
అంతరార్థం
భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలున్నా, అరటి లేదా కొబ్బరి కాయలకే ఆది నుంచి అగ్రతాంబూలం. వాటినే పూర్ణఫలాలుగా పేర్కొంటారు. కారణం ఏమిటంటే, సృష్టిలోని అన్ని ఫలాలను మనం ఆరగించి, వాటిలోని విత్తనాలను నోటినుంచి ఊసి పారవేస్తాం. దానివల్ల ఆ విత్తనాలు ఎంగిలి అవుతాయి. కొన్ని పండ్లను పక్షులు తిని, వాటి విత్తనాలను విసర్జిస్తాయి. అవి మొలకెత్తి, తిరిగి పుష్పించి, ఫలిస్తాయి. మనం తిరిగి ఆ ఫలాలనే భగవంతునికి సమర్పిస్తాం. అది అంత శ్రేష్ఠం కాదు.
అయితే అరటి లేదా కొబ్బరి చెట్ల విషయంలో అలా జరగదు. మహాపతివ్రత, సౌందర్యరాశి అయిన సావిత్రిదేవి శాపవశాత్తూ భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది. అర టిచెట్టు విత్తనాల ద్వారా గాక పిలకల ద్వారా మొలిచి, అన్ని కాలాల్లోనూ పండ్లను ఇస్తుంది. కొబ్బరిచెట్టు బీజంగల చెట్టే అయినప్పటికీ, దానికి కూడా ఎంగిలి దోషం అంటదు. అందుకే అరటిపండు, కొబ్బరికాయ పూర్ణఫలాలయ్యాయి. వినాయకుడికి, ఆంజనేయస్వామికి, రామచంద్రమూర్తికీ అరటిపండ్లు అమితమైన ప్రీతి గలవి. వారి పూజలో అరటిపండును నివేదించడం తప్పనిసరి అని పెద్దలు చెబుతారు.