ఒక నిమిషం – ఒక విశేషం | special story for some doughts on god and vasthu | Sakshi
Sakshi News home page

ఒక నిమిషం – ఒక విశేషం

Published Sun, Jan 22 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

ఒక నిమిషం – ఒక విశేషం

ఒక నిమిషం – ఒక విశేషం

శ్లోకం... భావం
ఉపకారిషుయస్సాధుః సాధుత్వే తన్యకోగుణః
అపకారిషు యస్సాధుః సాధుః సద్భి రుచ్యతే

తాత్పర్యం: ఉపకారం చేసిన వారిపట్ల మంచితనం చూపిస్తే ఆ మంచితనంలో గొప్పదనమేముంది? ఎవరైతే అపకారుల విషయంలో మంచితనం చూపిస్తారో, వారే అసలైన సాధువులుగా కీర్తిపొందుతారు.

ఉదాహరణ: దుర్యోధనుడు మాయాజూదంలో ధర్మరాజును ఓడించి, ద్రౌపదిని అవమానించి, చివరికి వారిని అరణ్యాల పాలు చేశాడు. అక్కడ కూడా వారు సుఖంగా ఉంటారేమోనని, వివిధ రీతులలో అష్టకష్టాలకు గురి చేశాడు. చివరకు వారికి తన భోగభాగ్యాలు చూపించి, వారు కుళ్లుకునేలా చేయాలని ఘోషయాత్ర పేరుతో వారున్న చోటికి వచ్చి గంధర్వులు చేతిలో చిక్కాడు. ధర్మరాజు దుర్యోధనుడికి తగిన శాస్తి జరిగింది అని సంతోషించలేదు. తన తమ్ముళ్లైన భీముణ్ణీ, అర్జునుణ్ణీ పంపి, వారిని విడిపించాడు. క్షమాగుణానికి, ధర్మనిరతికి మారుపేరుగా నిలిచాడు.

 పూజామందిరం ఇలా...
ఇంటిలో ఈశాన్యదిక్కుగా పూజామందిరం ఉండాలన్నది శాస్త్రోక్తి. అద్దె ఇంటిలో అలా కుదరకపోవచ్చు. అయితే వసతి ఉన్నంతలో కనీసం మన ఇష్టదైవపటం ఒక్కటైనా సరే, ఇంటిలో ఒక మూలన పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దేవుణ్ణి మనకంటే తక్కువ ఎత్తులో ఉంచరాదు. అంటూ కిందికి చూస్తూ పూజ చేయరాదు. అలాగని మరీ పైన అంటే అందనంత ఎత్తులో కూడా ఉంచరాదు. పూజామందిరం లేదా పూజకు వాడే బల్ల మనకు అభిముఖంగా అంటే ఎదురుగా ఉండాలి. మన చూపు సరిగ్గా దేవుడి మీద ప్రసరించేలా దేవుడి ప్రతిమలు లేదా పటాలను అమర్చుకోవాలి. దేవుడి గూడు మీద అధిక బరువులు ఉంచరాదు. పడక గది గోడకు దేవుడి క్యాలెండర్‌ ఉంటే తప్పు లేదు కానీ, పడకగదిలోనే పూజ చేయడం, అక్కడే దీపారాధన చేయడం మంచిది కాదు. వసతి లేనప్పుడు అంటే ఒకే గదిలోనే నివసించవలసి వచ్చినప్పుడు ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకుని, అందులోనే దేవుడిని ఉంచాలి.

ధర్మసందేహం
ద్రౌపది మహాపతివ్రత కదా, ఐదుగురు పుత్రులను కోల్పోయి, కడుపుకోత అనుభవించవలసి వచ్చిన దుస్థితి ఆమెకు ఎందుకు వచ్చింది?
ద్రౌపది సాక్షాత్తూ పరమేశ్వరీ అంశలో అగ్నిగుండం నుంచి పుట్టిన  అయోనిజ. అర్జునుణ్ణి పెళ్లాడటం కోసమే పుట్టి, మిగిలిన నలుగురినీ కుంతికోరిక మీద భర్తలుగా స్వీకరించిన ఉత్తమురాలు. అలాగే పాండవులైదుగురూ యమ– వాయ– ఇంద్ర– అశ్వినీ దేవతల అంశలలో పుట్టిన వారు. అమ్మవారి నామాలలో చిదగ్నికుండ సంభూతా... భవబంధ విమోచనీ అనే నామాలున్నాయి. అంటే ఈ లోకపు బంధాలనుంచి మనందరినీ విడిపించడం కోసం అగ్నికుండం నుంచి పుట్టినది అని అర్థం. మన బంధాలనే విడిపించే ఆమె తనకంటూ ఐదుగురు భర్తలనీ, ఐదుగురు పుత్రులనీ అనుబంధంగా ఉంచుకుంటుందా? అందుకే ఐదుగురు భర్తలకంటే ముందుగా తానే పడిపోయే వంక వెతుక్కుంది. అంతకుముందే ఐదుగురు పుత్రులని కోల్పోయే స్థితిని కలిగించుకుంది. ఇదంతా జగన్నాటకం కోసమే తప్ప యథార్థం కాదు.

కొలనుభారతి ఆలయం
సరస్వతీదేవికి ఆలయాలు ఎక్కడున్నాయని అడిగితే భాసర, వర్గల్‌... ఇంకా ఎక్కువ పేర్లు చెప్పాలంటే ఎంతటివారైనా కాస్తంత తడబడతారు. అయితే, కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని దట్టమైన అడవీ ప్రాంతంలో ఎల్తైన కొండల నడుమ, చారుఘోషిణీ నది ఒడ్డున అమ్మవారికి ఆలయం ఉంది. కొలనుభారతి అనే పేరుతో వెలసిన ఈ అమ్మవారికి 11వ శతాబ్దికి చెందిన మల్లభూపతి అనే చాళుక్యరాజు నిర్మించినట్లు శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది. భారతీదేవి సన్నిధిలో విద్యాభ్యాసం ప్రారంభిస్తే, అత్యున్నత స్థాయికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం.

ఎలా వెళ్లాలంటే.. కొలనుభారతి క్షేత్రానికి వెళ్లాలంటే ముందు శ్రీశైలం లేదా కర్నూలుకు చేరుకోవాలి. ఆత్మకూరుకు చేరినా దగ్గరే. అక్కడినుంచి మండల కేంద్రమైన కొత్తపల్లివ మీదుగా సుమారు 15 కిలోమీటర్లు వెళ్తే శివపురం గ్రామం వస్తుంది. అక్కడినుంచి మరో 5 కిలోమీటర్లు మెటల్‌ రోడ్డుగుండా ప్రయాణించి కొలనుభారతి ఆలయాన్ని చేరుకోవచ్చు.

వివాహ సంప్రదాయంలో...
హిందూ వివాహ సంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టాలు 35 ఉన్నాయి. అవి పెళ్లిచూపులు, నిశ్చితార్థం, స్నాతకం, కాశీయాత్ర, వరపూజ– ఎదురుకోలు, గౌరీపూజ, మంగళస్నానాలు, కన్యావరణం, మధుపర్కాలు, యజ్ఞోపవీతధారణ, మహాసంకల్పం, కాళ్లుకడగటం, సుముహూర్తం (జీలకర్ర, బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచటం, కాళ్లు తొక్కించటం, కన్యాదానం, సువర్ణజలాభిమంత్రం, యోక్త్రబంధనం, మంగళసూత్రధారణం, తలంబ్రాలు, బ్రహ్మముడి, గౌరీశంకర సంవాదం (అంగుళీయకాలు తీయడం), సప్తపది పాణిగ్రహణం, హోమం, సన్నికల్లు తొక్కడం, లాజహోమం, స్థాళీపాకం, నాగవల్లి, సదస్యం, నల్లపూసలు కట్టడం, అరుంధతీ దర్శనం, ఉయ్యాలలోని బొమ్మను ఆడపడచుకు అప్పజెప్పడం, అంపకాలు, గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం, కంకణ విమోచనం, గర్భాదానం... ఈ ముప్ఫై ఐదూ వివాహ సంప్రదాయంలో జరిగే తంతులు.

ఏ దేవుడికి ఏ పూలంటే..?
జాజి, జమ్మి, దర్భ, కొండమల్లెలు, మల్లెలు, గన్నేరు, నాగపుష్పాలు, పున్నాగ, అశోక, సంపెంగ, పొగడ, తామర, మారేడు అన్ని దేవుళ్ల పూజకూ ఉపయోగించవచ్చు.

∙స్త్రీ దేవతల పూజలో తులసి పత్రిని ఉపయోగించరాదు ∙ఎర్రమందారాలు మినహా మరే ఇతర ఎర్రనిపూలను పురుష దేవతల పూజకు వాడరాదు ∙విష్ణుమూర్తిని అక్షతలతోనూ, దుర్గను గరికతోనూ, గణపతిని తులసితోనూ, శివుణ్ణి మొగలిపూవులతోనూ పూజించరాదు ∙దేవతార్చనకు వాడే పూలను కడగటం, వాసన చూడటం అపరాధం.

చిరగనివి, పురుగులు లేనివి, తాజాగా ఉన్నవి, తన తోటలో లేదా పెరటిలో పూసినవి, ద్రవ్యం ఇచ్చి కొనుగోలు చేసినవి, ఇంటి యజమాని అనుమతితో కోసిన చెట్టు పూలను మాత్రమే పూజకు ఉపయోగించడం శ్రేష్ఠం.
విష్ణువును మాలతి, జాజి, మొగలి, మల్లె, అశోకం, సంపెంగ, పున్నాగ, పొగడ, కలువ, మల్లె,  గన్నేరు, ఉత్తరేణి, గుంటగలగర, చండ్ర, జమ్మి, గరిక, దర్భ పూలతో పూజిస్తే మిక్కిలి ప్రసన్నుడవుతాడు. అదేవిధంగా మరువం, దమనం, తులసి పత్రాలతో పూజించడం ప్రశస్తం.
మామిడిపూల గుత్తులతో పూజించడం మహా ప్రీతికరం.

సుభాషితం
∙ప్రజలందరూ ఇష్టపడే చక్కని శీలం కలవారికి నిప్పు నీరులాగా, సముద్రం పిల్లకాలువలాగా, మేరు పర్వతం చిన్న గులకరాయిలాగా, సింహం జింకపిల్లలాగా, విషసర్పం పూలమాల మాదిరిగా, విషం అమృతం లాగా అవుతాయి. ∙శ్వర్యానికి సౌజన్యమే అలంకారం. శౌర్యానికి మితభాషిత్వమూ, జ్ఞానానికి శాంతి, శాస్త్రజ్ఞతకు వినయమూ, ధనానికి పాత్రదానమూ, తపస్సుకు శాంతం, ప్రభువుకు సహనం, ధర్మానికి అపకీర్తి, ఆశ్రిత పక్షపాతం లేకుండటం అలంకారాలు.

మీకు తెలుసా?
పరుగెత్తే వారికి, ఆవులించేవారికి, తలస్నానం చేస్తున్న వారికి, భగవంతుని సన్నిధిలో ఉన్నవారికి నమస్కరించకూడదు. ఉదయించే, అస్తమించే సూర్యుడిని నీళ్లలోనూ, అద్దంలోనూ చూడరాదు.

పుస్తకం: కుండలినీ వికాసం... వివరణ
మనం తరచు కుండలినీ శక్తి, కుండలినీ సాధన అని వింటూ ఉంటాం. చాలా పుస్తకాలలో, నవలలలో కుండలిని గురించి ప్రస్తావిస్తారు కానీ, అదేమిటో, ఆ శక్తిని ఎలా జాగృతం చేయాలో ఒక్కరూ  స్పష్టంగా వివరించరు! ఆ లోటును తీర్చడానికా అన్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి మైత్రేయ ‘కుండలినీ వికాసం’ పేరుతో పుస్తకాన్ని అందించారు. ఇందులో కుండలిని అంటే ఏమిటి, ఆ శక్తి ప్రాశస్త్యం, శక్తి కేంద్రకాలు, ఏం చేస్తే ఆ కేంద్రకాలు చైతన్యవంతమవుతాయో కూడా చెప్పారు. అలాగే శ్రీ చక్రం గురించి కూడా సాకల్యంగా వివరించారు. మనిషి ద్వైతభావాన్ని విడనాడి, అద్వైతభావాన్ని చేరుకోవడానికి ఏం చేయాలో తంత్ర, యంత్ర, ముద్ర, క్రియాయోగ ప్రక్రియలతో సహా సులభశైలిలో సచిత్రంగా వివరించారు.

కుండలినీ వికాసం
వెల: రూ.300; ప్రతులకు: 040 2315 6070; 99635 21696
www.swamimaitreya.org


మంత్రం అర్థం..?
‘మననాత్‌ త్రాయతే ఇతి మంత్రః’ అని.. దేనిని మననం చేస్తే రక్షణ చేయగలదో దానిని మంత్రం అంటారు. మననం చేస్తే రక్షించగలిగే శక్తి దేనికి ఉంటుందో, దానికే మంత్రం అని పేరు. బీజాక్షరాలతో కూడుకుని ఉండటం వల్ల మంత్రానికి ఆ శక్తి ఉంటుంది. అయితే ఆ రక్షణశక్తి అంతర్లీనంగా ఉంటుంది. ఒక్కొక్క మంత్రంలో ఒక్కో బీజాక్షరం ఉండచ్చు. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క రుషి ఉంటారు. ఆ బీజాక్షరానికి ఒక దైవం ఉంటాడు. ఆ బీజాక్షరాన్ని మననం చేసినప్పుడు అది లో లోపలే విస్ఫోటనం అయి, రుషి అనుగ్రహం చేత, దేవత అనుగ్రహం చేత, దానిని ఎవరు మననం చేశారో వారిని రక్షించేటటువంటి శక్తిని లోపల ప్రసారం చేస్తుంది. అటువంటి మంత్రాన్ని ఎవరైనా ఒక గురువు వద్ద ఉపదేశం తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement