కొత్తగా పెళ్లైన ఆడపిల్లలకు శ్రావణ పట్టీలు పెట్టే వేడుకలతోనో.. కుటుంబ సుఖసౌఖ్యాల కోసం చేసే నోములు వ్రతాలతో నెలంతా సందడి చేసే శుభప్రద శ్రావణం రానే వచ్చేసింది. తొలిరోజే అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక సన్నాహాలు చేపట్టారు. నాగుల చవితి..గౌరీ పంచమి.. మంగళగౌరి వ్రతం.. వరలక్ష్మీ వ్రతం.. కృష్ణాష్టమి.. రాఖీపౌర్ణిమ తదితర ప్రధాన పండుగలు ఈ మాసం సకల దేవతలకు అత్యంత ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసం వచ్చిదంటే అందరిలో.. ముఖ్యంగా మహిళలలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి
సాక్షి, అనంతపురం : గురువారం నాటి అమావాస్య రాకతో ఆషాఢానికి వీడ్కోలు పలుకుతూ శుభ శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. వాస్తవానికి బుధవారం మధ్యాహ్నం నుంచే అమావాస్య వచ్చేసింది. గురువారం మధ్యాహ్నానికి వెళ్లిపోతుంది. అయితే సూర్యోదయంతో తిథి వార నక్షత్రాల లెక్కింపు ఉన్నందున శుక్రవారం వారం నుంచే శ్రావణ మాసం ఆరంభమవుతుందని పండితులంటున్నారు. శ్రావణమొస్తోందంటే అంతటా ఒకటే సందడి..హడావుడి నెలకొంటుంది. ఈ మాసంలో ఆధ్యాత్మిక చింతన, శుభకార్యాలు నిర్వహిస్తే పుణ్యలోకప్రాప్తి కలుగుతుందని వేదపండితులు అంటున్నారు.
ఈ మాసంలో వచ్చే బలరామకృష్ణ్లు జయంతి, హయగ్రీవ జయంతి, రాధాష్టమి వంటివి భక్తిభావాలను మరింత పెంచనున్నాయి. గీతాచార్యుడైన శ్రీకృష్ణభగవానుని జన్మాష్టమి పర్వదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని ఇస్కాన్ మందిరంలో కన్నుల పండువగా జరుగుతాయి. శ్రావణ బహుళ విధియనాడు మంత్రాలయ రాఘవేంద్రుల ఆరా«ధనా ఉత్సవాలు మొదటిరోడ్డులోని మఠంలో శోభాయమానంగా జరుగుతాయి. సామాన్య భక్తులే గాక రైతులు కూడా పంటలు సమృద్ధిగా పండాలని, ప«శు సంపద వర్దిల్లాలని ప్రత్యేకంగా పూజలు చేసే పొలాల అమావాస్య కూడా ఇదే మాసం చివరి రోజు రానుంది.
హరిహరబేధం లేని మాసం
అన్నిటికి మించి పరమశివునికి కార్తీకం తర్వాత ఇష్టమైనది శ్రావణమాసమేనని శివపురాణం చెబుతోంది. ఈ మాసంలో శనిత్రయోదశి పూజలు, తైలాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు చేస్తే పరమపద మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణపండితులు చెబుతున్నారు. అదే విధంగా ఉపవాస దీక్షలకు ఇందులో అధిక ప్రాధాన్యముంటుంది. ముఖ్యంగా మగువలు సుమంగళిగా జీవించాలని కోరుకుంటూ చేసే వివిధ నోములు, వ్రతాలతో ఆలయాలే కాదు ఇంటి పరిసరాలూ పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో కళకళలాడుతాయి.
శ్రావణంలో వచ్చే పర్వదినాలివే:
ఈసారి శ్రావణ మాసం ఆగస్టు 02 నుండి 29వ తేదీ వరకూ ఉంటుంది. ఇందులో ఆగస్టు 4న నాగుల చవితితో పండుగలు ప్రారంభమవుతాయి. అదే క్రమంలో 6న మంగళగౌరీ వ్రతం, 9న వరలక్ష్మీవ్రతం, 15న స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు రాఖీ పౌర్ణిమ, ఇదే రోజు నుంచి ఐదు రోజుల పాటు రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, 19న సంకష్టహర చతుర్థి, 23న శ్రీ కృష్ణాష్టమి, 24న వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు రానున్నాయి. 30న పొలాల అమావాస్యతో భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ప్రధానంగా శ్రావణ శుక్రవారాలు అమ్మవారి ఆలయాలలో, శ్రావణ శనివారాలు జిల్లా వ్యాప్తంగా శ్రీవైష్ణవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటాయి.
శ్రావణ నోములకు చాలా ప్రాధాన్యత
శ్రావణ మాసం అంటే ఎంతో పవిత్రమైనదిగా, మరెంతో ప్రధానమైనదిగా భావిస్తారు. జ్ఞానసిద్ధిని ఒసిగే మాసంగా దీనిని పురాణాల్లో పేర్కొన్నారు. శ్రావణమంటే ఎంతో శుభమని భావించడం పరిపాటి. అయితే ఈసారి నెలంతా శుభముహూర్తాలు లేకపోవడం ప్రత్యేకంగా గుర్తించాలి. గత నెల 9న వచ్చిన శుక్రమూఢమి సెప్టెంబరు 19 వరకూ ఉంటుంది. తర్వాత కూడా పదిరోజులు పితృపక్షాలు రానున్నాయి. అదే నెల 29న ఆశ్వీజం పుట్టే వరకూ శుభ కార్యాలు చేయడానికి వీలులేదు. ముఖ్యంగా వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలకు ముహూర్తాలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment