స్కాల్ప్‌ సమస్యలు మాడుతోంది | special story to hair fall in summer | Sakshi
Sakshi News home page

స్కాల్ప్‌ సమస్యలు మాడుతోంది

Published Wed, Apr 5 2017 11:09 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

స్కాల్ప్‌ సమస్యలు మాడుతోంది

ఎవరికైనా సరే... తొలి కిరణం సోకేది మాడుకే. తొలుత మాడిపోయేది మాడే. భానుడి చండప్రచండానికి మొదట గురయ్యేదీ, ఎక్కువగా ప్రభావితమయ్యేది కూడా మాడే. ఎండలకు మాడే ఈ మాడు తాలూకు... మూడు ప్రధాన సమస్యలు. అవి... వెంట్రుకలు రాలడం, దురద. చుండ్రు. ఎండ వల్ల పొడిబారి దురద పెరగవచ్చు. చుండ్రు రాలడం మరింతగా జరగవచ్చు. ఇవిగాక మరికొన్ని వ్యాధుల వల్లనే వచ్చేవి
కాస్తంత అరుదు... అప్రధానం. మూడు సమస్యలను ప్రత్యేకంగా ఇచ్చాం. మిగతావి గుదిగుచ్చాం. మొత్తం మీద మాడుపై ప్రత్యేక కథనమిది. తల గోక్కుంటుంటే వెంటనే చదవవచ్చు. ఊరికే తల గీరుకోకూడదని అనుకున్నా వెంటనే ఈ కథనాన్ని చదవాల్సిందే.

ఎండల్లో తిరుగుతుంటే చర్మం నల్లబారుతుండటం మనకు తెలిసిందే. స్కిన్‌ట్యాన్‌ను గుర్తించిన వెంటనే మనం ఫుల్‌ స్లీవ్స్‌ వేసుకోవడమో, సన్‌ స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడమో చేస్తుంటాం. మరి ఎండ వల్ల మాడుపై ఎలాంటి దుష్ప్రభావం పడుతుంది. దానిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలకు ఆస్కారం ఉంటుందనే విషయాలపై అవగాహన పెంచుకుందాం.

ఎండలో మాడుపై పడే దుష్ప్రభావాలు!
మిగతా చర్మంతో పోలిస్తే మన మాడు మీద నూనె స్రవించే గ్రంథుల సంఖ్య దాదాపు పది రెట్లు ఎక్కువ. అలా నూనెను స్రవించే గ్రంథులను సెబేషియస్‌ గ్లాండ్స్‌ అనీ... ఆ నూనెను సీబమ్‌ అని అంటారు. ఈ సీబమ్‌ సాధారణ వాతావరణంలో స్రవించే మోతాదుకంటే ఎండకాలం ఎక్కువగా స్రవిస్తుంటుంది. పైగా పది రెట్లు ఎక్కువగా. అందుకే ఈ సీజన్‌లో జుట్టు త్వరగా జిడ్డుగా మారడం, అణిగినట్లుగా కనిపించడం జరుగుతుంది. పైగా జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్‌) ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.అందరి చర్మంపైనా మలసేజియా అనే ఫంగస్‌ నివసిస్తూ ఉంటుంది. దానికి మన చర్మం పైన స్రవించే ఈ ‘సీబమ్‌’ ఆహారం. ఇక ఎండలో తిరిగేవారిలో సీబమ్‌ పెరగడం వల్ల ఈ ఫంగస్‌ మరింత ఎక్కువగా వృద్ధి చెంది చుండ్రుకు కారణమవుతుంది. అదే ఫంగస్‌ పెరుగుదల విపరీతంగా, అత్యంత ఎక్కువగా జరిగితే... అది సెబోరిక్‌ డర్మటైటిస్‌ అనే చర్మవ్యాధికి దారి తీస్తుంది.

ఎండ కారణంగా... చెమట వల్ల...
ఎండలో మాడుపై సీబమ్‌ పెరగడంతోపాటు కొందరిలో చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇది జుట్టు దట్టంగా ఉండేవారికి నరకమే. ఇలాంటి స్థితిలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. వీటివల్ల హెయిర్‌ ఫాలికిల్‌ ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. దీన్ని వైద్యపరిభాషలో ‘ఫ్యాలిక్యులైటిస్‌’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో మాడు మీద చీము పొక్కులు (పస్‌ నిండినట్లుగా అనిపించే కురుపులు) వస్తుంటాయి. వాటి వల్ల నొప్పి, దురద ఎక్కువగా ఉండవచ్చు.

నేరుగా పడే ఎండ వల్ల!
నేరుగా మాడుపై ఎండ పడుతూ ఉండటం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే వెంట్రుకలపై ఎండ నేరుగా పడితే ‘రోమాంకురాలు’ (హెయిర్‌ ఫాలికిల్స్‌ డ్యామేజ్‌) దెబ్బతింటాయి. ఫలితంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యను ‘ఎక్టినిక్‌ టెలోజెన్‌ ఎఫ్లువియమ్‌’ అని కూడా అంటారు. వీటితో పాటు తీవ్రమైన ఎండల వల్ల కొందరిలో నుదుటి మీద చిన్న చిన్న పొక్కులు లేదా మొటిమల వంటివి వస్తుంటాయి.

ఎండలో హెల్మెట్‌తో సమస్యా?
హెల్మెట్‌ పెట్టుకుంటే జుట్టు మరింతగా రాలుతుందనే అపోహ ఉంది. కానీ హెల్మెట్‌ జుట్టును, మాడును ఎండ నుంచి కాపాడుతుంది. కాలుష్యం నుంచీ రక్షిస్తుంది. జుట్టును రాలకుండా ఆపుతుంది. అయితే పరిశుభ్రమైన గుడ్డను తల మీద కప్పుకుంటే మంచిది. అలా చేయడం వల్ల చెమటతో తడిసి, అపరిశుభ్రంగా ఉన్న హెల్మెట్‌ను ధరించడం వల్ల వచ్చే ఇబ్బందులను నివారించవచ్చు.

స్కాల్ప్‌ అంటే ఏమిటి...?
మాడు భాగాన్ని ఇంగ్లిష్‌లో స్కాల్ప్‌ అంటుంటాం. ముక్కు, చెవి, నుదురులాగ స్కాల్ప్‌ అనేది ఒక పదం కాదు. ఇంగ్లిష్‌లో ఐదుపదాల ముందు అక్షరాలను తీసుకొని ‘స్కాల్ప్‌’ అనే పదాన్ని రూపొందించారు. దీని స్పెల్లింగ్‌లోని ఐదు ఇంగ్లిష్‌ అక్షరాలూ ఇలా ఉంటాయి. ఎస్‌ అంటే స్కిన్, సీ అంటే కనెక్టివ్‌ టిష్యూ, ఏ అంటే ఎపోన్యూరోటికా, ఎల్‌ అంటే లూజ్‌ ఏరియోలా, పీ అంటే పెరియాస్టియమ్‌ అనే మాటలను సూచిస్తాయి. ఇందులో మొదటిదైన స్కిన్‌ అంటే చర్మం నుంచి మొదలై నుంచి పి అంటే పెరియాస్టియమ్‌ అనే పుర్రె ఎముక భాగం వరకు వరసగా ఉండే పొరలకు ఉన్న పేర్ల తాలూకు ఇంగ్లిష్‌ అక్షరాలతో స్కాల్ప్‌ అనే పదాన్ని రూపొందించారు.

మాడు సమస్యల నివారణ కోసం...
పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలోని పోషకాలు చుండ్రుతో పాటు పలు మాడు సమస్యలకు కారణమయ్యే అంశాలను నివారిస్తాయి. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం వల్ల మాడు మీద చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. మాడుపై చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నవారు  మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్‌ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

డాక్టర్‌ను సంప్రదించాల్సినదెప్పుడు...
మాడుకు సమస్య వచ్చినట్లు గ్రహించిన తర్వాత, డాక్టర్‌ను తప్పక సంప్రదించాల్సిన అవసరం ఈ కింది సందర్భాల్లో ఉంటుంది. ∙మాడు మీద విపరీతంగా దురద పెడుతున్నప్పుడు ∙ఎండలో ఉన్నప్పుడు దురద మరింతగా పెరుగుతుంటే ∙చీముతో కూడిన కురుపులు కనిపించినప్పుడు ∙మాడు మీద తెలుపు లేదా గ్రే కలర్‌ పెచ్చులు వచ్చినప్పుడు ∙ఎండలో తిరిగినప్పుడల్లా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే... తప్పనిసరిగా చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించాలి.

అపోహ... వాస్తవం
⇒ఎండల్లో హెల్మెట్‌ కారణంగా మరింత జిడ్డు పెరగడం, చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ హెల్మెట్‌ ఈ సీజన్‌లో నేరుగా ఎండ  వెంట్రుకలపై పడటం వల్ల కలిగే దుష్ప్రభావాలనుంచి కాపాడుతుంది. కాకపోతే లూజ్‌గా ఉండే పరిశుభ్రమైన గుడ్డను చుట్టుకున్న తర్వాత హెల్మెట్‌ పెట్టుకోవడం మేలు.
⇒మంచి షాంపూ వాడిన తర్వాత కాసేపు ఎండలో వెంట్రుకలు మెరుస్తూ కనిపిస్తాయని అనుకుంటాం. కానీ నేరుగా వెంట్రుకలపై పడే ఎండ వాటిని డల్‌గా చేస్తుంటుంది. అందుకే నేరుగా ఎండలోకి వెళ్లేవారు వెంట్రుకలకు రక్షణగా క్యాప్‌ ధరించడం మేలు. అది కాస్తంత వదులుగా ఉండే కాటన్‌ క్యాప్‌ అయితే మరింత మంచిది.

ఎండ వేళల్లో... దువ్వుకోవాల్సిందిలా...
⇒రక్తప్రసరణ కుదుళ్లకు సరిగ్గా అందాలంటే బాగా దువ్వుకోవడం, మంచి దువ్వెన ఉపయోగించడం మేలు. వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో జుట్టును పాయలుగా విడదీస్తూ, ముందుకు వేసుకుని కుదుళ్ల దగ్గర నుంచి చివర్ల వరకు దువ్వాలి. ఇలా చేయడం వల్ల తలలో దుమ్ము, చుండ్రు ఉంటే రాలిపోతుంది. అది మాడుకు మేలు చేస్తుంది.
⇒ఎండల్లో సాధారణంగా పెరుగుతూ మాడును మాడ్చేసే పై సమస్యలను తెలుసుకుంటే, దానికి బదులు సమస్యనే మాడ్చవచ్చు. చికిత్సతో మాన్పవచ్చు. అంతేకాదు... పైన పేర్కొన్న జాగ్రత్తలు కేవలం మాడుకే గాక మిగతా చర్మానికే మేలు చేస్తాయి.

ఎండలో మాడు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
⇒మాడుపై సీబమ్‌ ఎక్కువగా రావడం వల్ల జుట్టు డల్‌గా, జిడ్డుగా కనిపిస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ లేదా రోజు విడిచి రోజు తలస్నానం చేయాలి.
⇒మన స్కాల్ప్‌ తాలూకు పీహెచ్‌ విలువ 5.5 ఉంటుంది. సరిగ్గా ఇదే పీహెచ్‌ ఉన్న షాంపూలను వాడితే మాడుకు మంచిది.
⇒చుండ్రు లేదా ఫాలిక్యులైటిస్‌ ఉన్నవారు తప్పనిసరిగా చర్మవ్యాధి నిపుణులను కలిసి వారు సూచించే మందులను తీసుకోవాలి. జాగ్రత్తలను తప్పక పాటించాలి.
⇒జిడ్డు చర్మం, జిడ్డుగా ఉండే మాడు ఉన్నవారు... ఆయిలీగా ఉండే కండిషనర్స్‌ను వాడకూడదు.
⇒జిడ్డు చర్మం, జిడ్డు ఎక్కువగా ఉండే మాడు కలిగిన వారు తలకు నూనె పెట్టడం కూడా అంత మంచిది కాదు.
⇒నేరుగా ఎండలోకి వెళ్లేవారు, మోటార్‌ బైక్‌పై వెళ్లేవారు ఏదైనా వదులుగా ఉండే కాటన్‌ తల గుడ్డతో తలను కవర్‌ చేసుకొని ఆ పైనే హెల్మెట్‌ ధరించాలి.
⇒ ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు, ద్రవాహారాలు కూడా ఎక్కువగా తీసుకోవడం అందరికీ మేలు.

డాక్టర్‌ సింధూర కంభంపాటి
కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్,హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement