అరటిని కాపాడుకోండి
– శిక్షణ కార్యక్రమంలో శాస్త్రవేత్త శ్రీనివాసులు
అనంతపురం అగ్రికల్చర్ : మార్కెట్‌లో మంచి ధరలు ఉన్నందున అరటిలో మంచి దిగుబడులు వచ్చేలా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని రేకులకుంట డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖరగుప్తా ఆధ్వర్యంలో అరటి సాగుపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ ఆదినారాయణతో పాటు శ్రీనివాసులు హాజరై సాగు పద్ధతుల గురించి అవగాహన కల్పించారు.
యాజమాన్య పద్ధతులు
అరటి తోటలు దాదాపు కోత దశలో ఉన్నాయి. గెల వేసిన అరటి చెట్లు గాలులకు పడిపోకుండా కట్టెలతో పోటు పెట్టుకుంటే మేలు. గెలలకు ఎండ సోకకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పాలి. కోత తర్వాత పంట కోసం సూటి పిలక ఒక్కటి ఉంచి మిగతావన్నీ కోసేయాలి. రెండో పంట కావడంతో పంట కాలం నెల తక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో సూటి పిలక ఉంచిన తర్వాత నత్రజని, పొటాష్ ఎరువులు వేసుకోవాలి. సింగిల్ సూపర్ పాస్ఫేట్ అవసరం లేదు.
లేదంటే వారం రోజులు వరుసగా రోజుకు ఎకరాకు ఒక కిలో 13–0–45 నీటిలో కరిగే ఎరువులు డ్రిప్ ద్వారా పంపాలి. తర్వాత మూడు రోజులు విరామం ఇచ్చి మళ్లీ డ్రిప్ ద్వారా తగిన మోతాదులో ఎరువులు పంపాలి. జింక్, బోరాన్, మెగ్నీషియం లాంటి సూక్ష్మపోషకాల లోపాన్ని సవరించడానికి వీలుగా 5 గ్రాములు ఫార్ములా–4 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. వేసవి కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే మందుల పిచికారి చేసుకోవాలి. కొత్తగా అరటి మొక్కలు నాటే వారు ఉత్తర, దక్షిణం దిక్కుల్లో నాటుకుంటే మేలు. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటంతో మొక్కలు చనిపోకుండా పడమటి దిశలో ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 250 గ్రాములు వర్మీకంపోస్టు, 250 గ్రాములు వేపచెక్క వేసుకోవాలి.