స్వైన్ ఫ్లూ | special story to swin flu | Sakshi
Sakshi News home page

స్వైన్ ఫ్లూ

Published Wed, Sep 27 2017 11:45 PM | Last Updated on Thu, Sep 28 2017 3:51 AM

special  story to swin flu

ఇటీవల విధి నిర్వహణ కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఒక పోలీస్‌ అధికారి స్వైన్‌ఫ్లూతో మృతి చెందారు. ఆయనే కాదు... ఇప్పుడు చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చూడటానికి అచ్చం మామూలు జలుబులాగే ఉన్నా... ఇది సాధారణ జలుబు కంటే ఒకింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. అందుకే దీన్ని గురించి అవగాహన పెంచుకోవడం అవసరం. ప్రత్యేకంగా ఇటీవల వాతావరణం చల్లబడుతున్న నేపథ్యంతో పాటు కొత్తగా చేరిన మిషిగన్‌ వైరస్‌తో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడు దీని గురించి తెలుసుకోవడం మరింత అవసరం. అందుకే ఈ ప్రత్యేక కథనం.

సాధారణ లక్షణాలివే...
సాధారణ ఫ్లూ జ్వరంలో ఉండే లక్షణాలే దీన్లోనూ కనిపిస్తాయి. అంటే... కాస్తంత జ్వరం, దగ్గు, గొంతులో ఇన్ఫెక్షన్, గొంతులో గరగర, ముక్కు దిబ్బడ వేయడం,  ముక్కు కారడం, ఒంటి నొప్పులు, తలనొప్పి, చలి, అలసట, నీరసం, కళ్లు–ముక్కు ఎర్రబారడం, కడుపులో నొప్పి... లాంటి లక్షణాలు ఇందులో ఉంటాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు కూడా కనిపించవచ్చు.

వ్యాప్తిచెందే అవకాశాలివి...
ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి గాలి ద్వారా సోకుతుంది. అంటే... సాధారణ జలుబులాగానే దగ్గడం, తుమ్మడం వల్ల గాలిలో కలిసిన ఈ వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవచ్చు.

సీజనల్‌ ఫ్లూకూ... స్వైన్‌ ఫ్లూకు పోలికలు
సీజనల్‌ ఫ్లూ విషయానికి వస్తే అది ఏ సమయాల్లో అయినా వస్తుంది, వస్తే ఎంతకాలం ఉంటుంది, దాని తీవ్రత ఎంత, ఏ సమయంలో అది తీవ్రమై ప్రాణాపాయానికి దారితీయవచ్చు అన్న అంశాలపై అవగాహన ఉంది.

కొత్త హెచ్‌1ఎన్‌1 వైరస్‌ అన్నది 25 ఏళ్ల లోపువారిపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. 64 ఏళ్ల కంటే పైబడ్డవారిలో ఈ కొత్త హెచ్‌1ఎన్‌1 పెద్దగా ప్రభావం చూపిన దృష్టాంతాలు లేవు. కాని సీజనల్‌ ఫ్లూ విషయం అలా కాదు. వయసు అన్న అంశం మినహా మిగిలిన అంశాలన్నీ... అంటే గర్భవతి అయి ఉండటం, డయాబెటిస్, గుండెజబ్బులు, ఆస్తమా, మూత్రపిండాల, నరాల సంబంధమైన వ్యాధులు ఉండటం లాంటి అన్ని సందర్భాల్లోనూ... మిగతా ఇన్‌ఫ్లుయెంజాలో మాదిరిగానే ఈ కొత్త హెచ్‌1ఎన్‌1 వచ్చినప్పుడు పై అంశాలను రిస్క్‌ఫ్యాక్టర్లుగానే పరిగణించవచ్చు.

పిల్లల్లో లక్షణాలు...
►పిల్లలు ఆయా సపడుతున్నట్లు ఉన్నా, శ్వాస అందడంలో ఇబ్బంది ఉన్నా
►చర్మం రంగు నీలంగా లేదా బూడిద రంగు (గ్రే)గా మారినా
►తగినంతగా ద్రవ పదార్థాలు తాగలేకపోతున్నా
►వాంతులు అవుతున్నా
►సరిగ్గా నడవలేకపోతున్నా లేదా  మాట్లాడలేకపోతున్నా
► తట్టుకోలేనట్లుగా కనిపిస్తూ అస్థిమితంగా ఉన్నా
►ఫ్లూ లక్షణాలు తగ్గినా జ్వరం, దగ్గు మళ్లీ మళ్లీ రావడం... ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి.

పెద్దల్లో లక్షణాలు...
►ఆయాసపడుతున్నా లేదా శ్వాస అందకపోయినా
►ఛాతిలో నొప్పి, కడుపులో నొప్పి లేదా పట్టేసినట్లుగా ఉన్నా
►అకస్మాత్తుగా తలతిరుగుతున్నట్లు అనిపించినా
►అయోమయంగా అనిపించినా
► ఆగకుండా, తీవ్రంగా వాంతులు అవుతున్నా
►ఫ్లూ లక్షణాలు తగ్గినా దగ్గు, జ్వరం మళ్లీ రావడం... అప్పుడు పెద్దవాళ్లూ (అడల్ట్స్‌) కూడా వైద్య సహాయం కోసం వెంటనే డాక్టర్‌ను కలవాలి.

పోర్క్‌ తింటే వస్తుందా?
పోర్క్‌ తింటే స్వైన్‌ ఫ్లూ వస్తుందన్నది చాలామందిలో ఉండే సాధారణ అపోహ. అయితే పేరును బట్టి అందరూ అనుమానించినట్లు ఇది పంది మాంసంతో సంక్రమించదు. అయితే... ఒకవేళ పంది మాంసాన్ని సక్రమంగా ఉడికించనప్పుడు (ఇంప్రాపర్లీ కుక్‌డ్‌ పోర్క్‌), పంది మాంసంతో కూడా స్వైన్‌ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగానైతే గాలి ద్వారానే ఈ వైరస్‌ రోగి నుంచి మరో మామూలు వ్యక్తికి (మామూలు ఫ్లూ లాగా) వ్యాపిస్తుంది.

ఇతరులకు వ్యాప్తి చేయగల వ్యవధి...
హెచ్‌1ఎన్‌1 వైరస్‌ కూడా సాధారణ సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా లాగానే వ్యాప్తి చెందుతుంది. రోగులు – తమకు లక్షణాలు కనిపించడానికి ఒక రోజు ముందు నుంచి తమకు వ్యాధి సోకిన 5 నుంచి 7 రోజుల వరకు ఇతరులకు వ్యాప్తి జేయగల స్థితిలో ఉంటారని అధ్యయనాల్లో తేలింది. కొందరిలో ఈ వైరస్‌ మరింత కాలం యాక్టివ్‌గా ఉంటుంది. వారి నుంచి రెండు వారాల వరకు కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది.

డాక్టర్‌ నళిని నాగళ్ల, సీనియర్‌ కన్సల్టెంట్‌ పల్మునరీ –
స్లీప్‌ డిజార్డర్స్, కాంటినెంటల్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌

ఇంట్లో ఫ్లూ ఉన్నవాళ్లుంటే పనికి వెళ్లవచ్చా?
మన ఇంట్లో ఫ్లూ రోగి ఉన్నా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు నిరభ్యంతరంగా వర్క్‌ప్లేస్‌కు వెళ్లవచ్చు. అయితే మన ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ పరీక్షించుకుంటూ ఉండాలి. నివారణ కోసం చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలన్నీ పాటిస్తుండాలి. ఆల్కహాల్‌ బేస్‌డ్‌ క్లెన్సర్స్‌ ఉపయోగిస్తుండాలి. ఒకవేళ జ్వరం లక్షణాలు కనిపిస్తే ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి.

చేతులు కడుక్కోవడం ఎలా?
తరచూ చేతులు కడుక్కోవడం వల్ల అన్ని రకాల వైరస్‌ల నుంచి మంచి రక్షణ దొరుకుతుంది. సబ్బులతో చేతులు రుద్దుకోవడం అన్నది కనీసం 15–20 సెకండ్ల పాటు చేయాలి. సబ్బు, నీళ్లు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్‌ బేస్‌డ్‌ డిస్పోజబుల్‌ రుమాళ్లు (హ్యాండ్‌ వైప్స్‌) లేదా శానిటైజర్స్‌ లేదా జెల్స్‌ ఉపయోగించవచ్చు.

జ్వరంగా అనిపిస్తోందా?
మీకు జ్వరం వచ్చినట్లుగా ఉంటే ఇతరులతో కలవద్దు. మీ పరిసరాల్లోని వ్యక్తుల్లో ఎవరికైనా ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలు, జ్వరం ఉన్నట్లు తెలిస్తే వారిని మిగతావారితో సన్నిహితంగా మెలగనివ్వవద్దు. జ్వరం తగ్గిన 24 గంటల వరకూ మిగతావారితో కాంటాక్ట్‌ లేకపోవడమే మంచిది. వైద్య సహాయం కోసం తప్ప మిగతావాటి కోసం బయటికి వెళ్లవద్దు. అంటే... డ్యూటీకి వెళ్లడం, స్కూలు, కాలేజీలకు కూడా వెళ్లకూడదు. ప్రయాణాలు, షాపింగ్స్, ఫంక్షన్స్, సమావేశాల వంటి బహిరంగ ప్రదేశాలకు  వెళ్లడం సరికాదు.

ఏమిటీ వైరస్‌?
ఇది ఒక రకమైన జలుబు. కొన్నిచోట్ల ఈ వ్యాధిని హాగ్‌ ఫ్లూ, పిగ్‌ ఫ్లూ అని కూడా అంటారు. స్వైన్‌ఫ్లూ అంటే పంది నుంచి వచ్చే ఫ్లూ జ్వరం. అయితే ఈ వైరస్‌ పూర్తిగా పంది జాతిలో కనిపించేది కూడా కాదు. దీని చరిత్ర గురించి కాస్తంత తరచి చూద్దాం. జలుబుతో వచ్చే సాధారణ (ఫ్లూ) జ్వరానికి ఇన్‌ఫ్లుయెంజా అనే వైరస్‌ కారణం. స్వైన్‌ ఫ్లూ వైరస్‌ ప్రధానంగా గాలి ద్వారానే వ్యాపిస్తుంది. ఫ్లూకు కారణమయ్యే ఇన్‌ఫ్లుయెంజాలోనే అనేక రకాల వైరస్‌లు ఉన్నాయి. అందులో దీన్ని ‘హెచ్‌1ఎన్‌1’ వైరస్‌గా నిపుణులు చెబుతున్నారు.

మరి దీన్ని స్వైన్‌ ఫ్లూ అని ఎందుకంటున్నారు?
సాధారణంగా ఈ తరహా వైరస్‌లను ‘ఇన్‌ఫ్లుయెంజా ఎ’, ‘ఇన్‌ఫ్లుయెంజా బీ’, ‘ఇన్‌ఫ్లుయెంజా సి’ అని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ‘ఇన్‌ఫ్లుయెంజా బీ’ రకం పందుల్లో ఉండదు. ‘ఎ, సి’ రెండూ పందుల్లో కనిపిస్తాయి. ప్రస్తుతం కనిపిస్తున్న వైరస్‌ ‘ఇన్‌ఫ్లుయెంజా ఎ’ గ్రూపునకు చాలా దగ్గరగా ఉంది. ఇది... కొన్ని ఉత్పరివర్తనాలకు గురై, మానవులకు సోకే విధంగా రూపొందిందని నిపుణులు అభిప్రాయం. సాధారణ పరిభాషలో ప్రస్తుతం ‘స్వైన్‌ ఫ్లూ’గా అభివర్ణిస్తున్న ఈ వైరస్‌ను నిపుణులు ‘క్వాడ్రపుల్‌ రీ–అసార్టెంట్‌’ వైరస్‌ అని అంటున్నారు. అంటే... ఈ వైరస్‌ నాలుగు రకాల జీన్స్‌తో (జన్యు) మార్పిడి ఏర్పడ్డ సరికొత్త వైరస్‌ అని అర్థం అన్నమాట. అంటే ఇందులో రెండు ఖండాలకు చెందిన పందులకు వచ్చే వైరస్‌ల జీన్స్, పక్షులకు వచ్చే వైరస్‌ల జీన్స్, మానవులకు వచ్చే వైరస్‌ల జీన్స్‌... ఇలా అనేక రకాలకు చెందిన నాలుగు జీన్స్‌ ఉన్నా... రెండూ పందులకు వచ్చేవే ఉండటంతో దీన్ని ‘స్వైన్‌ ఫ్లూ’ అనే పిలుస్తున్నారు.

దీని తీవ్రత ఎంతంటే?
కొందరిలో ఇది మామూలు తీవ్రతతో కనిపించినా మరికొందరిలో ఇది మరీ ప్రమాదకరం కూడా కావచ్చు. ఇది సోకిన చాలామంది ఎలాంటి చికిత్స అవసరం లేకుండా తమంతట తామే కోలుకుంటారు. మరికొందరికి లక్షణాల తీవ్రతను బట్టి చికిత్స అవసరం కావచ్చు. కొందరికి ఇది తీవ్రంగా పరిణమించవచ్చు. సాధారణ సీజనల్‌ ఫ్లూలో 65 ఏళ్లు పైబడ్డ వృద్ధులు, ఐదేళ్ల లోపు చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులున్న అన్ని వయసుల వారిని ‘హై రిస్క్‌’ ఉన్నవారిగా చెప్పవచ్చు. డయాబెటిస్, గుండెజబ్బులు, ఆస్తమా, మూత్రపిండాల వ్యాధులతో గతంలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నవారికి ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ సోకినప్పుడు వాళ్లలో 70% మందికి గతంలో కనిపించిన లక్షణాలు తిరగబెట్టినందున వాళ్లను హైరిస్క్‌గా పరిగణించవచ్చు. కాని ఇంతవరకు ఆ ఏజ్‌ గ్రూప్‌లో ఉన్నవాళ్లకు ఈ కొత్త హెచ్‌1ఎన్‌1 హైరిస్క్‌గా తెలియరాలేదు. ఇటీవల సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ నిర్వహించిన పరిశోధనల్లో 64 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న అడల్ట్స్‌లో ఇంతవరకు ఈ కొత్త హెచ్‌1ఎన్‌1 వైరస్‌ యాంటీబాడీస్‌ కనిపించలేదు. అంతమాత్రాన  ఈ ఒక్క కారణం చేతనే ఫలానా ఏజ్‌ గ్రూపునకు చెందిన వారికి ఈ వైరస్‌ నుంచి పూర్తి  రక్షణ ఉంటుందని నిర్ధారణగా చెప్పడానికి లేదు. ఇది ఎవరికైనా రావచ్చు.

గర్భవతులకు జాగ్రత్తలు
గర్భవతులకు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిలోనూ, శరీరంలో జరిగే మార్పుల కారణంగానూ హెచ్‌1ఎన్‌1 త్వరగా, తీవ్రంగా వ్యాపించే అవకాశం ఉంది. వారికి నిమోనియా, ఏఆర్‌డీఎస్‌ (అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌) వంటి జబ్బులు వచ్చి ఊపిరితిత్తులు విఫలం అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అంతేకాదు... పిండానికి ఆక్సిజన్‌ అందక అబార్షన్‌ అయ్యేందుకు, బిడ్డ మరణించి పుట్టేందుకు (స్టిల్‌బర్త్‌) అవకాశం ఉంది. అంతేకాదు పుట్టిన బిడ్డకు ప్రాణాపాయం అయ్యే ప్రమాదమూ ఉంది.
ఈ ప్రమాదాలు జరగకుండా గర్భిణి స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
►మూడో నెల తర్వాత డాక్టర్‌ను సంప్రదించి తప్పనిసరిగా ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి.
►ఫ్లూ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి యాంటీవైరల్‌ (ఒసాల్టమివిర్‌) వంటి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణులు ఎంత త్వరగా (అంటే 48 గంటల లోపు) ఒసాల్టమివిర్‌ తీసుకుంటే ప్రమాదకరమైన పరిస్థితిని అంతగా నివారించవచ్చు.

చికిత్స...
సాధారణ ఫ్లూకు లాగే దీనికీ చికిత్స చేస్తారు. అయితే... ఇంతకంటే ముందుగా అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం మరొకటుంది. ఫ్లూకు సంబంధించిన సాధారణ లక్షణాలు కనిపించగానే దాన్ని స్వైన్‌ఫ్లూ అంటూ అనుమానించి ఇష్టం వచ్చినట్లుగా యాంటీబయాటిక్స్‌ మందులు, వైరల్‌ ఇన్ఫెక్షన్లను అదుపు చేయడం కోసమే ఉద్దేశించిన ఒసెల్టామివిర్‌ (టామీఫ్లూ) లేదా జనామివిర్‌ అనే మందు ఉపయోగించడం ఎంతమాత్రం సరికాదు. తప్పనిసరిగా డాక్టర్‌ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపించగానే విచక్షణ రహితంగా టామిఫ్లూ వంటి మందులు వాడటం వల్ల మామూలు వైరస్‌లకూ మందులను ఎదుర్కొనే శక్తిని (రెసిస్ట్‌ చేసే శక్తి లేదా రెసిస్టెన్స్‌) మరింతగా పెంచడం మినహా మరో ప్రయోజనం లేదు. నిర్దిష్టంగా టామిఫ్లూ మందునే ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్లు తమ పరిజ్ఞానం, విచక్షణతో విశ్లేషించి ఆ విషయాన్ని నిర్ధారణ చేస్తారు.

ఇది మళ్లీ ఎందుకు పెరుగుతోంది?
మన దేశంలో హెచ్‌1ఎన్‌1 వైరస్‌ 2009లో మొదటిసారి ఉద్ధృతంగా కనిపించిన విషయం అందరికీ తెలిసిందే. మెల్లగా ప్రజల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ పెరగడంతో 2010 నుంచి 2014 వరకు ఈ కేసులు ఎక్కువగా లేవు. కానీ 2015లో కాసిన్ని కనిపించాయి. ఆ తర్వాత ఇప్పుడు 2017లో ఇది మళ్లీ పడగవిప్పింది. ఈ ఏడాది ఇప్పటివరకు తెలంగాణలో 18, గుజరాత్‌లో 412 మృతులు నమోదయ్యాయి. ఇలా హెచ్‌1ఎన్‌1 తిరిగి విజృంభించడానికి కారణాలు...
►ప్రజల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ తగ్గడం ∙అందరూ ప్రతి ఏడాదీ వ్యాక్సిన్‌ తీసుకోకపోవడం∙యాంటీజెనిక్‌ డ్రిఫ్ట్‌ అంటే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ యాంటీజెన్‌లో మార్పులు రావడం ∙కొత్తగా చేరిన మిషిగన్‌ వైరస్‌

హెచ్‌1ఎన్‌1 మిగతా ఫ్లూల కంటే ఎలా వేరు?
∙ఇది సాధారణంగా మధ్యవయస్కుల వారిలోనే ఎక్కువగా వ్యాపిస్తుంది ∙గర్భవతులకు చాలా త్వరగా వ్యాధి వ్యాపించి, ప్రమాదానికి దారితేసే అవకాశం ఉంది. (ఇటు తల్లికి, అటు కడుపులోని బిడ్డకు ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంటుంది) ∙ డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిలో కూడా ఈ జబ్బు తీవ్రంగా ఉంటుంది.

స్వైన్‌ ఫ్లూ టిప్స్‌
►దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతుల్ని, చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతి రుమాలు లేనప్పుడు తమ మోచేతి మడతలో ముక్కు, నోటిని దూర్చి తుమ్మాలి.  
►దగ్గు, తుమ్ము వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
►దగ్గు, తుమ్ము సమయంలో ఉపయోగించిన రుమాలు/టిష్యూను గాని వేరొకరు ఉపయోగించ కూడదు. దాన్ని తప్పనిసరిగా డిస్పోజ్‌ చేయాలి.
►జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. రోగులు కూడా వ్యాధి లక్షణాలు తగ్గిన రెండురోజులు అందరి నుంచి దూరంగా ఉండటమే మంచిది.
►జ్వరంతో ఉన్నవారు పిల్లల ఆటవస్తువులు, దుస్తులు, పుస్తకాలను ముట్టుకోకపోవడమే మేలు.
►పరిసరాలను, కిచెన్లను, బాత్‌రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
►రోగి పక్కబట్టలను, పాత్రలను విడిగా శుభ్రపరచాల్సినంత అవసరం లేదు. అయినా వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒకరి బట్టలు, పక్కబట్టలు, పాత్రలను మరొకరు ఉపయోగించకపోవడమే మంచిది.
►పబ్లిక్‌ ప్లేసెస్‌లో ఒకే బాత్‌ రూమ్‌ ఉపయోగించినప్పుడు తలుపు హ్యాండిల్, కొళాయి నాబ్‌ ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. దాన్నే ఫొమైట్‌ ట్రాన్స్‌మిషన్‌ అంటారు. కాబట్టి హ్యాండిల్స్‌/నాబ్స్‌ను వాడిన తర్వాత చేతులను హ్యాండ్‌ శానిటైజెస్‌’తో శుభ్రం చేసుకోవడం అసవరం.
►పబ్లిక్‌ ప్రదేశాలలో మాస్క్‌ వాడటం వల్ల వ్యాధిని పూర్తిగా నివారించలేం. కానీ, కొంత మేరకు మంచిదే.
►స్వైన్‌ ఫ్లూకు ఇప్పుడు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement