అంత కష్టపడి రొట్టె చేసి
మళ్లీ తుంచడమేంటి?!
చుట్టేయండి...
హ్యాపీగా నోట్లో పెట్టేయండి.
ఎగ్ రోటీ రోల్
కావలసినవి :కోడి గుడ్లు – 4; కీరదోస ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్; క్యారెట్ తరుగు – 2 టేబుల్ స్పూన్స్; ఉల్లితరుగు – 2 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2; ఆమ్‌చూర్ పౌడర్ – 1 టీ స్పూన్, నిమ్మకాయ – 1 చెక్క; టొమోటొ కెచప్ – 2 టేబుల్ స్పూన్స్; నల్లమిరియాల పొడి – 1/4 టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడ; నూనె – 3 టేబుల్ స్పూన్స్.
తయారి: ఒక గిన్నెలోకి 4 గుడ్లును తీసుకుని, కొంచెం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టాలి ∙మరొక పాన్‌లో కోడిగుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్‌లాగా వేసుకోవాలి ∙ఆమ్లెట్ ఒకవైపు కాలిన తర్వాత, ముందుగా కాల్చి ఉంచుకున్న చపాతీని దానిపై వేసి మరొకవైపు తిప్పి కాలనివ్వాలి ∙రెండు వైపులా కాలిన రోటీ ఆమ్లెట్‌ను ఆమ్లెట్ పైకి వచ్చేలా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙ఈ రోటీ ఆమ్లెట్‌కు మధ్యలో నిలువుగా తరిగిన కీరా, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఆమ్‌చూర్ పౌడర్, ఉప్పు, టొమోటొ కెచెప్‌ను వేసి దానిపై నిమ్మరసాన్ని పిండి బటర్ పేపర్‌తో రోల్ చేస్తే ఎగ్ రోటీ రోల్ రెడీ!
వెజ్ పనీర్ రోటీ రోల్
కావలసినవి: తరిగిన కాప్సికమ్ – 1/4 కప్పు; ఉడికించిన బంగాళాదుంపల ముద్ద – 1 కప్పు, తురిమిన పనీర్ 3/4 కప్పు, కారం – 1 టీ స్పూన్ ; గరం మసాలా – 1/2 టీస్పూన్; ఛాట్ మసాలా – 1 టీ స్పూన్; ఉప్పు – రుచికి సరిపడ; టొమోటొ కెచెప్ – 2 టేబుల్ స్పూన్స్; తరిగిన కొత్తిమీర – 2 టీ స్పూన్స్; సన్నగా పొడవుగా తరిగిన క్యారెట్ – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర తరుగు – 1 టేబుల్ స్పూన్.
తయారి:స్టౌ పైన బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక క్యాప్సికమ్, ఉడికించిన బంగాళాదుంపలు, పనీర్, ఉప్పు, కారం, గరం మసాలా, ఛాట్ మసాలా వేసి అన్నిటిని బాగాకలిపి కాసేపు మగ్గనివ్వాలి ∙ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న రోటీని ఒక ప్లేట్‌లోకి తీసుకొని, టొమోటొ కెచెప్‌తో పూర్తిగా స్ప్రెడ్ చేయాలి ∙రోటీకి మధ్యలో నిలువుగా క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు వేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెజ్ పన్నీర్ స్టప్ ముద్దను రోల్‌గా మధ్యలో ఉంచి, చపాతీ కింద లోపలికి మడిచి, రోల్ చేసి, గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి.
క్యారెట్ హల్వా రోటీ రోల్
కావలసినవి: క్యారెట్ – కేజి (తురుముకోవాలి); పాలు – 1 లీటరు; పంచదార – 200 గ్రా; జీడిపప్పు పొడి – 2 టీ టేబుల్ స్పూన్స్, బాదం పొడి – 2 టేబుల్ స్పూన్స్; కోవా – 100 గ్రా; యాలకుల పొడి – 1 టీ స్పూన్; నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
తయారి: స్టౌ పైన మందపాటి బాణలి పెట్టి నెయ్యి వేసి తురుమిన క్యారెట్‌ను 10 నిమిషాల వేపు వేగనివ్వాలి ∙వేగిన క్యారెట్‌లో తురుములో పాలు పోసి మీడియమ్ ఫ్లేమ్‌లో పూర్తిగా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ∙పాలు, క్యారెట్ తురుము మిశ్రమానికి జీడిపప్పు పొడి, బాదంపొడి, యాలకుల పొడి, పంచదార, కొంచెం నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. హల్వా పూర్తిగా దగ్గరగా అయ్యాక కోవా కూడా వేసి బాగా కలుపుకుంటే క్యారెట్ హల్వా రెడీ! ∙ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాటీ మధ్యలో ఈ ఫిల్లింగ్‌తో రోల్ చేయండి. క్యారెట్ హల్వా రోటీ రోల్ రెడీ! (లేదా కాల్చని చపాతీలో క్యారెట్ హల్వాను ఫిల్ చేసి నూనెలో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు).
రోటీ తయారి
కావలసినవి: గోధుమపిండి – 150 గ్రా; వెన్న – 2 టేబుల్ స్పూన్స్; ఉప్పు – రుచికి సరిపడ; కోడిగుడ్డు – 1 (ఆప్షనల్). తయారి: ∙గోధుమపిండిలో వెన్న, ఉప్పు, (కోడిగుడ్డు) కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోసి మెత్తటి చపాతీ పిండిలా తయారు చేసుకుని 30 నిమిషాలు సేపు తడిబట్ట వేసి పక్కన పెట్టుకోవాలి ∙కలిపి పెట్టుకున్న పిండిని నాలుగు సమాన భాగాలుగా చేసుకుని, నూనెతో మాత్రమే చపాతీలా ఒత్తుకోవాలి స్టౌ పైన పెనం పెట్టి వేడయ్యాక రెండువైపులా నూనెతో లేదా వెన్నతో కాల్చుకోవాలి.
మటన్ రోటీ రోల్
కావలసినవి: మటన్ – 150 గ్రా; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్; గరం మసాలా – 1 టీ స్పూన్; కారం – 1 టీ స్పూన్; పసుపు – 1/4 టీ స్పూన్; నిలువుగా తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్స్; నిలువుగా తరిగిన కీరదోస ముక్కలు – 1/4 కప్పు; పుదీనా తరుగు – 2 టీ స్పూన్స్; నూనె – 4 టీ స్పూన్స్.
తయారి: ∙ఒక గిన్నెలోకి పొడవుగా తరిగిన మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు కలిపి గంట సేపు నాననివ్వాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక అర కప్పు ఉల్లి తరుగు; టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసి 3 నిమిషాలు వేయించి ముందునా నానబెట్టుకున్న మటన్ వేసి మరికాసేపు వేయించుకుని కొంచెం నీరు పోసి, లో ఫ్లేమ్ మీద 45 నిమిషాలు ఉడకనివ్వాలి ∙ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ తీసుకుని మధ్యలో మటన్ ఫ్రైతో ఫిల్ చేసి దానిపైన దోస ముక్కలు, ఉల్లి తరుగు, మిర్చి తరుగు, కొంచెం ఉప్పు వేసి రోల్ చేయండి. మటన్ రోల్స్ రెడీ!
Comments
Please login to add a commentAdd a comment