
కలియుగ వైకుంఠుని కమనీయ వైభవం
నాటి సినిమా
ఈ నెల 23 నుంచి బ్రహ్మోత్సవాల సందర్భంగా...
కలియుగాన పాపం పెరిగింది. కలి పురుషుని మహత్యాన మానవుడు వశం తప్పి చిత్తం చెదిరి చెడుత్రోవ పడుతున్నాడు. భూదేవికి పాపభారం పెరిగింది. వరాహస్వామి తన ముట్టె మీదమోస్తున్న భూమండలపు భారంతో సతమతమవుతున్నాడు. పాపహరణం చేసి మోక్షమార్గం చూపే వేల్పు కావాలి. ఇలవేల్పు కావాలి. అందుకని మహర్షులందరూ యజ్ఞానికిపూనుకొనగా నారదుని ప్రమేయంతో కథ మలుపులు తిరిగి వైకుంఠనాథుడు భూలోక దేవుడుగా ఎలా వెలిశాడనేదే ‘శ్రీ వెంకటేశ్వర మహత్మ్యంభృగువు అహంకారం అణిచి...కలియుగ కల్యాణం కొరకు మహర్షులు యజ్ఞం మొదలుపెట్టారు. హాజరైన నారదుడు ‘ఈ యజ్ఞానికి హవిర్భోక్త ఎవరు’ అని ప్రశ్నించాడు. త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తులో వారేహవిర్భోక్తగా ఉంటే బాగుంటుందని సూచిస్తాడు.
త్రిమూర్తులలో శాంతమూర్తులు ఎవరో తేల్చుకోవడాని భృగు మహర్షి బయలుదేరుతాడు. మొదట సత్యలోకం చేరుకుంటాడు. అక్కడ
శారద వీణానాదంలో తలమునకలయ్యి తన రాకను పట్టించుకోని బ్రహ్మను చూసి ‘నీకు భూలోకంలో గుళ్లూ గోపురాలు ఉండకుండా పోవుగాక’ అని శాపమిచ్చి కైలాసం చేరుకుంటాడు.అక్కడ పరమ శివుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవంలో మునకలై ఉంటే చూసి ఆగ్రహోదగ్రుడై ‘నీకు బెల్లం, విభూతి తప్ప మరో నైవేద్యం దక్కకుండా పోవుగాక’ అనికమండలం విదిలించి అక్కణ్ణుంచి సరాసరి వైకుంఠం చేరుకుంటాడు. అక్కడ లక్ష్మీదేవి శుశ్రూషతో స్వాంతన పొందుతున్న శ్రీహరి భృగువు రాకను విస్మరించగా భృగువు సరాసరి వచ్చి విష్ణువు వక్షస్థలంపై పాదాన్ని తాటిస్తాడు. అది చూసి లక్ష్మీదేవి హతాశురాలవుతుంది.
తాను నివాసముండే వక్షస్థలాన్ని తన్ని తనకు అవమానం చేసినా శ్రీమన్నారాయుణుడు చిన్న మాట కూడా అనకుండా భృగువుకు మర్యాదలు చేయడం భరించలేకపోతుంది. మరోవైపు శ్రీహరి భృగువుకు పాదపూజ చేస్తున్న నెపంతో ఆయన పాదంలో ఉన్న కంటిని చిదిమి ఆయనలోని అహంకారాన్ని అణిచేస్తాడు. కాని జరిగిన అవమానాన్ని సహించలేక లక్ష్మి భూలోకం చేరుకుంటుంది. ఆమెను వెతుక్కుంటూ శ్రీహరి సామాన్య మానవుని వలే శేషాచల సానువుల్లో అవతరిస్తాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆకలి దప్పులతో పుట్టలో
సేదతీరిన హరికి గోవు పాలు పడుతుంది. కాని పిండడానికి పాలు ఇవ్వని గోవును వెతుక్కుంటూ వచ్చిన గొల్ల శరభయ్య గోవును దండించబోయి హరికి గాయం చేస్తాడు. అందుకుబదులుగా శాపం పొంది భూతంగా మారుతాడు. తల మీద దెబ్బతో పుట్ట వీడిన హరి నేరుగా వకుళమాత ఆశ్రమానికి చేరుకుని ఆశ్రయం పొందుతాడు. ఆమె అతడికి తల్లి అవుతుంది.అతడికి శ్రీనివాసుడు అని నామకరణం చేస్తుంది. పూర్వజన్మలో యశోద అయిన వకుళమాత శ్రీకృష్ణుని కల్యాణం చూడలేకపోయినందుకు ఈ జన్మలో వకుళమాతగా అవతరించిశ్రీనివాసుని కల్యాణం కోసం వేచి ఉంది.
పద్మావతితో పరిణయందండెత్తడానికి వచ్చిన ఏనుగుల గుంపును అదుపు చేయడానికి బయలుదేరిన శ్రీనివాసుడు వసంతోత్సవం ఆడుతున్న పద్మావతీదేవిని చూసి మనసు పారేసుకున్నాడు. మరుక్షణంఆమెను ప్రియసఖిగా తలంపు చేశాడు. అంతటి అపురూపమూర్తిని చూసిన పద్మావతి కూడా వెనువెంటనే తన హృదయాన్ని శ్రీనివాసునికి సమర్పణం చేసింది. ఒకరికి వొకరు నచ్చారు.ఒకరిని ఒకరు మెచ్చారు. ఇక కల్యాణమే మిగిలింది. కాని ఆకాశరాజు భార్య ధరణీ దేవి ఇందుకు ససేమిరా అంటుంది. ‘దారిన పోయే నిరుపేదకు నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడమా’ అని అడ్డం తిరుగుతుంది. చివరకు పద్మావతి పూర్వజన్మలో వేదవతి అని, మాయా సీతగా రావణుని చెరను అనుభవించి సీతను కాపాడినందుకు బదులుగా శ్రీరాముని పత్నిగా అయ్యేవరం ఇమ్మని అడుగక ఈ జన్మలో సాధ్యం కాదన్న రాముడు మరు జన్మలో తీరుస్తానని మాట ఇచ్చాడనీ ఆ మాట ప్రకారమే శ్రీనివాసునిగా పుట్టి పద్మావతిగా జన్మించిన వేదవతినివివాహమాడనున్నాడని తెలుసుకుని వివాహానికి అంగీకరిస్తుంది.
పరమేశ్వరుడూ పరబ్రçహ్మా హాజరవ్వగా పెళ్లి ఖర్చులకు కుబేరుడు కాసుల వర్షం కురిపించగా అంగరంగ వైభవంగాపద్మావతీ కల్యాణం జరిగింది. కాని అలగి తపోదీక్షలో ఉన్న లక్ష్మీదేవికి ఈ సంగతి తెలిసింది. అంతే. ఇంకేముంది. ఆమె ఆవేశంతో అక్కసుతో రగిలిపోయింది. తన పతికి మరొక సతిరావడాన్ని చూసి ప్రాణత్యాగం చేయాలన్నంతగా కన్నీరు మున్నీరయ్యింది. కాని శ్రీనివాసుడు నిస్సహాయుడు. ఇటు శ్రీదేవికి సర్ది చెప్పలేడు. అటు భూదేవిని బుజ్జగించలేడు. ఇరువురు భామల మధ్య ఆయన మెల్లగా పక్కకు జరిగి కలియుగ దైవంగా శిలరూపు దాల్చాడు. ‘కలియుగాంతం వరకు ఆయన స్థావరం ఇక్కడే’ అని తెలుసుకున్న శ్రీదేవి, భూదేవులు కూడాచెరోవైపు ఆయన సమక్షంలో వేల్పులుగా అవతరించారు. తదాదిగా తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠంగా పూజలందుకుంటోంది. శ్రీనివాసుని వైభవంతో భక్తుల పుణ్యక్షేత్రంగాఅలరారుతోంది.
పి.పుల్లయ్య ప్రతిభ
శ్రీ వేంకటేశ్వరుని మహత్మ్యం పేరున రెండుసార్లు సినిమా తీసే అవకాశం దర్శకుడు పి.పుల్లయ్యకే దక్కింది. ఆయన 1939లో ఒకసారి ‘బాలాజీ’ పేరుతో ఆ సినిమా తీసి పెద్ద హిట్‌సాధించి తనివి తీరక 1960లో తిరిగి ఎన్టీఆర్, సావిత్రి, జి.వరలక్ష్ములతో అదే సినిమాను నిర్మించి మరోసారి ఘనవిజయం సాధించారు. వేంకటేశ్వర స్వామి జన్మవృత్తాంతంతెలుసుకోవాలనుకునే ప్రేక్షకులకు పామరులకు కూడా ఎంతో సులువుగా ఆ కథను చెప్పి భక్తి పారవశ్యం కలిగించిన దర్శకుడు ఆయన. ఈ సినిమాలో శ్రీనివాసునిగా ఎన్టీఆర్ ఎంతోసాత్వికంగా దైవగుణంతో కనిపించి ఆరాధన భావం కలిగిస్తారు. ఇక లక్ష్మిగా జి.వరలక్ష్మి తన సహజమైన అతిశయాన్ని ప్రదర్శిస్తే పద్మావతిగా సావిత్రి ఎంతో అణకువను చూపిస్తుంది.
ఈ ఇద్దరు దేవేరులను తన ఇరవైపులా పరిగ్రహించిన ఆ స్వామి వైభోగం ఎన్నిసార్లు చూసినా తనివి తీరుతుందా? అందుకే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. సాధారణంగా ‘డ్రామా’ ను రాసి మెప్పించే ఆత్రేయ ఈ సినిమాకు జనరంజకమైన మాటలు రాయడం ఒక విశేషం. ఇందులోనే ఆత్రేయ రాయగా ఘంటసాల పాడిన ‘శేషశైలావాస శ్రీవేంకటేశా’.. పాట ఇప్పటికీ బహుశా ఎప్పటికీ ఒక ప్రభాతగీతమే. ఇందులోనే పద్మావతికీ శ్రీనివాసునికీ మధ్య వచ్చే యుగళగీతం ‘కలగా కమ్మని కలగా’ కూడా కమ్మగా ఉంటుంది. గొల్ల శరభయ్యగా నటించిన రమణారెడ్డి అచ్చ నెల్లూరు గ్రామ్యంలో మాట్లాడుతూ ఆకట్టుకుంటారు. పుట్టలో పాలుపోస్తున్న గోవును కనిపెట్టిన ఆ గొల్లల సంతతికే తొలి దర్శనం వరం శ్రీనివాసుడు కలుగజేయడం అది నేటికీ కొనసాగుతూ ఉండటం స్వామి లీల. ఈ లీల ఒక్కటేనా... శ్రీనివాసుని లీలలు వేనవేలు. ఆ లీలతో తరియించే భక్తులు ఉన్నంత కాలం ‘శ్రీ వేంకటేశ్వర మహాత్య్మం’ సినిమా నిలిచే ఉంటుంది.
ఆ తిరుపతి ఈ తిరుపతి
ఈ సినిమా షూటింగ్ కోసం వాహిని స్టూడియోలో తిరుమల గుడి సెట్ వేస్తే ఆ సెట్టే గుడి అన్నంతగా షూటింగ్ జరిగినంత కాలం భక్తుల హడావిడి, పూజలు ప్రసాదాలు కొనసాగాయి. షూటింగ్ అయిపోయాక కూడా భక్తుల తాకిడి వల్ల కొంత కాలం ఆ సెట్‌ను అలాగే ఉంచాల్సి వచ్చింది. ఇక బండ్లు కట్టుకొని వందల మంది ఈ సినిమా చూడటానికి వచ్చేవారు. సినిమా హాళ్లు కూడా వెంకటేశ్వరస్వామి విగ్రహం పెట్టి హుండీలు పెట్టి వాటిని కూడా గుడులకు మల్లే సినిమా ఆడినంతకాలం నిర్వహించారు. ఇక ఈ సినిమాతో ఎన్టీ రామారావు వేంకటేశ్వరునిగా ప్రేక్షకుల గుండెల్లో ముద్ర పడిపోగా తిరుపతికి వెళ్లిన భక్తులు అటు నుంచి అటు చెన్నై వెళ్లి ఎన్టీఆర్‌ని చూసుకొని రావడం ఆనవాయితీగా మారింది. తిరుపతి–చెన్నై టూర్ ఆపరేటర్లు ఆ రోజుల్లో విపరీతంగా కలెక్షన్లు చేసుకున్నారనడం ఒక చెప్పుకోవాల్సిన జ్ఞాపకం.
- కె