మిస్టర్ పశువు
రావణాసురుడు సీతను బంధించాడు.. రాక్షసుడు!
కీచకుడు ద్రౌపదిని వేధించాడు..రాక్షసుడు!
ఇంద్రుడు అహల్యను మోసగించాడు.. రాక్షసుడే!
వీళ్లంతా పరస్త్రీని వేధించి రాక్షసులయ్యారు.
మరి మొగుడే మృగంలా ప్రవర్తిస్తే?
ఇఫ్ హి బికమ్స్ ఎ బీస్ట్ ఇన్ ద బెడ్రూమ్?
వాడు... మిస్టర్ పశువు! వాడికి... సంకెళ్లు రెడీ!!
రాత్రి .. పన్నెండుంపావు. వాక్... వ్వా.... క్...వాంతి చేసుకుంటోంది ప్రణవి. అంతకు ముందు జరిగింది గుర్తొచ్చి పొట్టలోంచి తన్నుకొస్తోంది వికారం. ఉండుండి కక్కుతోంది. మనసులో ఉన్న ఏవగింపూ బయటకు వస్తోంది వాంతి రూపంలో! ఓ పదిహేను నిమిషాలకు కడుపు ఖాళీ అయిపోయింది. కాని మెదడు ఇంకా భారంగానే ఉంది. తల నొప్పి మొదలైంది. మొహం కడుక్కొని టవల్‌తో తుడుచుకుంటూ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది. బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతున్నాడు భర్త. ఓ వికృత చేష్ట తర్వాత అలసిపోయిన మృగంలా కనిపించాడు ప్రణవికి.దుఃఖం ఆగట్లేదు. బెడ్ అంచు మీద కూర్చోని టవల్‌లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అలా ఎంతసేపు ఏడ్చిందో తెలియదు. అసలు నిద్ర పట్టిందో లేదో కూడా తెలియదు! ఆ బాధ, ఆ వికారం, ఆ వాంతులు, ఏవగింపు, జుగుప్స .. ఆ రాత్రే కొత్త కాదు. మొదలూ కాదు. ఆఖరిది కూడా కాదు ప్రణవికి.
కొన్నాళ్లే... సంబరం!
ప్రణవి, మోహన్ పెళ్లయి పదకొండు నెలలవుతోంది. పెద్దలు కుదిర్చిందే. పెళ్లయిన నెల అంతా సవ్యంగా, నార్మల్‌గా గడిచింది. నిజం చెప్పొద్దూ... మోహన్ లాంటి వ్యక్తి భర్తగా దొరికినందుకు ప్రణవీ మురిసిపోయింది. తమ బంధువుల్లోని ఆడపిల్లల సంసారాలతో తన కాపురాన్ని పోల్చుకొని పొంగిపోయింది. తన అదృష్టాన్ని తలచుకొని తబ్బిబ్బయింది. హనీమూన్ తర్వాత తొలిసారిగా తల్లిగారింటికి వెళ్లిన ప్రణవి మొహంలో ఆనందాన్ని పసిగట్టి ఇంటివాళ్లూ సంతోషపడ్డారు. కాని ఈ సంబరమంతా ఒక్క నెలరోజులే సాగింది!
ఊహించని ఉన్మాదం
మోహన్‌లోని అసలు మనిషి బయటకు వచ్చాడు. రాత్రవుతోందంటే చాలు ప్రణవికి చెమటలు పట్టేవి. వెన్నులోంచి వణుకొచ్చేది. అసలే ఆ పిల్లకు సెక్సువల్ లైఫ్‌కి సంబంధించిన నాలెడ్జ్ తక్కువ. పెళ్లికి ముందు దాని గురించి చెప్పినవాళ్లూ లేరు. అమ్మ చెప్పినా.. అమ్మమ్మ చెప్పినా.. మేనత్త చెప్పినా.. నానమ్మ చెప్పినా.. అత్తమామలకు, భర్తకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలి.. తల్లిగారింటి మర్యాద ఎలా కాపాడాలి.. అత్తింటి గుట్టు ఎంత చక్కగా గుప్పిట్లో దాచాలనే తప్ప సంసార జీవితం ఎలా ఉంటుంది.. ఎలా ఉండాలి.. ఏది నార్మల్.. ఏది అబ్‌నార్మల్.. అనే విషయాల గురించి ఊసే లేదు ఎవరి మాటల్లోనూ!
అందుకే పది నెలల నుంచి పడకగదిలో భర్త అబ్‌నార్మల్ ప్రవర్తనను నార్మల్ అనుకునే భరిస్తూ వస్తోంది. తన ఒంటి నిండా భర్త పంటి గాట్లే. ప్రైవేట్ పార్ట్స్ పుండవుతున్నాయి. ఒళ్లు పులిసిపోతోంది. తన నోటిని కూడా అసహ్యం చేస్తున్నాడు. తెల్లవారి అన్నం తినలేకపోతోంది. ఈ పదినెలలలో చాలా బరువు తగ్గింది. ప్రాణం కళ్లలోకి వచ్చింది. అయినా కనికరం చూపట్లేదు భర్త. చివరకు బహిష్టు సమయాల్లోనూ తనను వదలట్లేదు. ఇక తన వల్ల కాదు అనుకుంది.
ప్రతి రాత్రీ కంపరం
ఎప్పటిలాగే భోజనం ముగించుకొని బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు మోహన్. వంటిల్లు సర్దుతూ, గిన్నెలు కడుక్కుంటూ గదిలోకి రావడానికి తాత్సారం చేస్తున్న భార్యను వచ్చేవరకు పిలుస్తూనే ఉన్నాడు. అసహ్యాన్ని, నిస్సహాయతను, బాధను, భయాన్ని పంటిబిగువున పట్టి ఉంచి లోపలికి వెళ్లింది ప్రణవి. మోహన్‌లోని పర్వర్షన్ ఒళ్లు విరుచుకుంది. ప్రణవిని బొమ్మలా చేసి ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఉన్మాదాన్ని భరించలేని ప్రణవి అప్పటికప్పుడే భర్తని విడిపించుకుని, ఎప్పుడో సమాచారం సేకరించి పెట్టుకున్న ఓ ఎన్‌జీవో హోమ్‌కి పరుగున బయల్దేరి వెళ్లింది ఆ చీకట్లోనే!
‘బీస్టియాలిటీ’ని భరించనక్కర్లేదు
ప్రణవి భర్త సెక్సువల్ బిహేవియర్ సోడొమీ, ఫెలేషియో కిందకు వస్తుంది. అంటే ఆనల్ సెక్స్, సకింగ్ లేక లికింగ్ ఆఫ్ జెనైటల్స్! ఇలాంటి విపరీతమైన ప్రవర్తనతో చాలామంది మహిళలు శారీరక హింసకు, ఎవర్షన్‌కు గురవుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక, కాపురం అంటే అలాగే ఉంటుందేమోనని భరిస్తున్నారు. కాని ఇలాంటి ప్రవర్తన సాధారణం కాదు. సెక్సువల్ పర్వర్టెడ్‌నెస్, అన్ నేచ్యురల్ సెక్స్. ఇలాంటి అసహజమైన శృంగారాన్ని బీస్టియాలిటీ లేదా బెస్టియాలిటీ అంటారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ప్రకారం ఇవి నేరాలు కూడా. శారీరక కలయిక అన్నది సహజంగా, సౌకర్యంగా, అనందంగా ఉండాలి.
అంతేకాని అసహజంగా, రాక్షసంగా ఉండకూడదు. ఈ ప్రవర్తన మానసిక హింస కిందకు కూడా వస్తుంది. ఇలాంటి బాధలు పడే మహిళలు హిందూ వివాహచట్టం సెక్షన్ 13 (2- జీజీ) ప్రకారం విడాకులు తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కేవలం మహిళలకు మాత్రమే ఉపయోగపడే గ్రౌండ్. ప్రణవికి ఈ సెక్షన్ ధైర్యాన్ని ఇచ్చింది. లీగల్ కన్సల్టెంట్ సహాయం, భరోసాతో విడాకులకు కేస్ వేసింది. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా చేరింది. అయితే ఇక్కడ ప్రణవి విషయంలో ఇంకో అన్యాయం కూడా జరిగింది. ప్రణవితో కంటే ముందే మోహన్‌కు ఇంకో అమ్మాయితో పెళ్లయింది. మోహన్ పైశాచిక ప్రవృత్తిని భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.
ఆ విషయాన్ని దాచిపెట్టి ప్రణవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె విడాకుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఈ రహస్యం బయటపడింది. ప్రణవికి విడాకులు మంజూరయ్యాయి. ఇవన్నీ ఆలస్యంగా తెలుసుకున్నందుకు, తమ కూతురి బాధను అర్థం చేసుకోనందుకు పశ్చాత్తాపపడ్డారు ప్రణవి తల్లిదండ్రులు. ఇప్పుడు ప్రణవి నిర్ణయాన్ని ఆమోదించడమే కాక ఆమెకు కొండంత అండగా నిలబడ్డారు ఆ పేరెంట్స్!
ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com
నశించిన సహనం
‘మీ ఆయన ఆగడాల గురించి మీ ఇంట్లో వాళ్లకెప్పుడూ చెప్పలేదా?’ గృహహింస ఎదుర్కొంటున్న స్త్రీల కోసం, ఒంటరి స్త్రీల కోసం పనిచేస్తున్న ఎన్‌జీవోలో ఉన్న లీగల్ కన్సల్టెంట్ అడిగింది ప్రణవిని.
‘చెప్పాను మేడమ్. పెళ్లయిన ఆర్నెల్లకే. ముందు అందరూ అలాగే ఉంటారేమో అనుకొని సహించా. ఆ పిచ్చి రోజురోజుకూ ఎక్కువవుతుంటే అమ్మకు చెప్పా. అర్థం చేసుకోలేదు. తప్పించుకుంటున్నానుకొని నాకే సుద్దులు చెప్పి తిరిగి పంపించింది. అలా పంపిన రెండునెలలకే వచ్చి మళ్లీ చెప్పా. ఈసారి నానమ్మ, అమ్మ కలిసి క్లాస్ తీసుకున్నారు. ‘దొంగవేషాలు వేయకు.. పొద్దస్తమానం కాపురం వదులుకొని పుట్టింటికి వస్తే ఏ మొగుడు ఊరుకుంటాడు? ఇంకో దాని వలలో పడతాడు జాగ్రత్త. వెళ్లు.. వెళ్లి మీ ఆయన చెప్పినట్టు నడుచుకో’ అని మళ్లీ పంపించారు. ఇక చెప్పడం అనవసరమని భరించడం మొదలుపెట్టా. కానీ.. ఈమధ్య భరించే స్థితీ పోయింది మేడమ్’ అంటూ చేతుల్లో మొహం దాచుకొని గుండెపగిలేలా ఏడుస్తోంది ప్రణవి. తన చెయిర్‌లోంచి లేచి ఎదురుగా ఉన్న ప్రణవి దగ్గరికి వచ్చి ఆమె భుజాలు పట్టుకుంది లీగల్ కన్సల్టెంట్ అనునయంగా.. అభయంగా! - సరస్వతి రమ