నీలాంబరి టు... శివగామి | special story to ramya krishna | Sakshi
Sakshi News home page

నీలాంబరి టు... శివగామి

Published Sat, May 6 2017 10:30 PM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

నీలాంబరి టు... శివగామి

నీలాంబరి టు... శివగామి

రమ్యకృష్ణ సినిమా కెరీర్లో మొదటి ఏడేళ్లు అన్నీ ఫట్లే! కుంగిపోలా... లోయలో పడిపోలా... సముద్రంలో మునిగిపోలా తనలో తను లీనమైపోయింది... తనకి తాను చెప్పుకుంది... తన కోసం తను నిలబడింది తన చెయ్యి తనే పట్టుకుని పర్వతం ఎక్కింది ఒక శిఖరం నీలాంబరి... ఒక శిఖరం శివగామి ఈ మధ్యలో అన్నీ శిఖరాగ్రాలే అయినా తలెగరేసినవి ఈ రెండే.

20 ఏళ్ల క్రితం నీలాంబరి అన్నా.. ఇప్పుడు శివగామి అన్నా మీరే చేయాలన్నంత గొప్ప నటి అనిపించుకున్నారు..
(నవ్వుతూ). ఇన్నేళ్ల కెరీర్‌లో ఏ పాత్ర వచ్చినా అన్నీ బాగా కుదిరాయి. అప్పట్లో నీలాంబరి.. ఇప్పుడు శివగామి రెండూ మంచి పాత్రలే. నాకు వచ్చిన ఏ పాత్రని అయినా నేను హండ్రెడ్‌ పర్సంట్‌ డెడికేషన్‌తో చేస్తాను.
     
‘బాహుబలి’కి మీరే హీరో అని సోషల్‌ మీడియా ద్వారా మీకు చాలా మెసేజ్‌లు వచ్చినప్పుడు ఏమనిపించింది?
నాకైతే మాటల్లో ఎలా చెప్పాలో తెలియడంలేదు. నా ప్లేస్‌లో ఎవరు ఉన్నా హ్యాపీ ఫీలవుతారు. యాక్చువల్లీ నాకు ఏ క్యారెక్టర్‌ వస్తే అది చేసుకుంటూ వచ్చాను. నాకు సూట్‌ అయ్యే రోల్స్‌తోనే డైరెక్టర్స్‌ ఎప్రోచ్‌ అవుతారని నా నమ్మకం. అందుకే దాదాపు ఏ పాత్రకీ ‘నో’ చెప్పను. ‘బాహుబలి’కి అవకాశం రావడం నా లక్‌.

లక్‌ని, దేవుణ్నీ నమ్ముతారా?
లక్‌ని, దేవుణ్ణీ నమ్ముతా. నా టైమ్‌ ఆర్టిస్ట్‌లకి ఇలాంటి అవకాశాలు రావడం అరుదు. నాకు వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. నేను సాయిబాబా భక్తురాల్ని.

సాయిబాబా అంటే ఎప్పటి నుంచీ నమ్మకం.. ఆ నమ్మకం పెరగడానికి ఏదైనా సంఘటనలున్నాయా?
కొన్ని అద్భుతాలు జరిగాయి. అవి పూర్తిగా పర్సనల్‌. ఎప్పటినుంచి నమ్మడం మొదలుపెట్టానో అప్పటి నుంచి నా కెరీర్‌ బాగుంటోంది. మీకు తెలిసే ఉంటుంది.. హీరోయిన్‌గా నాకో మంచి హిట్‌ రావడానికి ఏడేళ్లు పట్టిందని.

ఆ ఏడేళ్లల్లో మిమ్మల్ని ‘ఐరన్‌ లెగ్‌’ అన్నవాళ్లూ ఉన్నారు. ఆ ట్యాగ్‌ని ఎలా తట్టుకోగలిగారు?
అప్పట్లో ఏ సినిమా వచ్చినా కాదనకుండా చేశా. ఏడేళ్లు సక్సెస్‌లు లేవు. విమర్శలు ఎదుర్కొన్నా. అప్పుడప్పుడూ కాన్ఫిడెన్స్‌ తగ్గేది. ఆ సమయంలో ‘మనకు మనమే ధైర్యం చెప్పుకోకపోతే ఎలా?’ అనుకునేదాన్ని. కాన్ఫిడెన్స్‌ తెచ్చుకునేదాన్ని. చివరికి రాఘవేంద్రరావుగారి వల్ల నాకో హిట్‌ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి ‘శివగామి’ దాకా నా కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా సాగిందంటే ఆయనే కారణం.
     
లైఫ్‌లో చిన్నపాటి ఫెయిల్యూర్స్‌కే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్న వాళ్లకు మీరు కచ్చితంగా రోల్‌ మోడల్‌ అనాలి...

రోల్‌ మోడల్‌గా తీసుకోమని అనను కానీ లైఫ్‌లో ఎవరైనా సరే డౌన్‌ఫాల్‌లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్‌ బిల్డ్‌ చేసుకోవడానికి ట్రై చేయాలి. మనకు మనం అది చేసుకోలేకపోతే ఎవరు చేస్తారు? నా విషయాన్ని తీసుకుందాం. నేను విధిని నమ్ముతా. ఏ ఛాన్స్‌ వచ్చినా కాదనుకుండా చేశా. కంటిన్యూస్‌గా ఫెయిల్యూర్స్‌ వచ్చినా డెడికేషన్‌ తగ్గలేదు. ఒక పాత్రకు న్యాయం చేయడానికి ఎంత కష్టపడాలో అంతా పడ్డాను. ఫైనల్లీ నాకు మంచే జరిగింది. కాకపోతే కొంచెం లేట్‌ అయింది. అంతవరకూ ఓపిక పట్టాలి.

గ్లామరస్‌ క్యారెక్టర్స్‌ చేసి మెప్పించారు.. అమ్మవారి పాత్రలూ చేయడం గొప్ప విషయం..
‘ఒక పక్క గ్లామరస్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ మరోపక్క అమ్మవారి పాత్రలా?’ అని కొంతమంది అన్నారు. కానీ, నేను పట్టించుకోలేదు. ఏ పాత్రని అయినా నేను డెడికేషన్‌తో చేయగలనని నాకు తెలుసు. అదే నాకు అడ్వాంటేజ్‌ అయింది. ఏ పాత్ర చేసినా నమ్మకంతో చేస్తాను. అది కమర్షియల్‌ రోల్స్‌ అయినా ట్రెడిషనల్‌ క్యారెక్టర్స్‌ అయినా.. దేవుడి సినిమాలైనా. ఇలా అన్నీ చేయడం నాకు అడ్వాంటేజ్‌ అయింది.
     
సమాజ ధోరణి చూస్తుంటే.. మీ ‘కంటే కూతుర్నే కను’ గురించి మాట్లాడాలనిపిస్తోంది.. ఇప్పుడు కొంతమంది ఆడపి ల్లను భూమ్మీదకు రాకముందే అంతం చేయడమో లేకపోతే వచ్చాక చెత్తకుండీలో పడేయడమో చేస్తున్నారు...
‘కంటే కూతుర్నే కను’ మంచి సినిమా. ప్రేరణగా తీసుకోవాల్సిన మూవీ. మీరన్నట్లు ఆడపిల్లకు ఆదరణ లేకుండా పోతోంది. నాకు తెలిసినంతవరకూ అమ్మాయిలే కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. అమ్మానాన్నలను, అక్కచెల్లెళ్లను, భర్తను.. మొత్తం కుటుంబాన్ని చూసుకుంటారు. బాధ్యతగా ఉంటారు. అబ్బాయిలు అంత బాధ్యతగా ఉండరని నా ఫీలింగ్‌. మరి.. కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయిలు వద్దని ఎందుకనుకుంటున్నారో?
     
సమాజంలో ఆడవాళ్లు నెగ్గుకు రావడం అంత ఈజీ కాదేమో.. ఉదాహరణకు సినిమా పరిశ్రమలో కెరీర్‌ స్మూత్‌గా సాగాలంటే ‘అడ్జస్ట్‌మెంట్‌’ అనే మెలిక పెడతారని ఈ మధ్య కొంతమంది హీరోయిన్లు బహిరంగంగానే అన్నారు...

అన్నవాళ్లే దీనికి సమాధానం చెప్పగలుగుతారు. ఆడవాళ్లకు ఇబ్బందులు లేనిదెక్కడ? ఒక్కో చోట ఎక్కువ సమస్యలు.. ఒక్కోచోట తక్కువ. వేరే ఫీల్డ్‌లో కూడా ‘అడ్జస్ట్‌మెంట్‌’ అనేది ఉంటుందేమో. కానీ, అడ్జస్ట్‌ అవ్వాలా? వద్దా? అనే నిర్ణయం ఎవరికి వాళ్లు తీసుకోవాలి. తప్పదు.. కెరీర్‌లో ముందుకెళ్లాలనుకున్నవాళ్లు అడ్జస్ట్‌ అవుతారు. వద్దనుకున్నవాళ్లు ‘నేనిలాగే ఉంటాను’ అని అడ్జస్ట్‌ అవ్వ రు. వాళ్ల వాళ్ల మైండ్‌సెట్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది.

‘రైట్‌ రాయల్‌’గా బతికే పరిస్థితి ‘ఉమెన్‌’కి ఉండదా?
సొసైటీ మేల్‌ డామినేటెడ్‌ అండి. ఎక్కడైనా ఒక మగాణ్ణి.. స్త్రీ రేప్‌ చేసిందనే వార్త వింటామా? వినం కదా. మేల్‌ డామినేటెడ్‌ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రావాలనేది మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ‘మీరిలా తెలివిగా ఉండాలి. ఇలా చేస్తే నెగ్గుకు రావచ్చు’ అని సలహాలివ్వలేను. ఎందుకంటే, ఫేస్‌ చేసే సిట్యుయేషన్‌ బట్టి నిర్ణయాలు ఉండాలి. ఏది రైట్‌ అనిపిస్తే అది చేయాలి. అది కొందరికి తప్పు అనిపించవచ్చు. కానీ, మన నిర్ణయాలు తీసుకునే హక్కు మనకుంటుంది కదా.

లైంగిక వేధింపుల గురించి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది.. నిర్భయలాంటివి?
జరగకూడనివి జరుగుతున్నాయి. అవి విన్నప్పుడు, టీవీల్లో చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. శిక్ష కఠినంగా ఉండాలి. ఆ శిక్ష చూసి, తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. నేరానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు చట్టంలో మార్పు చేసి, శిక్ష అమలు చేయాలి. ఇలా చేయడం వల్ల దాడులు ఆగుతాయనడంలేదు. కాకపోతే సగం అయినా తగ్గుతాయని నా బలమైన నమ్మకం. నిర్భయ ఘటన తీర్పు నేరగాళ్లకు మంచి హెచ్చరిక.

అనుకోకుండా మంచి పాత్రలు కుదిరాయన్నారు. విచిత్రంగా మీ భర్త పేరు, మీ పేరు (‘రమ్యకృష్ణవంశీ’) కూడా భలే కుదిరింది.. లవ్‌ని ఎవరు ప్రపోజ్‌ చేశారండి..
(నవ్వుతూ).. నిజమే.. పేరు భలే కుదిరింది. పర్టిక్యులర్‌గా ప్రపోజల్‌ అంటూ ఏమీ చేయలేదు. పెళ్లికి ఏడెనిమిదేళ్ల ముందు నుంచీ పరిచయం. ఆ ట్రావెల్‌లో ఒకర్నొకరు అర్థం చేసుకున్నాం. పెళ్లి చేసుకుంటే బాగుందనుకున్నాం. కంఫర్టబుల్‌గా సెటిలయ్యాం.

కృష్ణవంశీగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ‘ఆవిడ ఏంజిల్‌’ అని మీ గురించి అన్నారు. ఆయన గురించి మీరేమంటారు?

ఐయామ్‌ లక్కీ. కృష్ణవంశీగారిని పెళ్లి చేసుకున్నందుకు బాధపడిన సందర్భం ఒక్కటీ లేదు. నా కెరీర్‌ కోసం నేను చెన్నైలో ఉంటున్నాను. ఆయన హైదరాబాద్‌లో ఉంటారు. ‘నువ్వు అక్కడ ఉండటానికి వీల్లేదు’ అని ఉంటే, నేనేం చేయలేను. కానీ, ఆయన ‘వర్క్‌ ఓరియంటెడ్‌’. వర్క్‌ విలువ తెలుసు కాబట్టి, నేను హ్యాపీగా కెరీర్‌ కంటిన్యూ చేయగలుగుతున్నాను. ఇంత ఫ్రీడమ్‌ ఎవరిస్తారు చెప్పండి? ఆడవాళ్లంటే ఆయనకు గౌరవం ఎక్కువ. ఎంకరేజ్‌ చేస్తారు. ‘హీ ఈజ్‌ సో ప్రౌడ్‌ ఆఫ్‌ మి’. భర్త రూపంలో ఉన్న మంచి స్నేహితుడు ఆయన.

చెన్నైలో మీరు.. హైదరాబాద్‌లో కృష్ణవంశీగారు... మిస్‌ అవుతున్నట్లుగా అనిపించదా?
అలాంటిదేం లేదు. మేం చెట్లు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకునే ఏజ్‌లో లేం. మెచ్యుర్డ్‌ పీపుల్‌. దూరంగా ఉన్నంత మాత్రాన దూరమైపోతామని కాదు. ఫోన్‌లో మాట్లాడుకుంటాం. కష్టసుఖాలు చెప్పుకుంటాం. వీలునప్పుడు ఆయన చెన్నై, నేను హైదరాబాద్‌ వస్తుంటాం. అప్పుడు కూడా ఎవరో ఒకరం వర్క్‌తో బిజీగా ఉంటాం. దాంతో దగ్గరగా ఉన్నా కూడా లేనట్లే ఉంటుంది. అందుకే వెకేషన్‌ ప్లాన్‌ చేసుకుని,    ‘మా కోసమే మేం’ అన్నంతగా టైమ్‌ స్పెండ్‌ చేస్తాం.

వంట చేసే టైమ్‌ మీకుంటుందా? మీరు వండిన వంటల్లో కృష్ణవంశీగారికి ఏవి ఇష్టం?
రెండు రోజులకు మించి నేను బయట ఫుడ్‌ తినలేను. ఇంట్లో వండినది కావాల్సిందే. కొన్ని కూరలు వచ్చు. ఆయనెప్పుడూ వంక పెట్టలేదు. వేరే దారి లేక తింటారో... నచ్చే తింటారో కానీ తినేస్తారు (నవ్వేస్తూ).


హిట్టూ ఫ్లాప్స్‌ గురించి చర్చిస్తారా?
డిస్కస్‌ చేసుకుంటాం. కానీ, ఏం చేయాలనేది ఆయన డెసిషనే. డైరెక్టర్‌గా తనకు ఏది కంఫర్ట్‌ అనిపిస్తే అది చేయాలి. వేరేవాళ్ల నిర్ణయాల మీద ఆధారపడకూడదు.

ఫైనల్లీ... టీనేజ్‌లో స్టార్ట్‌ అయిన మీ కెరీర్‌ వయసు 30 ఏళ్ల పైనే. ఎప్పుడైనా రిలాక్స్‌ అవ్వాలనిపించలేదా?
అప్పుడప్పుడూ అనిపిస్తుంది. సరిగ్గా ఆ టైమ్‌కి ఎవరో ఒకరు వచ్చి అడగడం, సినిమా ఒప్పుకోవడం జరిగిపోతోంది. అందుకని రిలాక్స్‌కి ఛాన్స్‌ లేదు. అయినా ఫర్వాలేదు. ‘ఐయామ్‌ ఎంజాయింగ్‌ మై వర్క్‌’.

శివగామి పాత్ర గురించి రాజమౌళి గారు చెప్పినప్పుడు...
గొప్ప క్యారెక్టర్‌ అనిపించింది. అయితే ఇంత పెద్ద పేరు వస్తుందని మాత్రం ఊహించలేదు. ‘బాహుబలి’ ఇంత పెద్ద సినిమా అవుతుందని కూడా అనుకోలేదు. సౌత్, నార్త్‌.. ఇలా అన్ని చోట్లా హిస్టరీ క్రియేట్‌ చేసింది. ఇలాంటి సినిమాల్లో చేసే అవకాశం లైఫ్‌లో ఒక్కసారే వస్తుంది. ఆ ఛాన్స్‌ అందరికీ రాదు.

మీ అందం కొంచెం కూడా తగ్గలేదు.. ఏం చేస్తుంటారేంటి?
మా అమ్మా నాన్న అందంగా ఉంటారు. వాళ్ల జీన్స్‌ నాకొచ్చింది. జనరల్‌గా నేనెక్కువ స్ట్రెస్‌ అవను. ఆల్‌మోస్ట్‌ సంతోషంగా ఉంటాను. పీస్‌ఫుల్‌గా ఉంటాను. మనసు బాగుంటే పైకి కూడా బాగుంటాం. ఎక్సర్‌సైజులు చేయను. వాకింగ్‌ చేస్తాను. అంతే.

ఇప్పుడు ఒక్క సినిమా చేస్తే బోల్డంత పాపులార్టీ.. పారితోషికం. సో ఇప్పటి తరం హీరోయిన్‌ అయ్యుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా?
ఒకట్రెండు సినిమాలకే చాలా పాపులార్టీ వస్తోందన్నది నిజమే. కానీ, ఈ తరం హీరోయిన్‌ అయ్యుంటే బాగుండేదనుకోవడంలేదు. ఎందుకంటే, మాకు వచ్చినన్ని.. ముఖ్యంగా నాకు వచ్చినన్ని డిఫరెంట్‌ క్యారెక్టర్లు బహుశా ఇప్పుడు రావేమో. కెరీర్‌ వైజ్‌గా నాకెలాంటి అసంతృప్తీ లేదు. మంచి మంచి పాత్రలు చేశాను. అప్పుడు ఎలా కుదిరాయో ఇప్పుడూ అలానే మంచి పాత్రలు కుదురుతున్నాయి.

పాలిటిక్స్‌ వైపు ఎప్పుడైనా దృష్టి మళ్లిందా?
ఏది జరగాలని ఉంటే అది జరుగుతుందన్నది నా ఒపీనియన్‌. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని రాసి పెట్టి ఉంటే వచ్చేస్తానేమో. ఒకటి మాత్రం చెప్పగలను. రాజకీయాల్లోకి రాకుండా కూడా మంచి పనులు చేయొచ్చు. ఒకవేళ నేను రావడం ద్వారా ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందని రాసి పెట్టి ఉంటే.. వస్తానేమో.

డ్రీమ్‌ రోల్‌ ఏమైనా ఉందా?
లేదండి. నీలాంబరి కానీ, శివగామి కానీ నేను ఊహించలేదు. ఆ మాటకొస్తే ఇప్పటివరకూ నాకు ఫలానా రోల్‌ వస్తే బాగుంటుందని ఎప్పుడూ ఆలోచించలేదు.  ఏది కుదిరితే అది చేశా. ‘బాహుబలి’కి ఛాన్స్‌ రావడం నా లక్‌.

మీకు ఒకే ఒక్క కొడుకు.. ఆడపిల్ల లేదని ఫీలయ్యారా?
ఆడపిల్ల పుడితే బాగుంటుందనుకున్నాను. కానీ, కొడుకు పుట్టాడు. ‘ఐయామ్‌ ఓకే విత్‌ హిమ్‌’.

మీ అబ్బాయి రుత్విక్‌ని హీరోని చేస్తారా? లేక డైరెక్టరా?
ఇప్పుడు వాడు సిక్త్స్‌ క్లాస్‌ చదువుతున్నాడు. కెరీర్‌ని డిసైడ్‌ చేయడానికి ఇది టూ ఎర్లీ అవుతుంది. పెద్దయ్యాక రుత్విక్‌ ఏమవ్వాలనుకుంటే అదే.

150 సినిమాలకు పైగా చేశారు కదా.. ఆ అనుభవంతో డైరెక్షన్‌ చేస్తారా?
డైరెక్షన్‌కి చాలా ఓపిక కావాలి. బేసిక్‌గా నేను బద్ధకస్తురాల్ని. అందుకని దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.
– డి.జి. భవాని


భర్త కృష్ణవంశీ, తండ్రి బీవీ కృష్ణయ్య, చెల్లెలు వినయ, కొడుకు రుత్విక్‌తో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement