హార్టాసన | Special Story On International Yoga Day | Sakshi
Sakshi News home page

హార్టాసన

Published Fri, Jun 21 2019 8:22 AM | Last Updated on Fri, Jun 21 2019 8:22 AM

Special Story On International Yoga Day - Sakshi

మనిషన్నాక ఏదో ఒక రోగం, మందన్నాక ఏదో ఒక రూపం ఉండాలి. ముక్కుదిబ్బడ పెద్ద రోగం కాదనకుంటాం. కానీ ముప్పుతిప్పలు పెడుతుంది. కోల్డ్‌ యాక్ట్‌ వేస్తాం. విక్స్‌ వేపోరబ్‌ రాస్తాం. నివారణ్‌ తాగుతాం. ఇన్‌హేలర్‌ పీలుస్తాం. ఇన్నున్నాయి మందులు. ముక్కుదిబ్బడ చిన్న రోగం అనుకుంటే, గుండెదడ పెద్ద రోగం. దిబ్బడకు, దడకు మధ్యలో బాడీలో ఎన్ని పార్టులైతే ఉన్నాయో అన్ని పార్టులకూ ఏదో ఒకటి రాకుండా పోదు, తిన్నగా ఉండం కనుక! తిన్నగా ఉన్నా కూడా వారసత్వంగా ఉన్నవాటిని, వస్తున్నవాటిని తప్పించుకోలేం. వీటన్నిటికీ ట్రీట్‌మెంట్‌ ఉంది. ట్రీట్‌మెంట్‌తో ప్రతిదీ నయం అవుతుంది. అసలు మాత్రను మింగగానే, గుళికను నోట్లో వేసుకోగానే, మూత నిండా సిరప్‌ తాగగానే, ఇంజెక్షన్‌ పొడిపించుకోగానే, సెలైన్‌ పెట్టించుకోగానే, వేర్లు, చూర్ణాలు, లేపనాలు ఒంటిని తాకగానే.. ఒంట్లో నయం అయిన ఫీలింగేదో తక్షణం కలుగుతుంది. మందును కళ్లతో చూడ్డం వల్ల కలిగే ఫలితం కావచ్చు ఆ ఫీలింగ్‌. మనకు అనేక వైద్య విధానాలున్నాయి. అలోపతి, నేచురోపతి, హోమియోపతి, యునాని, సిద్ధ, యోగా.. ప్రతి విధానంలోనూ ఔషధానికి ఒక రూపం ఉంది. వీటిల్లో ఒక్క యోగాకే రూపం లేదు! మరి రూపం లేనిది మందెలా అవుతుంది? మందు కానప్పటికీ కోట్లాది మందికి అనేక అనారోగ్యాల నుంచి విముక్తిని ఎలా కల్పించగలుగుతోంది!

యోగాకు రూపం లేదనే మాట తప్పు. రూపం ఉంది. ఆ రూపం పేరే ‘ఆసనం’. మిగతా విధానాలన్నీ మెడిసిన్‌ని బయటి నుంచి బాడీకి అందిస్తాయి. యోగాసనం మాత్రం బాడీ తనకై తనే మెడిసిన్‌లని తయారు చేసుకునేలా చేస్తుంది! అద్భుతం కదా!! ఇంకో అద్భుతం కూడా ఉంది చూడండి. ఫిజికల్‌గా, మెంటల్‌గా, స్పిరుచ్యువల్‌గా.. మూడు రకాలుగా యోగా మన దేహానికి స్వస్థతను చేకూరుస్తుంది. అంటే ఒకే ఆసనానికి మూడు యాక్షన్‌లు ఉంటాయని కాదు. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా చికిత్స దేనికి అవసరం అయితే దానికి ప్రత్యేకంగా ఒక ఆసనం ఉంటుంది. అలాగే ఒక్కో ఆనారోగ్యానికి ఒక్కో ఆసనం చికిత్సగా పనిచేస్తుంది. ఈ రోజు (జూన్‌ 21) ఇంటర్నేషనల్‌ యోగా డే. ఐక్యరాజ్య సమితి ఒక రోజు ముందే నిన్న యోగా డేని సెలబ్రేట్‌ చేసుకుంది. ఇవాళ ‘యోగా విత్‌ గురూస్‌’ అనే అంశంపై న్యూయార్క్‌లో సదస్సు నిర్వహిస్తోంది. ఈ ఏడాది యోగా డేకి ఐరాస థీమ్‌ : క్లైమేట్‌ యాక్షన్‌. 

మనం ఆ థీమ్‌ని ఫాలో అవుతూనే, వేరుగా ‘యోగా ఫర్‌ హార్ట్‌’ అనే ఇంకో థీమ్‌తో యోగా డేని జరుపుకుంటున్నాం. కేంద్రంలో మనకు ‘ఆయుశ్‌’ అనే మంత్రిత్వ శాఖ ఉంది. ఆయుర్వేదం, యోగా అండ్‌ నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి.. వీటన్నిటినీ కలిపి ‘ఆయుశ్‌’ అని పేరు పెట్టారు. ఆ శాఖ మంత్రి శ్రీపాద్‌ శయో నాయక్‌. ఆయనే మనం ఈ ఏడాది యోగా డేని ‘యోగా ఫర్‌ హార్ట్‌’ గా జరుపుకుంటున్నట్లు ప్రకటించారు. ‘‘ఇంటింటికీ యోగా సందేశాన్ని తీసుకెళ్లడం మా ఉద్దేశం’’అని ఆ ప్రకట విడుదల చేస్తున్నప్పుడు ఆయన అన్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలోని ప్రభాత్‌ తారా మైదాన్‌’కు వస్తున్నారు. అక్కడ ఆయన సంకేతమాత్రంగా గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే యోగాసనాన్ని వేస్తారు. ఇక ఈ ఏడాదంతా.. యోగాసనాలు గుండె చుట్టూ తిరుగుతుంటాయి. అలా ప్రోగ్రాములను ప్లాన్‌ చేస్తారు. ఈ సందర్భంగా మనమూ, కొన్ని హార్ట్‌ ఆసనాల గురించి తెలుసుకోవడం సందర్భోచితంగానే కాదు, ఇన్‌స్పైరింగ్‌గా కూడా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement