అంతా దైవ చిత్రం
నేను నా దైవం
జరిగేదంతా మన మంచికే... అనే భావం ఎక్కడ నుంచి పుట్టి ఉంటుంది?
దేవుడికి ప్రేమించడం తప్ప, ద్వేషించడం రాదనే నిజం నుంచి పుట్టింది.
మనం అనుకున్నదేదో కాలేదని దేవుణ్ని నిందించవచ్చు!
కానీ... దేవుడు నవ్వి... అంతా నీ మంచికే... అని ఆశీర్వదిస్తాడు!!
చివరికి... మనం అనుకున్నది అనుకున్నట్లే జరక్కపోవడమూ మంచికే
అని... మనకు ఆలస్యంగానైనా తెలుస్తుంది.
జయచిత్ర జీవితంలో ఇలాంటివి ఎన్నో!
ఆమె జీవితమే ఒక చిత్రం!
అంతా దైవచిత్తం అని అర్థం చేసుకున్న జయచిత్రమిది!!
తల్లిని మించిన దైవం లేదని అంటారు. దేవుడు ప్రతిచోట ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. సినీ నటి జయచిత్ర కూడా ఒక అమ్మే. ఆమె కుమారునికి జయచిత్ర దైవమైతే, ఆమెకు ఆమె తల్లి అమ్మాజీ దైవం. వీరందరూ కలిసి ఆరాధించే దేవుళ్లూ ఉన్నారు. అయితే ప్రతి మనిషిలోనూ భగవంతుడిని చూడగలగాలి, అదే అసలైన దైవారాధన అంటున్నారు జయచిత్ర.
దైవం అనే మాటకు మీ నిర్వచనం ఏమిటి?
మొత్తం ప్రపంచమే ఈ దేవుని సృష్టి. మన కంటికి కనపడని ఒక మహాశక్తి. మన ఊపిరి, ప్రాణం, ఆత్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఎన్నెన్నో. దేవుడు లేకుండా ఈ సృష్టిలో ఒక చిన్న విషయం కూడా జరుగదు.
దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు మీ ఇంటి ప్రాంగణంలో గుడి ఎందుకు కట్టించుకున్నారు?!
అపుడు నేను సుమారు పదహారూ పదిహేడేళ్ల అమ్మాయిని. సోగ్గాడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాలు చేస్తున్నపుడు చెన్నై మహాలింగపురంలో మావాళ్లు ఇల్లు కడుతున్నారు. ఇంటి స్థలం ఒకవైపు కార్నర్‌గా ఉంది, దోష నివారణకు గుడి కడితే బాగుంటుందని అమ్మ సూచించారు. మహాబలిపురం నుండి మూడు అడుగుల వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించాం. మొదట మా కోసమని ఇంటి ప్రాంగణంలోపల ‘శ్రీ జయ వినాయగర్ ఆలయం’ పేరుతో నిర్మించాం. అ తరువాత అందరికీ అందుబాటులో ఉండేలా మార్పులు చేశాం.
చిన్నప్పటి నుంచే మీలో భక్తి భావం ఉండేదా?
మా అమ్మమ్మ, అమ్మ అమ్మాజీ గారు చాలా భక్తిపరులు. అమ్మవారు, శివుడు, అయ్యప్ప ఆలయాలకు నన్ను వెంటపెట్టుకుని వెళ్లేవారు. నాకు తోడుగా షూటింగులకు వచ్చినపుడు కూడా మడిగట్టుకుని పూజలు చేసేవారు.
మీకు ఏ దేవుడంటే ఎక్కువ ఇష్టం?
వినాయకుడు, వేంకటేశ్వరస్వామి అంటే మహా ఇష్టం. శ్రీ వేంకటేశ్వరుడు అంటే మన మధ్య జీవించి ఉండే దేవుడు. అత్తగారింటి వారు తిరుచ్చిరాపల్లిలోని శిరువాదియూరు అమ్మన్‌ను కొలుస్తారు. ప్రతి ఏడాది మే 19వ తేదీన మా కుటుంబం తిరుమల కొండపై దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాం. గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వెళుతున్నాం. అంతా దైవానుగ్రహం.
మీకంత దైవానుగ్రహం ఎలా కలిగిందని అనుకుంటున్నారు?
మీకో విషయం చెప్పేదా. నేనే కాదు, మా కుటుంబ సభ్యులందరం కూడా పూర్వజన్మ సుకృతులం. ఎందుకంటే.. నేను కృష్ణ జయంతి రోజున పుట్టాను. మావారు శివరాత్రి రోజున జన్మించారు. మా బాబుది అనూరాధ నక్షత్రం. షిరిడీ సాయిబాబా సమాధి అయిన రోజుటి నక్షత్రం అది. అంతేకాదు కంచిపీఠం చంద్రశేఖర సరస్వతి మహా స్వాముల వారు కూడా అనూరాధ నక్షత్రంలో ఈ లోకంలో అవతరించారు. అది తలుచుకుంటే ఎంతో సంతోషం కలుగుతుంది.
అంతా బాగుంటే దైవానుగ్రహం అనుకుంటాం. ఏదైనా కీడు, నష్టం జరిగితే దేవుyì ని కోప్పడతాం. ఈ మానవ స్వభావంపై మీరేం చెబుతారు?
కష్టనష్టాల మిళితమే జీవితం. ప్రతి ఒక్కటీ దైవసంకల్పమేనని భావించాలి. దేవుడిపై కోప్పడటం, అలగటం నా జీవితంలో ఎప్పుడూ లేదు. దేవుడా నేనేమైనా తప్పు చేశానా, క్షమించమని ప్రాధేయపడటమే. మనం అనుకున్నది జరగనపుడు ఎందుకిలా జరిగిందని అనుకోవడం సహజం. అంతమాత్రాన దేవుడిపై నిందలు వేయడం తగదు. మరోరకంగా మంచి జరుగుతుందని భావిస్తూ సమస్యలను సైతం సానుకూల దృక్పథంతో స్వీకరించడమే మన పని.
కష్టాలు కలిగినపుడు కూడా ‘శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు’ అని సరిపెట్టుకుంటారా?
అదే చెప్తున్నా.. జీవితంలో ప్రతికదలికకు భగవంతుడే కారణం అనే నమ్మకాన్ని పెంచుకుంటే కష్టనష్టాలను తట్టుకునే శక్తిని భగవంతుడే ఇస్తాడు. గత ఏడాది అక్టోబరులో కేవలం నేనొక్కదాన్నే అన్నింటికీ నిలబడి బాబు పెళ్లి చేసానంటే దేవుడిచ్చిన శక్తి కాక మరేమిటి. అంతేకాదు ఏదో శక్తి నన్ను నడిపించింది. మనుమడి పెళ్లిని (నా కుమారుడు) కనులారా చూసిన ఆనందంతో ‘నా కోడలు గ్రేట్’ అంటూ నన్ను మెచ్చుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆమె కన్నుమూసారు. నిష్టాగరిష్ట సంప్రదాయ కుటుంబంలో అత్తగారి 16 రోజుల కర్మక్రతువుల సేవలు కూడా ఏకైక కోడలిగా నెరవేర్చే శక్తిని కూడా నాకు ఆ దేవుడే ప్రసాదించాడు.
‘ఇది దైవ మహిమ’ అని అనుకున్న సందర్భాలు మీ జీవితంలో ఏవైనా ఉన్నాయా?
ఓ..తప్పకుండా. మా అమ్మ, అమ్మమ్మ అందరం కలిసి చెన్నైకి సమీపంలోని అంగాళపరమేశ్వరీ అమ్మవారి ఆలయానికి వెళ్లేవారం. అక్కడ పెద్ద పాము పుట్ట ఉండేది. వెళ్లినపుడల్లా కోడిగుడ్డు వేసి పాలు పోసేదాన్ని. ఆ రకంగా పాము అంటే భయం కంటే భక్తి ప్రపత్తులు ఉండేవి. సరిగ్గా అదే సమయంలో ‘వెళ్లికిళమై వ్రతం’ (తెలుగులో నోము) చిత్రంలో హీరోయిన్‌గా బుక్ అయ్యాను. అపుడు నా వయస్సు 18 ఏళ్ల లోపే. అంత చిన్న వయస్సులో ఎంతో పొడవైన నిజమైన నాగుపాముతో ఏ మాత్రం భయం లేకుండా నటించానంటే అమ్మవారి కరుణే కారణం. అంతేకాదు, నాకు ఇంత మంచి జీవితం దక్కడం కూడా దైవ మహిమే అనుకుంటాను.
ఇంతగా మిమ్మల్ని అనుగ్రహించిన ఆ దేవుడికి రుణపడి ఉన్నానన్న భావన మీలో కలిగిన సందర్భాలున్నాయా?
దేవుడి రుణం తీర్చుకోవడం మానవ మాత్రునికి సాధ్యమా చెప్పండి? అయితే ఒక విషయం మాత్రం గుర్తుకు వస్తోంది. ఒకసారి చెన్నై టీనగర్‌లోని టీటీడీ ఆలయానికి వెళ్లినపుడు బైట గేటు మూసి ఉంది. ఇదేమిటి ఈ సమయంలో మూసి ఉన్నారని ఆలయ నిర్వాహకులను అడిగాను. శ్రీవారికి నైవేద్యం పెడుతున్నప్పుడు మూసివేస్తామని చెప్పారు. ఈ సంగతి భక్తులకు ఎలా తెలుస్తుంది? పైగా ఏమేమో అనుమానాలు వచ్చే అవకాశం ఉంది కదాని బాధపడ్డాను. నైవేద్యం సమయంలో గంట కొడుతూ ఉంటే భక్తులకు ఆ సంగతి అర్థం అవుతుందని, ఆ గంటను నేనే కొనిస్తానని నిర్వాహకులను కోరాను.
వాళ్లు అంగీకరించారు. వెంటనే చెన్నైలోని ప్యారిస్ సెంటర్ వెళ్లాను. బురద కారణంగా కారు లోనికి వెళ్లే పరిస్థితి లేదు. అక్కడే ఒక సందులోకి దిగి వెళ్లి, ఓ షాపులో గంటను సెలక్ట్ చేశాను. ‘నేను మెయిన్ రోడ్డులోకి వెళ్లిన తరవాత గంట కొట్టు, గంట మోత నాకు అక్కడికి వినిపించాలి’ అని షాపు వాళ్లకు చెప్పి మళ్లీ ఆ బురదలో వెనక్కు నడుచుకుంటూ వచ్చి విన్నాను. నేటికీ ఆలయంలో స్వామివారికి నేను సమర్పించిన ఆ గంటను నైవేద్యం సమయంలో వినిపిస్తున్నారు. అయితే అది రుణం తీర్చుకోవడం కాదు. ఏమి చేసినా దేవుని రుణం తీరేది కాదు.
దైవం మానుష రూపేణా అంటారు.. మరి మనుషులకు సేవ చేస్తే సరిపోతుంది కదా, ఈ పూజలు, అభిషేకాలు ఎందుకు?
ప్రతిఒక్కరిలో దైవాన్ని చూడగల పరిణతి మనుషుల్లో పెరిగినపుడు మనం ఇతరులకు చేసే సేవలు ఆ దేవదేవుని పాదాల వద్దకు చేరుతాయి.
దేవుడు ప్రత్యక్షమైతే ఏమి కోరుకుంటారు?
జన్మజన్మలకు అమ్రేష్ వంటి కొడుకు పుట్టాలి. బాబు అంటే నాకు ప్రాణం. అతనిని చల్లగా చూడు తండ్రీ అని ప్రార్థిస్తాను. బిడ్డల్ని సంతృప్తిగా చూసుకునేందుకే ప్రతి తల్లి ఎక్కువ కాలం బ్రతకాలని ఆశపడుతుంది. అలాంటి ఆశే ప్రతి తల్లినీ బతికిస్తూ ఉంటుంది. మా బాబు తన సంగీత దర్శకత్వంలో తొలిసారిగా ‘జీవితం’ అనే ఆడియో నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేశాడు. అందులోని ‘ఏడు కొండల వెంకయ్యే ఈ లోకము’ అనే గీతాన్ని తెలుగు, తమిళంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడారు.
ఈ పాట తిరుమల కొండపై వినపడాలని తల్లిగా నేను చేసిన ప్రార్థనను స్వామి ఆలకించాడు. తిరుమల కొండల్లో బాబు ఆడియో వినిపించినపుడు పులకించిపోయాను. సంగీతం సరే తమిళంలో పాటలు కూడా రాస్తున్నాడు. తెలుగు చదవకున్నా తెలుగు పాటలు రాస్తున్నాడు. నా బాబుకు నేను బహూకరించిన నిలువెత్తు మురుగన్ త్రిశూలం ఒక కవచంలా కాపాడుతోంది. ప్రత్యక్షం కాకుండానే మాకు ఎన్నో వరాలు ఇచ్చిన ఆ దేవుడిని ఇంకేమి కోరుకునేది.
– కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి చెన్నై