కిరణ్ డీమ్‌బ్లా
గుండె కలవాడని మగవాణ్ణి అంటారు. కండ కలిగి ఉండటమూ మగవాడి పనే అంటారు. గుండె కండె మగవాడి హక్కా? స్త్రీకి కూడా గుండె ఉంటుంది. ఆమె కండ బిగించితే అందులోని దారుఢ్యం వజ్రసమానం అవుతుంది. మానసికంగా శారీరకంగా స్త్రీలు దృఢంగా ఉన్న సమాజమే ఆరోగ్యకరమైన సమాజం. కిరణ్ డీమ్‌బ్లా హైదరాబాద్‌లో ఉంటూ దేశంలోని సెలబ్రిటీల దృష్టిని ఆకర్షిస్తోంది. పెంచితే ఆమెలా కండ పెంచాలని స్త్రీలు పురుషులు అనుకుంటున్నారు. జీవిస్తే ఆమెలా బహుముఖ ప్రావీణ్యాలతో జీవించాలనుకుంటున్నారు. ఆమె పరిచయం ఇది.
అద్దంలో చూసుకుంది.. ఉలిక్కిపడింది. నేనేనా? కాలేజీరోజుల్లో స్టేజ్ మీద పాటలు పాడే కాలాన్ని జ్ఞాపకం చేసుకుంది. సన్నటి నాజూకు రూపం గుర్తొచ్చింది. ఇదేంటి? ఇంతలా మారిపోయానా? అంటే .. పదేళ్లుగా తన గురించి ఆలోచించుకోవడమే మానేసింది.. శ్రద్ధే పెట్టుకోలేదు. పర్యవసానం 75 కేజీల బరువు. అద్దంలో ఇమడని ఆకారం. బాధేసింది ఆమెకు. పెళ్లయిన మరుక్షణం నుంచి ఇంటికోసం అంకితమైపోయింది. ఉదయం అయిదు నుంచి రాత్రి పన్నెండు వరకు ఉమ్మడి కుటుంబానికి అసౌకర్యం కలగకుండా రెక్కలతో కాపు కాసింది. అలసిపోయి నిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నా తెల్లవారి మొదలయ్యే బాధ్యత కలతగా మారి కలవరపెట్టేది. ఆ విశ్రాంతిలేమో.. మరేమో కాని బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయింది. అది తెలిసినప్పుడే అదిగో అలా అద్దం ముందుకు వచ్చింది మరిచిపోయిన తనను తిరిగి పరిచయం చేసుకోవాలనుకుంది. ఆమె పేరు కిరణ్ డీమ్‌బ్లా.
అసలు ఎవరు ఆమె?
45 ఏళ్ల మహిళా వెయిట్ లిఫ్టర్. ఫిట్‌నెస్ ట్రైనర్. సిక్స్‌ప్యాక్ సాధించిన వనిత. పర్వతారోహకురాలు. గాయని. ఫొటోగ్రాఫర్. ఆ బహుముఖ ప్రజ్ఞగురించి...కిరణ్ హైదరాబాద్ వాసి. ఒకప్పుడు ఆమె సాధారణ గృహిణి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు భార్య.. ఇద్దరు పిల్లల అమ్మ. అదే ఆమె అస్తిత్వం. భర్త, పిల్లలు, ఇల్లే ప్రపంచం అయిన అప్పటి కిరణ్ కూడా చాలామంది ఇల్లాళ్లలాగే తన గురించి పట్టించుకోవాలనే ఆలోచనేరాక వ్యాయామం అనే మాటే తెలియక లావైపోయింది. అనారోగ్యానికి తీసుకుంటున్న మందులూ ఆమె బరువును మరింత పెంచాయి.
ఇంట్లోనే ఉంటే దిగులు ఎక్కువవుతోంది. వ్యాకులతా వెయిట్‌ను పెంచుతోంది. పోనీ బయటకు వెళ్లి ఏమన్నా చేద్దామంటే అప్పటికీ పిల్లలిద్దరూ చిన్నవాళ్లే. ఇరుగుపొరుగు ద్వారా యోగా గురించి తెలుసుకుంది. యోగా తరగతులకు వెళ్లడం మొదలుపెట్టింది. కొన్నాళ్లు గడిచేసరికి కొంత ఫలితం కనపడింది. తన మీద తనకు నమ్మకమూ పెరిగింది. యోగా కొనసాగిస్తూనే ఈత నేర్చుకోవాలనీ నిశ్చయించుకుంది. కాని అనుకున్నంత సులువు కాలేదు. తొలుత వారం పదిరోజులు నీళ్లను చూసి భయపడ్డంతోనే సరిపోయింది.
అయినా పట్టువదలేదు కిరణ్. ఈతా నేర్చేసుకుంది. స్విమ్మింగ్‌కి వెళ్తున్నప్పుడే జిమ్ గురించి చెప్పారు అక్కడి ఫ్రెండ్స్. జిమ్‌లో చేరింది. ఇవన్నీ చేస్తూ ఉత్సాహంగా కనపడుతున్న భార్యను చూసి సంతోషపడ్డాడు ఆమె భర్త. పైగా ఆమె ఆరోగ్యంలో వచ్చిన మార్పూ గ్రహించాడు. కాబట్టి దేనికీ అడ్డుచెప్పలేదు. తెలియని పనిని భుజాన వేసుకోదు. భుజాన వేసుకున్న పనిని చేసేదాకా వదిలిపెట్టని నైజం కిరణ్‌ది. ఆమె దారికి భర్త అడ్డురాకపోవడానికి ఇదీ ఒక కారణమే. అదీగాక ఉద్యోగరీత్యా రకరకాల షిఫ్ట్‌లు, ప్రయాణాలతో భర్త ఎప్పుడూ బిజీయే. పిల్లలను చూసుకుంటూ మిగిలిన టైమ్‌ను ఈ రకంగా వినియోగించుకోవడం మొదలుపెట్టింది కిరణ్.
ఫిట్‌నెస్‌కి ముందు కిరణ్...
సెలబ్రిటీ ట్రైనర్... బాడీ బిల్డర్
పొద్దున నాలుగింటికే జిమ్‌కు వెళ్లిపోయి పిల్లలు నిద్రలేచే టైమ్‌కల్లా ఇంటికి వచ్చేసేది. పిల్లలను స్కూల్‌లో పంపి మళ్లీ కసరత్తు చేసేది. ఆరేడునెలలు తిరిగేసరికి ఈ శ్రమ ఆమెను 24 కిలోల బరువు తగ్గేలా చేసింది. ఆ ఉత్సాహాన్ని కొనసాగించింది. దాంట్లోనే కెరీర్ వెదుక్కునే దారి కోసం వెదికింది. ఆన్‌లైన్‌లో జిమ్ ట్రైనర్‌గా శిక్షణ తీసుకుంది. 2008లో బేగంపేట్ (హైదరాబాద్)లో సొంతంగా జిమ్‌ను ప్రారంభించింది. కిరణ్ వర్కవుట్స్ గురించి ఇతర జిమ్ ట్రైనర్స్ ద్వారా టాలీవుడ్ సెలబ్రెటీల చెవిన పడింది. రామచరణ్‌కు తెలిసి ఉపాసన వరకూ వెళ్లింది. దాంతో ఉపాసన.. కిరణ్ సమక్షంలో ఎక్సర్‌సైజులు మొదలుపెట్టింది. పోల్చుకోలేనంత స్లిమ్ అయిపోయింది ఉపాసన. అలా తమన్నా, అనుష్కశెట్టి, జయప్రద, ప్రభాస్, రాజమౌళి, ప్రకాశ్ రాజ్, తమిళ నటులు సూర్య, ఆర్యలకూ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేసింది కిరణ్. తమన్నా కోసం ఇప్పటికీ పనిచేస్తోంది.
సూర్యతో కిరణ్ డీమ్‌బ్లా
సిక్స్‌ప్యాక్.. బ్యూటిఫుల్ బాడీ
‘ఫిట్‌నెస్ సాధించాను. కాని అదొక్కటే సరిపోదు కదా’ అనుకొని సిక్స్ ప్యాక్‌కి సిద్ధం కావాలని నిర్ణయించుకుంది కిరణ్. ఇది 2012 నాటి సంగతి. అనుకోవడమే తడవుగా గట్టి ప్రయత్నమూ మొదలుపెట్టింది. ఎనిమిది నెలల్లో సిక్స్ ప్యాక్ సాధించి చూపించింది కిరణ్. తర్వాత కొంతకాలానికే అంటే 2013లో హంగేరీలో వరల్డ్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఆ పోటీలకు డైరెక్ట్ ఎంట్రీ పొందిన ఏకైక మహిళా పోటీదారు కిరణ్ కావడం విశేషం. ఆమె ఘనత కూడా. అయితే ఇంకో పదిహేనురోజుల్లో ఆ పోటీలున్నాయనగా ఆమె కుటుంబంలో ముగ్గురు బంధువులు చనిపోయి మానసికంగా కుంగిపోయే పరిస్థితి ఎదురైంది. భర్త అండగా నిలిచాడు. వెన్నుతట్టాడు. పోటీల్లో పాల్గొంది. ఆరవ స్థానంలో నిలిచింది. ‘బ్యూటీఫుల్ బాడీ’ టైటిల్‌ను గెలుచుకుంది.
డీజే..
కిరణ్‌లోని ఈ కళను చెప్పుకునే ముందు ఆమె నేపథ్యం చెప్పుకోవాలి. కిరణ్ సొంతూరు ఆగ్రా. సంప్రదాయ ఉమ్మడి కుటుంబంలోని ఆడపిల్ల. ఆమె తల్లి, మేనత్త, తోబుట్టువులు అందరికీ సంగీతం వచ్చు. ఆ ప్రభావంతో ఊహతెలియకముందే సరిగమల సాధన మొదలుపెట్టింది. ఊహ వచ్చేసరికి ప్రదర్శనలు ఇవ్వడమూ ప్రారంభించింది. హిందుస్థానీ సంగీతానికి తోడుగా తబలా వాద్యాన్ని, కథక్ నృత్యాన్నీ నేర్చుకుంది. ఎమ్మే మ్యూజిక్ చేసింది. ‘‘కాని పెళ్లితో వాటన్నిటినీ అటకెక్కించాల్సి వచ్చింది’’ అంటుంది కిరణ్ నవ్వుతూ. అలా అటకెక్కిన సంగీతం 2013 తర్వాత ఆమె గొంతులో పడింది.
తమన్నాతో కిరణ్ డీమ్‌బ్లా
సమకాలీన ఒరవడినీ ఒడిసిపట్టి... డీజేయింగ్‌లో ట్రైనింగ్ తీసుకొని డిస్కో జాకీగా మారింది. పాపులర్ అయింది. అక్కడితో ఆగిపోతే ఈ స్టోరీ ఇక్కడికే ఎండ్ అయ్యేది. వీటికి సమాంతరంగా మౌంటెనీరింగ్‌నూ ట్రాక్‌లో పెట్టింది. అయిదేళ్లుగా ప్రతియేడాది పర్వతారోహణకు వెళ్తుంది. ఇప్పటికే హిమాలయాలకు చెందిన అయిదు భిన్న ప్రాంతాల నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ వెళ్లింది కిరణ్. ఒక మజిలీ చేరగానే మరో కొత్త ప్రయాణానికీ సన్నద్ధమవడం కిరణ్ తత్వం. అలా ఇప్పుడు ఫొటోగ్రఫీని చేర్చుకుంది. నేర్చుకుంది. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా కెమెరాను చేతబట్టుకుంది.
ప్రభాస్‌తో కిరణ్ డీమ్‌బ్లా
నేను కండలు పెంచుతుంటే వింతగా చూసినవారున్నారు. నన్ను కామెంట్ చేసినవాళ్లలోఆడవాళ్లూ ఉన్నారు. అలాంటి మాటలకు విలువివ్వాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎవరేమనుకుంటారో అని నా ప్రయాణాన్ని ఆపను. నేను చేసిన .. చేసే ప్రతిపని నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పెంచుతోంది. నా పిల్లలు నన్ను చూసి గర్వపడ్తారు. ముందు మనింట్లో వాళ్లకు మనం స్ఫూర్తినివ్వాలి. తర్వాత సమాజానికి. మార్పు ఇంటి నుంచే మొదలవుతుంది. ఆడపిల్లలు ఎవరికివారే ధైర్యం నింపుకోవాలి. సెల్ఫ్‌డిఫెన్సివ్‌గా తయారుకావాలి. తల్లిదండ్రులు అలా పెంచాలి. మానసికస్థైర్యం ఇవ్వాలి. అలాగే అమ్మాయిలు కూడా తమతో సమానమనే స్పృహతో అబ్బాయిలను పెంచాలి.
– కిరణ్ డీమ్‌బ్లా
Comments
Please login to add a commentAdd a comment