అమ్మవు నీవె... అఖిల జగాలకు | special story to vijayawada kanaka durga devi | Sakshi
Sakshi News home page

అమ్మవు నీవె... అఖిల జగాలకు

Published Wed, Sep 27 2017 12:39 AM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM

special  story to  vijayawada kanaka durga devi - Sakshi

ఈ అమ్మ కడుపులో మా అమ్మ పుట్టింది అవ్వ, జేజమ్మ – వాళ్ల అమ్మ – అలా... అందరు అమ్మలకూ అమ్మ ఆదిపరాశక్తి – కనకదుర్గమ్మ... దుర్గమ్మ – దుర్గాప్రసాద్‌ అమ్మ!

దుర్గగుడి ప్రధాన అర్చక పదవి రావడం అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి కదా..!
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే... (అంటూ అమ్మవారి ప్రార్థన తో ప్రారంభించారు). విజయవాడలో ఇంద్రకీలాద్రిపై అమ్మ స్వయంభువుగా వెలిసింది. స్వయంభూ దేవాలయాలకు పంచప్రాణాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇందులో మొదటి ప్రాణం అర్చకుడిది. అంతటి ఉన్నత స్థానం పొందిన అర్చకుడిగా ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.

వంశపారంపర్యంగా వచ్చినట్లున్నారు?
అవునండీ. నాన్నగారు లింగాభొట్ల వెంకటేశ్వర్లు ఆలయ ప్రధాన అర్చకులుగా ఉండేవారు. వంశపారంపర్యంగా నాన్నగారి తరవాత నేను ప్రధాన అర్చకుడినయ్యాను. ప్రస్తుతం ఈ చట్టాన్ని పునరుద్ధరించారు. అందువల్ల మా వంశంలో మా తరవాతి తరానికి ఈ అవకాశం లేదు. ఈ అవకాశం తీసేయడంతో పదవీవిరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచారు. ఈ పరంపరలో నేనే చివరివాడిని కావడం కూడా అమ్మ సంకల్పంగానే భావిస్తాను.

చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతను స్వీకరిస్తున్న సమయంలో మీ అనుభూతి ఏమిటి?
నా 12వ ఏట నుంచే నాన్నగారి వెంట దేవాలయానికి వెళ్లేవాడిని. నా 18వ ఏట అర్చకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. మొదట భయం వేసింది. మా మీద ఆధారపడిన పాతిక కుటుంబాలను సంరక్షించే బాధ్యత ఆ తల్లి నాకు అప్పచెప్పిందని గుర్తుకు వచ్చి, ఎంతో జాగ్రత్తతో నా కర్తవ్య నిర్వహణకు పూనుకున్నాను. ఆ తల్లి దయ వల్లే నాకు చదువుకునే అవకాశం కూడా కలిగింది. దేవాలయానికి వస్తూనే డిగ్రీ పూర్తి చేశాను.

మీరు అర్చకత్వం స్వీకరించే నాటికి మీ తండ్రి మీతోనే ఉన్నారా? ఈ పదవికి మీ వంశంలోని మిగతా వారితో పోటీ పడవలసి వచ్చిందా?
పూర్తి బాధ్యతలు తీసుకునే సమయానికి నాన్నగారు గతించారు. మా వంశంలో మొత్తం ఆరుగురం ఉన్నాం. నాన్నగారికి మేం ఇద్దరం సంతానం. మొత్తం ఆరుగురికీ వరుసగా నాలుగు రోజులకు ఒకరు చొప్పున అర్చనలు ఉండేవి. మావి రెండు వాటాలు ఉండటంతో మాకు ప్రధాన అర్చకత్వ బాధ్యతలు వచ్చాయి. మా అన్నగారికి ఆరోగ్యం సరిగా లే కపోవడంతో, నేనే పూర్తి బాధ్యతలు స్వీకరించవలసి వచ్చింది.

మొదటి రోజు అర్చకునిగా ఎలాంటి భావాలకు లోనయ్యారు?
చిన్నతనమంతా నాన్నగారి నీడలోనే అమ్మవారిని దర్శించుకున్నాను. ‘ఈ రోజు నుంచి బరువుబాధ్యతలు నావే’ అనే విషయం గుర్తుకురాగానే ఒకలాంటి ఉద్వేగం కమ్ముకుంది. అమ్మవారి సేవ మాత్రమే కాదు, మా దగ్గర పనిచేసేవారి బాగోగులు కూడా నాన్నగారిలాగే బాధ్యతగా చూడాలి. ఈ భయంతో ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపాను. ఆ తల్లిని నిత్యం నేనే అలంకరించి, స్వయంగా పూజించాలి అనే భావన మదిలో మెదలగానే ఏదో తెలియని దివ్యానుభూతి కలిగింది. నాటి నుంచి నేటి వరకు ఆ తల్లే నన్ను వెన్ను తట్టి నడిపిస్తోంది.

మీ జీవితంలో వ్యక్తిగతంగా అమ్మవారి మహిమలు ఏవైనా సంభవించాయా?
ఎన్నో మహిమలు చూశాను. ఇటీవల సంభవించిన మహిమను నేను ఎన్నటికీ మరచిపోలేను. అది నాకు పునర్జన్మ. ఆ రోజున ఆ తల్లి దయ లేకపోతే ఈ రోజు మీతో మాట్లాడగలిగేవాడిని కానేమో. ఒకరోజు సాయంత్రం పని మీద వెళ్లి ఇంటికి నా కారులో స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ వస్తున్నాను. సరిగ్గా పుష్పహోటల్‌ సెంటర్‌కి వచ్చేసరికి నాకు ఏమైందో తెలీదు కాని, రోడ్డుకి పక్కగా కారు పార్క్‌ చేశాను. ఆ తరవాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్లు తెరిచి చూస్తే ఆసుపత్రిలో ఉన్నాను. డాక్టర్‌ నాతో, ‘అసలు ఏం జరిగిందో గుర్తు ఉందా, కారు ఎందుకు, అలా పార్క్‌ చేశారో చెప్పగలరా?’ అని అడిగారు. నాకేమీ గుర్తు రాలేదు. ఆ మాటే చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు. ‘మీ గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఒకేసారి అదుపు తప్పాయి. ఆ క్షణంలో మీరు కారు డ్రైవ్‌ చేసి ఉంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, మీకు ఏం జరిగేదో చెప్పలేను’ అన్నారు. ఒక్కసారిగా ఆ జగజ్జనని, అమ్మలగన్న అమ్మని మనసులో స్మరించుకున్నాను. ఆ తల్లి నాయందు లేకపోతే ఆ రోజు ఏం జరిగి ఉండేదో... ఈ అనుభవం నా జీవితంలో మరచిపోలేనిది.  

అమ్మవారి మహిమ వల్లే మీరు బయటపడ్డారనే విషయాన్ని తరచు చెబుతుంటారా? అంటే.. దైవాన్ని నమ్మని వారిని  నమ్మించే ప్రయత్నం ఏమైనా చేస్తుంటారా?
అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. మనలను నడిపే  శక్తి ఉందని మాత్రమే చెబుతాను. నమ్మనివారు దైవాన్ని దూషించినా, క్రియల ద్వారా వారి వ్యతిరేకత చూపినా... పట్టించుకోను. అయితే వారి మనసులో మార్పు తీసుకురావడానికి మాత్రం నాకు చేతనైనంతగా ప్రయత్నిస్తాను.

నిరంతరం భక్తుల మధ్య ఉంటారు. ఎప్పుడైనా భక్తులు తమ బాధలు చెప్పి, పరిష్కారం కోరితే ఏ విధంగా సలహాలు, సూచనలు ఇస్తారు?
అర్చకుడిని భక్తులంతా భగవంతునికి తమ కోర్కెలను నివేదించేవానిగా భావిస్తారు. అందువల్లే వారి కష్టాలు మాకు చెప్పుకుంటారు. సంతానం లేదని, ఉద్యోగం రాలేదని, అమ్మాయి వివాహం జరగలేదని మొరపెట్టుకుంటారు. భక్తులు వారి బాధ చెప్పుకున్నప్పుడు, వారికి కొంత ఉపశమనం కలిగే పరిష్కారాలు చెబుతుంటాను.  
 
మీరు ఇబ్బందులకు గురైనప్పుడు, సమస్యల నుంచి బయట పడేయమని అమ్మవారిని కోరుకుంటారా?
నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏనాడూ అమ్మవారిని నా బాధ తీర్చమని అడగలేదు. అడగను కూడా! ఆ తల్లిని నమ్ముకున్నాను. నిత్యం అర్చన చేస్తాను. కళ్లు మూసుకుని ధ్యానించుకుంటాను. ఆ తల్లిని నమ్ముకున్న వారి బాగోగులు ఆ తల్లే చూసుకుంటుందని విశ్వసిస్తాను. అమ్మవారి ముక్కుపుడక పోయినప్పుడు అర్చకులను నిందించారు. మేం సరిగ్గా పూజలు చేయకపోవడం వల్లే ఈ విధంగా జరిగింది అన్నారు. అన్నిటికీ అందరం ఓర్చుకున్నాం. ఒకసారి హైదరాబాద్‌ నుంచి ఒక దంపతులు మా దగ్గరకు వచ్చారు. వారికి ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి బీటెక్‌ చదువుతుండగా అకస్మాత్తుగా చనిపోయిందట. చిన్నమ్మాయి మానసికంగా కుంగిపోయిందట. వారు అమ్మవారిని దర్శించుకుని, సరాసరి మా ఇంటికి వచ్చారు. వారికి అమ్మవారి ఫొటో ఇచ్చి, నిత్యం పూజలు చేసుకోమని, సర్వశుభాలు కలుగుతాయని చెప్పాను. నె రోజుల తరవాత మళ్లీ వచ్చి, ‘అయ్యా! మీరు ఇచ్చిన ఫొటోకు నిత్యం పూజలు చేశాం. మీ దయ వల్ల మా కుటుంబం అంతా ఆనందంగా ఉన్నాం. మా చిన్నమ్మాయి ఆరోగ్యం బాగయ్యింద’ని చెప్పారు. ఆ ఆనందాన్ని మరచిపోలేను.

సకాలంలో మొక్కులు చెల్లించుకోలేదని ఎవరైనా మీ వద్దకు వస్తే వారికి ఎటువంటి పరిష్కార మార్గం చూపుతారు?
‘ఫలానా పని పూర్తయితే దేవాలయానికి వస్తాం’ అనో, ‘ఫలానా పూజ చేయిస్తాం’ అనో భక్తులు మొక్కుకోవడం తెలిసిందే. కొందరు అనుకున్న సమయానికి మొక్కులు చెల్లించుకోలేకపోతారు. అటువంటప్పుడు అపరాధం జరుగుతుందని వారు భయపడతారు. మా దగ్గరకు వచ్చి పాపపరిహారం చెప్పమంటారు. అటువంటి సమయాలలో, ‘మీరు సకాలంలో మొక్కు చెల్లించుకోకపోవడం వల్ల మీకు ఏ అరిష్టమూ అంటదు. ఇప్పుడు మీరనుకున్న దానికి రెట్టింపు చెల్లించుకోండి’ అని చెబుతాను. మొక్కు తీర్చుకోలేదు కనుక, అమ్మవారు శిక్షిస్తుందని చెప్పడం సరైనది కాదు నా దృష్టిలో.

ఈ వృత్తిలో ప్రవేశించినందుకు ఏనాడైనా బాధ పడిన సంఘటనలు ఎదురయ్యాయా?
ఎన్నడూ అలా జరగలేదు. ఎవ్వరికైనా కొన్ని అనుకోని సంఘటనలు తప్పవు. వాటిని సైతం అమ్మవారి దయగానే భావిస్తాను.  

మీ చేతి మీదుగా అమ్మవారి దేవాలయంలో చేసిన మంచి మార్పులు?
ఆలయంలో మా వంశీకులు ఆరుగురం పనిచేస్తున్నాం. ఆ తల్లి దయ వల్ల మహామండప శంకుస్థాపన దగ్గర నుంచి జయేంద్రసరస్వతి స్వామివారితో కలశాలకు మహాకుంభాభిషేకం చేసేవరకు పూర్తిగా అన్నీ నా చేతుల మీదుగానే జరిగాయి. తెప్పోత్సవ ప్రారంభ రచన, అమ్మవారి స్వర్ణతాపడం ఆ అమ్మవారు నా చే తే ప్రారంభింపచేశారు. అది నా అదృష్టంగా భావిస్తాను. అదేవిధంగా ప్రాతఃకాల అర్చన అనంతరం ఖడ్గమాల పూజకు ఆలోచన చేశాను. విజయవంతంగా నడుస్తోంది.

అమ్మవారికి ఇస్తున్న విశ్రాంతి చాలనుకుంటున్నారా, మరింత విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నారా?
మామూలు రోజుల్లో అయితే ఆ తల్లికి విశ్రాంతి సరిపోతుంది. కాని పండుగలు, నవరాత్రుల సమయంలో మాత్రం చాలదు. ఒకేరోజున రెండు అవతారాలు ఉన్నరోజున మాత్రం ఒకవైపు పూజలు చేస్తూనే, మరో వైపు దర్శనానికి వదులుతాం. లేదంటే దర్శనం పూర్తికాదు. ముఖ్యంగా మూల నక్షత్రం రోజున అస్సలు కుదరదు. ఎంతో దూరాల నుంచి ఆ తల్లిని చూడటానికి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తుల కోసం ఆ తల్లి అవిశ్రాంతంగా దర్శనం ఇస్తూనే ఉంటుంది.

అమ్మపూజకు ఎప్పుడైనా దూరమైన సందర్భాలున్నాయా?
ధర్మప్రచారం కోసం ప్రభుత్వం తరఫున కిందటి సంవత్సరం అమెరికా వెళ్లాను. అమ్మవారి విగ్రహం తీసుకువెళ్లి అక్కడ అలంకరించి, పూజలు చేశాం. మొత్తం 12 రాష్ట్రాలలో 50 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాం. అన్నిరోజుల పాటు అమ్మవారికి దూరంగా ఉండటం వల్ల కొద్దిగా మనసు కలత చెందింది. కాని ఇక్కడ చేస్తున్నది కూడా అమ్మవారి సేవే కదా అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. ఎంత సర్దిచెప్పుకున్నా, అమ్మవారికి దూరమయ్యాననే భావన పూర్తిగా తొలగిపోలేదు.

ఇంట్లో ఉన్న సమయంలో మీ కుటుంబ సభ్యుల మధ్య అమ్మవారి ప్రస్తావన వస్తే ఆ తల్లిని ఏమని సంబోధిస్తారు?
ఇంట్లోనూ ‘అమ్మ’ అనే సంబోధిస్తాను. మా ఇంట్లో ‘అమ్మ’ ఉందన్న అనుభూతిలోనే ఉంటాను. అమ్మవారికి అన్నీ తెలుసు. ఉద్యోగంలా కాకుండా, ఆ తల్లితో అనుబంధం ఉన్నట్లుగా ఉండాలి అర్చకత్వం అంటే. తన సేవలు చేయడానికి నాకు ఇంకా 12 ఏళ్లు అవకాశం ఇచ్చింది ఆ తల్లి. ట్రస్ట్‌ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నాను. అమ్మవారి దర్శనం జరుగుతున్నంతసేపు ప్రసాద వితరణ జరగాలనేది నా కోరిక. ఇందుకోసం నేను కృషి చేస్తున్నాను. కార్యసాఫల్యత జరిగేవరకు చేస్తూనే ఉంటాను.

► అమ్మవారు సర్వశక్తులనూ సంపాదించి, మహిషుడిని సంహరించి, అదే ఉగ్రరూపంలో ఇంద్రకీలాద్రి మీద వెలిసింది. ఆ రూపాన్ని చూడటానికి అంతా భయపడ్డారని, కొందరు ప్రాణాలు విడిచారనీ కథనాల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు బీజాక్షరాలతో శ్రీచక్రయంత్ర ప్రతిష్ఠ చేసి, అమ్మవారి శక్తిని శ్రీచక్రంలో ప్రవేశపెట్టి, ఉగ్రరూపం కనపడకుండా, అమ్మను సౌమ్యంగా ఉండేలా అలంకరించారట.

►ఒకసారి ఒక భక్తుడు ఆలయంలో మర ణించడంతో, అమ్మవారికి స్నపనం చేయించాలా వద్దా అని తర్జనభర్జన పడుతున్నారట. ఎక్కువమంది వద్దనే నిశ్చయానికి వచ్చారట. ఆ సమయంలో ఎర్రటి చీర కట్టుకుని, ఒంటì నిండా బంగారు నగలు, నడుముకు వడ్డాణంతో ఒక స్త్రీమూర్తి వచ్చి, ‘మీరు చేయకపోతే అవదా ఏంటిరా’ అంటూ ఏకవచనంలో సంబోధించిందట. ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయారట. మరునాటి ఉదయం గర్భాలయంలో అమ్మవారి పైన ఉండే గోపురం మీద మాత్రమే వర్షం కురిసిందట. అలా ఆవిడ సంప్రోక్షణ అయిందని నాన్నగారు చెప్పేవారు.

► నవరాత్రులు తొమ్మిది రోజులూ ఉదయం నుంచి ఉపవాసం ఉండి, రాత్రి అమ్మవారికి నివేదన చేశాక, ఇంటికి వచ్చి భోజనం చేస్తాను. అమ్మవారే ఏమీ తినకుండా ఉంటే, నేను తినడం ఏమిటి అనుకుంటాను.

► మహిషాసుర మర్దని అలంకారం రోజున ఏదో ఒక చిన్న దెబ్బ తగిలి, రక్తం చిందుతుంది.  

► పుట్టినరోజు సందర్భంగా అందరూ దేవాలయానికి వచ్చి అమ్మను దర్శించుకుంటారు. నేను దుర్గమ్మ ప్రసాదం కావడంతో దుర్గాష్టమి రోజంతా ఆవిడ సన్నిధిలోనే ఉండే భాగ్యం నాకు కలిగింది.

► ఏటా నవరాత్రులలో అన్నపూర్ణ అవతారం రోజున కనీసం పదిమందైనా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తారు. నలభై ఏళ్లుగా ఇలా జరుగుతూనే ఉంది. అమ్మవారి దయ.

► అమ్మవారి నగలు పోయిన రోజు.. తెల్లవారు జామునే గుడి తలుపులు తెరిచే బాధ్యత నాది. ఆ రోజు కూడా ప్రాతః కాలానే నిద్ర లేచి స్నానం చేస్తుండగా, నగలు పోయాయని ఫోన్‌ వచ్చింది. నోట మాట రాలేదు. ‘తాళాలు నా దగ్గరే ఉన్నాయి. ఈ చోరీ ఎలా జరిగిందా’ అని మధన పడ్డాను. వెళ్లి చూస్తే.. అమ్మవారి  ముక్కుపుడక, బులాకీ, సూత్రాలు, నైజాం నవాబులు ఇచ్చిన బంగారు నాణెం అన్నీ పోయాయి. నిత్యం అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారు, ఆ రోజు నిరాలంకారంగా దర్శనమిచ్చేసరికి నాలో ఏదో తెలియని ఆవేదన కలిగింది.  ఇంటికి వచ్చి చిన్నపిల్లవాడిలా ఏడ్చేశాను. వారం రోజుల దాకా సాధారణస్థితికి రాలేకపోయాను. మా మీద నింద రాకుండా ఆ తల్లి కాపాడిందని ఇప్పటికీ అనుకుంటాను.  
- డా. పురాణపండ వైజయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement