సిగటోకతో అరటి దిగుబడికి ముప్పు
- పొంచి ఉన్న తెగుళ్లు, పురుగుల బెడద
- సిగటోక, బ్యాక్టీరియా కుళ్లు తెగులు, పండుఈగతో నష్టం
- వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీనివాసులు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా సాగులో ఉన్న అరటి తోటలకు ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా పురుగులు, తెగుళ్లు సోకి నష్టం కలిగించే పరిస్థితి ఉందని రేకులకుంట వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సిగటోక మచ్చ తెగులు, బ్యాక్టీరియా కుళ్లు తెగులు, తామర పురుగులు, పండు ఈగ లాంటి వాటితో అరటి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
+ జిల్లాలో 90 శాతం తోటలు ఫిబ్రవరి-మార్చి నెలలో సాగులోకి వచ్చాయి. అరటితోటలు ప్రస్తుతం ఐదు నుంచి ఆరు నెలల వయస్సులో ఉన్నాయి. వచ్చే నెలల్లో ఎక్కువ తోటలు గెల వేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఓ వైపు వర్షం, మరోవైపు వేడి వాతావరణ పరిస్థితులు ఉన్నందున చీడపీడలు దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. తెగుళ్లు లక్షణాలు కనిపించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
+ అరటిని బాగా దెబ్బతీసే వాటిలో సిగటోక మచ్చ తెగులు ప్రధానమైంది. ఇది సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వ్యాపించే అవకాశం ఉంది. దీని నివారణకు మొదటి దఫా కింద 2 గ్రాములు క్లోరోథలోనిల్ లేదా 2.50 గ్రాములు మాంకోజెబ్ + జిగురు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండో దఫా కింద 2 మి.లీ హెక్సాకొనజోల్ + జిగురు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మూడో ధఫాగా 1 మి.లీ ప్రొపికొనజోల్+ జిగురు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి తగ్గకుంటే చివరగా 1 మి.లీ కాలిక్సిన్ + జిగురు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. జిగురు ద్రావణం అంటే సాండోవిప్ లేదా డానువిప్ లేదా ఆప్సా–80 లేదా ట్రైటాన్ ఎక్స్–100 ను ఎంచుకుని ఒక లీటర్ నీటికి 0.5 మి.లీ కలుపుకోవాలి.
+ బ్యాక్టీరియా కుళ్లు తెగులు వ్యాపిస్తే మొక్క, దుంప, వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. నివారణకు 20 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్లు, మొవ్వ బాగా తడిచేలా పోయాలి. అవసరమైతే 1 గ్రాము కార్బండిజమ్ + 0.5 గ్రాము స్రెప్టోసైక్లీన్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
+ గెలకు బయటకు వచ్చిన సమయంలో తామర పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. గెలలో హస్తాలు విచ్చుకున్న తర్వాత, మగ పువ్వును తుంచేసిన తర్వాత 2 మి.లీ పిప్రోనిల్ + 10 గ్రాములు 13–0–45 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దీని వల్ల తామర పురుగులు నశించిపోవడమే కాకుండా కాయలు మంచి సైజు, నాణ్యతగా వస్తాయి.
+ ఇక పండు ఈగ నివారణకు మీథైల్ యూజినాల్ మందుతో ఎరలు తయారు చేసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి. గెలలకు పాలిథీన్ కవర్లు తొడిగితే కొన్ని రకాల పురుగుల వల్ల నష్టం తగ్గిపోతుంది.