‌’  (సుక్కూని ఉద్దేశించి).

సుక్కు: థ్యాంక్స్‌... లవ్‌ యూ డార్లింగ్‌...

దేవి: లవ్‌ యు టు డార్లింగ్‌.

లైఫ్‌కి ఫ్రెండ్స్‌ అవసరమా?
సుక్కు: చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో నేను చాలా ఎమోషనల్‌గా ఉండేవాణ్ణి. డిగ్రీ చుదువుకునే రోజుల్లో ఎవరైనా ఫ్రెండ్‌ మాట్లాడకపోతే ఎంతో ఎమోషన్‌ అవుతాం. వాడు ఏడిస్తే మనం ఏడుస్తాం. అసలిదంతా ఎందుకు జరుగుతోందంటే, కలిసి ఉండటం అనేది ఎక్కడో జెనిటికల్‌గా ఉంది. కలిసి ఉండాలనే మనుషుల తత్త్వం వల్లే ఫ్రెండ్‌షిప్‌ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్‌షిప్‌లో ఓ థ్రిల్‌ ఉంటుంది. ఇష్టమైన వ్యక్తితో షేరింగ్‌ అనేది బాగుంటుంది. తప్పకుండా ఫ్రెండ్‌ అవసరం. 10 కిలోమీటర్ల దూరం నుంచి గోల్ఫ్‌ బాల్‌ని కొడితే గోల్‌ పడినప్పుడు సంతోషపడతాం. కానీ, ఆ సంతోషాన్ని చూడడానికి, వినడానికి ఓ ఫ్రెండ్‌ లేకపోతే ఆ అద్భుతం వృధా. ఒక విషయాన్ని షేర్‌ చేసుకోవడానికి ఓ ఫ్రెండ్‌ లేకపోతే... ఆ విషయానికి అర్థం ఏముంటుంది? మంచైనా.. చెడైనా. ఎవరితోనైనా పంచుకుంటేనే బాగుంటుంది.

దేవి: లైఫ్‌లో ఫ్రెండ్‌ కావాలండి. లేకపోతే కొన్ని విషయాలు పంచుకోవడానికి మనుషులు లేక మనసులోనే ఉండిపోతాయ్‌. పంచుకోవాలనుకున్న విషయాలు చెప్పుకోవడానికి ఓ ఫ్రెండ్‌ ఉంటే చాలా అదృష్టం అండి. అందుకే ఫ్రెండ్‌ చాలా అవసరం.

‘నాన్న’ గురించి మాట్లాడితే మీ ఇద్దరూ ఎమోషన్‌ అయిపోతారు. మీ ఇద్దరిలో ఉన్న కామన్‌ పాయింట్స్‌లో ‘ఫాదర్‌ లవింగ్‌ సన్స్‌’ ఒకటేమో..
దేవి: ఎగ్జాట్లీ. ఏడాదిన్నర గ్యాప్‌లో మా ఇద్దరి ఫాదర్స్‌ పోయారు. మా నాన్నగారు చనిపోయిన టైమ్‌లో నా పక్కన ఉన్నది సుక్కూనే. నా సొంత బ్రదర్‌ ఉంటే ఎలా చూసుకునేవాడో అలా నన్ను చూసుకున్నాడు. అలాగే సుక్కూ నాన్నగారు చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను.

సుక్కు: దేవీకి తన నాన్నగారు అంటే చాలా ఇష్టం. ఒక మంచి సక్సెస్‌ వచ్చిందనుకోండి... ‘డార్లింగ్‌.. నాన్నగారు పై నుంచి చూస్తున్నారు’ అంటాడు. ఆయన ఆశీర్వాదం ఉండటం వల్లే ఈ సక్సెస్‌ వచ్చింది అంటుంటాడు. ఇప్పుడు రామ్‌చరణ్‌తో నేను చేస్తున్న ‘రంగస్థలం’కు మంచి ట్యూన్‌ వచ్చింది. ఈ సాంగ్‌ నాన్నగారు వింటే ఎంత ఆనందపడేవారు అంటుంటాడు. తన క్రియేషన్‌ని వాళ్ల నాన్నగారు చూడలేదని బాధపడుతుంటాడు. ఈ మధ్య తన బర్త్‌డేని సెలబ్రేట్‌ చేసి, వాటిని వీడియోలో చూపించాను కదా. అప్పుడు దేవి ‘చూడు డార్లింగ్‌.. నాన్న నా వెనకాలే ఉన్నారు. సెలబ్రేషన్స్‌ చూస్తున్నారు’ అని వెనకాల ఉన్న సత్యమూర్తిగారి ఫొటో చూపించాడు. వెంటనే నా కళ్లలో నీళ్లు తిరిగాయి.

దేవీగారిని ఆన్‌–స్క్రీన్‌ ఎప్పుడు చూపిస్తారు? తను హీరోగా మీరే సినిమా చేయాలనుకున్నారు కదా?
సుక్కు: దేవీని హీరోగా చేయమని నేనే ప్రపొజ్‌ చేశాను. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. అంటే, నేను వెంటనే వేరే  సినిమా చేయాల్సి వచ్చింది. ఇక్కడ నేను స్వార్థం చూసుకున్నానని చెప్పాలి. దేవీతో సినిమా అనుకున్నప్పుడు, మనీ కోసం ఇంకో సినిమా చేశాను. అప్పుడు కుదరలేదు. ఇప్పటివరకూ కుదరలేదు. కానీ తప్పకుండా తనని హీరోగా పెట్టి ఒక్క సినిమా అయినా తీస్తాను. అలా అని తనను హీరోగా కంటిన్యూ చేయమని నా ఉద్దేశం కాదు. హీరోగా ఎవరైనా చేయగలరు కానీ మ్యూజిక్‌ అందరూ చేయలేరు కదా.
– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement