Special Story about Sridevi and Madhuri Dixit - Sakshi
Sakshi News home page

'శ్రీ' దీక్షిత్‌

Published Tue, Apr 24 2018 12:01 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

special story to sridevi and - Sakshi

శ్రీదేవి,మాధురీ దీక్షిత్‌.

‘షిద్దత్‌ సే’ అంటే ‘మనస్ఫూర్తిగా ప్రేమించి’ అని.శ్రీదేవి చేయాల్సిన ‘షిద్దత్‌’ సినిమా ఇప్పుడు మాధురీ దీక్షిత్‌ చేస్తోంది.ఎన్నో ఏళ్ల క్రితం ‘న్యూ కమర్‌’గా మాధురి, ‘సక్సెస్‌ఫుల్‌ రన్నర్‌’గా శ్రీదేవి ఎన్నోసార్లు పోటీపడ్డారు. ఇవాళ శ్రీదేవి లేరు కానీ పోటీ అలానే ఉంది.శ్రీదేవి ఇమేజ్‌తో మాధురి పోటీపడాలి.శ్రీదేవిలా నటించాలి.  నటనలో జీవించాలి.

అది 1977‘పదినారు వయదినిలే’... అంటే పదహారేళ్ల వయసులో అని అర్థం.ఆ సినిమా చేసేటప్పుడు శ్రీదేవి వయసు పధ్నాలుగేళ్లు.సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌.తెలుగులో తీస్తే ఇక్కడా హిట్‌.అందానికి అందం.. నటనకు నటన.కొత్త హీరోయిన్‌ శ్రీదేవి ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది.వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ.తిరుగులేని ‘స్టార్‌’. తనకు తానే పోటీ.కాలచక్రం గిర్రున తిరుగుతోంది.చకచకా సినిమాలు చేస్తున్నారు శ్రీదేవి.పదేళ్లు పూర్తయ్యేలోపు వంద సినిమాలు పూర్తి చేసేశారు.ఎవరు? శ్రీదేవికి దీటుగా నిలిచేది ఎవరు? దాటేది ఎవరు?అప్పుడు వచ్చింది మాధురీ దీక్షిత్‌.అది 1984మాధురీ మొదటి సినిమా ‘అభోథ్‌’ రిలీజ్‌ అయింది.సినిమా ఫట్‌. మాధురీ అందం, అభినయానికి ఫుల్‌ కాంప్లిమెంట్స్‌.‘ఈ పిల్ల ఎవరో శ్రీదేవికి గట్టి పోటీ ఇచ్చేలా ఉందే...’ అంటూ సినీ పండితులు అంచనా వేశారు.ఇప్పుడు చూద్దాం... శ్రీదేవి ఆట కట్టవుతుందేమో.న్యూ కమర్‌ మాధురీ దీక్షిత్‌ ముందు సీనియర్‌ శ్రీదేవి కెరీర్‌ అటక ఎక్కుతుందేమో?.. ఇది కొంతమంది ఉత్సాహం.శ్రీదేవి లాంటి స్టార్‌ ముందు జూనియర్‌ మాధురీ నిలబడ గలుగుతుందా?.. ఇది ఇంకొంతమంది ఉత్సుకత.అప్పటికి శ్రీదేవి వంద సినిమాలు చేసిన హీరోయిన్‌. వేరే హీరోయిన్‌ అయితే మొహం మొత్తేదేమో.
అయితే ఇక్కడున్నది శ్రీదేవి.

అయినా లవ్లీ లుక్స్‌తో, బ్యూటీ స్మైల్‌తో సీన్లోకొచ్చిన మాధురీ దీక్షిత్‌ నిలుస్తుందని చాలామంది నమ్మకం.అయితే మాధురీ అనే చిన్న కుదుపుకి ఒరిగిపోయే స్టార్‌డమ్‌ కాదు శ్రీదేవిది. చాలా స్ట్రాంగ్‌ ఫౌండేషన్‌. కానీ వంద సినిమాలు చేసేశాక కొత్తగా మళ్లీ పోటీ అంటే ఏ స్టార్‌కైనా కొంచెం కష్టమే. అలాగే శిఖరాగ్రాన ఉన్న శ్రీదేవి లాంటి స్టార్‌తో పోటీ పడటం న్యూ కమర్‌కీ కష్టమే. ఓ సీనియర్‌.. ఓ న్యూకమర్‌. ఇద్దరూ సై అంటే సై అన్నారు. ‘అభోథ్‌’ తర్వాత దాదాపు అరడజను ఫ్లాప్స్‌ చూసిన మాధురీ ‘తేజాబ్‌’తో తిరుగులేని స్టార్‌ అనిపించుకుంది.ఫ్రెష్‌ హీరోయిన్‌ తళుకులీనింది. సీనియర్‌ హీరోయిన్‌ కూడా న్యూ కమర్‌కి దీటుగా కొత్తగా మెరిసింది.‘శెభాష్‌ సరైన పోటీ’ అన్నారు.  ఓ టెన్‌ ఇయర్స్‌ పోటాపోటీగా ఇద్దరూ సినిమాలు చేశారు.

అది 1996
ఇప్పుడు శ్రీదేవికి ‘ప్రొఫెషనల్‌ లైఫ్‌’ కన్నా ‘పర్సనల్‌ లైఫ్‌’ ముఖ్యమైంది.మనసు నిండా తన మీద ప్రేమ నింపుకున్న బోనీ కపూర్‌ని పెళ్లాడాలనుకున్నారు.మూడుముళ్లు పడ్డాయి. బాలనటిగా, కథానాయికగా దాదాపు 25 ఏళ్లకుపైగా ముచ్చటగా సాగిన కెరీర్‌కి బ్రేక్‌ ఇచ్చేశారు.అప్పటికి తేజాబ్, హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’ వంటి చిత్రాలతో మాధురి కెరీర్‌ ఊపందుకుంది.శ్రీదేవి మైనస్‌ మాధురి కెరీర్‌ ఇంకా బ్రహ్మాండంగా సాగింది. ‘నో రేస్‌’. అందుకే ఇంకా గ్రేస్‌తో మాధురీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అయితే జస్ట్‌ త్రీ ఇయర్స్‌ మాత్రమే.

అది 1999
శ్రీరామ్‌ నేనేని పెళ్లాడారు మాధురీ. పెళ్లయ్యాక శ్రీదేవి సినిమాలకు దూరమయ్యారు. మాధురీ కూడా సేమ్‌ టు సేమ్‌.1996 తర్వాత శ్రీదేవి మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌ పైకి రావడానికి సుమారు 14 ఏళ్లు పట్టింది. మాధురీ మాత్రం అందులో సగం.. అంటే పెళ్లయిన 7 ఇయర్స్‌కే ‘ఆజా నాచ్‌లే’ అనే సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. అయితే ఆ సినిమా నిరుత్సాహపరిచింది. ‘ఇంగ్లిష్‌–వింగ్లిష్‌’ సూపర్‌ సక్సెస్‌తో శ్రీదేవి సెకండ్‌ ఇన్నింగ్స్‌ గ్రాండ్‌గా మొదలైంది. అయితే ఇప్పుడు ఎవరి దారి వారిది. వీళ్లు ఎవరికీ పోటీ కాదు. ఎవరూ వీళ్లకు పోటీ కాదు.కానీ శ్రీదేవి చేసిన ఇంగ్లిష్‌–వింగ్లిష్, మామ్‌.. సక్సెస్‌.‘ఆజా నాచ్‌లే’ తర్వాత ఏడేళ్లు గ్యాప్‌ తీసుకుని, మాధురీ చేసిన ‘దేడ్‌ ఇష్కియా’ ఓకే అనిపించుకుంది. జూహీ చావ్లాతో కలిసి చేసిన ‘గులాబ్‌ గ్యాంగ్‌’ కూడా ఫర్వాలేదనిపించుకుంది.నిజానికి శ్రీదేవి చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టి, టీనేజ్‌లోనే హీరోయిన్‌గా చేయడంవల్ల ‘సీనియర్‌’ అనాల్సి వచ్చింది కానీ మాధురీకీ, ఆమెకూ మధ్య పెద్ద వయసు వ్యత్యాసం లేదు. జస్ట్‌ నాలుగంటే నాలుగేళ్లే. అయితే ముందు స్క్రీన్‌ మీదకొచ్చిన హీరోయిన్‌ని ఎవరైనా ‘సీనియర్‌’లానే చూస్తారు ఆ తర్వాత వచ్చిన అమ్మాయిని ‘యంగ్‌ హీరోయిన్‌’ అంటారు. శ్రీదేవి, మాధురి విషయంలో ఇదే జరిగింది. ఈ ఇద్దరి మధ్య ‘ప్రొఫెషనల్‌ రైవలరీ’ ఉండేదని పరిశీలకుల ఫీలింగ్‌. అయితే ఇద్దరూ బహిరంగంగా మాటా మాటా అనుకున్నది లేదు. ఇద్దరి ప్రవర్తన హుందాగానే ఉండేది. 

ఇది 2018
శ్రీదేవి ఇక లేరు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఫిఫ్టీ ప్లస్‌ ఏజ్‌లో చేసే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌కి ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిందే. ఆ స్థానాన్ని భర్తీ చేయగల తార ఎవరు? అంటే చాలామందికి అనిపించిన పేరు ‘మాధురీ దీక్షిత్‌’. ఒకప్పుడు పోటీపడిన మాధురీ ఇప్పుడు శ్రీదేవికి రీప్లేస్‌మెంట్‌. అవును.. ఒక సినిమాలో రీప్లేస్‌మెంట్‌ జరిగింది. చనిపోక ముందు శ్రీదేవి ఒప్పుకున్న ‘షిద్దత్‌’ అనే సినిమాలో ఇప్పుడు మాధురీ నటిస్తున్నారు. ‘ఇంగ్లిష్‌–వింగ్లిష్‌’ తర్వాత నాలుగైదేళ్లు గ్యాప్‌ తీసుకుని, ‘మామ్‌’ చేశారు శ్రీదేవి. అంటే.. స్క్రిప్ట్, క్యారెక్టర్‌ సెలెక్షన్‌ విషయంలో అంత కేర్‌ తీసుకున్నారు. అందుకే ‘షిద్దత్‌’ స్క్రిప్ట్, ఆమె ఒప్పుకున్న క్యారెక్టర్‌ గొప్పగా ఉండి ఉంటాయని ఊహించవచ్చు. శ్రీదేవి ఫైనల్‌గా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఆ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, శ్రీదేవి ఒప్పుకున్న క్యారెక్టర్‌ని మాధురీ ఎలా చేశారో చూడ్డానికి ‘ఇష్టంగా నిరీక్షిద్దాం’.  ఎందుకంటే ‘షిద్దత్‌’ అంటే.. ఇష్టంగా నిరీక్షించడం అని ఓ అర్థం. అన్నట్లు ముందు ‘షిద్దత్‌’ అని టైటిల్‌ ఫిక్స్‌ చేసినప్పటికీ ఈ సినిమాకి ఇప్పుడు ‘కళంక్‌’ అని టైటిల్‌ మార్చారు. టైటిల్‌ ఏదైనా నిరీక్షణ ఎప్పుడూ ఇష్టంగానే ఉంటుంది కదా.

శ్రీదేవి–మాధురీ–ఓ అనిల్‌కపూర్‌
శ్రీదేవి, మాధురి బాలీవుడ్‌ కెరీర్‌ బెస్ట్‌ హిట్స్‌ అనిల్‌ కపూర్‌తో ఉండటం విశేషం. అనిల్‌తో శ్రీదేవి చేసిన ‘మిస్టర్‌ ఇండియా’ బాలీవుడ్‌లో ఆమె స్థానాన్ని సుస్థిరం చేస్తే, ఆ సినిమాలో ‘హవా హవాయి’ సాంగ్‌ ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది.  అనిల్‌తో చేసిన ‘తేబాజ్‌’ సినిమా మాధురీని ఓవర్‌ నైట్‌ స్టార్‌ని చేసింది. ఆ సినిమాలో ‘ఏక్‌ దో తీన్‌ చార్‌...’ పాట ఎంత పాపులరో తెలిసిందే.

‘కళంక్‌’ కహానీ
‘షిద్దత్‌’  సినిమాను  తండ్రి యశ్‌ జోహార్‌తో కలిసి కరణ్‌ జోహార్‌ పదిహేనేళ్ల క్రితమే ప్లాన్‌ చేశారు. అయితే అప్పుడు కుదరలేదు. ఆ తర్వాత 2014లో తీసిన ‘2 స్టేట్స్‌’ హిట్‌ తర్వాత  ఆ చిత్రదర్శకుడు అభిషేక్‌ వర్మన్‌తో ఈ సినిమాను ప్లాన్‌ చేశారు కరణ్, సాజిద్‌ నడియాడ్‌వాలా. ఫైనల్లీ ఈ ఏడాది  పట్టాలెక్కింది. ముందు ‘షిద్దత్‌’ అనుకున్నా ఆ తర్వాత ‘కళంక్‌’ అయితే బాగుంటుందనుకున్నారట. ఈ చిత్రకథ ఏంటంటే... 1940లో ఇండియా, పాకిస్తాన్‌ ఎదుర్కొన్న కష్టాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంజయ్‌ దత్, మాధురీ దీక్షిత్‌ ఓ జంటగా, వరుణ్‌ ధావన్, ఆలియా భట్‌ యువజంటగా కనిపిస్తారు. సోనాక్షి సిన్హా ఓ ముఖ్య పాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో ‘భరత్‌ అనే నేను’ భామ కియారా అద్వానీ స్పెషల్‌ అపియరెన్స్‌ ఇవ్వనుంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ఈ నెల 18న ప్రారంభమైంది. అదే రోజు మాధురీ లుక్‌ టెస్ట్‌ జరిగింది. అంటే.. ఫస్ట్‌ డే షూట్‌లో మాధురీ పాల్గొనలేదు. ‘‘ఈ సినిమా షూట్‌లో పాల్గొనడానికి ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నా’’ అని మాధురీ పేర్కొన్నారు. 2019 ఏప్రిల్‌ 19న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

డ్యాన్సింగ్‌ క్వీన్స్‌.. స్టెప్స్‌ అదుర్స్‌
శ్రీదేవి, మాధురీ.. ఇద్దరూ మంచి డ్యాన్సర్స్‌. రొమాంటిక్‌ సాంగ్‌ ‘అబ్బ నీ తియ్యనీ దెబ్బ..’కు శ్రీదేవి స్టైలిష్‌గా స్టెప్స్‌ వేస్తే..., రొమాంటిక్‌ సాంగ్‌ ‘ధక్‌ ధక్‌  కర్నే..’కి మాధురీ కూడా అంతే స్టైలిష్‌గా డ్యాన్స్‌ చేశారు. స్టెప్స్‌ ఎంత హాట్‌గా ఉన్నా నీట్‌గా చేయడం ఈ ఇద్దరి స్టైల్‌. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒకే స్టేజి మీద డ్యాన్స్‌ చేస్తే చూడ్డానికి ఐ–ఫీస్ట్‌. టీవీ షో ‘ఝలక్‌ దిక్‌ లాజా’ అందుకు వేదిక అయింది.కమ్‌బ్యాక్‌ ఫిల్మ్‌ ‘ఇంగ్లిష్‌–వింగ్లిష్‌’ని ప్రమోట్‌ చేయడం కోసం ఆ షోకి వెళ్లారు శ్రీదేవి. ఆ షోకి మాధురీ దీక్షిత్‌ ఓ న్యాయ నిర్ణేత. ఒకప్పుడు హీరోయిన్లుగా పోటీపడిన ఈ ఇద్దరూ ఆ షోలో డ్యాన్స్‌ చేయడం ఓ హైలైట్‌. ‘మీ ఇద్దరూ డ్యాన్స్‌ చేస్తే చూడాలని ఉంది’ అని పార్టిసిపెంట్స్‌ కోరితే శ్రీదేవి నటించిన ‘చాందినీ’లోని ‘మేరీ హాతోం మే’కి మాధురీ కాలు కదిపితే, శ్రీదేవి కూడా స్టెప్స్‌ వేశారు. అదే స్టేజి మీద ‘బేటా’లో మాధురీ చేసిన ‘ధక్‌ ధక్‌ కర్నే లగా..’ పాటకు శ్రీదేవి వేసిన స్టెప్స్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. 

25 ఏళ్ల తర్వాత సంజయ్‌– మాధురీ
25 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఖల్‌నాయక్‌’ సినిమా గుర్తుందా? అంత ఈజీగా మరచిపోలేం. సంజయ్‌ దత్, మాధురీ దీక్షిత్‌ జంటగా నటించిన చివరి సినిమా అది. ఇద్దరి మధ్య ‘ఎఫైర్‌’ ఉండేదనే వార్త అప్పట్లో వినిపించింది. కారణాలేవైనా ఈ ఇద్దరూ కలసి ఆ తర్వాత నటించలేదు. 25 ఏళ్ల తర్వాత ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘కళంక్‌’. 
– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement