హారతి కళ్లకు అద్దుకోవటం
• సన్నిధి అంతరార్థం
ఇంటిలో, ఆలయాల్లో, పూజామందిరాలలో, నోములు, వ్రతాల వంటి శుభకార్యాలలో హారతి ఇవ్వడం సర్వసాధారణం. ఈ హారతిని దర్శించుకుని, కన్నులకు అద్దుకోవడం అంతే సాధారణం. జ్యోతిస్వరూపం. పరమాత్ముడు స్వయంప్రకాశక స్వరూపుడు. వెలుగు అనేది అంధకారాన్ని తొలగించి వస్తువును దృష్టికి కనిపించేలా చేస్తుంది. చీకటిలో వస్తువులను చూడలేం. అజ్ఞానం అనే అంధకారం ఉన్నప్పుడు ఆ పరమాత్మ స్వరూపాన్ని చూడలేం. కాబట్టి కళ్లకు హారతి అద్దుకుంటూ అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని కలిగించమని భగవంతుడిని ప్రార్థించాలి.
సూర్యుడిలోని జ్యోతి, పరమాత్మ యొక్క ప్రకాశం, మన నేత్రాలలోని జ్యోతి ఒక్కటే. దానికి గుర్తుగానే హారతి ఇచ్చినప్పుడు కన్నులకు అద్దుకుంటాం. మరోరకంగా చూస్తే, కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి. శ్వాసకోశవ్యాధులు, అంటువ్యాధులు దరిచేరవు. కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో, అలాగే మనం తెలిసీ తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని వేడుకుంటూ హారతిని కళ్లకద్దుకోవడం అసలు సిసలైన ఆధ్యాత్మిక అంతరార్థం.