రాక్షసుడు
నిజాలు దేవుడికెరుక
అమెరికాలోని యుటా, 1975. రాత్రి పన్నెండున్నర కావస్తోంది. సబార్డినేట్లతో కలిసి రోడ్లమీద పెట్రోలింగ్ చేస్తున్నాడు ఇన్‌స్పెక్టర్ ఆర్నాల్డ్. చలికాలం సమీపిస్తుం డటంతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. అయితే అప్పుడప్పుడూ వచ్చి తాకుతోన్న చలిగాలులు ఎముకల్ని కొరకాలని ప్రయత్నించడమే కాస్త ఇబ్బంది పెడుతోంది. ‘‘ఇప్పుడే ఇంత చలిగా ఉంది... ఇంకొన్ని రోజులు పోతే ఏంటి మన పరిస్థితి?’’ అన్నాడు ఆర్నాల్డ్ స్వెటర్‌ని సరి చేసుకుంటూ.
‘‘నిజమే సర్, చలి కొరికేస్తోంది’’ వంతపాడాడు సబార్డినేట్లలో ఒక వ్యక్తి.
‘‘ఏమైనా ఈ మధ్య కాస్త క్రైమ్ రేట్ తగ్గినట్టే ఉంది కద సర్’’... పరిసరాలను పరిశీలిస్తూ అన్నాడు మరొకతను. అలా అన్నాడో లేదో... కారుకి సడెన్ బ్రేకు పడింది. అందరూ అదిరిపడ్డారు. ‘‘ఏంటి డ్యానీ... ఏమైంది?’’ అన్నాడు డ్రైవర్‌వైపు చూస్తూ ఆర్నాల్డ్.
‘ఒకసారి అటు చూడండి సర్’’ అన్నాడు డ్యానీ చేయి చాచి ఎదురుగా చూపిస్తూ. అందరూ అటువైపు చూశారు. ఓ అమ్మాయి కారుకు అడ్డుగా నిలబడింది.
కారు కింద పడబోయి తప్పించుకున్న ట్టుంది... భయంతో వణికిపోతోంది. కారు దిగి ఆమె దగ్గరకు వెళ్లారు అందరూ. ‘‘సారీ అమ్మా... దెబ్బలేమీ తగల్లేదు కదా’’ అన్నాడు ఆర్నాల్డ్ అనునయంగా. ఆమె మాట్లాడలేదు. వణికిపోతూనే ఉంది. అంత చలిలోనూ చెమటలు పోస్తున్నాయి. కళ్లు భయంతో పెద్దగా విచ్చుకున్నాయి. రెప్ప కూడా వేయకుండా ఉండిపోయింది. ఆమె దగ్గరకు వెళ్లాడు ఆర్నాల్డ్. భుజమ్మీద చేయి వేస్తే ఉలిక్కిపడిందామె. ‘‘నన్నేం చేయొద్దు... నీకు దణ్నం పెడతాను... నన్ను వదిలెయ్’’... బిగ్గరగా అరవసాగింది. అందరూ అవాక్కయ్యారు.
గబగబా వెళ్లి ఆమెను పట్టుకున్నారు. ఎంత కంట్రోల్ చేయాలని చూసినా ఆమె ఊరుకోలేదు. అరుస్తూనే ఉంది. అరిచి అరిచి చివరకు స్పృహ కోల్పోయింది. ఆమెను కారులో వేసుకుని ఆస్పత్రికి బయలుదేరారు.
‘‘నేను... నేను ఎక్కడున్నాను?’’... కళ్లు తెరుస్తూనే ఉలిక్కిపడి లేచి కూర్చుందామె. భయంభయంగా చుట్టూ చూస్తోంది. ‘‘దేన్నో చూసి బాగా భయపడింది సర్. నన్ను వదిలెయ్ అని అరుస్తోందంటే ఆ భయానికి కారణం ఒక మనిషే అయి ఉండొచ్చు’’... చెప్పాడు డాక్టర్.
అలాగా అన్నట్టు తల పంకించాడు ఆర్నాల్డ్. ఆమె దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించాడు.
బెదిరి దూరంగా జరిగి పోతోంది. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించాడు. తన పోలీసు తెలివితేటలతో చాకచక్యంగా మాట్లాడి ఆమె నమ్మకాన్ని గెల్చుకున్నాడు. ధైర్యం చెప్పాడు. దాంతో ఆమె నె మ్మదించింది. అప్పుడు అడిగాడు ఆర్నాల్డ్... ‘‘నీ పేరేమిటి? నీకు ఏమయ్యింది? అంత రాత్రివేళ... ఎందుకలా రోడ్డుమీద పరిగెడుతున్నావ్?’’
ఆ ప్రశ్నలు వినగానే ఆమె కళ్లలో మళ్లీ భయం పెరిగింది. ‘‘నా పేరు... నా పేరు... క్యారల్. నేను మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్లి వస్తున్నాను. అప్పుడు... అప్పుడు...’’.. భయంతో మాట పెగల్లేదు.
‘‘డోన్ట్ వర్రీ క్యారల్. నేనున్నానుగా! ఏం జరిగిందో చెప్పు’’... అనునయంగా అన్నాడు ఆర్నాల్డ్. దాంతో మెల్లగా మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది.
‘‘పార్టీ అయ్యాక రోడ్డుమీదికొచ్చాను. ట్యాక్సీ స్టాండ్ వైపు నడుస్తుంటే చెప్పు జారి కాలు బెణికింది. దాంతో నడవలేక అక్కడే కూలబడిపోయాను. అంతలో ఓ కారు వచ్చి నా దగ్గర ఆగింది. లిఫ్ట్ కావాలా అంటే సరే అన్నాను. కానీ అతను... కారెక్కి కొంచెం దూరం వెళ్లాక రూటు మళ్లించేశాడు. ఎక్కడో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిపోయాడు. అరిస్తే కొట్టాడు. రేప్ చేయడానికి ప్రయత్నిం చాడు. ఎలాగో తప్పించుకుని పారిపోయి వచ్చాను. దార్లో మీ కారు కింద పడ్డాను.’’
తల పంకించాడు ఆర్నాల్డ్. ‘‘అతని గుర్తులు, ఆ కారు గుర్తులు చెప్పగలవా?’’
చెప్పిందామె. అతని గుర్తులు ఎక్కడా తెలిసినవిలా అనిపించలేదు. కానీ కారు గుర్తులు, నంబరు చెబుతుంటే ఎక్కడో విన్నట్టుగా అనిపించింది. వెంటనే స్టేషన్‌కి వెళ్లి పాత ఫైళ్లు తిరగేశాడు. కొద్ది రోజుల క్రితం పెట్రోలింగ్‌లో ఉన్న ఓ పోలీసును గుద్దేసి వెళ్లిపోయిన కారు అది. అంటే వాడు పొరపాట్న యాక్సిడెంట్ చేసినవాడు కాదు. క్రిమినల్ అన్నమాట. వాడినెలా అయినా పట్టుకోవాలి. అనుకున్నదే తడవుగా వేట మొదలుపెట్టాడు ఆర్నాల్డ్. ఎట్టకేలకు అతని జాడ కనిపెట్టాడు.
‘‘ఎస్... ఎవరు కావాలి?’’... అడిగీ అడగడంతోనే అతని గూబ గుయ్‌మంది. కానీ అతను షాక్ తినలేదు. కొట్టినందుకు ఫీలవనూ లేదు. చాలా కూల్‌గా అన్నాడు... ‘‘అడిగితే కొడతారేంటి సర్?’’
‘‘నువ్వే కావాలి మిస్టర్ టెడ్ బన్డీ’’ అంటూ చేతులకు బేడీలు వేశాడు ఆర్నాల్డ్. అప్పుడు కూడా అతను కంగారు పడలేదు. మౌనంగా పోలీసుల వెంట నడిచాడు.
ఇంటరాగేషన్ రూమ్‌లో కూడా అతని తీరు అదే. పోలీసుల కళ్లలోకి సూటిగా చూస్తున్నాడు. ఏదడిగినా చకచకా సమా ధానం చెబుతున్నాడు. ఓ నేరస్తుడు, తమ సమక్షంలో అంత కూల్‌గా ఉండటం చూసి విస్తుపోయారు పోలీసులు.
‘‘చెప్పు... క్యారల్‌ని కిడ్నాప్ చేసి రేప్ చేయడానికి ప్రయత్నించావ్ కదూ?’’... ఆర్నాల్డ్ గొంతు కటువుగా పలికింది.
‘‘తెలిసే కదా అరెస్ట్ చేశారు?’’
చుర్రుమంది ఆర్నాల్డ్‌కి. లాగి ఒక్కటివ్వబోయి తమాయించుకున్నాడు. ‘‘కొద్ది రోజుల క్రితం పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసాఫీసర్ మీద కారు ఎక్కించి, ఆగ కుండా వెళ్లిపోయావ్. అప్పుడు తప్పించు కున్నావ్ కానీ ఇప్పుడు దొరికిపోయావ్.’’
‘‘కావాలని గుద్దలేదు. ఒక అమ్మాయి నా నుంచి పారిపోయింది. ఆమెను పట్టుకునే క్రమంలో వేగంగా డ్రైవ్ చేశాను. పొరపాటున మీ ఆఫీసర్‌ని గుద్దేశాను. అంతే.’’
విస్తుపోయాడు ఆర్నాల్డ్. క్షణం పాటు మాట్లాడలేక పోయాడు. అతడు మౌనంగా అయిపోవడం చూసి టెడ్ అన్నాడు... ‘‘షాక్ తిన్నారు కదూ! నాకిది మామూలే. మీరు ఇప్పుడే వింటున్నారు కదా... అందుకే అంతగా షాకవుతున్నారు.’’
ఇంకా బుర్ర తిరిగిపోయింది ఆర్నాల్డ్‌కి. అతణ్ని ఇక పెద్దగా శ్రమ పెట్టకుండానే టెడ్ తన గురించిన నిజాలన్నీ చెప్పడం మొదలు పెట్టాడు.
1946లో ఓ పెళ్లికాని అమ్మాయి కడుపున పుట్టాడు టెడ్. ఊహ తెలిసి నప్పటి నుంచీ తన తండ్రి ఎవరో తెలుసు కోవాలని తపన పడ్డాడు. తల్లి చెప్పలేదు. కలత చెందాడు. తండ్రి ఎవరో తెలియని బిడ్డగా తనను ఈ లోకానికి తెచ్చిన తల్లిమీద అయిష్టాన్ని పెంచుకున్నాడు. ఆ బాధ, కోపం, విసుగు అన్నీ కలసి అతడి మనస్తత్వాన్ని విచిత్రంగా తయారు చేశాయి. ఎదుటివాళ్లు బాధపడితే చూడ టంలో ఆనందం కలిగేది. ఉండేకొద్దీ కావాలని ఇతరులను బాధపెట్టడం మొదలుపెట్టాడు.
తర్వాత తన తల్లిని పెళ్లాడిన వ్యక్తి తనను చేరదీసినా అతనికి దగ్గర కాలేకపోయాడు. అతని పిల్లలతో తనను సమానంగా చూసినా ఆనందించ లేకపోయాడు. అతని పిల్లలను హింసించే వాడు. ఓసారి చెల్లెల్ని మేడమీది నుంచి కూడా తోసేశాడు. దాంతో టెడ్‌ని హాస్టల్లో చేర్పించారు.
హాస్టల్ జీవితం టెడ్‌కి చాలా నచ్చింది. అక్కడతని ఆలోచనల్ని, చేతల్ని గుర్తించేవారెవరూ లేకపోవడంతో టెడ్‌లో వికృతత్వం పురులు విప్పుకుంది.
ఏదో తెలియని కసి పెరిగింది. అది ఎలా తీర్చు కోవాలా అని చూసేవాడు. సైకాలజీలో డిగ్రీ చేసి, లా కాలేజీలో చేరాడు. సరిగ్గా అదే సమయంలో టెడ్ ప్రేమించిన యువతి అతనితో బంధాన్ని తెంచుకుని వెళ్లిపోయింది. తట్టుకోలేకపోయాడు. అన్నే ళ్లుగా అతనిలో అణచి పెట్టిన ఉన్మాది ఒక్క సారిగా బయటకు వచ్చాడు. తన మాజీ ప్రేయసిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టాడు. దారుణంగా రేప్ చేసి చంపేశాడు. అతడిలో ఏదో ఆనందం! అంతే... నాటి నుంచీ మొదలైంది టెడ్ నేరాల పరంపర.
రాత్రిళ్లు ఒంటరిగా కనిపించిన అమ్మాయిలకు లిఫ్ట్ పేరుతో ఎర వేసే వాడు. కారు ఎక్కాడ కిడ్నాప్ చేసి తీసుకు పోయేవాడు. తన కారులోనే చిత్రహింసలు పెట్టేవాడు. అలా మొత్తం ముప్ఫై మందికి పైగా అమ్మాయిలను పొట్టన పెట్టుకు న్నాడు. కొందరిని చంపడానికి ముందే రేప్ చేశాడు. కొందర్ని చంపేశాక వారి మృతదేహాలతో కోరిక తీర్చుకున్నాడు. తన మాజీ గాళ్‌ఫ్రెండ్‌లాగా నీలి కళ్లు, నల్లని జుత్తు ఉన్న అమ్మాయిలంటే టెడ్‌కి పిచ్చి. అలాంటి అమ్మాయిల్ని చంపేసి, వారి మృతదేహాలు కుళ్లి కృశించే వరకూ వాటి తోనే గడిపేవాడు. కొందరి తలల్ని తన ఇంట్లో ట్రోఫీల్లాగా దాచుకున్నాడు.
టెడ్ పైశాచికత్వానికి న్యాయస్థానం సైతం ఉలిక్కిపడింది. ఎలక్ట్రిక్ చెయిర్‌లో కూర్చోబెట్టి ప్రాణాలు తీయమంటూ ఆదేశించింది. 1989, జనవరి 24న ఆ శిక్ష అమలయ్యింది. ఆ మానవమృగం ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయింది. విచిత్రం ఏమిటంటే... చనిపోయే ముందు కూడా టెడ్ కాస్తయినా పశ్చాత్తాపపడక పోవడం. చనిపోతున్నందుకు బాధగా లేదా అని అడిగితే... ‘‘నాకు నచ్చింది నేను చేశాను... మీరు చేయాల్సింది మీరు చేయండి’’ అన్నాడు టెడ్. అతడికి మరణ శిక్ష వేయడమే న్యాయమని ఆ చివరి మాటలు సైతం రుజువు చేశాయి!
టెడ్‌ని అరెస్ట్ చేసిన తర్వాత అతని కారును సీజ్ చేశారు పోలీసులు. అప్పుడా కారులో ఉన్న మారణాయుధాలను చూసి షాక్ తిన్నారు వాళ్లు. రకరకాల చాకులు, చిత్ర విచిత్రమైన కత్తులు ఉన్నాయి ఆ కారులో. పైగా రక్తం ఇంకిపోయి సీట్లు రంగు మారిపోయాయి. దానికి తోడు భరించలేని దుర్వాసన. తాను చాలా హత్యలు ఈ కారులోనే చేయడంతో దాని పరిస్థితి అలా తయారైందని విచారణలో చెప్పాడు టెడ్!